షమిమా బేగం: ఐఎస్‌లో చేరేందుకు బ్రిటన్ నుంచి సిరియా వెళ్ళిన ఓ టీనేజర్ కన్నీటి కథ

  • 16 ఫిబ్రవరి 2019
షమిమా బేగం Image copyright PA
చిత్రం శీర్షిక షమిమా బేగం

షమీనా బేగం. బ్రిటన్‌లోని ఓ స్కూల్‌లో చదువుకుంటున్న ఈ టీనేజర్ కొన్నేళ్ల క్రితం ఐఎస్‌లో చేరడానికి సిరియా వెళ్లారు.

సిరియా శరణార్థి శిబిరంలో ఉన్న ఆమె ఇప్పుడు నిండు గర్భిణి. తమ బిడ్డను వెన్కకి రప్పించాలని తూర్పు లండన్‌లో ఉన్న షమీనా బేగం కుటుంబం యూకే ప్రభుత్వాన్ని కోరుతోంది.

‘మా కూతురు కడుపులో పెరుగుతున్న బిడ్డకు లోకం తెలియదు. తనకు బ్రిటన్‌లో స్వేచ్ఛగా, శాంతియుతంగా పెరిగే హక్కు ఉంది’ అని షమీమా కుటుంబ సభ్యులు అన్నారు.

కానీ, సిరియాలోని ఒక శరణార్థి శిబిరంలో ఉన్న షమీమా మాత్రం తిరిగి బ్రిటన్ వెళ్తే పుట్టబోయే బిడ్డను తనకు దూరం చేస్తారేమోనని భయంగా ఉందని ద టైమ్స్‌కు చెప్పారు.

ఇటు, షమీమా తిరిగి బ్రిటన్ వస్తే కచ్చితంగా అభియోగాలు ఎదుర్కోవలసి ఉంటుందని ఆ దేశ హోం సెక్రటరీ సాజిద్ జావిద్ అన్నారు.

2015లో యూకే నుంచి సిరియాకు పారిపోయిన ముగ్గురు స్కూల్ విద్యార్థుల్లో షమీమా బేగం ఒకరు.

ఆమె సిరియాలోని ఒక శరణార్థుల శిబిరంలో తలదాచుకున్నట్టు టైమ్స్ రిపోర్టర్ గత బుధవారం గుర్తించారు.

శనివారం టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో "నా బిడ్డకు ఏమవుతుందని మీరు అనుకుంటున్నారు. ఎందుకంటే నాకు నా బిడ్డను దూరం చేసుకోవాలని లేదు. కనీసం నా కుటుంబానికైనా ఆ బిడ్డను అప్పగించాలి అని షమీమా అన్నారు.

శిబిరానికి వచ్చిన తర్వాత ఆస్పత్రికి తీసుకెళ్లినపుడు, తను త్వరలో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు తెలిసిందని ఆమె చెప్పారు.

Image copyright Met Police
చిత్రం శీర్షిక కదిజా సుల్తానా, అమిరా, షమిమా బేగం

ఐఎస్ ఫైటర్‌ను పెళ్లాడారు

తూర్పు సిరియాలో ఒకప్పుడు ఐఎస్‌కు పట్టున్న బగుజ్ నుంచి షమీమా తప్పించుకున్నారు.

తమ బిడ్డను మళ్లీ చూస్తామని అనుకోలేదని, అయితే, తప్పించుకునే సమయంలో ఐఎస్‌కు దొరికిపోయుంటే ఆమెకు జైలు లేదా మరణశిక్ష విధించి ఉండేవారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఐఎస్‌లో చేరినందుకు షమీమాకు పశ్చాత్తాపం లేకపోవడంపై ఆమె కుటుంబం షాక్ అవుతోంది. 15 ఏళ్ల వయసులో ఐసిస్ సానుభూతిపరుల మాటలే ఆమెను మార్చేశాయని వారు చెప్పారు.

నాలుగేళ్లపాటు ఐఎస్‌లో ఉన్న ఆమె మానసిక స్థితి ఇప్పుడు ఎలా ఉందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

ఆ సమయంలో ఆమె ఒక ఐఎస్ ఫైటర్‌ను పెళ్లాడి, ఇద్దరు పిల్లలకు తల్లి కూడా అయ్యారు. కానీ, ఆ పిల్లలు చనిపోయారు.

"ఇప్పుడు షమీమాకు పుట్టబోయే బిడ్డ సంక్షేమం మా కుటుంబానికి చాలా ముఖ్యం. ఈ ఘటనలతో ఎలాంటి సంబంధం లేని ఆ బిడ్డను కాపాడుకోడానికి మేం మా శక్తి మేరకు ప్రయత్నిస్తాం" అన్నారు.

సిరియాలో చర్యలకు షమీమాపై బ్రిటిష్ చట్టాల ప్రకారం దర్యాప్తు జరిగితే దానిని తాము ఆహ్వానిస్తామని వారు చెప్పారు.

ఐసిస్ నుంచి తప్పించుకుని తిరిగి యూకే వచ్చే వారి వల్ల తీవ్ర ప్రమాదం ఉంటుందని బ్రిటన్ హోం సెక్రటరీ సాజిద్ వాజిద్ భావిస్తున్నారు. వారిని అడ్డుకునేందుకు బ్రిటిష్ పౌరసత్వం రద్దు చేయడం, లేదా దేశనుంచి బహిష్కరించడం చేయవచ్చని తెలిపారు.

"ఎవరైనా తిరిగి బ్రిటన్ రాగలిగితే వారు దర్యాప్తు ఎదుర్కోడానికి, శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి" అన్నారు.

Image copyright GettyImages

ఒక్కరే మిగిలారు

కానీ, షమీమాను తిరిగి రాకుండా ఆయన చట్టపరంగా అడ్డుకోగలరని తాను భావించడం లేదని షమీమా బేగం కుటుంబం లాయర్ అంటున్నారు.

బ్రిటన్ తిరిగొస్తే తీవ్రవాదం అభియోగాలు ఎదుర్కోవలసి ఉంటుందనే విషయం తనకు తెలుసని షమీమా చెప్పారు.

శుక్రవారం మ్యూనిచ్ సెక్యూరిటీ సదస్సులో మాట్లాడిన ఇంటెలిజెన్స్ చీఫ్ అలెక్స్ యోంగర్ "బ్రిటిష్ పౌరులకు తమ దేశానికి తిరిగి వచ్చే హక్కు ఉంటుంది" అని అన్నారు.

జీహాదీలు తిరిగి యూరప్ చేరుకుంటుండడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వారి నైపుణ్యాలు, సంబంధాలు వారిని చాలా ప్రమాదకరంగా మార్చవచ్చని అన్నారు.

షమీమా బేగం కదీజా సుల్తానా(16), అమీరా అబేస్(15)తో కలిసి తూర్పు లండన్‌లోని బెతనల్ గ్రీన్ అకాడమీ నుంచి సిరియా పారిపోయారు.

ఒక ఇంటిపై బాంబులు వేయడంతో కదీజా సుల్తానా మృతి చెందిందని, అమీరా ఏమైందో ఇప్పటికీ తెలీలేదని షమీమా చెప్పారు.

రెండు వారాల క్రితం బగుజ్ నుంచి షమీమా బేగం తప్పించుకున్నారు. కానీ డచ్ నుంచి ఇస్లాం మతం తీసుకున్న ఆమె భర్త సిరియన్ ఫైటర్స్‌కు దొరికిపోయాడు.

ఇరాక్, సిరియాలో చాలా ప్రాంతాలపై ఐఎస్ తన పట్టు కోల్పోయింది.

అయితే, ఈశాన్య సిరియాలో మాత్రం సంకీర్ణ దళాలకు, ఐఎస్‌కు మధ్య ఇంకా యుద్ధం కొనసాగుతోంది. అక్కడ గత కొన్నివారాలుగా చాలా మంది విదేశీ ఫైటర్లను అదుపులోకి తీసుకున్నామని కుర్దిష్ దళాలు ప్రకటించాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)