మహమ్మద్ బిన్ సల్మాన్‌: పాకిస్తాన్‌లో సౌదీ ప్రిన్స్ పర్యటన: నిధుల కోసం ఘన స్వాగతం

  • 17 ఫిబ్రవరి 2019
పాకిస్తాన్
చిత్రం శీర్షిక ఐఎంఎఫ్ నుంచి భారీ బెయిల్-ఔట్ భారాన్ని తగ్గించుకోవడానికి పాకిస్తాన్‌కు గల్ఫ్ డబ్బు చాలా అవసరం

విదేశీ మారక ద్రవ్యం అడుగంటిపోయి, ఆర్థిక లోటుతో సతమతమవుతూ, భవిష్యత్తు పట్ల ఆందోళనగా చూస్తున్న పాకిస్తాన్... తమ దేశానికి వచ్చిన సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌కు ఘన స్వాగతం పలికింది.

పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు ఇప్పుడు చాలా డబ్బు కావాలి. అదీ వెంటనే కావాలి.

ఎంబీఎస్.. అంటే మహమ్మద్ బిన్ సల్మాన్ ఇప్పుడు పాకిస్తాన్‌కు ఎన్నో ఆశలు కల్పిస్తూ ఆ దేశంలోకి అడుగుపెట్టారు.

అయితే, ఈ రెండు దేశాల సంబంధాలకు డబ్బు అన్నది ఒక కోణం మాత్రమే. ఇందులో ఇంకా చాలా అంశాలు ఇమిడి ఉన్నాయి.

సౌదీ యువరాజు తలపెట్టిన అయిదు ఆసియా దేశాల పర్యటనలో పాకిస్తాన్ మొదటిది. అయితే, ఇండొనేసియా, మలేషియా దేశాల పర్యటనలు ప్రస్తుతానికి వాయిదా పడ్డాయి. ఈ విడతలో ఆయన పాకిస్తాన్ తరువాత చైనా, భారత్ దేశాలను సందర్శించబోతున్నారు.

ఈ సందర్శన ఎంత ఘనంగా ఉంది?

గతంలో సౌదీ రాజ సందర్శన 2006లో జరిగింది. అప్పటి రాజు కింగ్ అబ్దుల్లా బిన్ అబ్దులాజీజ్ ఈ అణ్వస్త్ర దేశాన్ని సందర్శించారు.

ఈసారి సౌదీ యువరాజు రాకకు ఇమ్రాన్ ఖానే స్వయంగా భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారని వార్తలు వచ్చాయి.

కశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై మానవబాంబు దాడి జరిగి, భారత్-పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సందర్భంలో ఈ పర్యటన జరుగుతోంది. గత కొన్ని దశాబ్దాలలో అత్యంత తీవ్రస్థాయిలో జరిగిన ఈ దాడి వెనుక ఉన్నది పాకిస్తానే అని భారత్ ఆరోపిస్తోంది.

ఎంబీఎస్‌ ప్రయాణించే విమానం పాకిస్తాన్ గగనతలంలోకి రాగానే జెఎఫ్-17 థండర్ ఫైటర్ జెట్స్ దానికి భద్రత కల్పిస్తాయి. ఎంబీఎస్ విమానంతో పాటే అవి ల్యాండ్ అవుతాయి.

ఇస్లామాబాద్‌లో ఎంబీఎస్ కోసం ఫైవ్ స్టార్ హోటళ్ళలో వందల కొద్దీ గదులు బుక్ చేశారు. ఆయనతో పాటు వస్తున్న దాదాపు వేయి మంది ప్రతినిధుల బృందానికి సకల సౌకర్యాలతో బస ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు, స్వాగత వేడుకల కోసం వేలాది పావురాలను కూడా సిద్ధంగా ఉంచారని వార్తలు వినిపిస్తున్నాయి.

నిధుల సమీకరణ కోసం తమ వద్ద ఉన్న విలాసవంతమైన కార్లను గత ఏడాది వేలానికి పెట్టిన పాకిస్తాన్, ప్రస్తుతం సౌదీ యువరాజుకు స్వాగతం పలికేందుకు 300 తొయోతా ల్యాండ్ క్రూజర్లను ఏర్పాటు చేసింది.

రెండు రోజుల పర్యటన కోసం పాకిస్తాన్ వస్తున్న సౌదీ యువరాజు ఆ దేశ ప్రధానమంత్రి అధికార నివాసంలోనే బస చేస్తారు. గతంలో ఇలా ఏ దేశాధినేతకు కూడా పాక్ ప్రధాని అధికార నివాసాన్ని కేటాయించలేదు.

ఈ క్రికెట్ ‘సుడిగాలి’ ప్రపంచకప్ గెలవగలుగుతుందా?

'కన్ను మూసినా, తెరిచినా కనిపించేది నీటి సమస్యే' #MyVoteCounts

చిత్రం శీర్షిక ఇరాన్ నేతల స్థానంలో ఇప్పుడు గల్ఫ్ నేతలకు పాక్‌లో ప్రాధాన్యం పెరిగిన సంకేతాలు కనిపిస్తున్నాయి

పాకిస్తాన్‌‌కు తీవ్రమైన నిధుల సమస్య

పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంకులో 800 కోట్ల డాలర్లు మాత్రమే ఉన్నాయి. ఫలితంగా ఆ దేశం చెల్లింపుల సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటోంది.

మాజీ స్టార్ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ గత ఏడాది ఆగస్ట్‌లో ప్రధాని పదవి చేపట్టిన నాటి నుంచి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) కఠినమైన నిబంధనలతో ఇచ్చే బెయిల్-ఔట్ ప్యాకేజిని తగ్గించుకునేందుకు మిత్ర దేశాల సాయం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

పాకిస్తాన్ 1980ల తరువాత కోరుతున్న 13వ బెయిల్-ఔట్ ప్యాకేజి ఇది.

అబూదాభీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్-నాహ్యన్ దేశంలోకి అడుగు పెట్టిన వెంటనే సౌదీ యువరాజు కూడా ఇక్కడికి వస్తుండడం విశేషం.

చితికిపోయిన పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు 600 కోట్ల డాలర్ల సహాయం అందించేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంగీకరించింది. మొత్తంగా రెండు అరబ్ దేశాల నుంచి పెట్టుబడులు, రుణాల రూపంలో 3,000 కోట్ల డాలర్లు తమకు అందుతాయని పాకిస్తాన్ ఆశిస్తోంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక క్రౌన్ ప్రిన్స్‌ హోదా రావడానికి ముందు 2016లో ఎంబీఎస్ పాకిస్తాన్ సందర్శించారు

అయితే, పాకిస్తాన్‌తో ఎంబీఎస్ ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోబోతున్నారన్నది ఇంకా కచ్చితంగా తెలియదు. కానీ, దక్షిణ తీర ప్రాంత నగరమైన గ్వాదర్‌లో 800 కోట్ల డాలర్లతో కొత్త చమురు శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.

చైనా-పాకిస్తాన్‌ల మధ్య నిర్మిస్తున్న 6,000 డాలర్ల విలువైన ఎకనామిక్ కారిడార్‌కు గ్వాదర్ చాలా కీలకం. చైనా నుంచి వచ్చే నిధులు పాకిస్తాన్‌కు చాలా అవసరం.

కానీ, ఆ నిధుల చుట్టూ నిబంధనలు, ఆంక్షలు చాలా ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాకుండా, దాని వల్ల పాకిస్తాన్ ‌మీద చైనా పెత్తనం అధికమవుతుందని కూడా వారు భావిస్తున్నారు.

అందుకే, సౌదీ అరేబియా, గల్ఫ్ దేశాల నుంచి వచ్చే నిధులకు వారు స్వాగతం పలుకుతున్నారు.

సౌదీకి ఏమిటి లాభం?

పాకిస్తాన్ తన సార్వభౌమాధికారాన్ని పణంగా పెడుతూ తన మిత్ర దేశాల నుంచి భారీయెత్తున ప్రయోజనాలు అందుకుంటోంది. అయితే, ఈ విషయంలో ముఖ్యమైన కోణాలు ఇంకా వేరే కూడా ఉన్నాయి.

సౌదీ అరేబియాకు కూడా పాకిస్తాన్‌తో అవసరాలున్నాయి.

యెమెన్‌లో తాను చేస్తున్న యుద్ధం వల్ల తెల్తుతున్న మానవీయ సంక్షోభంతో సౌదీ ప్రతిష్ఠ మసకబారుతోంది. అలాగే, ఇస్తాంబుల్ కాన్సులేట్‌లో జర్నలిస్ట్ ఖషోగ్జీ హత్య కూడా వారి ప్రతిష్ఠను బాగా దెబ్బ తీసింది. వీటి వల్ల అంతర్జాతీయంగా ఒత్తిడి ఎదురవుతున్న సందర్భంలో సౌదీ యువరాజు పాక్ పర్యటనకు వస్తున్నారు.

ఇలాంటి పరిస్థితులో మిత్ర దేశాలకు ఆర్థిక సహకారం అందించి అనుబంధం పటిష్టం చేసుకోవాలని సౌదీ భావిస్తోంది.

పైగా, సౌదీలకు పాకిస్తాన్ చాలా ముఖ్యమన్న సంగతి కూడా విస్మరించడానికి వీల్లేదు. ఈ రెండు దేశాల మధ్య దశాబ్దాల కాలంగా సైనిక సంబంధాలున్నాయి. ముస్లింల పవిత్ర స్థలమైన మక్కా మీద నాలుగు దశాబ్దాల కింద మిలిటెంట్లు దాడి చేసినప్పుడు, పాకిస్తాన్ దళాలే వారిని తిప్పి కొట్టాయి.

"కొన్ని గల్ఫ్ దేశాల మాదిరిగానే సౌదీ అరేబియా వద్ద చాలా డబ్బుంది. కానీ, దానికి బలమైన సైన్యం లేదు. పాకిస్తాన్‌కు డబ్బు లేదు. కానీ, బలమైన సైన్యం ఉంది" అని దక్షిణాసియా వ్యవహారాల నిపుణుడు, ది ఎకనామిస్ట్ పత్రిక డిఫెన్స్ ఎడిటర్ శశాంక్ జోషి అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)