జైష్-ఎ-మొహమ్మద్ అంటే ఏమిటి? ఈ మిలిటెంట్ సంస్థ విస్తరించడానికి కారణం ఎవరు?

ఫొటో సోర్స్, Getty Images
భారత పాలిత కశ్మీర్లో ఫిబ్రవరి 14న ఆత్మాహుతి దాడి తమ పనేనంటూ జైష్-ఎ-మొహమ్మద్ సంస్థ ప్రకటించింది. ఈ దాడిలో కనీసం 46మంది భారత జవానులు మరణించారు. 1989నుంచి ఇప్పటిదాకా భారత సైన్యంపై జరిగిన దాడుల్లో అత్యంత తీవ్రమైన దాడి ఇదే.
జైష్-ఎ-మొహమ్మద్ పాకిస్తాన్‌కు చెందిన మిలిటెంట్ సంస్థ. భారత్‌తోసహా అమెరికా, ఇంగ్లండ్, ఐక్యరాజ్య సమితి.. జైష్-ఎ-మొహమ్మద్‌ను ‘ఉగ్రసంస్థ’గా పరిగణించాయి.
కశ్మీర్‌ను పాకిస్తాన్లో కలపడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. తమ లక్ష్యసాధనలో ఈ సంస్థ.. భారత్, కశ్మీర్‌ల్లో అనేక దాడులకు పాల్పడుతోంది.
‘పేలుడు పదార్థాలు నిండిన వాహనంతో భారత జవాన్ల కాన్వాయ్‌ను ఢీకొట్టాక, డజన్లకొద్దీ భారత సైనిక వాహనాలు ధ్వంసమయ్యాయి’ అని జైష్-ఎ-మొహమ్మద్ అధికారిక ప్రతినిధి మొహమ్మద్ హసన్ అన్నారని మీడియా కథనాలు పేర్కొన్నాయి.
ఫొటో సోర్స్, Getty Images
పుల్వామా ఘటనకు నిరసిస్తూ కారుకు నిప్పు పెట్టిన ఆందళనకారులు
జైష్-ఎ-మొహమ్మద్ అంటే ఏమిటి?
జైష్-ఎ-మొహమ్మద్ అంటే 'మొహమ్మద్' సైన్యం అని అర్థం. పాకిస్తాన్‌కు చెందిన మతాధికారి మౌలానా మసూద్ అజర్‌ను భారత ప్రభుత్వం 1999లో విడుదల చేసింది. విడుదలయ్యాక, మౌలానా మసూద్ ఈ సంస్థను స్థాపించారు.
భారత విమానాన్ని హైజాక్ చేసి, తాలిబన్ పాలనలోని అఫ్ఘానిస్తాన్‌కు తరలించినపుడు, భారత వైమానిక సిబ్బంది, ప్రయాణికులను విడుదల చేయాలంటే భారత చెరలోని ముగ్గురు ఖైదీలను విడుదల చేయాలంటూ మిలిటెంట్లు షరతు విధించారు.
ఆ షరతు మేరకు భారత ప్రభుత్వం 1999లో విడుదల చేసిన ముగ్గుర్లో మౌలానా మసూద్ అజర్ ఒకరు.
1999లో తిరిగి పాకిస్తాన్ చేరుకోగానే మసూద్ అజర్ జైష్-ఎ-మొహమ్మద్ సంస్థను స్థాపించారు.
ఫొటో సోర్స్, Getty Images
మౌలానా మసూద్.. తాలిబన్ లీడర్ ముల్లా ఒమర్, అల్‌ఖైదా లీడర్ ఒసామా బిన్ లాడెన్‌ను కలిసినట్లు తెలిసింది.
2001లో భారత పార్లమెంటుపై జరిగన దాడిలో మౌలానా మసూద్ హస్తముందని భారత ప్రభుత్వం చెబుతోంది. కానీ ఈ ఆరోపణలను మౌలానా ఖండించారు.
ఈ దాడి జరిగిన వెంటనే పాకిస్తాన్ ప్రభుత్వం జైష్-ఎ-మొహమ్మద్ సంస్థను నిషేధించింది. కానీ అఫ్జల్ గురు బృందం, అల్-మురాబితున్, తెహ్రీక్-అల్-ఫర్కాన్ పేర్లతో ఈ సంస్థ తన కార్యకలాపాలను సాగిస్తోంది.
తాజాగా 2016 జనవరిలో భారత్‌లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్‌లో జరిగిన దాడిలో కూడా మౌలానా మసూద్ ప్రమేయం ఉన్నట్లు భారత ప్రభుత్వం చెబుతోంది. ఈ ఘటనలో ముగ్గురు భారత జవానులు మరణించారు.
2017డిసెంబర్లో జైష్-ఎ-మొహమ్మద్ కమాండర్ నూర్ మొహమ్మద్ తాన్త్రేయ్ను భారత బలగాలు చంపాయి. ఈ సంఘటన ఆ సంస్థకు పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. కానీ హింస మాత్రం ఆగలేదు.
ఈ సంస్థ విస్తరించడానికి, పాకిస్తాన్ రహస్య మద్దతే కారణం కావొచ్చని భారత వార్తాపత్రిక 'ది ప్రింట్' పేర్కొంది. కానీ పాకిస్తాన్ మిలిటరీ స్థావరాలపై ఈ సంస్థ దాడి చేసింది. అంతేకాకుండా, 2003లో పాకిస్తాన్ మాజీ ప్రధాని పర్వేజ్ ముషార్రఫ్‌పై కూడా హత్యాయత్నం చేసింది.
ఫొటో సోర్స్, Getty Images
భారత్-పాక్‌లు ఏమంటున్నాయి?
మౌలానా మసూద్ అజర్ తూర్పు పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రాంతంలో ఉన్నాడని, అతడిని వెంటనే దేశం నుంచి బహిష్కరించాలని భారత్ తరచూ కోరుతోంది. కానీ మౌలానా మసూద్‌కు చెందిన ఆధారాలేవీ లేవని పాక్ చెబుతోంది.
మౌలానా మసూద్ అజర్‌ను 'అంతర్జాతీయ టెర్రరిస్టు'గా పరిగణించాలని ఐక్యరాజ్యసమితిని భారత్ కోరింది. కానీ, పాకిస్తాన్ మిత్రదేశం చైనా.. భారత్ ప్రయత్నాన్ని అడ్డుకుంటోంది.
పుల్వామా ఘటన తర్వాత భారత విదేశాంగ శాఖ..
''తమ భూభాగం నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న టెర్రరిస్టులకు, టెర్రరిస్టు సంస్థలకు పాకిస్తాన్ తన మద్దతును ఉపసంహరించుకోవాలి. ఇతర దేశాలపై దాడులు చేసేందుకున్న ఉపయోగించుకుంటున్న సదుపాయాలను నిర్వీర్యం చేయాలి'' అని డిమాండ్ చేసింది.
కానీ ఈ దాడికి సంబంధించి, భారత్ చేస్తున్న సూచనలను పాకిస్తాన్ ఖండిస్తోంది.
''ప్రపంచంలో హింసాత్మక ఘటనలు ఎక్కడ జరిగినా మేం ఖండిస్తూనే ఉన్నాం..'' అని పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికారిక ప్రతినిధి అన్నారు.
ఇవి కూడా చదవండి
- ఫేస్బుక్, యూట్యూబ్‌ల నుంచి ఆ వీడియోల తొలగింపు
- మీ ఇంట్లో అత్యంత అపరిశుభ్రమైనది ఏమిటో మీకు తెలుసా...
- పెయిన్ కిల్లర్స్: తేడా వస్తే నొప్పినే కాదు మనిషినే చంపేయొచ్చు
- పుల్వామా దాడి: కశ్మీర్ యువత మిలిటెన్సీలో ఎందుకు చేరుతోంది
- 'మిలిటెంట్ల కుటుంబాలకు రూ. కోటి పరిహారం ప్రకటించిన కాంగ్రెస్' అనే ప్రచారంలో నిజమెంత...
- మద్యం అతిగా తాగితే... డీఎన్ఏ డామేజ్ అవుతుందా...
- జైష్-ఎ-మొహమ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజర్ ఎవరు?
- పాకిస్తాన్లో సౌదీ ప్రిన్స్ పర్యటన: నిధుల కోసం ఘన స్వాగతం
- #BBCSpecial: మసూద్ అజర్‌ను టెర్రరిస్టుగా ప్రకటించాలనే డిమాండ్‌కు చైనా అడ్డుపుల్ల ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)