అంతర్జాతీయ న్యాయస్థానం: దేశాల మధ్య వివాదాలను ఎలా పరిష్కరిస్తుంది?

అంతర్జాతీయ న్యాయస్థానం

ఫొటో సోర్స్, Getty Images

ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రధాన న్యాయ విభాగం అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే). దీని ప్రధాన కార్యాలయం ది హేగ్‌లో ఉంది. వివిధ దేశాల మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించడమే దీని ఏర్పాటు వెనక ప్రధాన ఉద్దేశం.

భారత్‌కు చెందిన జస్టిస్ దల్వీర్ భండారి 2017లో ఐసీజేలోని 15 మంది న్యాయమూర్తుల ప్యానెల్‌కు ఎంపికయ్యారు. అంతకు ముందు ఆయన భారత సుప్రీంకోర్టులో సీనియర్ జడ్జిగా పనిచేశారు.

ఫొటో సోర్స్, PAKISTAN FOREIGN OFFICE

ఐసీజే ముందు ఏ దేశమైనా కేసు దాఖలు చేసేముందు తమ దేశానికి చెందిన జడ్జి ఆ బెంచ్‌లో లేకపోతే, తమ దేశం వారిని అడ్ హాక్ జడ్జిగా, అంటే తాత్కాలికంగా ఐసీజేలో కూర్చోపెట్టవచ్చు. ఈ ఏర్పాటు కేవలం ఆ ఒక్క కేసు వరకే. ప్రస్తుతం పాకిస్తాన్‌కు చెందిన జడ్జి ఎవరూ ఐసీజేలో లేరు. అందుకే కుల్‌భూషణ్ జాదవ్ కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాన న్యాయమూర్తి తసాడుక్ హుస్సేన్ జిలానీని అంతర్జాతీయ న్యాయస్థానం అడ్ హాక్ జడ్జిగా పాకిస్తాన్ గత సంవత్సరం నియమించింది.

ఫొటో సోర్స్, Getty Images

ఐసీజే ప్రధాన విధులేంటి?

ఐసీజేకు ప్రధానంగా రెండు బాధ్యతలున్నాయి. ఒకటి, వివిధ దేశాల మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించడం. రెండోది, ఐక్యరాజ్య సమితికి చెందిన విభాగాలు, ఏజెన్సీల సూచన మేరకు కొన్ని సలహాలు ఇవ్వడం... అయితే ఈ సలహాలు, సూచనలు పాటించాలనే నియమం ఏమీ లేదు.

వివిధ దేశాలకు చెందిన 15 మంది జడ్జిలతో ఈ కోర్టు పనిచేస్తుంది. ఐసీజేకు ఎన్నికైన జడ్జి పదవీకాలం 9 సంవత్సరాలు. వీరిని ఐక్యరాజ్య సమితి సాధారణ సభ, భద్రతా మండలి కలసి ఎన్నుకుంటాయి.

ఐసీజేలో సభ్యులు తమ దేశ ప్రభుత్వాలకు ప్రాతినిధ్యం వహించరు. వీరు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయమూర్తులుగానే వ్యవహరిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images

ఐసీజేలో ఎవరు కేసు వేయవచ్చు?

గుర్తింపు పొందిన దేశాలు మాత్రమే ఐసీజే ముందుకు వివాద పరిష్కారం కోసం వెళ్లేందుకు అవకాశం ఉంది. అంటే ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం పొందిన 192 దేశాలకు మాత్రమే తమకు ఇతర దేశాలతో ఉన్న సమస్యల పరిష్కారానికి అంతర్జాతీయ న్యాయస్థానం గడప తొక్కేందుకు ఆస్కారం ఉంది.

తన జోక్యానికి ఇరు దేశాలూ అంగీకరిస్తేనే ఐసీజే కేసు విచారణకు అంగీకరిస్తుంది.

విచారణ మొదటి దశలో... రాతపూర్వకంగా ఇరు పార్టీలు తమ పిటిషన్లను దాఖలు చేసి, తమ అభిప్రాయాలను, వాదనలను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవాలి. దీని తర్వాత ఇరు పార్టీలతో మౌఖిక విచారణ, బహిరంగంగా జరుగుతుంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

జస్టిస్ దల్వీర్ భండారి

ఐసీజే తీర్పులను కచ్చితంగా పాటించాలా?

మౌఖిక వాదనలు పూర్తయ్యాక, తర్వాత దశలో ప్రైవేటుగా, కెమెరాల పర్యవేక్షణలో విచారణ జరుగుతుంది. ఈ విచారణ పూర్తైన తర్వాత న్యాయస్థానం తన తీర్పును బహిరంగ సమావేశంలో వెల్లడిస్తుంది. ఈ తీర్పే తుది తీర్పు. దీనిపై ఇక ఎలాంటి అప్పీళ్లకు అవకాశం లేదు.

ఇరు పార్టీల్లో ఎవరైనా దీన్ని అమలు చేయకపోతే, రెండో దేశం ఈ విషయాన్ని భద్రతా మండలి దృష్టికి తీసుకువెళ్లవచ్చు. మండలిలో వీటో అధికారమున్న ఐదు దేశాల్లో ఏ ఒక్కటైనా ఈ తీర్పును గానీ, తదనంతర చర్యలను గానీ వ్యతిరేకిస్తే, ఆ సమస్య ఇక అపరిష్కృతంగా మిగిలినట్లే. అంటే తీర్పు అమలు చేయాల్సిన అవసరం ఉండదు.

1946 నుంచి ఇప్పటివరకూ ఐసీజే సరిహద్దు వివాదాలను మొదలుకొని, సైనిక చర్యలు అవసరం లేకుండా, దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా దేశాల సార్వభౌమాధికారాలపై సమస్యల పరిష్కారం, బందీలకు సంబంధించిన అంశాలు, విదేశాల్లో ఆశ్రయం పొందే హక్కులు, జాతీయత వంటి అనేక వివాదాలపై తీర్పులనిచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images

ఇప్పటి వరకూ ఐసీజే ఎప్పుడైనా అడ్వైజరీలు జారీచేసిందా?

ఐసీజే జారీచేసే అడ్వైజరీలు దౌత్యపరమైనవిగా ఉంటాయి. వాటికి తప్పనిసరిగా కట్టుబడి ఉండాల్సిన అవసరం ఇరు పార్టీలకూ ఉండదు.

ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటివరకూ ఎన్నోసార్లు ఐసీజే అడ్వైజరీలను జారీచేసింది. ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం, మానవ హక్కుల పరిరక్షణ కోసం సమితి నిర్దేశించిన బాధ్యతల్లో ఉండగా జరిగిన గాయాలకు పరిహారాలు, అణ్వాయుధాల వాడకం వల్ల అనర్థాలు వంటి అంశాల్లో అడ్వైజరీలు జారీచేసింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ

ఐసీజే అడ్వైజరీలు విజయవంతమయ్యాయా?

ఐసీజే చరిత్రను చూస్తే అన్నీ ఒడిదొడుకులే కనిపిస్తాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎన్నో ఆశలతో దీన్ని ఏర్పాటు చేశారు. కానీ ఏర్పాటు వెనకున్న ప్రధాన లక్ష్యమైన అంతర్జాతీయ వివాదాల పరిష్కార సాధనలో అంతర్జాతీయ న్యాయస్థానం విఫలమైందనే చెప్పవచ్చు. ఎందుకంటే ఏ దేశమూ కూడా తమకు సంబంధించిన వివాదాల పరిష్కార బాధ్యతను పూర్తిగా ఐసీజేకు అప్పగించేందుకు సిద్ధంగా లేదు.

1984లో నికరాగ్వాలోని శాండినిస్టా ప్రభుత్వం దాఖలు చేసిన ఓ కేసు నుంచి అప్పటి అమెరికా ప్రభుత్వం వైదొలిగింది. అమెరికా మద్దతున్న కాంట్రా రెబెల్స్ చర్యలపై శాండినిస్టా ప్రభుత్వం ఐసీజేకు ఫిర్యాదు చేసింది. కానీ రీగన్ ప్రభుత్వం ఈ వ్యవహారంలో అంతర్జాతీయ న్యాయస్థానం జోక్యంపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, తదుపరి చర్యలు తీసుకోవడాన్ని వ్యతిరేకించింది.

అంతకు ముందు 1977లో అర్జెంటీనా కూడా ఐసీజే ఇచ్చిన ఓ తీర్పును అంగీకరించేందుకు నిరాకరించింది. బీగిల్ చానల్‌లోని దీవులను చిలీకు అప్పగించడాన్ని అర్జెంటీనా ఒప్పుకోలేదు. చివరికి పోప్ జోక్యంతో అప్పట్లో యుద్ధం తప్పింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

అంతర్జాతీయ నేర న్యాయస్థానం

అంతర్జాతీయ న్యాయస్థానానికి, ఇతర అంతర్జాతీయ కోర్టులకు తేడా ఏంటి?

దేశాల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారానికి ఉద్దేశించినదే ఐసీజే. ఇది ప్రభుత్వాలతోనే సంప్రదిస్తుంది తప్ప వ్యక్తులతో కాదు.

అంతర్జాతీయ న్యాయస్థానానికి, అంతర్జాతీయ నేర న్యాయస్థానానికి (ఐసీసీ) తేడా ఉంది. ఇది కూడా ది హేగ్‌లోనే ఉంది. ప్రపంచంలో ఎక్కడైనా జరిగే నరమేధాలు, మానవత్వానికి వ్యతిరేకంగా జరిగే తీవ్ర నేరాలు, యుద్ధ నేరాలు వంటి తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసులను ఐసీసీ విచారిస్తుంది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)