అధ్యక్షుడు ట్రంప్‌పై కోర్టుకెక్కిన 16 అమెరికా రాష్ట్రాలు.. మెక్సికో గోడ వివాదం

  • 19 ఫిబ్రవరి 2019
డోనల్డ్ ట్రంప్ Image copyright Getty Images

మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మించాలన్న అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ పంతం ఆ దేశంలో ఫెడరల్ గవర్నమెంట్, రాష్ట్రాల మధ్య ఘర్షణకు దారితీస్తోంది.

ఇప్పటికే ట్రంప్ నిర్ణయానికి కాంగ్రెస్‌ ఆమోదం దొరక్కపోవడంతో ఆయన అత్యవసర స్థితి ప్రకటించి గోడ నిర్మాణానికి మార్గమేర్పరుచుకుంటున్న సంగతి తెలిసిందే.

అయితే, అత్యవసర పరిస్థితి విధించాలన్న ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించాయి.

కాలిఫోర్నియా నేతృత్వంలో 16 రాష్ట్రాలు కాలిఫోర్నియాలోని ఓ న్యాయస్థానంలో కేసు దాఖలు చేశాయి.

అధ్యక్షుడిగా తనకున్న అధికారాలను దుర్వినియోగం చేస్తున్న ట్రంప్‌ను నిలువరించేందుకు ఆయన్ను కోర్టు ముందుకు తెస్తున్నామని కాలిఫోర్నియా అటార్నీ జనరల్ జేవియర్ బెసెర్రా అన్నారు.

ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బును ట్రంప్ దోచుకుంటున్నారని.. దాన్ని కాంగ్రెస్ చట్టబద్ధంగా అడ్డుకుందని.. అయినా, ట్రంప్ అధికార దుర్వినియోగంతో పంతం నెగ్గించుకునే ప్రయత్నం చేస్తుండడంతోనే కోర్టునాశ్రయించామని చెప్పారు.

Image copyright Getty Images

కాగా ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా శుక్రవారం తొలి కేసు దాఖలైంది. పబ్లిక్ సిటిజన్ అనే ఒక న్యాయసేవల సంస్థ ఈ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కేసు దాఖలు చేసింది.

ట్రంప్ ప్రతిపాదిస్తున్న గోడ వేసే మార్గంలో పొలాలు ఉన్న టెక్సాస్‌కు చెందిన ముగ్గురు స్థలయజమానుల తరఫున ఈ న్యాయసేవల సంస్థ కోర్టుకు వెళ్లింది.

న్యూయార్క్ డెమొక్రటిక్ అటార్నీ జనరల్ లెతీషియా జేమ్స్ కూడా ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా చట్టపరంగా ఉన్న అన్ని మార్గాల్లో పోరాడుతానని చెప్పారు.

ట్రంప్ ఏమంటున్నారు?

శుక్రవారం వైట్ హౌస్ రోజ్ గార్డెన్‌ నుంచి ట్రంప్ ఎమర్జెన్సీని ప్రకటించారు. ఇలా చేయడం వల్ల గోడ నిర్మాణం కోసం 800 కోట్ల డాలర్లను తాను వినియోగించే అధికారం దఖలు పడుతుందని ఆయన తెలిపారు.

అయితే, సుమారు 3,200 కిలోమీటర్ల మేర నిర్మించతలపెడుతున్న ఈ గోడ కోసం అవసరమైన 2300 కోట్ల డాలర్లకు ఇది చాలా తక్కువ.

ఎమర్జెన్సీపై కోర్టుకు వెళ్తారని.. అయితే, సుప్రీంకోర్టులో అడ్డంకులన్నీ తొలగిపోవచ్చని ట్రంప్ చెబుతున్నారు.

Image copyright AFP
చిత్రం శీర్షిక ట్రంప్ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు

అసలేంటీ ఎమర్జెన్సీ

అమెరికాలో 'నేషనల్ ఎమర్జెన్సీ యాక్ట్' అనేది దేశం సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు ఉపయోగించడానికి ఉద్దేశించిన అత్యవసర చట్టం.

దేశ దక్షిణ సరిహద్దుల్లో వలసల కారణంగా సంక్షోభం తలెత్తిందని.. అందుకే ఈ చట్టాన్ని ప్రయోగించానని ట్రంప్ అంటున్నారు. కానీ, వలసలకు సంబంధించిన అధ్యయనకర్తలు, నిపుణులు మాత్రం అలాంటి సంక్షోభ పరిస్థితులేమీ లేవంటున్నారు.

నిజానికి అమెరికాకు వచ్చి తమ వీసా గడువు ముగిసినా కూడా అక్రమంగా అక్కడ ఉంటున్న వలసదారులే అధికం. ఇలాంటివారు ఏటా పెరిగిపోతున్నారు.

ట్రంప్ ఈ ఎమర్జెన్సీని ప్రకటించడం వల్ల ఆయనకు ప్రత్యేక అధికారాలు దఖలుపడతాయి. సాధారణ రాజకీయ ప్రక్రియ ప్రకారం చేపట్టాల్సిన పనులను.. ఆ ప్రక్రియ అవసరం లేకుండానే కేవలం తన నిర్ణయాధికారంతోనే పూర్తిచేసుకునేందుకు ఇది వీలుకల్పిస్తుంది.

అంతేకాదు.. సైనిక, సహాయ రంగాల బడ్జెట్ల నుంచి నిధులను ట్రంప్ ఈ గోడ నిర్మాణానికి మళ్లించుకునే వీలూ ఏర్పడుతుంది.

ఇదే మొదటిసారా?

ట్రంప్ కంటే ముందు అధ్యక్షులుగా పనిచేసినవారు కూడా ఈ ఎమర్జెన్సీ విధించే అధికారాన్ని విరివిగా వాడుకున్నారు.

ఉగ్రవాద సంబంధాలున్న సంస్థలకు నిధులు రాకుండా అడ్డుకోవడంలో నిర్ణయం తీసుకోవడానికి, మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడే దేశాల్లో పెట్టుబడులను నిషేధించడానికి.. విదేశాంగ విధానంలో తాము తీసుకున్న నిర్ణయాలు అమలు చేయడానికి ఇలా అనేక సందర్భాల్లో గత అధ్యక్షులూ ఈ అధికారాన్ని వాడుకున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కశ్మీర్‌, దిల్లీలకు చెందిన ఇద్దరు కలం స్నేహితులు రాసుకున్న ఉత్తరాల్లో ఏముంది...

కరోనావైరస్: దక్షిణ కొరియాలో ఒకే రోజులో రెట్టింపైన రోగుల సంఖ్య

ట్రంప్‌కు 70 లక్షల మంది స్వాగతం పలకడం సాధ్యమేనా...

మానసి జోషి: BBC Indian Sportswoman of the Year నామినీ

విశాఖ ఏజెన్సీ: తమ ఊరికి సొంతంగా రోడ్డు నిర్మించుకున్న ఈ గిరిజనులు ఏమంటున్నారో వింటారా...

ఛత్తీస్‌గఢ్ గిరిజనులపై బంగ్లాదేశ్ శరణార్థులు నిజంగానే ఆధిపత్యం చలాయిస్తున్నారా?

200 ఏళ్ల నాటి ఈస్టిండియా కంపెనీ పెయింటింగ్స్‌.. భారత్‌కు నచ్చలేదు, బ్రిటన్‌ ఇబ్బంది పడింది ఎందుకు

‘నగ్నంగా గుంపులుగా నిలబెట్టి, ‘ఫింగర్ టెస్ట్’లు చేశారు’: ఫిట్‌నెస్ పరీక్షల నిర్వహణ తీరుపై మహిళా ఉద్యోగుల అభ్యంతరం