యూట్యూబ్: భూమి బల్లపరుపుగా ఉందని చెబుతోందా?

ఊహా చిత్రం

భూమి గుండ్రంగా లేదని, బల్లపరుపుగా ఉందని ఒప్పించేందుకు జరుగుతున్న ప్రయత్నంలో యూట్యూబ్ కీలకపాత్ర పోషిస్తోందని ఓ అధ్యయనం తెలిపింది.

ఈ అంశంపై జరిగిన కొన్ని కాన్ఫరెన్సులకు హాజరైన ప్రజలను అధ్యయనకారులు ప్రశ్నించారు.

వారిలో చాలామంది.. ‘భూమి బల్లపరుపుగా ఉందని తెలిపే వీడియోల’ను యూట్యూబ్‌లో చూసినట్లు తెలిపారు. ఈ వీడియోలు చూపి, భూమి బల్లపరుపుగా ఉంది అని కొందరు వాదిస్తున్నారు.

తమ వెబ్‌సైట్‌కు వచ్చే వీక్షకులకు సరైన సమాచారం అందించేందుకు యూట్యూబ్ ప్రయత్నించాలని ఆధ్యయనకారులు చెబుతున్నారు.

‘‘యూట్యూబ్‌లో ఎంత విలువైన సమచారం అందుబాటులో ఉందో, అంతే స్థాయిలో తప్పుడు సమాచారం కూడా ఉంది’’ అని టెక్సాస్ టెక్ యూనివర్సిటీ ప్రొఫెసర్ యాష్‌లీ లాండ్రమ్ అన్నారు.

ఒక వీడియో చూడటం పూర్తయ్యే సమయంలో.. ‘మరో వీడియో చూడండి’ అంటూ యూట్యూబ్.. వీక్షకులకు కొన్ని సూచనలు చేస్తుంది. దీని వెనుక పనిచేసే యూట్యూబ్ ఆల్గారిథమ్.. ఇలాంటి వీడియోలు చూపి, వీక్షకులను అయోమయంలో పడేస్తోంది.

‘‘భూమి బల్లపరుపుగా ఉందని నమ్మడం వల్ల నష్టం లేదు. కానీ ఈ కొత్త విశ్వాసం వల్ల వ్యవస్థ పట్ల, అధికార సంస్థల పట్ల విశ్వాసం పోతుంది’’ అని యాష్‌లీ అన్నారు.

భూమి బల్లపరుపుగా ఉందన్న అంశంపై నిర్వహించిన రెండు కాన్ఫరెన్సులకు హాజరైన 30మందిని అధ్యయనంలో భాగంగా ప్రశ్నించారు.

యూట్యూబ్‌లో.. ‘వాస్తవ విరుద్ధ సిద్దాంతాల’కు చెందిన వీడియోలను చూశాక, భూమి బల్లపరుపుగా ఉందని చెప్పే వీడియోలు చూడాలంటూ యూట్యూబ్ తమకు సూచించినట్లు అధ్యయనంలో తేలింది.

వీరిలో కొందరు.. ఈ బల్లపరుపు సిద్ధాంతాన్ని విమర్శించడానికే తాము ఆ వీడియోలను చూశామని చెప్పారు. కానీ విమర్శను వదిలిపెట్టి, ఆ వాదనతో వీరూ ఏకీభవించారు.

‘అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ సైన్స్’ సమావేశంలో ఈ అధ్యయనాన్ని సమర్పించారు. ఇలాంటి వాస్తవ విరుద్ధ సిద్ధాంతాలను సవాలు చేయడానికి సైంటిస్టులు, సైన్స్ గురించి వాదించగలిగినవారి అవసరం చాలా ఉంది అని యాష్‌లీ అన్నారు.

‘‘ఇలాంటి తప్పుడు సమాచారంతో పోరాడటానికి మన దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం. సరైన సమాచారాన్ని అందివ్వడమే..!’’ అని యాష్‌లీ అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)