నా గర్ల్‌ఫ్రెండ్ నన్ను ఎలా చిత్రహింసలు పెట్టిందంటే...

  • అలెక్స్ స్కీల్
  • (వయసు 22 ఏళ్లు)
జోర్డాన్, అలెక్స్

ఫొటో సోర్స్, BBC Three / Century Films

అలెక్స్ భాగస్వామి జోర్డన్.. బ్రిటన్‌లో గృహహింస కింద జైలు పాలైన మొట్టమొదటి మహిళ.

నా గర్ల్‌ఫ్రెండ్ జోర్డన్ మొదటిసారి నా మీద మరుగుతున్న నీళ్లు పోసిన క్షణాన్ని నేనెప్పుడూ మరచిపోలేను. గదిలో ఒక మూలకు నెట్టేసి నా మీద వేడివేడి నీళ్లు గుమ్మరించింది.

మేమిద్దరం మూడేళ్లుగా కలిసి జీవిస్తున్నాం. ఇదంతా మొదట చిన్న విషయాలుగానే మొదలైంది. నన్ను ఊదా రంగు బట్టలు తొడుక్కోవద్దని చెప్పేది. నా హెయిర్‌స్టైల్ తనకు నచ్చలేదనేది. క్రమంగా అది భౌతిక హింసగా మారింది. తొమ్మిది నెలల పాటు నిత్యం నరకం చవిచూశాను. ఆమెను చూస్తేనే భయంతో వణికిపోయేవాడిని.

నామీద గుమ్మరించిన ఆ మరుగుతున్న నీటిలో మొదటి నీటి బిందువు నా చర్మాన్ని కాల్చివేస్తూ లోపలికి వెళ్లటం నాకు ఇప్పటికీ గుర్తుంది. అదంతా స్లోమోషన్‌లో జరిగింది. ఆ తర్వాత నా చర్మం గడ్డకట్టుకుపోయింది. నేను ఎన్నడూ ఎరుగనంత నొప్పి అది. చన్నీళ్ల బాత్‌టబ్‌లో పడుకోనివ్వమని ఆమెను ప్రాధేయపడ్డాను. అలవిమాలిన మంట నుంచి ఉపశమనం పొందటానికి నాకు వచ్చిన ఆలోచన అదొక్కటే. ఆమె అనుమతించింది.

చన్నీళ్లలో పడుకున్న తక్షణమే చాలా ఉపశమనం అనిపించింది. అంత వేడినీళ్లతో మండిన శరీరాన్ని చన్నీళ్లలో ముంచినపుడు ఎంత అద్భుతంగా ఉంటుందో మీరు ఊహించలేరు. ప్రపంచంలో అంతకు మించిన హాయి లేదు. అంతలో నన్ను బాత్ టబ్ నుంచి బయటకు రమ్మని ఆమె చెప్పింది. రాకపోతే మళ్లీ వేడినీళ్లు పోస్తానంది.

ఫొటో సోర్స్, BBC Three / Century Films

నేను నొప్పిగా ఉందని మూలుగుతూ ఉంటే.. ''అయితే బాత్ టబ్‌లో దిగు'' అని చెప్పేది. మళ్లీ వెంటనే లేచి రమ్మని బెదిరించేది. ఆమెది మైండ్ గేమ్. నా జీవితంలో అన్ని అంశాల మీదా తన పట్టు ఉండాలన్నది ఆమె కాంక్ష. ఒంటి మీద నూలు పోగు లేకుండా బాత్ టబ్‌లో పడుకోవటం నాకు గుర్తుంది.. ఓవెన్‌లో ఉడుకుతూ ఉన్నట్లు. నా చర్మం ఊడిపోతూ ఉంది. అది చాలా భయానకం.

ఇంగ్లండ్, వేల్స్‌లో నేరాల మీద చేసిన సర్వే తాజా గణాంకాల ప్రకారం 2018 మార్చితో ముగిసిన సంవత్సరంలో.. 16 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు వయోజనుల్లో 20 లక్షల మంది గృహ హింస బాధితులు ఉన్నారు. వారిలో మూడో వంతు మంది పురుషులని అంచనా.

పురుషులు గృహ హింస బాధితులవుతున్న ఉదంతాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. 2017లో ఇంగ్లండ్, వేల్స్‌లలో పురుషులు గృహ హింస బాధితులుగా ఉన్న కేసులు దాదాపు 1,50,000 నమోదయ్యాయి. ఇది 2012లో నమోదైన కేసులకు రెట్టింపు కన్నా అధికం.

ఫొటో సోర్స్, BBC Three / Century Films

జోర్డాన్ వర్త్, నేను 2012లో కాలేజీలో కలిసినపుడు మా ఇద్దరి వయసూ 16 ఏళ్లే. స్కూల్‌లో ఆమె బాగా చదివేది. యూనివర్సిటీ ఆఫ్ హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌లో ఫైన్ ఆర్ట్ చదవటానికి సీటు కూడా తెచ్చుకుంది. ఆమె టీచర్ కావాలనుకుంది. మొదటి కొన్ని నెలలు అంతా బాగుంది. మేం కలిసి హాయిగా గడిపాం. సినిమాలు చూడటం, కలిసి వాకింగ్‌కు వెళ్లటం అంతా మామూలుగానే చేశాం.

కొన్ని నెలలు గడిచాక.. కొన్ని వింత సంఘటనలు జరిగాయి. ఆమె తన మీదే దృష్టి పెట్టటానికి అలా ప్రవర్తిస్తోందని అప్పుడు నేను అనుకున్నాను. మా అమ్మానాన్న మమ్మల్ని లయన్ కింగ్ చూడటానికి లండన్ పంపించారు. అంతలో జోర్డాన్ అకస్మాత్తుగా అదృశ్యమైపోయింది. ఆమె కోసం మేం ఆందోళనగా చాలాసేపు అంతటా వెదుకుతున్నాం. చాలాసేపటి తర్వాత ఆమె రిసెప్షన్ ఏరియాలో కనిపించింది. మమ్మల్ని చూసి పడిపడి నవ్వింది. అదంతా కొంచెం విచిత్రంగా అనిపించింది. ఇప్పుడు ఆలోచిస్తే.. నా మీద తన పట్టు సంపాదించటం కోసం.. ఆమె గురించి నేను ఆందోళన చెందేలా, భయపడేలా చేయటానికి ఆమె అనుసరించే పద్ధతి అది అని అనిపిస్తుంది.

కొద్ది రోజులకే జోర్డన్ నన్ను పూర్తిగా ఏకాకిని చేసింది. నా ఫ్యామిలీ నుంచి, నా ఫ్రెండ్స్ నుంచి వేరు చేసింది. వారిని కలవకుండా నన్ను ఆపేసింది. నా ఫేస్‌బుక్ అకౌంట్‌ని కూడా తన చేతుల్లోకే తీసుకుంది. నేను ఎవరితోనూ నా బాధ చెప్పుకునే వీలు లేదు.

ఫొటో సోర్స్, BBC Three / Century Films

ఫొటో క్యాప్షన్,

తన కవల సోదరుడు, తల్లితో అలెక్స్

ఆ తర్వాత నాకు తిండి పెట్టటం కూడా మానేసింది. దీంతో నేను చాలా బరువు తగ్గిపోయాను. ఆమె ప్రవర్తనను ప్రశ్నించటానికి నేను ప్రయత్నించాను. కానీ ఆమె తిరిగి నన్నే తప్పుపట్టేది. సమస్య నా వల్లే వస్తోందని నన్ను ఒప్పించటానికి ప్రయత్నించేది. అది నా తప్పో కాదో నాకు తెలియదు. కానీ ఆమె మాటలతో 'నేనేం తప్పు చేస్తున్నాను?' అని నేను ఆలోచించుకోవాల్సి వచ్చేది. ఆమెకు ఇష్టమైన పనులు చేసే వాడిని. ఆమెకు ఇష్టం లేదన్న దుస్తులు తొడుక్కోవటం మానేశాను. అదంతా ఆమెను మెప్పించటానికి.

కానీ వాస్తవంలో.. ఆమె నన్ను తను అనుకున్నట్లుగా మలచుతోంది. అది నా ఆత్మవిశ్వాసాన్ని బలహీనపరుస్తుంది. నేను ఎన్నడూ గెలవని యుద్ధం చేస్తున్నానన్న మాట.

మాకు ఇద్దరు పిల్లలు పుట్టారు. ఏదైనా మార్పు వస్తుందన్న ఆశతో ఉండేవాడిని. పిల్లలు ఇంకా పసివాళ్లే. అయినా జరుగుతున్నది వారు చూసి ఉంటారు. వాళ్లని ఆమె నేరుగా గాయపరచలేదు కానీ.. నేను వెళ్లిపోతే ఆమె తన హింసను వారిపైకి మళ్లిస్తుందని భయపడేవాడిని. అందుకే నేను ఉండిపోయాను.

అలాగని.. మా ఇద్దరి మధ్య నిజంగా మంచి సంబంధాలు ఎప్పుడూ లేవని కాదు. జోర్డన్, నేను కలిసి సంతోషంగా ఉన్న సమయాలున్నాయి. మేం కలిసి నవ్వుతూ ఆనందంగా గడిపిన క్షణాలవి. మా బంధం మెరుగుపడాలని నేను కోరుకున్నాను. అందుకోసం ప్రయత్నించాను. ఎందుకంటే నేను ఆమెను ప్రేమించాను.

ఏడాదిన్నరలో ఈ మానసిక హింస భౌతిక హింసగా మారింది. నేను వేరే యువతులను కలుస్తున్నానని, వారికి మెసేజ్‌లు పంపిస్తున్నానని ఆరోపించటంతో ఇది మొదలైంది. రాత్రిళ్లు నేను నిద్రపోతున్నపుడు ఓ గ్లాస్ బాటిల్‌తో నా తలపై గట్టిగా కొట్టేది.

ఆమె ఆ ఆరోపణలన్నిటినీ స్వయంగా పుట్టిస్తోందని తర్వాత నాకు తెలిసింది. గ్లాస్ బాటిల్‌ను పక్కనే పెట్టుకుని నిద్రపోయేది. నేను నిద్రలోకి జారుకున్న తర్వాత దానితో నా తలపై బాదేది. ''ఏం ఆలోచిస్తున్నావు?'' అని అడిగేది.

ఫొటో సోర్స్, BBC Three / Century Films

ఫొటో క్యాప్షన్,

ఎక్స్‌రేలో అలెక్స్ విరిగిన పళ్లు

కొంత కాలానికి అలా కొట్టినా నొప్పి పుట్టని పరిస్థితికి నేను వచ్చేశాను. ఆ నొప్పి ఎంతగా అలవాటైపోయిందంటే.. నొప్పి తెలిసేదే కాదు. దీంతో ఆమె హింసను తర్వాతి దశకు తీసుకెళ్లేది. నన్ను హింసించటానికి బలమైన మార్గం అన్వేషించేది. బాటిల్ పనిచేయనపుడు సుత్తితో కొట్టింది. ఆ తర్వాత చేతికి ఏది దొరికితే దానితో నన్ను బాదేది.

ఒకసారి.. ల్యాప్‌ట్యాప్ చార్జర్‌తో కొట్టింది. చార్జర్ వైరును ముంజేతికి చుట్టుకుని మెటల్ ప్లగ్‌ను నా తలపై విసిరి కొట్టింది. తల నుంచి రక్తం చిమ్ముకొచ్చి ధారగా కారటం మొదలైంది. నేలంతా రక్తంతో తడిసిపోతోంది. ''ప్లీజ్ నాకు హెల్ప్ చెయ్యి'' అని ఏడ్చాను. ఆమె నవ్వుతూ మెట్లెక్కి పైకి వెళ్లిపోయింది. ''వెళ్లి చావకపోయావా? నీకోసం ఎవరూ ఏడవరు...'' అంటూ.

ఇక క్రమంగా కత్తులతో దాడి చేయటం మొదలుపెట్టింది జోర్డాన్. ఒకసారి నా మణికట్టు మీద పెద్ద నరం తెగిపోయేదే. తృటిలో తప్పిపోయింది. ఆ తర్వాత ఉడుకు నీళ్లతో దాడి చేసింది.

ఆమె పెట్టే హింసల నొప్పికి నేను అలవాటుపడుతూ ఉంటే ఆమె ఒక లెవల్ పెంచుకుంటూ పోతుంది. ఆ వేడి నీళ్ల దాడి తర్వాతి దశ అంటే నా చావే అయ్యుండేది.

ఫొటో సోర్స్, BBC Three / Century Films

జోర్డన్ అంటే నేను చాలా భయపడే వాడిని. ఆమె ఏం చేస్తుందో తలచుకుంటే వణుకుపుట్టేది. నేనేమైనా చేస్తే నన్ను చంపేస్తుందని భయపడే వాడిని. నేను హాస్పిటల్‌కు వెళ్లి.. జారిపడ్డానని, నా తల గోడకు తగిలిందని, షవర్‌లో చాలా వేడి నీళ్ల వల్ల ఒళ్లు కాలిందని చెప్పేవాడిని.

ఇంట్లో అరుపులు విని పొరుగింటి వ్యక్తి ఒకరు పలుమార్లు పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చినపుడు నేను అబద్ధాలు చెప్పేవాడిని. జోర్డాన్‌ పెట్టే హింస గురించి చెప్పేవాడిని కాదు. నా ప్రాణాలు కాపాడుకోవటానికే అలా చెప్పాను. నా కళ్లు కమిలిపోయేవి. ఆమె తన మేకప్‌తో వాటిని కప్పేసేది. ఆమె చేస్తున్న దానిని దాచటానికి.

నా శరీరం కృశించిపోవటం నాకు తెలిసేది. నేను 30 కిలోలకు పైగా బరువు తగ్గిపోయాను. ఆ తర్వాత డాక్టర్లు నన్ను చూసినపుడు.. చావుకు మరో పది రోజుల దూరంలో ఉన్నావని చెప్పారు. ఎందుకంటే అప్పటికి ఎన్నో రోజులుగా నాకు తిండి లేదు. ఒంటి మీద గాయాలు చాలా తీవ్రమయ్యాయి.

ఇదంతా 2018లో ముగిసిపోయింది. అంతకుముందు వచ్చి వెళ్లిన ఓ పోలీస్ ఆఫీసర్ మళ్లీ వచ్చి నన్ను ప్రశ్నించినపుడు భయంకరమైన నిజం బయటకు వచ్చింది. ఆ సమయంలో నా గాయాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. నేను బరువు తగ్గిపోయి చాలా బక్కపల్చగా బలహీనంగా ఉన్నాను. అప్పటివరకూ ఏమీ జరగలేదని చెప్తూ వచ్చాను. ఇక అలా చెప్పలేకపోయాను.

ఫొటో సోర్స్, BBC Three / Century Films

ఫొటో క్యాప్షన్,

పొరుగువారు అప్రమత్తం చేసినప్పుడు వచ్చిన పోలీసులు బాడీ‌క్యామ్‌తో రికార్డు చేసిన ఫుటేజీలో అలెక్స్

ఆ క్షణంలో పోలీసులు కనుక జోక్యం చేసుకుని ఉండకపోతే.. నేను సమాధిలో ఉండేవాడిని. అందులో సందేహం లేదు. నా శరీరం మీద ఎన్నో గాయాలు ఉండటం నాకు అదృష్టంగా మారింది. సాక్ష్యం బలంగా ఉంది. ఆమెను జైలుకు పంపించటానికి అది సాయపడింది.

జోర్డన్ ఎందుకలా చేసిందంటే.. కేవలం అసూయేనని నేను అనుకుంటాను. నా కుటుంబంతో నేను చాలా సన్నిహితంగా ఉండేవాడిని. చాలా తెలివైన స్నేహితులు ఉండేవారు. వారందరి నుంచి ఆమె నన్ను దూరం చేసింది. నాకున్న దానినంతటి నుంచీ నన్ను ఆమె లాగేసుకుంది. ''నీ జీవితం నాశనం చేస్తాను'' అని ఆమె నాతో అనటం నాకు గుర్తుంది.

ప్రతీ ఆరుగురిలో ఒకరు తమ జీవితంలో ఏదో ఒక సందర్భంలో గృహ హింసను ఎదుర్కొంటున్నారు. అయితే.. కేవలం ప్రతి 20 మందిలో ఒకరు మాత్రమే బయటకు వచ్చి సాయం కోరుతున్నారు.

జోర్డన్ ఎప్పుడూ చింతించలేదు. పోలీసులు ప్రశ్నించినప్పుడు కూడా. నన్ను హింసించిన విషయం కన్నా.. తను దొరకకుండా చూసుకోవటానికే ఆమె ప్రాధాన్యం ఇచ్చిందని నాకు అనిపిస్తోంది. ఆమె తను తప్పు చేసినట్లు కోర్టులో ఒప్పుకుంది.. శిక్ష తగ్గించుకోవటం కోసం.

ఫొటో సోర్స్, BBC Three / Century Films

ఫొటో క్యాప్షన్,

పోలీసు విచారణలో జోర్డాన్

ఈ తరహా ప్రవర్తనను జోర్డాన్ ఎలా సమర్థించుకుంటుందో నాకు తెలియదు. అయతే.. గృహ హింస అనేది ఆ హింసకు పాల్పడే వారికి ఒక వ్యసనంగా ఒక మత్తుపదార్థంగా మారుతుందని నేను అనుకుంటాను. ఎందుకంటే అలా హింసించటం ద్వారా వారికి ఒక ఆనందం లభిస్తుంది. ఎంత ఎక్కువగా హింసిస్తే.. తాము దొరక్కుండా ఉండగలమని అంత ఎక్కువగా నమ్ముతుంటారు.

దీంతో ఈ హింస రోజు రోజుకూ దారుణంగా మారుతుంది. అదెలా ఉంటుందే.. వాళ్లు స్వర్గంలో ఉన్నట్లు.. మనం నరకంలో ఉన్నట్లు ఉంటుంది. వాళ్లు కోరుకున్నది.. పూర్తి నియంత్రణ.. వారికి లభిస్తుంది. మనం జీవితంలో ఎన్నడూ కోరుకోని దారుణ పరిస్థితుల్లోకి మనం పడిపోతాం. అకస్మాత్తుగా వాళ్లకి భారీ షాక్ తగులుతుంది.

నేను జోర్డాన్‌ను కలవటానికి ముందు పురుషులు పాల్పడే గృహ హింస గురించి విన్నాను. ఆమె చేస్తున్నదేమిటో నాకు తెలుసు. అదంతా చాలా చాలా చెడ్డదని నాకు తెలుసు. కానీ ఏం చేయాలో నాకు తెలియదు. నిజంగా తెలియదు. ఆమెను అరెస్ట్ చేయటానికి అవసరమయ్యే ఒక అభియోగం నేను చెప్పలేను. ఎందుకంటే నాకు అసలు ఏమీ తెలియదు.

ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి నేను ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఇది హాస్యాస్పదంగా అనిపించవచ్చు. కానీ, నేను బయటపడగలిగే మార్గమేదీ లేదు. నిజంగా నాకంటూ అసలు ఏమీ లేదు. పైగా మాకు ఇద్దరు పిల్లలున్నారు. ఇది ఆగిపోతుందని ఆశించేవాడిని. ఏ రోజైనా ఒక దెబ్బ తగ్గితే.. అది చాలా మంచి దినం. అలా అనుకునేవాడిని. నా ఆందోళన పిల్లల గురించే. వాళ్లు బాగుండాలనే నా తపన.

ఫొటో సోర్స్, BBC Three / Century Films

ఫొటో క్యాప్షన్,

అలెక్స్ ఆస్పత్రి నుంచి వచ్చాక తన బేబీ ఐరిస్‌ను మళ్లీ కలిశారు

జోర్డాన్‌కు 2018 ఏప్రిల్‌లో ఏడున్నరేళ్ల జైలుశిక్ష విధించారు. ఆ వార్త విన్నపుడు నేనేమీ స్పందించలేదు. ''అది న్యాయం'' అని అనుకున్నానంతే. ఇప్పుడు ఏ విషయాలూ నన్ను కదిలించవు.

నేను అనుభవించిన వేదన ఫలితమిదని నేను అనుకుంటున్నా. ఆమె జైలుకు వెళుతోందని తెలిసినపుడు.. ఐదేళ్లలో మొదటిసారి నేను ఎటువంటి ఆందోళన లేకుండా ఉండగలిగాను.

ఏం జరుగుతోందన్నది పిల్లలకు ఏమీ తెలియదు. దీనికంతటికీ సంబంధించిన సమాచారం.. కోర్టు పత్రాలు దాచాను. పిల్లలు పెద్దవాళ్లయ్యాక, వారు అర్థం చేసుకోగలిగే పరిస్థితులు వచ్చినపుడు వారికి వివరిస్తాను.

ఫొటో సోర్స్, BBC Three / Century Films

''డాడ్.. నువ్వు చాలా మంచి పని చేశావు'' అని ఏదో ఒక రోజు వారు అనాలన్నదే నా కోరిక. భవిష్యత్తులో గృహహింస బాధితులైన పురుషుల కోసం స్వచ్ఛంద సంస్థల సాయంతో పనిచేయాలని అనుకుంటున్నా.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)