పుల్వామా దాడి: 'భారత్-పాక్ సంబంధాల పునరుద్ధరణకు చర్చలే ఉత్తమ మార్గం' : అభిప్రాయం

  • డాక్టర్ హసన్
  • బీబీసీ కోసం, లాహోర్ నుంచి
imran khan

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ఇమ్రాన్ ఖాన్

పుల్వామా దాడిపై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మొదటిసారిగా స్పందించారు. 40 మందికి పైగా భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయిన పుల్వామా ఆత్మాహుతి దాడిలో పాకిస్తాన్ ప్రమేయం ఉన్నట్లు వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. ఈ ఘటనకు పాల్పడితే పాకిస్తాన్‌కు ఒరిగేదేమీలేదని, పాకిస్తాన్‌ కేంద్రంగా ఇలాంటి కార్యకలాపాలు సాగిస్తే, వారు జాతిప్రయోజనాలకు విరుద్ధంగా నడుచుకున్నట్లేనని ఆయన అన్నారు.

పుల్వామా ఘటన దర్యాప్తులో తాము సహకరిస్తామని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. ఒకవేళ.. పుల్వామా దాడిలో పాకిస్తాన్‌కు చెందిన ఏ సంస్థ ప్రమేయం ఉందని సాక్ష్యాధారాలతో సహా భారత్ రుజువు చేస్తే, వారిపై తగిన చర్యలు తీసుకుంటామని ఇమ్రాన్ ఖాన్ ప్రతిజ్ఞ చేశారు.

యుద్ధం జరుగుతుందంటున్న భారత రాజకీయ నాయకులు, మీడియా హెచ్చరికలపై స్పందిస్తూ, రెండు దేశాల మధ్య సంబంధాలను విషతుల్యం చేసే పరిణామాలకు చర్చలే పరిష్కారమని విశ్వసిస్తున్నానని ఆయన అన్నారు. కానీ, తమపై భారత్ ఎలాంటి సైనిక చర్యకు పాల్పిడినా, ప్రతీకారం తీర్చుకోవడానికి పాకిస్తాన్ సంకోచించదని హెచ్చరించారు.

పుల్వామా ఘటనకు ఘాటుగా స్పందించాలని ప్రధాని మోదీపై తీవ్రమైన ఒత్తిడి ఉన్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఏప్రిల్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎట్టిపరిస్థితుల్లోనూ వెనకడుగు వేసేందుకు మోదీకి ఇష్టం లేదని, పాకిస్తాన్ హింసాత్మక ఘటనలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని మోదీ పలు సందర్భాల్లో ప్రమాణం చేశారని మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మీడియా ఒక అడుగు ముందుకేసి, పాకిస్తాన్‌పై చర్యలు తీసుకోవల్సిందేనంటూ ఎడతెగని కథనాలు ప్రసారం చేస్తోంది. 2016 పఠాన్‌కోట్ సైనిక స్థావరంపై దాడి ఘటనకు సర్జికల్ స్ట్రైక్‌తో భారత్ సమాధానం చెప్పింది. మరి.. కొన్ని దశాబ్దాల్లో భారత సైన్యంపై ఎప్పుడూ జరగనంత తీవ్రమైన దాడికి అంతే స్థాయిలో భారత్ ప్రతిస్పందిస్తుందని కొందరి వాదన. ఇలాంటి వ్యవహారంతో ఇరు దేశాల మధ్య నెలకొన్న అసలు సమస్యకు పరిష్కారం లభించదు. గతంలో జరిగిన యుద్ధాలు భారత్-పాకిస్తాన్‌ల మధ్య నెలకొన్న సమస్యలకు పరిష్కారం చూపలేదు, భవిష్యత్తులో కూడా చూపవు అని ఇమ్రాన్ ఖాన్ తన ప్రసంగంలో అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images

ద్వేషపూరిత రాజకీయాలకే లాభం

ఒకవైపు అంతర్జాతీయంగా పాకిస్తాన్‌ను ఒంటరిని చేస్తామని భారత్ చెబుతోంది. మరోవైపు పాకిస్తాన్ చైనా, సౌదీ అరేబియాతో సన్నిహితంగా ఉంది. అంతేకాకుండా, అఫ్గానిస్తాన్ భవిష్యత్తును నిర్దేశించడానికి జరుగుతున్న చర్చల్లో పాకిస్తాన్ కీలకపాత్ర పోషిస్తోంది.

గతంలో... కశ్మీర్, అఫ్ఘానిస్తాన్‌లో కార్యకలాపాలు సాగించిన ఇస్లామిస్ట్ మిలిటెంట్లతో పాకిస్తాన్‌కు సాన్నిహిత్యం ఉండేది. ఆ సమయంలో, భారతీయ ప్రజలు, సైన్యంపై జరిగిన దాడుల్లో పాకిస్తాన్ తమ హస్తం లేదని పాకిస్తాన్ ప్రకటించినా, అనుమానాలు తీరేవి కావు. కానీ ఇప్పుడు ఇస్లామిస్ట్ మిలిటెంట్లతో తమకు సంబంధాలు లేవని, ఇస్లామిస్ట్ మిలిటెంట్ల ఏరివేత లక్ష్యంగా దశాబ్దకాలం మిలిటరీ పనిచేసిందని పాక్ చెబుతోంది. ఇప్పటికీ.. కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులకు పాకిస్తాన్ మద్దతు ఇస్తోందన్న ఆధారాలు ఉన్నపుడు పాక్ వైఖరిపై అనుమానాలు కలుగుతున్నాయి. ఉదాహరణకు ముంబై దాడుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జమాద్-ఉద్-దవా సంస్థకు చెందిన హఫీజ్ సయీద్, జైష్‌-ఎ-మొహమ్మద్‌ నాయకుడు మసూద్ అజర్ ఇద్దరూ పాకిస్తాన్‌లో స్వేచ్ఛగా జీవిస్తున్నారు.

ముంబై, పఠాన్ కోట్‌లో మిలిటెంట్ల దాడి అనంతరం, దర్యాప్తుకు మేం సహకరిస్తాం అని పాకిస్తాన్ ప్రకటించింది. అనంతరం, ఉమ్మడి దర్యాప్తులో అడ్డంకుల గురించి, ఇరు దేశాల మధ్య ఉన్న అపనమ్మకం గురించి పరస్పర ఆరోపణలకు దిగాయి.

ఏది ఏమైనా, ఉప ఖండంలో ఉద్రిక్త పరిస్థితులను నివారించడం కోసం శాంతంగా వ్యవహరించడం, చర్చలకు మార్గం సుగమం చేయడం ఎంతో ముఖ్యమనడానికి చాలా కారణాలున్నాయి.

వాటిలో ఒకటేమిటంటే, ఇటు భారతదేశంలో కానీ, అటు పాకిస్తాన్‌లో కానీ పౌర, సైనిక నాయకత్వాలనేవి ఏక ధ్రువంగా లేవు. రెండు పొరుగు దేశాల మధ్య విద్వేషం, శత్రు భావనలు కొనసాగడం వల్ల ద్వేషపూరిత రాజకీయాలు చేసే వారు మాత్రమే లాభపడతారు. ఆ పరిస్థితులను వారు తమ రాజకీయ స్థానాలను సుస్థిరం చేసుకోవడానికి ఉపయోగిస్తారు. ఇలాంటివారి వల్ల కొనసాగుతున్న నిరర్థక యథాతథ స్థితికి ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవాలి. రాజకీయంగా కష్టమైనప్పటికీ అలా చేయడమే మంచిది.

ఫొటో సోర్స్, Getty Images

సానుకూల స్పందన సముచితం

ఇక రెండో కారణం, పాకిస్తాన్ తమ దేశాలలో తీవ్రవాద దాడులకు పాల్పడుతోందని ఆరోపిస్తున్న ఇరాన్, అఫ్గానిస్తాన్ దేశాలతో భారతదేశం కలపడంతో, తమ సరిహద్దు ప్రాంతాలలో కార్యకలాపాలు సాగిస్తున్న సాయుధ మిలిటెంట్ గ్రూపులతో తమకున్న సంబంధం ఏమిటన్నది పాకిస్తాన్ కూడా స్పష్టం చేయాల్సిన అగత్యం ఏర్పడుతోంది.

ఆ మేరకు ఆ దేశం మీద ఒత్తిడి కూడా పెరుగుతోంది. అదే సమయంలో భారతదేశం కూడా తాను కశ్మీర్‌లో అనుసరిస్తున్న విధానాలను సమీక్షించుకోవాలి. రావల్పిండిలో తయారవుతున్న వ్యూహాల ప్రభావం కన్నా ఎక్కువగా స్థానికంగా అమలవుతున్న అణచివేత చర్యల వల్లనే చాలా మంది మిలిటెన్సీ వైపు మొగ్గు చూపుతున్నారు.

ఇప్పుడు పుల్వామా దాడికి పాల్పడింది కూడా స్థానిక యువకుడే కానీ, పాకిస్తాన్ నుంచి వచ్చిన వ్యక్తి కాదన్నది గుర్తుంచుకోవాలి. ఆ వ్యక్తిని హింసా మార్గం వైపు మళ్ళించడంలో భారత అధికారుల అణచివేత ధోరణులు కూడా కీలక పాత్ర పోషించాయని అతడి మిత్రులు, బంధువులు చెప్పారు.

పుల్వామా దాడి మీద స్పందిస్తూ ఇమ్రాన్ ఖాన్, భారత్-పాక్ చర్చల పునరుద్ధరణకు పిలుపునిచ్చారు. దక్షిణాసియాలో తీవ్రవాదంపై కూడా చర్చిద్దామన్నారు. ఇరుదేశాల సంబంధాలలో ముందడుగు వేయాలంటే ఆయన పిలుపునకు సానుకూలంగా స్పందించడం అత్యంత సముచితం.

(డాక్టర్ హసన్ జావిద్ లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్సెస్ (ఎల్.యు.ఎం.ఎస్)లో పొలిటికల్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఈ వ్యాసంలోని అభిప్రాయాలు ఆయన వ్యక్తిగతం. వాటితో బీబీసీ వైఖరికి ఎలాంటి సంబంధం లేదు.)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)