#AntiHateChallenge: 'నేను పాకిస్తానీని, పుల్వామా ఉగ్రదాడిని ఖండిస్తున్నా'

  • షుమైలా జాఫ్రీ
  • బీబీసీ ప్రతినిధి, ఇస్లామాబాద్
#AntiHateChallenge

ఫొటో సోర్స్, AFZALRAHIM/FACEBOOK

పుల్వామా దాడి బాధితులకు సంఘీభావంగా పాకిస్తాన్‌లోని కొందరు మహిళలు సోషల్ మీడియాలో ఓ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. #AntiHateChallenge పేరుతో దీన్ని జర్నలిస్టు, శాంతి కార్యకర్త సెహీర్ మీర్జా ప్రారంభించారు.

"నేను పాకిస్తానీని. నేను పుల్వామా ఉగ్రదాడిని ఖండిస్తున్నా" అని రాసి ఉన్న బ్యానర్‌తో ఉన్న చిత్రాన్ని ఆమె ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

'కశ్మీర్‌లో అమాయకుల ప్రాణాలు బలిగొన్న ఉగ్రదాడితో మేమంతా చాలా కలతచెందాం' అని 'అమన్ కీ ఆశా' అనే ఫేస్‌బుక్ గ్రూపులో షేర్ చేసిన ఓ పోస్టులో ఆమె పేర్కొన్నారు.

ఇలాంటి సమయంలో యుద్ధం, ఉగ్రవాదాలకు వ్యతిరేకంగా మాట్లాడేందుకు భారత్, పాకిస్తాన్‌లకు ధృడమైన గొంతుకలు కావాలని సెహీర్ అభిప్రాయపడ్డారు.

#AntiHateChallenge, #NoToWar, #WeStandWithIndia, #CondemnPulwamaAttack వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో పుల్వామా దాడులను ఖండించాలని, భారతీయులకు సంఘీభావం తెలపాలని పాకిస్తానీలకు పిలుపునిచ్చారు.

ఇరు దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొనడం పట్ల తనకెంతో బాధగా ఉందని సెహీర్ బీబీసీతో అన్నారు.

"భారత్‌లో ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారనే విషయం తెలుసు. వారు బాధలో ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా దీనిపై విపరీతమైన స్పందన వస్తోంది" అని ఆమె అన్నారు.

అందుకే, ఈ నిశ్శబ్దాన్ని పోగొట్టేందుకు పాకిస్తాన్ వైపునుంచే ప్రయత్నించాలని సెహీర్, ఆమె స్నేహితులు నిశ్చయించుకున్నారు.

ఫొటో సోర్స్, SEHYRMIRZA/FACEBOOK

"ఆగ్రహం, విచారం, బాధ కలిగిన సమయంలో మనకు ఓదార్పునిచ్చే చర్యలు కావాలి. ఇది కేవలం ప్రేమ, ఆత్మీయతలతోనే సాధ్యమవుతుంది" అని సెహీర్ అభిప్రాయపడ్డారు.

యుద్ధం పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేయాలంటూ ఆమె తన పోస్టు ద్వారా సాహిర్ లూధియాన్విని కోరారు.

"రక్తం మనది కావచ్చు, వారిది కావచ్చు.. కానీ అది మనుషులదే కదా.

యుద్ధం జరిగింది తూర్పున కావచ్చు, పశ్చిమాన కావచ్చు.. కానీ హత్యకు గురైంది ప్రపంచ శాంతే కదా.

బాంబులు పడింది ఇళ్లపై కావచ్చు, సరిహద్దుల్లో కావచ్చు.. కానీ ఆత్మ గాయపడింది కదా.

యుద్ధం అంటేనే ఓ సమస్య. ఇక యుద్ధం సమస్యలను ఎలా పరిష్కరిస్తుంది?

ఈరోజు బాంబుల వర్షం, రక్తపాతం... రేపు ఆకలి, దుర్భిక్షం."

ఈ పోస్ట్ తర్వాత మరింత మంది ఈ క్యాంపెయిన్‌లో చేరారు. వారిలో లాహోర్‌కు చెందిన లాయర్ షిమ్లా ఖాన్ ఒకరు.

"ఈ దాడి అనంతరం జరిగిన ప్రకటనల్లో ఎక్కడా కూడా శాంతి గురించిన ప్రస్తావనే లేదు. రెండు వైపుల నుంచి జాతీయవాదం, యుద్ధం అనే మాటలే వినబడుతున్నాయి. అందుకే, ప్రజలు కోరుకునే శాంతి సందేశాన్ని #AntiHateChallenge ద్వారా ఇవ్వాలనుకుంటున్నాం" అని షిమ్లా వ్యాఖ్యానించారు.

ఇప్పటివరకూ దాదాపు 12 మంది మహిళలు ఈ #AntiHateChallenge లో పాల్గొన్నారు. కానీ దీనికి వచ్చిన స్పందన మాత్రం అనూహ్యం.

ప్రాంతాలకతీతంగా వీరిని ఎందరో ప్రశంసిస్తున్నారు. 'అమన్ కీ ఆశా' ఫేస్‌బుక్ గ్రూపు ఎడిటర్, చిత్ర నిర్మాత బీనా సర్వార్ కూడా ఈ ఛాలెంజ్‌కు మద్దతు ప్రకటించారు.

"#AntiHateChallenge పేరుతో పాకిస్థాన్ యువతులు ఓ అద్భుతమైన ప్రచారాన్ని ప్రారంభించారు. 'నేను పాకిస్థానీని, నేను పుల్వామా ఉగ్రదాడిని ఖండిస్తున్నా' అని రాసి ఉన్న తమ ప్రొఫైల్ పిక్చర్లను పోస్ట్ చేస్తున్నారు. #NoToWar" అని ఆమె ఓ ట్వీట్‌లో తెలిపారు.

"#AntiHateChallenge #Pakistan #India #PulwamaAttack ఇలాంటి హ్యాష్‌ట్యాగ్‌లతో పోస్టులు చేయడమంటే నేరాన్ని ఒప్పుకున్నట్లు కాదు, కారణమేదైనా కావచ్చు.. జరిగిన హింసాత్మక చర్యలను ఖండించడం. ఈ దాడిలో చనిపోయిన అమాయకులకు నా నివాళి, వారి కుటుంబాలకు మా సానుభూతి. వీరిలో చాలా మంది ఆర్థికంగా వెనకబడినవారే" అని ఆమె తన ఫేస్‌బుక్ టైమ్‌లైన్‌లో పోస్ట్ చేశారు.

"ఇదో సాహసోపేతమైన చర్య అని కొందరు భారతీయులు అంటున్నారు. మానవత్వంపై నాకున్న నమ్మకం నిలబడింది. ధన్యవాదాలు సెహీర్ మీర్జా #AntiHateChallenge" అని వినాయక్ పద్మదేవ్ అనే ట్విటర్ యూజర్ పోస్ట్ చేశారు.

"పాకిస్తాన్‌లో ఎవరూ చేయని విధంగా పుల్వామా ఉగ్రదాడిపై ఓ వైఖరి తీసుకున్నందుకు ఈ వీరవనిత సెహీర్ మీర్జాకు అభినందనలు. #AntiHateChallenge. ఈరోజు ప్రేమపై ద్వేషం గెలిచినా, మానవత్వంపై ఉన్మాదం ఆధిపత్యం సాధించినా కూడా ఈమె మళ్లీ ఒక ఆశాకిరణంలా కనిపిస్తున్నారు. ఆమెకు ఆశీస్సులు" అని రాజీవ్ సింగ్ ట్వీట్ చేశారు.

"వీరు కొద్దిమందే కావచ్చు. కానీ పాకిస్తాన్‌లో కూడా మానవత్వం ఉన్న మహిళలున్నారు. సెహీర్ మీర్జాకు అభినందనలు. మా సైనికుల మృతదేహాలను లెక్కపెడుతూ ఆనందించే కొందరు మీ దేశస్తులే మీపై దాడులు చేయవచ్చు. ధైర్యంగా ఉండండి" అంటూ సిద్ధార్థ్ దాస్ ట్విటర్లో వ్యాఖ్యానించారు.

అయితే మా క్యాంపెయిన్‌కు మిశ్రమ స్పందన లభిస్తోందని సెహీర్ మీర్జా అంటున్నారు. వీరికి మద్దతు ప్రకటించేవారు కొందరుంటే.. ఎన్నో విమర్శలు చేస్తూ, ఆన్‌లైన్ వేదికల్లో తిట్టేవారు కూడా ఎందరో ఉన్నారని ఆమె తెలిపారు.

"మమ్మల్ని తీవ్రంగా తిడుతున్నారు. ఈ ఫొటోలు అవాస్తవం అని కూడా అంటున్నారు. కానీ రెండువైపులా శాంతిని కోరుకునే వారికి ఇదో పరీక్షాసమయం. ఇప్పుడు బహిరంగంగా మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ అభిప్రాయాలు అవతలివారికి చేరాలి" అని ఆమె తెలిపారు.

"దశాబ్దాలుగా కశ్మీర్‌లో భద్రతా దళాల దుశ్చర్యల ఫలితమే పుల్వామా దాడి" అని ఈ ఛాలెంజ్‌ను వ్యతిరేకించేవారు వ్యాఖ్యానిస్తున్నారు.

"పాకిస్తాన్‌లోని ఉన్నత వర్గం తమ పక్కనే ఉన్న ఈ తీవ్ర సమస్యను అర్థం చేసుకోలేకపోతే, ఎలాంటి చర్యలు చేపట్టాలో అవగాహనకు రాలేకపోతే, ఇక అర్థంలేని ఖండనలతో ఎలాంటి ఉపయోగం ఉండదు. బుర్రలకు పదునుపెట్టండి. ఆక్రమణలు అంతమైతేనే శాంతి సాధ్యమవుతుంది" అని బుర్హాన్ గిలానీ ట్విటర్లో అభిప్రాయపడ్డారు.

"కొంతమంది మరో వింత వాదన తీసుకొస్తున్నారు.. అంత సంక్లిష్ట సమస్యను ఇంత చిన్న బ్యానర్‌లో చెప్పలేం అంటున్నారు" అని షిమ్లా ఖాన్ తెలిపారు.

"కశ్మీరీల ఆకాంక్షలు, భావాలను దృష్టిలో పెట్టుకుంటూ శాంతి సాధనే లక్ష్యంగా పాకిస్థానీలు ఎలా స్పందిస్తే బాగుంటుంది, తమ అభిప్రాయాలను ప్రభావవంతంగా ఎలా చెప్పాలి అనే దానిపై ఓ చర్చను లేవదీశాం. అది మాకు సంతోషం" అని ఆమె అన్నారు.

"మనం మన భావాలను వెల్లడిస్తూనే ఉండాలి. అప్పుడే పౌరులుగా ఈ చర్చను ముందుకు తీసుకెళ్లగలం. లేదంటే రెండు దేశాల ప్రభుత్వాలూ తమ జాతీయవాద అనుకూల భావాలను తమకు అనుకూలంగా మలచుకుంటూ ఉంటాయి" అని షిమ్లా తెలిపారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)