పుల్వామా దాడి: మసూద్ అజర్‌ 'టెర్రరిస్టు' అని చైనా ఎందుకు అంగీకరించడం లేదు

  • సందీప్ సోనీ
  • బీబీసీ ప్రతినిధి
మసూద్ అజర్

ఫొటో సోర్స్, Getty Images

ఈ ఏడాది ఫిబ్రవరి 14న పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జైషే మహమ్మద్ ఆత్మాహుతి దాడి తర్వాత మసూద్ అజర్ పేరు మరోసారి పతాక శీర్షికల్లో నిలిచింది.

జైషే మహమ్మద్ పాకిస్తాన్‌లోని ఒక మిలిటెంట్ సంస్థ. మసూద్ అజర్ దాని చీఫ్. అతడిని 'అంతర్జాతీయ టెర్రరిస్టు'గా ప్రకటించాలని భారత్ డిమాండ్ చేస్తోంది.

దీని కోసం భారత్ భద్రతా మండలిలో అపీల్ చేసింది. కానీ భారత్ ప్రస్తావనను చైనా ప్రతిసారీ వీటో చేస్తోంది. చైనా అలా ఎందుకు చేస్తోంది?

ఈ ప్రశ్నకు భారత మాజీ దౌత్యవేత్త వివేక్ కాట్జూ "చైనా.. పాకిస్తాన్ సైన్యం కోసం మసూద్ అజర్‌ను వెనకేసుకొస్తోంది. అతడు పాకిస్తాన్ సైన్యంలో ఒక వర్చువల్ భాగం. పాకిస్తాన్ విదేశాంగ విధానం, వ్యూహాలను ముందుకు తీసుకెళ్లడానికి మసూద్ అజర్, జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, హఫీజ్ సయీద్ సాయం చేస్తారు" అన్నారు.

"మీరు మసూద్ అజర్‌ను ఐక్యరాజ్య సమితి టెర్రరిస్టుగా ప్రకటించకుండా అడ్డుకోండని పాకిస్తాన్ సైన్యం చైనాను కోరిందని నాకు అనిపిస్తోంది. అయితే జైషే మహమ్మద్‌ను మాత్రం తీవ్రవాద సంస్థగా ప్రకటించారు" అని కాట్జూ తెలిపారు.

"కానీ మసూద్ అజర్‌కు కూడా పాకిస్తాన్ సైన్యంతో చాలా అనుబంధం ఉంది. ఆ బంధం వల్లే వారు మసూద్ అజర్‌కు ఇలాగే అండగా నిలవాలని చైనాను కోరుతూ వస్తున్నారు".

ఫొటో సోర్స్, Getty Images

చైనా, పాకిస్తాన్ స్నేహం పాతదే

"చైనాతో పాకిస్తాన్ స్నేహం హిమాలయాల కంటే ఉన్నతమైనది, సముద్రం కంటే లోతైనది, తేనె కంటే తీయనైనది అని మేం గత నాలుగైదు దశాబ్దాలుగా వింటూ వస్తున్నాం. పాకిస్తాన్‌లో చాలా అనిశ్చితి ఉంది. కానీ ఈ స్నేహం మాత్రం కొనసాగుతూనే ఉంది" అని ఇస్లామాబాద్ బీబీసీ ప్రతినిధి ఆసిఫ్ ఫారూఖీ అన్నారు.

"గత రెండు మూడేళ్ల నుంచి ఈ స్నేహానికి కొత్త జీవం వచ్చింది. చైనా పాకిస్తాన్‌లో జోరుగా పెట్టుబడులు పెడుతోంది. పాకిస్తాన్‌ రాజకీయాలు, సైన్యం, సామాన్యుల్లో చైనాకు వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడేవారు చాలా తక్కువగా కనిపిస్తారు" అని ఆసిఫ్ చెప్పారు.

అయితే చైనా అవసరాన్ని మించి పాకిస్తాన్‌లో జోక్యం చేసుకోవడం సరికాదని భావించే కొందరు మేధావులు కూడా ఇక్కడ ఉన్నారు. స్నేహం ఉండాలి కానీ 'లిమిట్‌'లో ఉండాలని చెబుతున్నారు.

"చైనా పాకిస్తాన్‌కు అండగా ఎందుకు నిలుస్తోంది అనేది తెలుసుకోవాలంటే మనం ఏవైతే వినడానికి, అర్థం చేసుకోడానికి అలవాటుపడ్డామో ఆ విషయాల దగ్గరికే వెళ్లాల్సుంటుంది" అని బీజింగ్‌లో ఉన్న సీనియర్ విలేఖరి సైబల్ దాస్ గుప్తా భావిస్తున్నారు.

వీడియో క్యాప్షన్,

కశ్మీర్‌: సీఆర్పీఎఫ్ జవాన్లపై ఆత్మాహుతి దాడి, 34 మంది మృతి

"చైనా భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్‌ను ఉపయోగించుకుంటోంది అని భారత్‌లో చెబుతారు. ఇది కొంతవరకూ నిజమే. అలా చేయడం వల్ల భారత్ ఆర్థిక శక్తిగా మారకుండా అడ్డుకోవచ్చు. కానీ చైనా, పాకిస్తాన్ బంధాలు ఇప్పటివి కావు".

"1950 దశకంలో చైనా ట్రక్కులు పాకిస్తాన్‌ వెళ్లడానికి వీలుగా కారాకోరమ్ కనుమను ఎలాంటి సాంకేతిక సాయం లేకుండా వెడల్పు చేశారు. చైనా నుంచి పాకిస్తాన్ వెళ్లాలంటే ఇప్పుడు కూడా ఆ దారిలోంచే వెళ్లాల్సి ఉంటుంది. ఈరోజు చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అదే దారిలో జరుగుతోంది. దానిని విస్తరిస్తున్నారు".

సైబల్ ఈ స్నేహంలోని మరో కోణం గురించి కూడా చెప్పారు. "అలాగే అక్సాయి చిన్‌ అనే భాగం ఉంది. ఆ భాగాన్ని చూసుకోవడం తమ వల్ల అయ్యే పని కాదని పాకిస్తాన్‌కు తెలుసు. అందుకే పాక్ ఆ భాగాన్ని చైనాకు ఇచ్చేసింది. పాకిస్తాన్, చైనా బంధం పాతది" అన్నారు.

"మధ్యలో అమెరికా వచ్చింది. పాకిస్తాన్‌కు డాలర్లు ఇవ్వడం మొదలుపెట్టింది. చైనా దగ్గర ఇవ్వడానికి అంత ఉండేది కాదు. డాలర్‌తో పాకిస్తాన్, అమెరికా ప్రేమ పీక్స్‌‌కు చేరింది. ఇప్పటికే పాకిస్తాన్ అమెరికాకు సుమారు 60 బిలియన్ డాలర్లు చెల్లించాలి".

"కానీ చైనా ఇప్పుడు పాకిస్తాన్‌కు ఆర్థిక మద్దతు అందిస్తోంది. అది ఆ దేశానికి పొరుగు దేశంగా మారింది. భారత్‌కు వ్యతిరేకం కూడా. పాక్ సైన్యానికి చైనా నుంచి విమానాలు, ట్యాంకులు కూడా అందుతున్నాయి. పాకిస్తాన్‌కు ఇంకేం కావాలి" అని సైబల్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images

వెనకేసుకొస్తున్న పాక్ సైన్యం

భారత మాజీ దౌత్యవేత్త వివేక్ కాట్జూ "జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను భారత్‌పాటు ప్రపంచంలోని మిగతా దేశాలు కూడా టెర్రరిస్టుగా భావిస్తున్నాయి. కానీ కేవలం చైనా మాత్రం వీటో ద్వారా మసూద్ అజర్‌ను కాపాడుతూ వస్తోంది" అన్నారు.

"మసూద్ అజర్ ఏళ్ల క్రితం హర్కతుల్ అంసార్‌లో భాగంగా ఉండేవాడు. కశ్మీర్‌లో భారత్‌కు పట్టుబడ్డాడు. జైలు శిక్ష కూడా వేశారు. కానీ 1999లో కాందహార్ విమానం హైజాక్ సమయంలో 160 మంది ప్రాణాలు కాపాడడానికి భారత్ మసూద్ అజర్‌ను విడుదల చేయాల్సొచ్చింది".

"విడుదలైన తర్వాత మసూద్ అజర్ పాకిస్తాన్ వెళ్లాడు. అక్కడ అతడికి భారీ స్వాగతం లభించింది. విడుదలైన కొన్ని నెలల తర్వాత మసూద్ బహావల్‌పూర్‌లో తన సంస్థ ఏర్పాటు చేశాడు. పాకిస్తాన్ ప్రభుత్వం కూడా అతడికి చాలా సాయం చేసింది. తర్వాత కశ్మీర్‌లో అతడిని ఉపయోగించుకుంది" అని కాట్జూ తెలిపారు.

"అమెరికా బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా ఇంకా ఎన్నో దేశాలు భారత్ వాదనతో ఏకీభవిస్తున్నాయని ఆయన చెప్పారు. ఐక్యరాజ్య సమితి 1267 ప్రకారం మసూద్ అజర్‌ను అంతర్జాతీయ టెర్రరిస్టుగా ప్రకటించడానికి ఎలాంటి సమస్యా లేదు. కానీ చైనా దానికి అడ్డుపుల్ల వేస్తోంది. దీనికి ఒకే ఒక కారణం పాకిస్తాన్, ముఖ్యంగా పాకిస్తాన్ సైన్యం" అంటారు కాట్జూ.

చైనా అడ్డుపుల్ల వేయడానికి మూడు కారణాలు

చైనా మసూద్ అజర్‌కు వ్యతిరేకంగా భారత్ ప్రతిపాదనను వీటో చేయడానికి సీనియర్ విలేఖరి సైబల్ దాస్‌ గుప్తా మూడు కారణాలు చెప్పారు.

మొదటి కారణం: "ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కొన్ని నియమాలు, చట్టాలు ఉన్నాయి. వాటిని పాటించాల్సి ఉంటుంది. దాని ప్రకారం లిస్టింగ్ జరిగినప్పుడు, మేమంతా దాని ప్రకారం ఆలోచిస్తాం అని చైనా చెబుతోంది.

రెండో కారణం: "మేం అలా చేయడానికి మసూద్ అజర్‌కు వ్యతిరేకంగా భారత్ కీలకమైన ఆధారాలేవీ ఇవ్వడం లేదు, ఆధారాలు ఇస్తే అప్పుడు చూస్తాం అని చైనా అంటోంది".

మూడో కారణం: "చైనా మినహా అందరి మద్దతు పొందామని భారత్ చెబుతున్నా, భారత్ ఈ అంశంలో భద్రతా మండలిలోని సభ్యులందరి మద్దతూ పొందలేకపోతోంది అని చైనా చెబుతోంది".

"భారత్ ప్రతిపాదనను చైనా వీటో చేసిందనే విషయంపై భారత్‌లా పాకిస్తాన్‌లో ఎక్కువగా చర్చించరు" అని ఇస్లామాబాద్‌లో బీబీసీ ప్రతినిధి ఆసిఫ్ ఫారూఖీ చెప్పారు.

"చైనా వీటో వల్ల పాకిస్తాన్‌తో స్నేహమే కాదు, భారత్‌తో దానికి శత్రుత్వం కూడా వచ్చింది. మిలిటెంట్ గ్రూపులకు దీనివల్ల ప్రయోజనం లభించింది. ఇదంతా శత్రువుకు శత్రువు మనకు మిత్రుడే అన్నట్లు అయ్యింది. ఐక్యరాజ్య సమితిలో చైనా తీరు కూడా అలాగే కనిపిస్తోంది".

ఫొటో సోర్స్, Getty Images

ఒక వర్గం నుంచే మద్దతు

"పాకిస్తాన్‌లో ఆంక్షలు ఉన్నప్పటికీ జైషే మహమ్మద్ కార్యకలాపాలు కనిపించాయి. వారికి పాకిస్తాన్ నిఘా వ్యవస్థ సాయం లభిస్తోందని చెబుతారు. కానీ దానికి ఎలాంటి పక్కా ఆధారాలు లేవు" అని బీబీసీ ప్రతినిధి ఆసిఫ్ ఫారూఖీ చెప్పారు.

"1999లో కాందహార్ ఘటన తర్వాత మసూద్ అజర్ అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల సాయంతో జైషే మహమ్మద్ ఏర్పాటు చేశాడు. రెండు మూడేళ్ల తర్వాత తను పాకిస్తాన్ వచ్చాడు. కానీ మసూద్‌ను అరెస్ట్ చేశారు. అతడి సంస్థలోనే నిర్బంధించారు. మసూద్ అజర్ గురించి బహిరంగంగా, రహస్యంగా మాట్లాడిన ఏ నేతనూ నేను ఇప్పటివరకూ చూళ్లేదు" అని ఆసిఫ్ తెలిపారు.

అయినా పాకిస్తాన్‌లోని ఒక వర్గం అతడిని సమర్థిస్తోంది. దీనిపై ఆసిఫ్ ఫారూఖీ "పాకిస్తాన్‌లో మసూద్ అజర్ గురించి ఎవరికీ సదభిప్రాయం లేదు. అతడు ఒక టెర్రరిస్ట్ సంస్థ చీఫ్ అని, తీవ్రవాదాన్ని ప్రచారం చేస్తున్నాడని అందరికీ తెలుసు" అన్నారు.

"ఎన్నో మిలిటెంట్ దాడుల్లో అతడి హస్తం ఉంది. ఇప్పటి యువతరంలో మసూద్ అజర్ గురించి సదభిప్రాయం లేదు. కానీ భారత్‌ను శత్రువుగా భావిస్తూ, ఆ దేశాన్ని నాశనం చేయాలనుకునే సమాజంలోని ఒక భాగం మాత్రం అతడిని సమర్థిస్తోంది" అని ఆసిఫ్ తెలిపారు.

"కరాచీలో ఒక కార్యక్రమంలో సుమారు 17 ఏళ్ల క్రితం బయట కనిపించిన మసూద్ అజర్ ఆ తర్వాత అండర్‌గ్రౌండ్‌కు వెళ్లాడు. హఫీజ్ సయీద్‌లా ఆయన మీడియాలో ప్రత్యేకంగా కనిపించడం ఉండదు. మూడేళ్ల క్రితం కశ్మీర్‌లోని ముజఫరాబాద్ దగ్గర జిహాదీల కాన్ఫరెన్సులో ఆయన్ను చివరిసారి చూశారు" అంటారు ఆసిఫ్.

బీజింగ్‌లో సీనియర్ విలేఖరి సైబల్ దాస్‌ గుప్తా "పాకిస్తాన్ సైన్యం మసూద్ అజర్‌ వెంట ఉంది. అతడికి ఐఎస్ఐ మద్దతు కూడా ఉంది. పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐను బాధపెట్టడం చైనాకు ఇష్టం లేదు. చైనాకు పాకిస్తాన్ సైన్యం అవసరాలు ఉండడమే దానికి కారణం. ఎందుకంటే సరిహద్దుల్లో ఉన్న షింజియాంగ్ ప్రాంతంలోని ముస్లిం జనాభా చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది. వాళ్లకు సాయం చేయడానికి తాలిబన్లు ఆ వైపు నుంచి ఈ వైపు రావడం చైనాకు ఇష్టం లేదు" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

చైనా వైఖరి ఎప్పటికైనా మారేనా?

ఈ ప్రశ్నకు భారత మాజీ దౌత్యవేత్త వివేక్ కాట్జూ "ఒకవేళ చైనా తన తీరు మార్చుకోవాలని అనుకుంటే, దానికి సరైన సమయం ఇదే. కానీ చైనా తన వైఖరి మార్చుకోదు. ఎందుకంటే తీవ్రవాదం, తీవ్రవాదాన్ని ఉపయోగించడం అనేది పాకిస్తాన్ సెక్యూరిటీ టాక్టిక్స్‌లో ఒక ప్రత్యేకమైన భాగం" అన్నారు.

"పాకిస్తాన్ సైన్యానికి మిలిటెంట్ గ్రూపులను ఉపయోగించుకోవడం అవసరం. అందుకే అది వారికి ఆశ్రయం, ప్రోత్సాహం ఇస్తుంది. కానీ ఏదో ఒక రోజు చైనా కూడా సీరియస్‌గా ఆలోచించే రోజు వస్తుందని, అప్పుడు భారత్‌లో తమ పట్ల అంత వ్యతిరేకత దీని గురించే వచ్చిందనే విషయం తెలుసుకుంటుందని అనుకోవాలి".

ఫొటో సోర్స్, Getty Images

అజర్‌ కోసం భారత్ సరిహద్దు దాటుతుందా?

అమెరికా పాకిస్తాన్ వెళ్లి ఒసామా బిన్ లాడెన్‌పై చర్యలు చేపట్టినట్టు, ఇప్పుడు భారత్ కూడా ఆ వైపు వెళ్లి చర్యలు చేపట్టగలదా?

ఈ ప్రశ్నకు వివేక్ కాట్జూ "అమెరికా ఒసామా బిన్ లాడెన్‌పై చర్యలకు దిగడానికి వారికి అవకాశం లభించింది. అది కూడా అంత తేలిగ్గా దొరకలేదు. ఆ దారిలో అమెరికా మినహా వేరే ఏ దేశమైనా వెళ్లడం సాధ్యమని నాకు అనిపించడం లేదు. ప్రపంచంలో అమెరికా స్థాయిని కూడా మనం తోసిపుచ్చలేం" అన్నారు.

అమెరికాలా చర్యలకు దిగకపోవడం భారత్ బలహీనతా లేక వైఖరా అన్న ప్రశ్నకు కట్జూ "ఇది భారత్ బలహీనతో, వైఖరో కాదు. ఇది ఆలోచన. ఈ ఆలోచనే తర్వాత చర్యగా మారుతుంది. భారత్ ఎప్పటికైనా అలాంటి చర్యల గురించి ఆలోచించవచ్చని నాకు అనిపించడం లేదు" అన్నారు.

"దానివల్ల చాలా అంతర్జాతీయ పరిణామాలు ఎదురవుతాయి. అందుకే ఆ దారి గురించి భారత్ ఎప్పుడూ ఆలోచించలేదు. అసలు ఆ మార్గంలో వెళ్లాలా, వద్దా అనేది వేరే విషయం" అన్నారు కాట్జూ.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)