గోసా ఎక్కడికి వెళ్ళినా... తేనెటీగలు ఆయనను వదిలిపెట్టవు

తేనెటీగల మిత్రుడు

ఇథియోపియాలో నివసిస్తున్న గోసా టఫీస్ తన ఇంట్లోనే తేనెటీగలను పెంచుతూ ఉంటారు. మరి మీకు ఆశ్చర్యం కలగొచ్చు, అవి ఆయనను కుట్టవా అని. దీనికి ఆయనిచ్చే సమాధానం ఏంటో తెలుసా?

"నన్నంతా 'ఫాదర్ ఆఫ్ బీస్', 'ఫాదర్ ఆఫ్ హనీ' అని పిలుస్తారు" అని అంటారు గోసా.

నిజమే, అవి ఆ తేనెటీగలకు మిత్రుడే. అవి ఆయనను ఏమీ చెయ్యవు. ఆయన్నే కాదు, ఆయన కుటుంబంలో ఎవ్వరినీ ఏమీ చెయ్యవు.

వీడియో క్యాప్షన్,

గోసా ఎక్కడుంటే తేనెటీగలు అక్కడే

15 ఏళ్ల క్రితం గోసా ఇంటికి తేనెటీగలు వచ్చాయి. కానీ, అవి తిరిగి వెళ్లలేదు. "అవి నేనెక్కడుంటే అక్కడకు వస్తాయి, నాతోనే ఉంటాయి. అందుకే, అవన్నీ నా కుటుంబంలో భాగమే. వాటిని మేమంతా కుటుంబ సభ్యుల్లాగే చూస్తాం" అంటారు గోసా.

"వాళ్ల ఇంట్లో ఉన్న ఓ పెద్ద తేనెతుట్టె నుంచి 25 నుంచి 30 కేజీల తేనె వచ్చేది. కానీ, తేనెటీగలు ఎక్కువైపోయి, అది చాలా పెద్దదిగా అయిపోయింది. పిల్లలకు వాటితో ఏ సమస్యా లేదు. కానీ, ఇరుగుపొరుగువారిని మాత్రం అవి కొన్నిసార్లు ఇబ్బంది పెట్టాయి. అందుకని దీన్ని నేనే చిన్నదిగా చేసేశాను" అని చెబుతున్నారు గోసా.

తేనెటీగలు చుట్టుపక్కల వారికి అప్పుడప్పుడు సమస్యగా మారడంతో గోసా ఆ పెద్ద తేనెపట్టును తీసేసి, ఈగలను బయటకు పంపించేయాలని కూడా ప్రయత్నించారు. కానీ, తేనెటీగలు మళ్ళీ వచ్చేశాయి.

తేనెటీగలు ఉండడం వల్ల తన స్నేహితులెవరూ తమ ఇంటికి రావడం లేదని గోసా కుమార్తె యెమరిమ్‌వర్క్ చెబుతున్నారు.

"నా స్నేహితులను చదువుకోవడానికి ఇక్కడకు రమ్మంటే, ఈగలు కుడతాయని భయపడతారు. దీంతో నేనే వాళ్లింటికి వెళ్తుంటా" అని ఆమె అంటున్నారు.

తానెక్కడికి వెళ్లినా ఈగలు కూడా వస్తాయి, కానీ, అవి అలా ఎందుకు వస్తాయో అర్థం కావడం లేదంటారు గోసా.

"ఇప్పటివరకూ మూడు పట్టణాలకు వెళ్లా. నేనెక్కడికి వెళ్లినా ప్రతిసారీ కొన్ని తేనెటీగల గుంపు నా చుట్టూ చేరేది. నేనేదో ప్రత్యేకమైన వ్యక్తినని అనుకోవడం లేదు. కానీ, అందరూ అలా అంటుంటే నేనూ సరేనంటున్నా" అని చెబుతున్నారు గోసా.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)