మూడుసార్లు ఉరికంబం వరకు వెళ్లాడు.. రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేశాడు.. అయినా బతికి బయటపడ్డాడు

  • మేరీ గుడ్‌హార్ట్
  • బీబీసీ న్యూస్ మలావీ
బైసన్ కౌలా
ఫొటో క్యాప్షన్,

బైసన్ కౌలా

ఆయన పేరు బైసన్ కౌలా. హత్యకేసులో ఉరి శిక్ష పడిన ఖైదీ. మూడుసార్లు ఉరి కంబం వరకు వెళ్లాడు. అయినా ప్రాణాలతో మిగిలాడు.

నాలుగోసారి ఉరి కంబం వరకు వెళ్లాల్సిన అవసరం రాలేదు. ఆ దేశంలో ఏకంగా ఉరి శిక్షలే రద్దు చేయడంతో మృత్యువు అతని దారిలోంచి పక్కకు తప్పుకొంది.

ఇంతకీ ఎవరీ బైసన్ కౌలా.. మూడు సార్లు ఉరి నుంచి ఎలా బయటపడ్డాడో తెలుసుకోవాలంటే ఆయన కథ చదవాల్సిందే.

బైసన్ కౌలాది మలావీ. ఆగ్నేయ ఆఫ్రికా ప్రాంతంలోని చిన్న దేశం అది. అక్కడ ఎవరైనా హత్యా నేరం చేస్తే మరణ శిక్ష విధిస్తారు.

1992లో కౌలా ఒక హత్య కేసులో చిక్కుకున్నాడు. ''ఇరుగుపొరుగువారు అసూయతో నన్ను హత్య కేసులో ఇరికించారు'' అని కౌలా అప్పటి కేసు గురించి చెబుతాడు.

ఇంతకీ ఏమిటా హత్య కేసు.. కౌలాకు ఎందుకు శిక్ష పడిందో తెలియాలంటే ఇంకాస్తా గతంలోకి వెళ్లాల్సిందే.

దక్షిణ మలావీలోని చిన్న గ్రామంలో పుట్టిపెరిగిన కౌలా ఆ తరువాత దక్షిణాఫ్రికా వెళ్లి జోహన్నెస్‌బర్గ్ వెళ్లి గ్యాస్ పరిశ్రమల్లో పనిచేసి డబ్బు సంపాదించారు.

ఆ డబ్బులో మలావీలో స్థలం కొని అయిదుగురు ఉద్యోగులను నియమించుకుని పండ్లు, గోధుమలు, జొన్నలు, కసావా వంటివి పండించసాగాడు.

''అక్కడి నుంచి నాకు బ్యాడ్ టైం మొదలైంది'' అంటారాయన.

కౌలా తల్లి లక్కీ
ఫొటో క్యాప్షన్,

కౌలా తల్లి లక్కీ

కౌలా వద్ద పనిచేసే అయిదుగురిలో ఒకరిపై ఇరుగుపొరుగువారు దాడి చేశారు. దాడిలో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఇతరుల సహాయం లేకుండా నడవలేని దుస్థితికి చేరాడు. మిగతా ఉద్యోగులు, కౌలా ఆయనకు సహాయపడుతుండేవారు.

ఒక రోజు బాగా వర్షం పడిన తరువాత అతడిని టాయిలెట్‌కు తీసుకెళ్లాల్సి వచ్చింది. అప్పటికి ఎవరూ లేకపోవడంతో కౌలాయే మెట్లపై నడిపించుకుంటూ తీసుకెళ్తున్నాడు.

ఇంటి బయట ఉన్న ఆ మెట్లు వర్షానికి తడిసిపోవడంతో కౌలా జారిపోయాడు. దాంతో పట్టు తప్పి ఆ గాయపడిన వ్యక్తి కూడా పడిపోయారు. దీంతో మళ్లీ గాయపడిన ఆయన్ను హాస్పిటల్‌లో చేర్చినప్పటికీ చికిత్స పొందుతూ మరణించాడు.

దీంతో కౌలాయే ఆయన్ను చంపాడంటూ హత్య కేసు పెట్టారు ఇరుగుపొరుగువారు. కౌలాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు. దీంతో కౌలాకు మరణ శిక్ష పడింది.

కొన్నాళ్లు జైలులో ఉన్న తరువాత ఆయన్ను ఉరి తీయడానికి నిర్ణయించారు. ఆ రోజొచ్చింది.

అప్పటికి ఉరి తీసే తలారి ఒక్కరే ఉండేవారు. ఆయనది దక్షిణాఫ్రికా. పలు ఆఫ్రికా దేశాల్లో ఉరి శిక్షలు అమలు చేసే పని ఆయనే చేస్తుండేవారు. దాంతో ఆ దేశం, ఈ దేశం తిరుగుతుండే ఆయన రెండు నెలలకోసారి మలావీలో తన విధి నిర్వహణకు వచ్చేవారు.

తొలిసారి మృత్యువు ముంగిటకు..

ఆ రోజు ఆ తలారీ మలావీ జైలుకు ఉరిశిక్షలు అమలు చేయడానికి వచ్చారు.

ఆ రోజు ఉరి తీయాల్సిన 21 మందిలో కౌలా పేరు కూడా ఉండడంతో జైలు సిబ్బంది ఆయన దగ్గరకు వచ్చి 'మధ్యాహ్నం ఒంటి గంటకు నిన్ను ఉరి తీస్తారు. ప్రార్థన చేసుకో' అని చెప్పి వెళ్లారు.

ఒంటి గంట నుంచే తలారీ పని మొదలుపెట్టాడు. ఆ జాబితాలో ఉన్నవారిని ఒక్కరొక్కరిని ఉరి తీశాడు.

మధ్యాహ్నం 3 గంటలైంది.. కౌలా సహా ముగ్గురు ఇంకా మిగిలారు. తలారీ తన పని కొనసాగిస్తే మరో అర్ధగంటలో కౌలా ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. కానీ, అప్పటికే 18 మందిని ఉరి తీసిన ఆ తలారీ శారీరకంగా, మానసికంగా అలసిపోయినట్లున్నాడు.

ఆ రోజుకు తన పని ఆపేసి మళ్లీ వచ్చే నెల వస్తానని జైలు సిబ్బందికి చెప్పి వెళ్లిపోయాడు.

దాంతో కౌలా ప్రాణాలు అప్పటికి మిగిలాయి.

రెండోసారి..

చెప్పినట్లే ఆ తరువాత నెల తలారీ వచ్చాడు.

మళ్లీ ఉరి తీయాల్సినవారి జాబితా రెడీ అయింది. తలారీ పని ప్రారంభించాడు. ఈసారి కూడా ముగ్గురు నలుగురు మిగిలి ఉండగా తన పని ఆపేశాడు. అలా మిగిలిన వారిలో మళ్లీ కౌలా ఉన్నాడు.

రెండు సార్లు చావు అంచుల వరకు వెళ్లిన కౌలా మూడోసారి మరణం తప్పదనుకున్నాడు.

మూడోసారి..

జైలు సిబ్బంది వచ్చి 'ఉరి కంబం దగ్గరకు వెళ్లు' అని చెప్పగానే ఆయనకు ప్రాణాలు పోయినట్లయింది.

భారంగా అడుగులు వేసుకుంటే లగ్నం కాని మనసుతో ప్రార్థన చేసుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ అక్కడకు చేరుకున్నాడు.

తనకంటే ముందు అక్కడున్నవారిని ఒక్కరొక్కరినీ తలారీ ఉరి తీస్తున్నాడు.

ఒక్కొక్కరు తరిగిపోతున్నారు. ఇంకా నలుగురు ఉన్నారు.. కానీ, తలారి పని ఆపలేదు.

కౌలా ముందు ఇప్పుడు ఇద్దరున్నారు... మరునిమిషం ఆ ఇద్దరిలో ఒకరు శవమయ్యాడు.

ఇప్పుడు ముందున్నది ఒక్కరే.. ఆ ఒక్కరూ ఉరికొయ్యకు వేలాడివేలాడి నిశ్చలంగా మారిపోయాడు.

''నెక్స్ట్ నేనే.. ఇవే నా చివరి క్షణాలు'' అనుకున్నాడు కౌలా.

అంతకుముందులా ఈసారి ముగ్గరునలుగురిని వదిలేసి వెల్లలేదు ఆ తలారి. దీంతో తనకిక భూమిపై నూకలు చెల్లిపోయానుకున్నాడు కౌలా.

అప్పటికింకా బతికే ఉన్నాడు కానీ ఆయనకు ప్రాణాలు పోయినట్లే అనిపిస్తోంది.

మృత్యువు ముంగిట కౌలా అలా నిల్చున్న వేళ... కౌలా ఒక్కడిని విడిచిపెట్టి తలారీ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

అంతే... మూడోసారీ కౌలా ప్రాణం నిలిచింది. కానీ, ఆయనకు మాత్రం ప్రాణమున్నట్లుగా లేదు. మృత్యుముఖం వరకు వెళ్లొచ్చిన భయం ఆయన్ను వీడలేదు.

మూడు సార్లు ఉరి కంబం వరకు వెళ్లొచ్చి బతికిన కౌలా కథ విన్నవారెవరైనా ఆయనంత అదృష్టవంతుడు లేడనుకుంటారు.

కానీ, ముమ్మారు మరణం సమీపం వరకు వెళ్లొచ్చిన అనుభవం ఆయనలో తీవ్ర మానసిక అలజడిని కలిగించింది.

మళ్లీ తనను ఉరేయడం ఖాయమని.. ఇంతకుముందులా ఈసారి అదృష్టవశాత్తు తాను మిగులుతానన్న నమ్మకం లేదనుకుంటుండేవాడు.

ఆ భయంతోనే రెండు సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. సమయానికి అక్కడున్నవారు కాపాడడంతో ఆ రకంగానూ మృత్యువును తప్పించుకున్నాడు.

ఆ తరువాత 1994లో మలావీ ప్రభుత్వం తమ దేశంలో ఉరి శిక్షలను రద్దు చేయడంతో కౌలాకు కూడా ఉరి శిక్ష రద్దయింది.

హేస్టింగ్స బండా

ఫొటో సోర్స్, Michael Stroud/gettyimages

ఫొటో క్యాప్షన్,

హేస్టింగ్స్ కముజు బండా

ఉరి శిక్షలు ఎలా ఆగిపోయాయి?

మలావీలో 1964 నుంచి హేస్టింగ్స్ కముజు బండా ప్రధానిగా ఉండేవారు. 1966లో ఆయన అధ్యక్షుడయ్యాక నిరంకుశ పాలన మొదలైంది. 1994 వరకు అక్కడ నిరంకుశ పాలనే ఉండేది. బండా ముప్ఫయ్యేళ్ల ఏకపక్ష పాలనలో వేలాది మందిని ఉరి తీశారు.

1993 నుంచి అంతర్జాతీయంగా ఒత్తిళ్లు తీవ్రమవడంతో ఏక పార్టీ విధానానికి స్వస్తి పలికి ఎన్నికలకు అవకాశమిచ్చారు బండా.

తాను సైతం ఎన్నికల బరిలో నిలిచినప్పటికీ విసిగిపోయిన ప్రజలు ఆయన్ను ఓడించారు.

దాంతో 1994లో తొలిసారి మలావీలో బహుళ పార్టీలతో కూడిన ప్రజాస్వామ్య వ్యవస్థ రూపుదాల్చింది. అలా ఏర్పడిన ప్రజాస్వామ్య ప్రభుత్వం దేశంలో మరణ శిక్షలను నిలిపివేశారు.

దాని ప్రకారం కౌలాతో పాటు ఎంతోమందికి ఉరిశిక్ష రద్దు కానప్పటికీ అమలు చేయడం మాత్రం ఆగిపోయింది.

అప్పటి నుంచి గత పాతికేళ్లుగా ఏ అధ్యక్షుడూ మళ్లీ మరణ శిక్షల అమలు జోలికి పోలేదు. నిలుపుదల అలాగే కొనసాగుతోంది.

మరణశిక్ష పడిన చాలామంది ఖైదీలకు యావజ్జీవ శిక్షగా మార్చారు.

కౌలా మరణశిక్ష నుంచి బయటపడినా జైలు నుంచి విడుదల కాగలనని మాత్రం అనుకోలేదు. జైలులో నిర్వహించే విద్యాకార్యక్రమాల్లో ఆయన నిమగ్నమయ్యేవాడు. విద్యార్థిగా, బోధకుడిగా ఆ కార్యక్రమాల్లో పాలుపంచుకునేవాడు.

మళ్లీ కథ మలుపు తిరిగింది..

2007లో అక్కడి మరణ శిక్షల చట్టాన్ని సవాల్ చేశాడో ఖైదీ. డ్రగ్స్‌కు బానిసైన ఆయన తన సవతి కుమారుడిని చంపేశాడు.

డ్రగ్స్ మత్తులో తాత్కాలికంగా మతిభ్రమించి హత్య చేశానని వాదించిన ఆయన 'హత్యానేరానికి తప్పనిసరి మరణ శిక్ష' అనే మలావీ చట్టాన్ని కోర్టులో సవాల్ చేశాడు.

ఈ తప్పనిసరి శిక్ష అనేది నిష్పాక్షిక విచారణను అడ్డుకుంటోందని వాదించాడు. మలావీ రాజ్యాంగం ప్రకారం పౌరులకు సంక్రమించిన నిష్పాక్షిక విచారణ హక్కు.. అమానుష ప్రవర్తన నుంచి రక్షించుకునే హక్కులను ఈ చట్టం హరిస్తోందని కోర్టు ఎదుట వాదించాడు.

ఆయన వాదనను కోర్టు అంగీకరించింది. అన్ని హత్యాకేసులకూ మరణ శిక్ష విధించడం సరికాదని.. శిక్షల్లో భేదం ఉండాలని అభిప్రాయపడింది.

దాంతో అప్పటికే తప్పనిసరి మరణశిక్ష పడిన కేసులన్నిటినీ సమీక్షించాలని నిర్ణయించింది. 170 కేసులను సమీక్షించి 139 మంది ఖైదీలను విడిచిపెట్టింది.

అయితే, వారిలో చాలామంది మానసిక జబ్బులకు గురై చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పట్టించుకునే స్థితిలో కూడా లేరు.

మరికొందరు ప్రజ్ఞా వైకల్యంతో బాధపడుతున్నారు.

కొందరు న్యాయవాదులు జైలులో ఉన్న కౌలాను కలిసి ఆయన కేసు కూడా న్యాయ సమీక్షకు తీసుకెళ్తామని చెప్పినప్పుడు ఆయన తొలుత అంగీకరించలేదు.

ఆయన ఎంతో భయపడిపోయాడు. మళ్లీ కోర్టుకెళ్తే ఉరి తీస్తారేమోనని ఆందోళన కూడా చెందాడు. అయినా, న్యాయవాదులు ఆయన్ను కోర్టుకు తీసుకెళ్లగా... న్యాయవాది వెంటనే ఆయన్ను విడిచిపెట్టేయాలని ఆదేశిస్తారు.

''కోర్టు తీర్పు తరువాత జైలు వార్డర్లు నా దగ్గరకొచ్చి సెల్ నుంచి బయటకు రమ్మన్నారు. కానీ, నిలబడడానికి కూడా నాకప్పుడు శక్తి లేదు. ఒళ్లంతా వణుకుతోంది. అది కలా నిజమో తెలియని పరిస్థితి. న్యాయమూర్తి చెప్పింది కూడా నేనిప్పటికీ నమ్మలేకపోతున్నాను'' అంటాడు కౌలా.

తల్లితో కౌలా
ఫొటో క్యాప్షన్,

తల్లితో కౌలా

అమ్మకూ కష్టాలే

కౌలాకు శిక్ష పడిన తరువాత ఆయనొక్కడి జీవితమే కాదు ఆయన తల్లి జీవితంలోనూ కష్టాలే మిగిలాయి.

ఏడాదికొక్కసారి జైలు అధికారులు అనుమతించేటప్పుడు కౌలాను చూడ్డానికి ఆయన తల్లి లక్కీ వెళ్లేవారు.

ఏడాదంతా పత్తి పండించి పోగేసిన కొద్దిపాటి డబ్బుతో కౌలాకు కావాల్సినవన్నీ కొనుక్కుని, తాను మోయగలిగినన్ని వస్తువులు తీసుకుని వెళ్లేవారు.

2007లో మరణశిక్షలపై సమీక్ష మొదలైనా ప్రక్రియంతా సాగి 2015లో కౌలాను జైలు నుంచి విడుదల చేశారు. 23 ఏళ్ల తరువాత బయటకు వచ్చిన ఆయన మానసికంగా చితికిపోయి ఉన్నాడు.

అతడిని మళ్లీ మునుపటి కౌలాలా మార్చడానికి ఒక సంస్థలో చేర్చారు. అక్కడ ఆయనకు కొత్త నైపుణ్యాలు నేర్పించారు. ఇప్పుడాయన మళ్లీ మునుపటి మనిషిలా మారాడు. బాహ్య ప్రపంచంలోకి వచ్చాడు. తనలా ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గి బయటపడి మానసికంగా దెబ్బతిన్నవారికి సహాయపడే పనిలో పడ్డాడు.

కౌలా
ఫొటో క్యాప్షన్,

అమ్మ కోసం ఇటుకలతో పక్కా ఇల్లు కడతానంటున్నాడు కౌలా

జైలు నుంచి విడుదలయ్యేటప్పటికి కౌలాకు 60 ఏళ్ల వయసొచ్చేసింది.

ఆయన జైల్లో ఉన్నప్పుడే భార్య చనిపోయింది. ఆరుగురు పిల్లలు పెరిగి పెద్దవారై ఎక్కడెక్కడో నివసిస్తున్నారు.

ఇప్పుడు అరవయ్యేళ్ల కౌలా తన 80 ఏళ్ల తల్లితో కలిసి సొంతూరిలోనే ఉంటున్నారు.

''జైల్లో ఉన్నప్పుడు నేను ఎప్పుడూ అమ్మ గురించే ఆలోచించేవాడిని. పెద్దకొడుకుగా ఆమెకు ఏ లోటూ లేకుండా చూసుకోవాలనుకున్నాను. కానీ జైలులో ఉండిపోవడంతో ఆమె కోసం ఎంతో బాధపడేవాడిని. ఇప్పుడు నేనొచ్చేశాను. ఇకపై ఆమె పొలంలో కష్టపడాల్సిన పనిలేదు. నేనే పొలంలో పనిచేస్తాను. ఆమెను ఇంట్లోనే సౌకర్యంగా ఉండేలా చూసుకుంటాను'' అని చెబుతున్నారు కౌలా.

అమ్మకోసం ఇటుకలతో మంచి ఇల్లు కట్టడమే ఇప్పుడు తన ముందున్న తక్షణ కర్తవ్యం అంటున్నాడు కౌలా.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)