ఇస్లామిక్ దేశాల ముఖ్య అతిథిగా భారత్ ఏం సాధిస్తుంది? :అభిప్రాయం
- రాజేంద్ర అభ్యాంకర్
- బీబీసీ కోసం

ఫొటో సోర్స్, MEA TWITTER
అబూధాబీలో 2019 మార్చి 1న ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కార్పొరేషన్( ఓఐసీ) విదేశీ మంత్రుల మండలి 46వ ప్రారంభ ప్లీనరీ సమావేశాల్లో భారత్ మొట్టమొదటిసారి 'గౌరవ అతిథి' హోదాలో హాజరుకానుంది.
ఈ సమావేశాలకు ఆతిథ్యం ఇస్తున్న యనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భారత్‌ను ఆహ్వానించింది. దానికి చాలా కారణాలున్నాయి. మొదటి కారణం ప్రపంచవ్యాప్తంగా భారత్‌కు లభిస్తున్న గుర్తింపు పెరగడం. అంతేకాకుండా, భారతదేశానికి ఉన్న సాంస్కృతిక, చారిత్రక వారసత్వం. ఈ సంప్రదాయంలో ఇస్లాంకు కూడా భాగం ఉంది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయద్ అల్ నాహ్యాన్ ఆహ్వానాన్ని స్వీకరించిన తర్వాత భారత విదేశీ మంత్రి సుష్మా స్వరాజ్ "ఇది రెండు దేశాల మధ్య బలపడుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంకేతం. దానితోపాటు భారత్‌లోని సుమారు 18.5 కోట్ల ముస్లింలకు లభించిన గౌరవం" అన్నారు.
ఈ ఆహ్వానం సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ భారత్, పాకిస్తాన్ పర్యటనకు వచ్చి వెళ్లిన కొన్ని రోజులకే రావడం విశేషం. భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలను మెరుగుపరిచేందుకు సల్మాన్ ప్రయత్నించినట్లు చెబుతున్నారు.
అయితే, భారత్‌కు దీనిని ఒక మంచి అవకాశంగా భావించవచ్చు. ఎందుకంటే ఈ ఇస్లామిక్ మెయిన్ స్ట్రీమ్ సంస్థలో పాకిస్తాన్ ప్రతిష్టపై భారత్ ప్రశ్నలు లేవనెత్తవచ్చు. భారత్‌కు ఈ ఆహ్వానం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి లభించింది. ఇది ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కార్పొరేషన్(ఓఐసీ)కి చాలా ముఖ్యమైనదని భావిస్తున్నారు.
పాకిస్తాన్, సౌదీ అరేబియా ఆదేశాలతో ఓఐసీ మొదటి సమావేశాల్లో భారత్‌ను బహిష్కరించారు. మొదటి సమావేశం 1969లో మొరాకో రాజధాని రబత్లో జరిగింది. అప్పుడు దీనిని ఇస్లామిక్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనేవారు. ఆ తర్వాత నుంచి ప్రపంచంలో రెండో అతిపెద్ద ముస్లిం జనాభా ఉన్న దేశమైనప్పటికీ భారత్‌కు ఓఐసీ సభ్యత్వం లభించలేదు. ఈ వేదికను ఉపయోగించి పాకిస్తాన్ భారత్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోంది.
జమ్మూ కశ్మీర్‌పై, భారత్‌లో ముస్లింల పరిస్థితిపై ఓఐసీ దేశాలు చేస్తున్న ఏకపక్ష తీర్మానాలను భారత్ నిర్లక్ష్యం చేస్తూ వస్తోంది. అయితే అదే సమయంలో పాకిస్తాన్ మినహా ఓఐసీలోని మిగతా సభ్య దేశాలన్నిటితో భారత్ తన సంబంధాలు మెరుగు పరుచుకుంటోంది. మెల్లమెల్లగా వ్యాపార సంబంధాలు, రాజకీయ సంబంధాలను బలంగా చేసుకోవడంలో విజయం సాధించింది.
ఫొటో సోర్స్, EPA
మోదీ ప్రభుత్వం బోల్డ్ స్టెప్
ఇప్పుడు జరిగే సమావేశానికి భారత్ హాజరయితే, జమ్ము కశ్మీర్ గురించి ఓఐసీ దేశాల వైఖరి మారిపోతుందా? అలా అని చెప్పలేం. 2018లో ఢాకాలో ఓఐసీ విదేశీ మంత్రుల సమావేశంలో ఓఐసీ దేశాల ప్యాక్ట్ ఫైండింగ్ మిషన్ కశ్మీర్లో ప్రవేశించడానికి భారత్ అనుమతించాలని ఒక తీర్మానాన్ని ఆమోదించారు. ఓఐసీ దేశాలు కశ్మీర్‌ను భారత్ అధీకృత కశ్మీర్ అని అంటున్నాయి. ఇలాంటి అంశాలు అంతకు ముందు సమావేశాల్లో కూడా జరిగాయి.
ప్రస్తుతం కశ్మీర్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. సార్వత్రిక ఎన్నికలకు ఇక రెండు నెలలే ఉంది. అలాంటప్పుడు ఈ ఆహ్వానం స్వీకరించడం అనేది నరేంద్ర మోదీ ప్రభుత్వం వేసిన బోల్డ్ స్టెప్‌గా భావిస్తున్నారు.
1969లో రాబత్‌లో ఓఐసీలో ప్రవేశించడంలో భారత్ విజయం సాధించలేకపోయింది. ఆ తర్వాత కూడా ఈ సంస్థలో సభ్యత్వం కోసం ప్రయత్నాలు జరిగాయి. 2003లో కతార్‌లో ఓఐసీ సభ్య దేశాల విదేశీ మంత్రుల సమావేశానికి ముందు భారత్‌ను దానికి ఒక అభ్జర్వర్లా ఆహ్వనించాలని భావించారు.
అయితే సౌదీ అరేబియా అప్పుడు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించింది. 2006లో ఇదే సౌదీ అరేబియా ఇలాంటి ప్రతిపాదన పెట్టిందనేది మరో విషయం. అప్పుడు సౌదీ అరేబియా కింగ్ అబ్దుల్లా భారత గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చారు. అయితే అప్పుడు కూడా అది ఆ దశ దాటి ముందుకు వెళ్లలేదు.
ఫొటో సోర్స్, Getty Images
అప్పుడు అబ్జర్వర్, ఇప్పుడు అతిథి
భారత్ అధికారికంగా అబ్జర్వర్ అయితే దానివల్ల అది ఈ సంస్థలో ఏకపక్షంగా ఉన్న తీర్మానాలన్నింటినీ ఆమోదిస్తుంది అనే సందేశం కూడా వెళ్తుంది. భారత్ ఓఐసీ సభ్య దేశాలతో తన ద్వైపాక్షిక సంబంధాలపై ఏ ప్రభావం పడకుండా చూసుకుంటోంది. అందుకే అది ఆ ప్రతిపాదనల గురించి ఆలోచించకుండా పరస్పర సంబంధాలు బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెట్టింది.
ఓఐసీ సభ్య దేశాల్లో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కతార్, ఒమన్, మొరాకో, ట్యునీషియా, ఈజిఫ్ట్ లాంటి దేశాలతో భారత్ ద్వైపాక్షిక వ్యాపార, పెట్టుబడి సంబంధాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. అరేబియన్ గల్ఫ్‌లో సుమారు 60 లక్షల భారతీయులు ఉంటున్నారు, పనిచేస్తున్నారు. వీరిలో సగం సౌదీ అరేబియాలోనే ఉంటున్నారు.
వీరు స్వదేశానికి పంపిస్తున్న డబ్బు, భారత్ ఏడాది బడ్జెట్లో సుమారు 40 శాతం ఉంటుంది. అయితే ప్రతిఏటా సుమారు లక్షన్నర మంది భారతీయ ముస్లింలు మక్కా, మదీనా యాత్ర చేస్తున్నారు. గల్ఫ్ దేశాలు పెట్టుబడులకు భారత్‌ను ఒక బలమైన దేశంగా భావిస్తున్నాయి. భారత్‌కు చమురు సరఫరా దేశాల్లో ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాక్ చాలా ముఖ్యమైనవి.
ఫొటో సోర్స్, EPA
ఎలాంటి సంకేతాలు కనిపిస్తున్నాయి
దేశానికి ఎప్పటికీ పెట్రోల్ అందుతూ ఉండేలా సూడాన్, సిరియా, ఒమన్, కతార్‌లో పెట్రోలియంకు సంబంధించిన వెంచర్లలో భారత్ పెట్టుబడులు పెట్టింది.
సిరియా, యెమెన్ మధ్య ఘర్షణలతో అరబ్ దేశాలు రెండు వర్గాలుగా మారిపోయాయి. వీటిలో ఒక వైపు సౌదీ అరేబియా, మరోవైపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయి. మరో వైపు కతార్ ఉంది. అయితే భారత్ అరబ్ దేశాల మధ్య జోక్యం చేసుకోకూడదనే విధానాన్ని అవలంభిస్తోంది. కానీ రాజకీయంగా పరస్పర సహకారం క్రమంగా పెరుగుతూ వస్తోంది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆహ్వానం ప్రకారం భారత విదేశాంగ మంత్రి ఓఐసీ ప్రారంభ సమావేశాల్లో ప్రసంగించాలి. అది ఒక విధంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తోనే కాదు, ఇస్లామిక్ దేశాలకు భారత సంబంధాలకు సంకేతంగా ఉండాలి.
ఓఐసీ దేశాల నుంచి భారత్‌కు ఏ సవాలు లభిస్తుందో, ఆ నిబంధనల గురించి మాట్లాడేందుకు ఇది భారత్ ముందున్న మొదటి అవకాశం. ఓఐసీ సభ్య దేశాలు ఎలా పనిచేస్తాయి అనేది ఒక్కసారిగా మార్చేయడం సాధ్యం కాదు. కానీ, దానిపై ప్రభావం పడేలా చేయవచ్చు.
అయితే మోదీ ప్రభుత్వానికి, భారత్‌కు రెండింటికీ ఇది ప్రమాదం కంటే తక్కువేం కాదు. అయితే ఈ ప్రయత్నంలో విజయవంతమైతే అది జమ్ముకశ్మీర్ పరిస్థితినీ, ఇస్లామిక్ దేశాలతో భారత్ బందాలను రెండిటినీ ప్రభావితం చేస్తుంది.
(ఈ వ్యాసం రచయిత వ్యక్తిగత అభిప్రాయం. రాజేంద్ర అభ్యాంకర్ భారత మాజీ దౌత్యవేత్త. ఈయన ఇండియానా యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ అఫైర్స్‌లో బోధిస్తారు. ఆయన పుణెలోని కంజరూ సెంటర్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ చైర్మన్. ఆయన రాసిన 'ఇండియన్ డిప్లొమసీ-బియాండ్ స్ట్రాటజిక్ అటానమీ' పుస్తకాన్ని 2018 ఏప్రిల్‌లో ఆక్స్ఫర్డ్ యూనిర్సిటీ ప్రెస్ ప్రచురించింది.)
ఇవి కూడా చదవండి:
- భారత్-పాకిస్తాన్ యుద్ధం తప్పదా? ఈ యుద్ధం ఎలా ఉంటుంది? ఏం జరుగుతుంది?
- ‘డబ్బులిస్తే రాజకీయ పార్టీలకు అనుకూలంగా ట్వీట్ చేస్తా’
- ఐఎస్ తీవ్రవాదులు ఇప్పుడేం చేస్తున్నారు?
- '39 మంది భారతీయులను ఐసిస్ తీవ్రవాదులు చంపేశారు'
- సనాతన్ సంస్థ 'హిందుత్వ తీవ్రవాద' శిక్షణ కేంద్రమా?
- "కులాంతర వివాహం చేసుకుంటే తీవ్రవాదులేనా?" - అభిప్రాయం
- పాకిస్తాన్‌పై ‘ట్రంప్ కార్డ్’తో భారత్‌కు మేలెంత?
- 'సర్జికల్ స్ట్రయిక్స్'కు రెండేళ్ళు: కశ్మీర్లో హింస ఏమైనా తగ్గిందా?
- ‘కశ్మీర్‌పై భారత్‌కు ఇజ్రాయెల్ దారి చూపిస్తోందా?’
- సర్జికల్ స్ట్రైక్స్ చేశాక ప్రాణాలతో బయటపడడం చాలా కష్టం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)