Balakot: ‘మేమూ తడాఖా చూపిస్తాం.. కాచుకోండి’ - భారత్‌కు పాకిస్తాన్ సైన్యం హెచ్చరిక

పాక్ సైనికాధికారి గఫూర్

ఫొటో సోర్స్, Getty Images

మా సర్‌ప్రైజ్ కోసం వేచి చూడండి, మేమూ స్పందిస్తాం... భారత్‌కు డీజీఐఎస్పీఆర్ హెచ్చరిక.

భారత విమానాలు జాబా ప్రాంతంలో పేలోడ్‌ను వదిలాయని ఐఎస్పీఆర్ డీజీ ధ్రువీకరించారు. అయితే, 350 మంది చనిపోయినట్లుగా భారత్ చెబుతోందని, నిజంగా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ఆయన అన్నారు.

"మేం కూడా భారత్‌కు సర్‌ప్రైజ్ ఇస్తాం, మా స్పందన కోసం ఎదురు చూడండి. మా నుంచి ప్రతిచర్య ఉంటుంది, అది విభిన్నంగా ఉంటుంది. అయితే మేం శాంతికి కట్టుబడి ఉన్నాం" అని ఆయన వ్యాఖ్యానించారు.

"3 ప్రదేశాల్లో చొరబాట్లు జరిగాయి. వాటిని తిప్పికొట్టాం. మేమేమీ ఆశ్చర్యపోవడం లేదు. మిమ్మల్నే ఆశ్చర్యానికి గురిచేస్తాం. మా స్పందన వస్తుంది, ఎదురుచూడండి. మాది ప్రజాస్వామ్య దేశం, కానీ ఈ దాడుల ద్వారా మీది ఆ కోవకు చెందదు అని నిరూపించారు" అని డీజీ ఐఎస్పీఆర్ అన్నారు.

ఏం జరిగినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ప్రధాని మాకు సూచించారు. ఇక ఇప్పుడు భారత్ వంతు. ఎప్పుడు ఎక్కడ ఎలా స్పందిస్తామో ఎదురు చూడండి. మా ప్రతి చర్య ఎలా ఉండాలనేదానిపై మేం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చాం అని కూడా ఆయన వెల్లడించారు.

నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించిందని దూరదర్శన్ వెల్లడించింది. భారత సైన్యం వాటిని సమర్థవంతంగా తిప్పికొడుతోందని తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images

మిలిటెంట్లు మళ్లీ దాడి చేయొచ్చు..!

ఈ సంఘటన నేపథ్యంలో బీబీసీ ప్రతినిధి ఇలియాస్ ఖాన్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఆయన మాటల్లోనే..

పుల్వామా దాడితో రాజుకున్న ఉద్రిక్తతలను, తాజాగా భారత్ చేసిన వైమానిక దాడులు ప్రమాదకర స్థాయికి తీసుకు వెళ్లాయి. పుల్వామా ఘటనలాగే 2016లో భారత్‌లోని 'ఉరి ఆర్మీ బేస్'పై జరిగిన మిలిటెంట్ దాడి కూడా ఇలాంటి పరిణామాలకే దారి తీసింది.

పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌లో ఉన్న మిలిటెంట్ స్థావరాలను ధ్వంసం చేయడానికే తాము వైమానిక దాడులు చేశామని భారత్ అప్పట్లో ప్రకటించింది. వాస్తవాధీన రేఖ(ఎల్ఓసీ)ను దాటి, భారత సైన్యం దాడులు చేయడంతో కొందరు పాకిస్తాన్ సైనికులు మరణించారు.

కానీ ఈసారి అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఉన్న లక్ష్యాలపై భారత్ దాడి చేసింది. ఎన్నో ఏళ్లుగా కశ్మీరీ మిలిటెంట్ శిక్షణా శిబిరం ఉందని భావిస్తున్న సరిహద్దు వెంబడి ప్రాంతాన్ని భారత్ లక్ష్యంగా చేసుకుంది.

భారత్ దాడి చేసిన వార్త బయటకు వెలువడ్డానికి కొద్దిసేపటి క్రితమే ఆ ప్రాంతాన్ని పాకిస్తాన్ సైన్యం అదుపులోకి తీసుకుంది. అక్కడకు స్థానిక పోలీసులకు కూడా ప్రవేశం లేదు.

ఈ దాడి.. ఎల్ఓసీ వెంబడి జరగిందేనని, అంతర్జాతీయ సరిహద్దు వద్ద జరగలేదంటూ దాడి తీవ్రతను తగ్గించడానికి పాకిస్తాన్ సివిల్, మిలిటరీ అధికారులు ప్రయత్నించారు.

'భారత్ దాడికి ప్రతీకారంగా అదును చూసుకుని, భారత సైన్యంపై మిలిటెంట్లు దాడి చేయొచ్చు' అని కొందరు సీనియర్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)