పాకిస్తాన్‌ మీదుగా విమానాలు బంద్

  • 28 ఫిబ్రవరి 2019
విమానాల గమనం Image copyright FlightRadar24
చిత్రం శీర్షిక ప్రపంచంలో విమానాల రాకపోకల లైవ్‌ ట్రాకర్ నుంచి నుంచి తీసుకున్న చిత్రం ఇది. గురువారం ఉదయం 8 గంటల సమయంలో పాకిస్తాన్‌ మీదుగా విమానాల రాకపోకలు లేకపోవడాన్ని ఈ చిత్రంలో చూడొచ్చు

భారత్, పాక్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం రెండు దేశాలపైనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రవాణా సేవలపై ప్రభావం చూపడం మొదలైంది.

ప్రధానంగా తూర్పు ఆసియా నుంచి ఐరోపా దేశాలకు ప్రయాణించే విమానాలను దారి మళ్లించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉత్తర భారతం, పాక్ మీదుగా వెళ్లాల్సిన విమానాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో నడుపుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా అనేక విమానయాన సంస్థలు పాక్ మీదుగా ప్రయాణించాల్సిన తమ విమాన సర్వీసుల్లో కొన్నిటిని ఏకంగా రద్దు చేసుకోగా మరికొన్నిటి దారి మార్చాయి.

థాయి ఎయిర్‌వేస్ అయితే ఐరోపా వెళ్లాల్సిన తమ విమాన సర్వీసులన్నిటినీ రద్దు చేసింది. పాక్ గగనతలంలో విమాన ప్రయాణాలకు అవకాశం లేకపోవడంతో.. ప్రత్యామ్నాయంగా పాక్‌కు దక్షిణ ప్రాంతంలోని గగనతలంలో విపరీతమైన రద్దీ ఏర్పడి థాయ్ ఎయిర్‌వేస్ తన ఐరోపా సర్వీసులన్నీ రద్దు చేసింది.

సింగపూర్ ఎయిర్‌లైన్స్, బ్రిటిష్ ఎయిర్‌వేస్ కూడా తమ విమానాల మార్గం మార్చాయి. దీనివల్ల దూరం పెరిగి మధ్యలో ఇంధనం నింపుకోవాల్సిన అవసరం ఏర్పడుతోందని సింగపూర్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధులు వెల్లడించారు.

Image copyright AlexSeftel
చిత్రం శీర్షిక అలెక్స్ సెఫ్టెల్

ముంబయి మీదుగా ప్రయాణం

బ్యాంకాక్ నుంచి లండన్ వెళ్తున్న అలెక్స్ సెఫ్టెల్ తన అనుభవాన్ని పంచుకున్నారు. ఆయన తైవాన్‌కు చెందిన ఈవా ఎయిర్‌లైన్స్‌లో ఆయన బ్యాంకాక్ నుంచి లండన్ వెళ్తుండగా కోల్‌కతా వరకు వచ్చిన తరువాత విమానం తిరిగి వెనక్కొచ్చేసిందని చెప్పారు.

''విమానమెక్కి కొద్ది గంటలు ప్రయాణించాక ఫ్లయిట్ రూట్ మ్యాప్ చూసేసరికి కోల్‌కతా వరకు చేరుకున్నాక అక్కడి నుంచి వెనక్కు వచ్చేస్తున్నట్లు అర్థమైంది. మళ్లీ బ్యాంకాక్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యాకే పూర్తి వివరాలు తెలిశాయి'' అని చెప్పారాయన.

బ్యాంకాక్‌కు తిరిగి తెచ్చాక చాలా గంటలు వేచి చూడకతప్పలేదు. అందరినీ ఓ హోటల్‌కు పంపించి మళ్లీ గురువారం ఉదయం వేరే విమానంలో లండన్ పంపించారని అలెక్స్ వెల్లడించారు.

కొన్ని అంతర్జాతీయ విమానసర్వీసులు ముంబయి మీదుగా వెళ్లాయి.

తూర్పు ఆసియా, ఐరోపా దేశాల మధ్య రాకపోకలు సాగించే విమానాలు పాకిస్తాన్‌ మీదుగా వెళ్తాయి. కానీ, పాకిస్తాన్ గగనతలంలో ఇప్పుడు ప్రయాణించే పరిస్థితి లేకపోవడంతో భారత్ మధ్య, దక్షిణ ప్రాంతాల మీదుగా ప్రయాణించాల్సి వస్తోంది.

Image copyright Getty Images

''సాధారణంగా ఇండియా-పాకిస్తాన్ ఎయిర్‌ కారిడార్‌లోంచి రోజుకు సగటున 800 విమానాలు ప్రయాణిస్తాయి. ఐరోపా నుంచి దక్షిణాసియా కానీ ఆస్ట్రేలియా కానీ వెళ్లే విమానాలు పాక్, భారత్ ఉత్తర ప్రాంతం మీదుగా వెళ్లాలి. ఎక్కువగా సింగపూర్, బ్యాంకాక్‌కు సర్వీసులుంటాయి.

ఇప్పుడు ఐరోపా నుంచి ఇలాంటి సర్వీసులన్నీ ఇరాన్ వరకు వెళ్లిన తరువాత దారి మార్చుకుని దక్షిణ భారతం మీదుగా వెళ్లాల్సి వస్తోంది'' అని మార్టిన్ కన్సల్టింగ్ ఇండియా సంస్థ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ మార్టిన్ తెలిపారు.

బుధవారం భారత్‌లో దిల్లీకి ఎగువన 5 విమానాశ్రయాలను మూసివేశారు. దీంతో ఇండిగో, గో ఎయిర్, జెట్ ఎయిర్‌వేస్, విస్తారా వంటి విమానయాన సంస్థలు ఆయా విమానాశ్రయాలకు తమ సర్వీసులను నిలిపివేయాల్సి వచ్చింది. అనంతరం విమానాశ్రయాలను సాధారణ సర్వీసులకు అనుమతించినా విమానయాన సంస్థలు మాత్రం ఇంకా తమ సర్వీసులను పునరుద్ధరించలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

‘కడుపు కాలే రోడ్లపైకి వచ్చాం.. తెలంగాణ పునర్నిర్మాణ ఉద్యమానికి ఆర్టీసీ సమ్మె నాంది కావాలి’

అభిజిత్ బెనర్జీకి ఆర్థిక శాస్త్రంలో నోబెల్

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలిచ్చి అర్హత లేదని వెనక్కి తీసుకున్నారు.. ఎందుకు

భూమిలో మూడు అడుగుల లోతులో పాతిపెట్టారు.. బతికి బయటపడ్డ చిన్నారి

ఏనుగులు వేరే వాటిని కాపాడ్డానికి తమ ప్రాణాలనే పణంగా పెడతాయా

సౌరవ్ గంగూలీ: బీసీసీఐ అధ్యక్ష పదవిని చేపట్టబోతున్న భారత క్రికెట్ మాజీ కెప్టెన్

‘‘జీతంపైనే ఆధారపడి బతికే కుటుంబం.. అందరం కష్టపడితేనే ఇల్లు గడుస్తుంది’’

ఉప్పల‌పాడు పునరావాస కేంద్రానికి విదేశీ పక్షులు వేల సంఖ్యలో ఎందుకు వస్తున్నాయి