అభినందన్: విమానం నుంచి కింద పడగానే ఏం జరిగింది? ప్రత్యక్ష సాక్షి కథనం - BBC EXCLUSIVE

  • 28 ఫిబ్రవరి 2019
వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ Image copyright AFP
చిత్రం శీర్షిక వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్

పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌లోని భీంబర్ జిల్లా హోరాన్ గ్రామానికి చెందిన మొహమ్మద్ రజాక్ చౌదరీ ఓ స్థానిక రాజకీయ నాయకుడు. ఆయన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పార్టీ పీటీఐ మద్దతుదారుడు.

భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ పాకిస్తాన్ భూభాగంలో పడినప్పుడు ఆయన అక్కడకు సమీపంలోనే ఉన్నారు. అప్పుడేం జరిగిందో ఆయన బీబీసీకి వివరించారు.

ఆయన్ను (ఆ పైలట్‌ను) ప్రాణాలతో అక్కడినుంచి తీసుకెళ్లాలనేది వ్యక్తిగతంగా నా లక్ష్యం. ఆయన పారాచ్యూట్‌పై భారత జెండాను నేను చూశా. దీంతో ఆయనో భారతీయుడు అనే విషయం తెలిసింది. ఆయన విమానం నేలకూలడం చూశాను, ఆయన నేలపై పాకుతూ బయటకు వచ్చారు. కానీ అక్కడకు చేరుకున్న స్థానిక ప్రజలు ఆయనను చుట్టుముట్టారు. ఎక్కడ హాని తలపెడతారో అని కంగారుపడ్డాను లేదా ఆయన స్థానికులకు ఏదైనా హానిచేస్తారేమో అని కూడా భయపడ్డాను.

నేను భారత్‌లోనే దిగానా అని తన దగ్గరకు ముందుగా చేరుకున్న కొందరు యువకులను ఆ పైలట్ అడిగారు. కానీ ఆయనకు ఎవరైనా తగిన సమాధానం ఇచ్చారో లేదో తెలియదు. తన నడుం చుట్టూ ఉన్న పారాచ్యూట్ బెల్టును తనకుతానుగానే తొలగించుకున్నారు. భారత దేశంపై భక్తిని చాటే కొన్ని నినాదాలు చేశారు. కానీ అక్కడున్న యువకులు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.

దీంతో ఆ వ్యక్తి తన చుట్టూ ఉన్నవారిని భయపెట్టేందుకు తన తుపాకి తీసి ఓసారి గాల్లోకి కాల్చారు. కానీ ఈ పరిణామంతో చుట్టూ ఉన్న యువకులు ఆగ్రహంతో అక్కడున్న రాళ్లను తీసి ఆ పైలట్‌పై విసిరారు. దీంతో ఆయన గాల్లోకి మరికొన్ని రౌండ్లు కాల్పులు జరుపుతూ పరుగందుకున్నారు.

Image copyright DGISPR

సమీపంలోని కాలవలోకి దూకేవరకూ ఆ యువకులు ఆయన్ను వెంబడించారు. అప్పుడే నా మేనల్లుళ్లలో ఒకరు తన దగ్గరున్న తుపాకితో ఆ పైలట్ కాలిపై కాల్చారు. ఆయన నీళ్లలో పడ్డారు. తుపాకీని కిందపాడేయాలంటూ గట్టిగా చెప్పగా, ఆయన పడేశారు.

అప్పుడు మరో యువకుడు అతడిని పట్టుకుని, కింద కూర్చోపెట్టారు. అలా చేస్తే ఆ వ్యక్తి ఇక ఎలాంటి దాడికీ పాల్పడే అవకాశం ఉండదని, తన దగ్గర ఇంకేమైనా ఆయుధాలున్నా వాటిని ఉపయోగించలేరని వాళ్లు భావించారు.

ఈ సమయంలోనే ఆ పైలట్ తన జేబుల్లో ఉన్న కొన్ని పేపర్లను బయటకు తీసి, చింపి, వాటిని నాశనం చేసేశారు. కొన్నింటిని నోట్లో పెట్టుకుని నమిలేశారు. కానీ అక్కడున్న యువకులు ఆయన దగ్గర నుంచి కొన్ని పేపర్లను లాక్కున్నారు. వాటిని తర్వాత సైన్యానికి అప్పగించారు.

మా యువకులంతా చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఆ పైలట్‌ను కొట్టడానికి, పిడిగుద్దులు గుద్దడానికి దగ్గరగా వెళ్లారు. అయితే వారిలో కొందరు కోపంతో ఉన్నవారిని ఆపేందుకు ప్రయత్నించారు. సైన్యం వచ్చేవరకూ ఆయనకు ఎలాంటి హానీ చేయవద్దు అని నేను కూడా వారితో చెప్పాను.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు