కశ్మీర్ : చీకట్లో కొండ దిగడమే కష్టం, ప్రాణాలెలా కాపాడుకోవాలి

పాకిస్తాన్, భారత్ మధ్య ఉన్న ఉద్రిక్తతలతో నియంత్రణ రేఖ దగ్గర నివసిస్తున్న కశ్మీరీలు మరోసారి సమస్యలతో సతమతం అవుతున్నారు.
వీళ్లు మొత్తం ఏడాదంతా భయంభయంగా జీవితం గడిపేస్తుంటారు. ఎందుకంటే వీరి ఇళ్లు, గుడిసెలు ఎప్పుడూ తుపాకులు, ఫిరంగులకు లక్ష్యంగా ఉంటాయి. కానీ ఉద్రిక్తతలు తెలత్తినపుడు వీరు ఆ ఇళ్లు కూడా వీడాల్సి ఉంటుంది.
భారత్ పాక్ సరిహద్దులు దాటి దాడులు జరిపాక బుధవారం తెల్లవారుజాము నుంచీ లైనాఫ్ కంట్రోల్, ఇతర ప్రాంతాల దగ్గర ఉన్నట్టే చకోటీ సెక్టార్ కూడా తుపాకులు, ఫిరంగుల మోతలతో దద్దరిల్లింది.
మరోసారి నిరాశ్రయులయ్యారు
పాక్ పాలిత కశ్మీర్‌లోని వాదీ-ఎ-జీలంలోని చకోటీ గ్రామంలో నివసించే సయ్యద్ హుస్సేన్ "రాత్రి రెండు గంటల నుంచి పేలుళ్ల వద్ద కళ్లు మూతలు పడలేదని" చెప్పారు.
1999లో ఉద్రిక్తతలు తలెత్తినపుడు తన కుటుంబానికి నీడ లేకుండా పోయిందని, చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఇల్లు కట్టుకుంటే దాన్ని కూడా ఇప్పుడు వదలాల్సివచ్చిందని బాధపడ్డారు.
సోమవారం, మంగళవారం రాత్రి 2 గంటల నుంచి 4 గంటల వరకూ ఆయన కుటుంబం, చుట్టుపక్కల వారు భయాందోళనల్లో గడిపారు. కొండపైన ఉండడంతో చీకట్లో కిందకు దిగాలంటే దారి కూడా కనిపించదని అన్నారు.
"చిన్న పిల్లలతో చీకట్లో రాళ్లతో నిండిన మట్టి దారుల్లో దిగాలంటే చాలా కష్టంగా ఉంటుంది. టార్చ్ వేస్తే అది ఇంకా ప్రమాదం. అందుకే మేం సన్నటి వెలుతురు కోసం వేచిచూస్తుంటాం" అని హుస్సేన్ చెప్పారు.
"ఫైరింగ్ జరుగతున్నప్పుడు వారికి (భారత సైన్యం) వీళ్లు పౌరులా, లేక సైనికులా అనేది కనిపించదు. దాంతో మేం వారి తుపాకులకు బలికావాల్సి ఉంటుంది" అన్నారు.
సయ్యద్ తన కుటుంబం, చుట్టుపక్కల వారితో దారి వరకూ చేరుకున్నారు. కానీ ఆ దారికి దగ్గరగా నివసించే అందరూ కాల్పులు ప్రారంభానికి ముందే వాహనాల్లో, కాలి నడకన అక్కడ నుంచి వెళ్లిపోయారు.
"మా బంధువు ఒకరు చాలా దూరంలో ఉంటారు. ఆయన ఒక కంటైనర్ తీసుకుని వచ్చారు. మేమంతా దానిలో ఎక్కి అక్కడ్నుంచి బయటపడ్డాం" అన్నారు.
"భారత్ వైపు నుంచి పాకిస్తాన్ గగనతలంలోకి విమానాలు వచ్చిన తర్వాత ప్రభుత్వం స్థానికులను చీకటి పడ్డాక అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిందని" మరో స్థానికుడు సయ్యద్ కిఫాయత్ షా చెప్పారు
కానీ అక్కడి వారికి మాత్రం బహుశా ఏమీ కాదనే అనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ ఉద్రిక్తతల తర్వాత తరచూ అలర్ట్ చేస్తూనే ఉంటారు. "రాత్రి ఫైరింగ్ మొదలవగానే, పిల్లలను లేపి ఇళ్ల నుంచి బయటపడాల్సుంటుంది" అని స్థానికులు చెబుతున్నారు.
"మొత్తం ఊరంతా ఖాళీ అయిపోయింది. అయినా జనం పశువులకు గడ్డి వేయడం కోసం తిరిగెళ్లారు. చీకటి పడగానే తిరిగి వచ్చేశారు" అంటారు కఫాయత్ షా.
ఈ ఉద్రిక్తతలతో ప్రభుత్వం స్థానికులను ఇళ్లకు దగ్గరే బంకర్లు నిర్మించుకోడానికి ఆర్థిక సాయం కూడా చేస్తోంది. కానీ ఆ డబ్బు సరిపోవడం లేదని కొందరు, తమకు అసలు సాయం అందలేదని కొందరు చెబుతున్నారు.
దాడులు తీవ్రంగా ఉన్నప్పుడు అర్థరాత్రైనా స్థానికులు ఇళ్లు వదిలి బయటపడాల్సి ఉంటుంది.
ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తం
చకోటీ, దాని పరిసరాల్లోని నియంత్రణ రేఖ ప్రాంతమంతా హటియా బాలా ఏరియాలోకి వస్తుంది. హటియా బాలా డిప్యూటీ కమిషనర్ ఇమ్రాన్ షహీన్ బీబీసీతో "లైనాఫ్ కంట్రోల్ ప్రాంతంలో చకోటీ, ఖులానాలో 100 కుటుంబాలు నివసిస్తున్నాయని" చెప్పారు.
"ఎక్కువమంది ఇప్పుడు తమ బంధువుల ఇళ్లలో ఉంటున్నారు. ప్రభుత్వం కూడా ప్రజలకు బస ఏర్పాట్లు చేస్తోంది" అన్నారు.
"ఎందుకంటే కశ్మీర్ ప్రధాన మంత్రి ప్రాంతం. అందుకే ఆయన ప్రత్యేక ఆదేశాలతో ఈ ఏర్పాట్లు చేశారు. మాకు బస ఏర్పాటు చేయడానికి విద్యాసంస్థలు, భవనాలు తీసుకున్నారు. మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు".
"బుధవారం మధ్యాహ్నం తర్వాత ఈ ప్రాంతంలో ఫైరింగ్, బాంబుల మోత ఆగిపోయింది. అయినా ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తంగా ఉంది. ప్రభుత్వేతర సంస్థలన్నీ ప్రభుత్వానికి అండగా ఉన్నాయి" అని షహీన్ చెప్పారు.
స్థానికులను నియంత్రణ రేఖకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లోకి వెళ్లద్దని ప్రభుత్వం సూచించింది.
నీలం ప్రశాంతత, ప్రజల్లో భయం
మరోవైపు వాదీ-ఎ-నీలంలో పరిస్థితి ప్రస్తుతం ప్రశాంతంగానే ఉంది. కానీ స్థానికులు మాత్ర లోలోపలే భయపడుతున్నారు.
నీలం వైపు వెళ్లే రోడ్డులో ఒక పెద్ద భాగం నదికి దగ్గరే ఉన్న నియంత్రణ రేఖకు అవతల ఉన్న భారత ఫిరంగుల లక్ష్యంలో ఉంటుంది. అందుకే పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నప్పుడు స్థానికులను అక్కడినుంచి కదిలించడం అంత సులభం కాదు.
నీలమ్ గ్రామంలో ఉండే ఆబిద్ హుస్సేన్ " ప్రభుత్వం అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పింది అది వేరే విషయం. కానీ ఇప్పటివరకూ ఇక్కడ ఫైరింగ్ లేదా కాల్పులు జరగలేదు" అన్నారు
ముజఫరాబాద్ నుంచి వచ్చే దారిలో నౌసేరీ దగ్గర ట్రాఫిక్‌ను ఆపేశారు. రెండు, మూడు గంటలకు ఒక్క వాహనాన్ని మాత్రమే అనుమతిస్తున్నారు.
పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నప్పుడు వాదీకి మిగతా ప్రాంతాలతో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి. అయితే ఇంతకు ముందే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడం వల్ల చాలా మంది తమ ఇళ్లలో కనీసం ఒక నెల సరుకులు నిల్వ ఉంచుకుంటామని అబిద్ చెప్పారు
ముందు జాగ్రత్తగా రెండు రోజుల నుంచి చీకటి పడగానే ఆ ప్రాంతమంతా కరెంటు సరఫరా కూడా ఆపేస్తున్నారు.
ఉద్రిక్తతల వల్ల దారులన్నీ సైన్యం టార్గెట్‌లో ఉండడంతో.. నీలం ప్రజలకు తమ ఇళ్లను వదిలి వెళ్లడం సాధ్యం కావడం లేదు.
"కొండలపై ఉన్న దారుల్లో వెళ్లాలని అనుకోవడం కూడా కష్టమే. ఎందుకంటే ఆ దారి ఇప్పుడు మంచుతో కప్పుకుపోయి ఉంటుంది. అలాంటి దారిలో వెళ్లడం చాలా ప్రమాదం" అని స్థానికులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- అభినందన్ విమానం నుంచి పడగానే ఏం జరిగింది? ఆయన్ను కాలిపై ఎందుకు కాల్చారు?
- EXCLUSIVE: అంబేడ్కర్ వీడియో ఇంటర్వ్యూ
- పాకిస్తాన్‌పై 'నీటి సర్జికల్ స్ట్రైక్స్' వెనుక అసలు నిజం
- ‘పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం చేతిలో మరణించిన మిలిటెంట్ల ఫొటో నిజమేనా’
- రిజర్వేషన్లు పదేళ్ళు మాత్రమే ఉండాలని అంబేడ్కర్ నిజంగానే అన్నారా?
- భారత్-రష్యా: ఆయుధాలు, మసాలాలు కాకుండా ఇంకేం ఇచ్చిపుచ్చుకుంటున్నాయి?
- డోక్లాం: భారత్, చైనా మధ్యలో భూటాన్! ఇంతకీ భూటాన్ ప్రజలేమనుకుంటున్నారు?
- ఇస్లామిక్ దేశాల ముఖ్య అతిథిగా భారత్ ఏం సాధిస్తుంది...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)