అభినందన్‌ను పాకిస్తాన్ ఎందుకు విడుదల చేస్తోంది? ఇమ్రాన్ ఖాన్ నిర్ణయం వెనుక కారణాలేంటి? - పాక్ సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషణ

భారత వైమానిక దళ పైలట్ అభినందన్‌ను విడుదల చేయాలని పాకిస్తాన్ నిర్ణయించటంలో అంతర్జాతీయ ఒత్తిడి ఉన్నట్లు కనిపిస్తోందని.. పాకిస్తాన్‌కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ హరూన్ రషీద్ పేర్కొన్నారు.
రషీద్ బీబీసీ ప్రతినిధి వందనతో మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచుకుంటూ పోవాలని ఇమ్రాన్ మొదటి నుంచీ కోరుకోవటం లేదని చెప్పారు.
పాకిస్తాన్లో అధికారం రాజకీయ నాయత్వం చేతుల్లోనే ఉందని, ఆర్మీ చేతుల్లో లేదని ప్రపంచానికి చాటిచెప్పటం కూడా ఇమ్రాన్ ఈ నిర్ణయం తీసుకోవటం వెనుక ఒక వ్యూహమని విశ్లేషించారు.
వందన ప్రశ్నలకు హరూన్ రషీద్ చెప్పిన సమాధానాలు, విశ్లేషణలో ముఖ్యాంశాలివీ...
భారత పైలట్‌ను విడుదల చేయాలని పాక్ ఎందుకు నిర్ణయం తీసుకుంది? అంతర్జాతీయ దౌత్యం ప్రమేయం ఉందా?
ఈ ఉద్రిక్తతలను ఇంకా పెంచుకుంటూ వెళ్లాలన్న కోరిక పాకిస్తాన్‌కు మొదటి రోజు నుంచీ లేదు. భారతదేశంతో సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావటానికి, ఉద్రిక్తతలను తగ్గించటానికి ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ అనుసరిస్తున్న వ్యూహంలో భాగమే ఈ నిర్ణయం. ఇమ్రాన్‌ఖాన్ తన ప్రసంగంలో ఏ దేశం గురించీ ప్రస్తావించలేదు. పైలట్‌ను విడుదల చేయాలని లేదా ఉద్రిక్తతలను తగ్గించాలని తనపై ఒత్తిడి ఉందని కూడా చెప్పలేదు.
ఉద్రిక్తతలు తగ్గించటంలో తనకు సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించటం, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి యువరాజు సందేశంతో ఉన్నపళంగా పాకిస్తాన్ వెళ్లటం చూస్తే.. భారత్, పాకిస్తాన్‌లు ఉద్రిక్తతలను చల్లార్చటంలో కొంత అంతర్జాతీయ ప్రమేయం ఉన్నట్లు కనిపిస్తోంది.
గత రెండు రోజులుగా ఇమ్రాన్‌ఖాన్ మాటలను, పార్లమెంటులో చేసిన ప్రసంగాన్ని మీరు ఎలా చూస్తారు?
భారతదేశం పట్ల ఇమ్రాన్‌ఖాన్ అనుసరించిన వైఖరిని సోషల్ మీడియాలో చాలా మంది ప్రజలు ప్రశంసిస్తున్నారు. ఆయన తను ఒక రాజనీతిజ్ఞుడినని.. పాకిస్తాన్లో పరిస్థితికి తనే నిజమైన ఇన్చార్జినని నిరూపించుకోవటానికి ప్రయత్నిస్తున్నారు.
ఎందుకంటే ఆయన ఒక డమ్మీ ప్రధానమంత్రి, ఆయనకు వాస్తవ అధికారమేమీ లేదని, సైన్యం చేతిలోనే నిజమైన అధికారం ఉందని భారతీయ మీడియాలో చాలా ఆరోపణలు వచ్చాయి.
కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవటం ద్వారా.. తానే నాయకుడినని, ప్రధాన నిర్ణయం పాకిస్తాన్ రాజకీయ నాయకత్వమే తీసుకుందని, సైనిక నాయకత్వం కాదని ఆయన ప్రపంచానికి చూపటానికి ప్రయత్నిస్తున్నారు.
భారత్ - పాకిస్తాన్ ముందున్న మార్గమేమిటి?
ఉద్రిక్తతలు తగ్గాలని, పరిస్థితులు తిరిగి సాధారణ స్థితికి రావాలని మాత్రమే ఎవరైనా ఆశిస్తారు. పాక్, భారత నాయకత్వాలు ఉద్రిక్తతలను తగ్గించటానికి టెలిఫోన్ ద్వారా చర్చలు జరుపుతాయన్న మాటలు ఇప్పటికే వినిపిస్తున్నాయి.
సమయం గడిచేకొద్దీ.. ప్రత్యేకించి భారత పైలట్ పాక్ నుంచి భారత్ తిరిగి వచ్చేశాక వాతావరణం చల్లబడుతుంది.
పాక్ కస్టడీలో ఉన్న పైలట్ల సంఖ్య విషయంలో గందరగోళం ఎందుకు?
మొదట కొంత గందరగోళం ఉండింది. పాకిస్తాన్ ఇద్దరు భారత పైలట్లను పట్టుకున్నట్లు చెప్పిందని వార్తలు వచ్చాయి. అయితే తాము పట్టుకున్నది ఒకే ఒక పైలట్‌నని పాక్ సైన్యం అధికార ప్రతినిధి స్పష్టం చేశారు.
ఇక విమానాల విషయానికి వస్తే.. తాము రెండు భారత వాయుసేన విమానాలను కూల్చామన్న మాట మీదే పాక్ ఇంకా నిలుచుంది. ఆ దేశం చెప్తున్న దాని ప్రకారం ఒక విమానం పాకిస్తాన్లో కూలిపోగా, మరొకటి వెనుదిరిగి భారత భూభాగంలో కూలిపోయింది. కానీ దాని శకలాలు ఏవీ కనిపించలేదు. పాకిస్తాన్‌కు చెందిన ఒక ఎఫ్-16 విమానాన్ని కూల్చామని భారత్ చెప్తోంది. కానీ దానికి సంబంధించి స్వతంత్ర ఆధారాలేవీ లేవు.
కాబట్టి.. ఒక భారత విమానాన్ని కూల్చివేశారని, ఒక భారత పైలట్‌ను పట్టుకున్నారని మాత్రమే మనం కచ్చితంగా చెప్పవచ్చు. మిగతావన్నీ ఒకరు చెప్తున్న మాటలు, దానికి ప్రతిగా చెప్తున్న మాటలే.
- అభినందన్: విమానం నుంచి పడగానే ఏం జరిగింది? ప్రత్యక్ష సాక్షి కథనం - BBC EXCLUSIVE
- భారత సైనిక స్థావరాలపై దాడికి పాకిస్తాన్ ప్రయత్నించింది: త్రివిధ దళాధికారులు
- విశాఖ రైల్వేజోన్: కేంద్ర ప్రభుత్వ ప్రకటనపై అసంతృప్తి ఎందుకు?
- పవిత్ర గంగానది ప్రక్షాళన పూర్తైందా?
- యుద్ధం వస్తే తెరపైకి అణు బాంబులు వస్తాయి : అభిప్రాయం
- ఎన్నికల కోసమే భారత్ యుద్ధ వాతావరణం సృష్టించింది : ఇమ్రాన్ ఖాన్
- పాకిస్తాన్ బలం అమెరికా యుద్ధ విమానాలేనా?
- కంభంపాటి నచికేత పాకిస్తాన్‌కు పట్టుబడినపుడు ఏం జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)