బిన్ లాడెన్: ఒసామా కొడుకు హమ్జా సమాచారం ఇస్తే 10 లక్షల డాలర్ల రివార్డు - అమెరికా ప్రకటన

  • 2 మార్చి 2019
హమ్జా బిన్ లాడెన్ ఎక్కడున్నాడనే వివరాలు ఖచ్చితంగా తెలియదు Image copyright REWARDS FOR JUSTICE/STATE DEPARTMENT
చిత్రం శీర్షిక హమ్జా బిన్ లాడెన్ ఎక్కడున్నాడనే వివరాలు ఖచ్చితంగా తెలియదు

అల్-ఖైదా మాజీ నాయకుడు ఒసామా బినల్ లాడెన్ కొడుకుల్లో ఒకరి సమాచారం అందిస్తే 10 లక్షల డాలర్లు (దాదాపు రూ. 7 కోట్లకు పైనే) బహుమానం ఇస్తామని అమెరికా ప్రకటించింది.

ఒసామా కొడుకు హమ్జా బిన్ లాడెన్ ఇప్పుడు ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ అల్-ఖైదా నాయకుడిగా అవతరిస్తున్నాడని అధికారులు చెప్తున్నారు.

అఫ్గానిస్తాన్ - పాకిస్తాన్ సరిహద్దులో అతడి స్థావరం ఉన్నట్లు భావిస్తున్నారు.

అతడు.. తన తండ్రిని చంపినందుకు ప్రతీకారంగా అమెరికా, ఆ దేశ పాశ్చాత్య మిత్రదేశాలపై దాడులు చేయాలని అనుచరులకు పిలుపునిస్తూ ఇటీవలి సంవత్సరాల్లో ఆడియో, వీడియో సందేశాలు విడుదల చేశాడు.

అమెరికా ప్రత్యేక బలగాలు 2011లో పాకిస్తాన్‌లోని అబోటాబాద్‌లో ఒసామా బిన్ లాడెన్‌ను హతమార్చారు. 2001 సెప్టెంబర్ 11న అమెరికాలో 3,000 మందిని బలితీసుకున్న దాడులకు ఒసామా బాధ్యుడు.

హమ్జా గురించిన తెలిసిన వివరాలు ఏమిటి?

హమ్జా బిన్ లాడెన్ వయసు ప్రస్తుతం సుమారు 30 సంవత్సరాలుగా అంచనా. ఇతడిని అంతర్జాతీయ ఉగ్రవాది అని అమెరికా రెండేళ్ల కిందట అధికారికంగా ప్రకటించింది.

2001లో అమెరికాపై దాడి కోసం హైజాక్ చేసి ఉపయోగించిన నాలుగు కమర్షియల్ విమానాల్లో ఒక దానిని హైజాక్ చేసి.. న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ను ఢీకొట్టించిన మొహమ్మద్ అట్టా అనే తీవ్రవాది కుమార్తెను హమ్జా పెళ్లి చేసుకున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ చెప్తోంది.

ఒసామా బిన్ లాడెన్ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న లేఖల ద్వారా.. హమ్జా అతడికి ఇష్టుడైన కొడుకు అని, తన తర్వాత అల్-ఖైదా నాయకుడిని చేయటం కోసం హమ్జాను తయారు చేస్తున్నాడని తెలుస్తోంది.

హమ్జా బిన్ లాడెన్ తన తల్లితో కలిసి ఇరాన్‌లో కొన్నేళ్లు నివసించాడని, అక్కడే అతడి పెళ్లి జరిగిందని భావిస్తున్నారు. అయితే.. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, సిరియాల్లో అతడు నివసించి ఉండొచ్చునని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి.

''అతడు అఫ్గాన్ - పాకిస్తాన్ సరిహద్దులో ఉండొచ్చునని మేం విశ్వసిస్తున్నాం... అతడు సరిహద్దు దాటి ఇరాన్‌లోకి వెళతాడు. అయితే.. అతడు దక్షిణ మధ్య ఆసియాలో ఎక్కడైనా ఉండి ఉండొచ్చు'' అని దౌత్య భద్రత అసిస్టెంట్ సెక్రటరీ మైఖేల్ ఎవనాఫ్ పేర్కొన్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక పాకిస్తాన్‌లో తలదాచుకున్న ఒసామా బిన్ లాడెన్‌‌ను అమెరికా బలగాలు హతమార్చాయి

ఏమిటీ అల్-ఖైదా?

  • 1980ల్లో అఫ్గానిస్తాన్‌లో సోవియట్ బలగాల ఆక్రమణ మీద పోరాడటానికి అమెరికా మద్దతుతో పుట్టిన అఫ్గాన్ ముజాహిదీన్‌లలో అరబ్ వలంటీర్లు చేరారు.
  • ఈ వలంటీర్లకు సాయం చేయటానికి ఒసామా బిన్ లాడెన్ ఒక సంస్థను ఏర్పాడు చేశాడు. అల్-ఖైదా - అంటే 'భూమిక'గా పేరుగాంచింది.
  • ఒసామా 1989లో అఫ్ఘానిస్తాన్ వదిలి వెళ్లాడు. మళ్లీ 1996లో తిరిగివచ్చి సైనిక శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేశాడు.. వేలాది మంది విదేశీ ముస్లింలకు శిక్షణ ఇవ్వటానికి.
  • అమెరికా ప్రజలు, యూదులు, వారి మిత్రుల మీద అల్-ఖైదా 'పవిత్ర యుద్ధం' ప్రకటించింది.

అల్-ఖైదా ఇప్పుడు ఏమైంది?

2001 దాడి అనంతరం అమెరికా సారథ్యంలో అఫ్గానిస్తాన్ మీద జరిగిన యుద్ధంలో.. ఒసామా బిన్ లాడెన్, అతడి సంస్థకు ఆశ్రయం కల్పించిన తాలిబన్ పాలనను కూల్చివేసింది.

ఇటీవలి సంవత్సరాల్లో ప్రపంచ దృష్టిని, ఫైటర్లను, నిధులను ఆకర్షించటంతో పాటు.. పశ్చిమ లక్ష్యాలు, వాటి మిత్ర దేశాల మీద అనేక దాడులు చేసిన ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ప్రాభవంతో అల్-ఖైదా మరుగున పడిపోయింది.

''ఈ కాలంలో అల్-ఖైదా కార్యకలాపాలు పెద్దగా లేవు. అయితే అది వ్యూహాత్మక విరామం. లొంగుబాటు కాదు'' అని కౌంటర్ టెర్రరిజం అమెరికా కోఆర్డినేటర్ నాథన్ సేల్స్ అంటారు.

''అల్-ఖైదా ఇప్పుడు పునర్నిర్మితమవుతోంది. అమెరికాను, దాని మిత్ర దేశాలకు అది ఒక ముప్పుగానే కొనసాగుతోంది. మనల్ని దెబ్బతీసే సామర్థ్యం, ఉద్దేశం రెండూ అల్-ఖైదాకు ఉన్నాయి.. అందులో పొరపడొద్దు'' అని ఆయన వ్యాఖ్యానించారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)