ట్రంప్-కిమ్ సమావేశం ఎందుకు విఫలమైంది? ఉత్తర కొరియా, అమెరికాలపై దీని ప్రభావం ఎలా ఉంటుంది?

  • 1 మార్చి 2019
ఉత్తర కొరియా మహిళా సైనికురాలు Image copyright Getty Images

డోనల్డ్ ట్రంప్, కిమ్ జాంగ్ ఉన్ మధ్య జరిగిన రెండో సమావేశం ఎలాంటి ఒప్పందం జరగకుండానే ముగిసింది. ఉత్తర కొరియాతో చర్చలు విఫలం కావడంతో నిరాశ చెందాల్సిన అవసరం లేదని, భవిష్యత్తులో రెండు దేశాల మధ్య చర్చలు కొనసాగుతాయని అమెరికా తెలిపింది.

ముగిసిన ట్రంప్-కిమ్ చర్చలపై విశ్లేషకులు ఏమంటున్నారో చూద్దాం.

'ముందుగా ఊహించినదే..' - అంకిత్ పాండా, 'ది డిప్లమాట్‌' సీనియర్ ఎడిటర్

ఈ సమావేశం ఎలాంటి ఒప్పందం జరగకుండానే ముగుస్తుందని ముందుగానే ఊహించాం. ఇరు దేశాల మధ్య జరిగిన మొదటి సమావేశం నుంచి ఉత్తర కొరియా చేస్తున్న ప్రకటనలను ఓసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే, ఈ సమావేశం ఎందుకు విఫలమైందో అర్థమవుతుంది.

సింగపూర్‌లో ఇరుదేశాల మధ్య మొదటి సమావేశం ముగిసిన మరునాడే.. 'అమెరికా వైఖరి సక్రమంగా ఉంటే ఉత్తర కొరియా కూడా సానుకూలంగా స్పందిస్తుంది' అంటూ కిమ్ అభిప్రాయాన్ని, ఆ దేశ ప్రభుత్వ మీడియా పేర్కొంది.

అప్పటినుంచి, పుంగేరీలోని తన అణ్వాయుధ ప్రయోగ కేంద్రాన్ని మూసివేసి, అణ్వాయుధ ప్రయోగాలు నిలిపివేస్తున్నట్లు ఉత్తర కొరియా ప్రకటించింది. కొన్ని వారాల తర్వాత, తన 'మిస్సైల్ ఇంజిన్ టెస్ట్ స్టాండ్‌'ను కూడా ఉపసంహరించుకుంది.

దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్‌తో గతేడాది సెప్టెంబర్‌లో కిమ్ జాంగ్ మూడోసారి సమావేశమయ్యారు. ఆ సందర్భంగా, అమెరికాతో చర్చలు సఫలమైతే, 'యోంగ్‌బ్యోన్'లోని తమ అణ్వాయుధ పరిశోధనా కేంద్రాన్ని కూడా మూసివేయడానికి ఉత్తర కొరియా సంసిద్ధత వ్యక్తం చేసింది.

జనవరి 1న కిమ్ తన ప్రసంగంలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఉత్తర కొరియాకు ఆంక్షల నుంచి ఉపశమనం కలిగించాలన్నది కిమ్ ఉద్దేశం. కానీ 'కొరియా యుద్ధాన్ని ఆపేస్తున్నట్లు అమెరికా ప్రకటించాలి' అని కిమ్ భావిస్తున్నట్లు ఆయన భావాన్ని అపార్థం చేసుకున్నారు.

Image copyright Reuters

అణునిరాయుధీకరణ జరగాలంటే తమ దేశంపై విధించిన ఆంక్షలు ఉపసంహరించుకోవాలన్నది ఉత్తర కొరియా డిమాండ్. అంతవరకూ యోంగ్‌బ్యోన్ అణ్వాయుధ పరిశోధనా కేంద్రాన్ని మూసివేసే అంశాన్ని ఉత్తర కొరియా వాయిదా వేసింది.

తాజాగా హనోయ్‌లో రెండో రోజున చర్చలు విఫలం కావడానికి కూడా ఇదే ప్రధాన కారణమని డోనల్డ్ ట్రంప్ మీడియాతో అన్నారు.

ఉత్తర కొరియాపై ఆంక్షలు ఎత్తివేసే దిశగా అమెరికా అడుగు వేయనంతకాలం ఇరుదేశాల చర్చల్లో పురోగతి ఉండదు.

అమెరికా వైఖరి మందకొడిగా ఉందా? - జెన్నీ టౌన్, మేనేజింగ్ ఎడిటర్, 38 నార్త్

ఇరు దేశాలకు తమ డిమాండ్ల పట్ల పూర్తి అవగాహన ఉంది. కానీ చర్చలకు ముందే, రెండు దేశాలు తమ డిమాండ్లతో ముందుకురాకపోవడం ఆశ్చర్యంగా ఉంది.

మీడియా సమావేశంలో అంతా సానుకూలంగానే కనిపించింది. ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతాయన్న భావం ధ్వనించింది.

ఇంతవరకూ రెండు దేశాల నిర్దిష్టమైన డిమాండ్లు చర్చకు రాలేదు. కానీ పరస్పరం విశ్వాసం పెంపొందించే దిశగా, గతంలో ఉత్తర కొరియా చెబుతూవస్తున్న అణ్వాయుధ కేంద్రం మూసివేత.. లాంటి ప్రతిపాదనలు ఇకపై ఉండవని నా అనుమానం.

అమెరికా-ఉత్తర కొరియా చర్చల్లో పురోగతి కనిపించకపోవడంతో దక్షిణ కొరియా పరిస్థితి ఇబ్బందుల్లో పడింది. పరిస్థితి ఇలానే కొనసాగితే, ట్రంప్-కిమ్ చర్చల్లో భాగంగా దక్షిణ కొరియా ఆశిస్తున్న 'ఆంక్షల మినహాయింపు'ను ఆ దేశం కాపాడుకోలేదు. ముఖ్యంగా కొరియా అంతర్గత ఆర్థిక సహకారాన్ని ఆశిస్తోంది.

ఉత్తర కొరియాతో చర్చలు కొనసాగుతాయని డోనల్డ్ ట్రంప్ చెబుతున్నప్పటికీ, అమెరికాలోని రాజకీయ వాతావరణం అందుకు అనుకూలంగా లేదు.

Image copyright Getty Images

'ఉత్తర కొరియాకు ప్రమాదం' - ఆండ్రే అబ్రహామియాన్, స్టాండ్‌ఫోర్డ్ యూనివర్సిటీ

అమెరికా, ఉత్తర కొరియా దేశాల మధ్య ఇంతవరకూ ఏకపక్ష వైఖరి నెలకొంది. ఈ సమావేశం ద్వారా ఆ వైఖరి మారాల్సివుంది. కానీ అది జరగలేదు.

డోనల్డ్ ట్రంప్ దృష్టిలో చర్చలు విఫలం కావచ్చు. కానీ రెండు దేశాల చర్చల అంశంలో స్ఫూర్తిని నింపగలిగిన విషయాలను ఆయన వదిలేశారు. తనదారిన తను అమెరికా వెళ్లిపోతే.. కాలక్రమంగా చర్చల విషయం కూడా మరుగున పడుతుంది.

కానీ ఈ పరిణామం ఉత్తర కొరియాకు చాలా ప్రమాదం. అమెరికాలోని రాజకీయాల వల్ల, ఉత్తర కొరియాతో చర్చల నుంచి ట్రంప్ దృష్టి మరలే అవకాశం చాలా ఉంది. భవిష్యత్తులో అమెరికా అధ్యక్షులు ఎవరవుతారో? ఉత్తర కొరియా పట్ల వారి వైఖరి ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు?

Image copyright Reuters

'ఒత్తిడి ఎక్కువ లేదు' - ఆలివర్ హోథమ్, మేనేజింగ్ ఎడిటర్, ఎన్.కె.న్యూస్

చర్చల్లో భాగంగా, తమపై విధించిన అన్ని ఆంక్షలను ఎత్తివేయాలంటూ ఉత్తర కొరియా కోరుతోందని ట్రంప్ అన్నారు. కానీ ఉత్తర కొరియా డిమాండ్‌పై అమెరికా ఆసక్తి కనబరచడంలేదని అనిపిస్తోంది. ఏదేమైనా ఇరువురూ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

ఈ చర్చలు విఫలమవ్వడంతో దక్షిణ కొరియా ఇరకాటంలో పడింది. ఈ చర్చల ఫలితం సానుకూలంగా వస్తే, భవిష్యత్తులో కొరియాలో నెలకొనే శాంతి సౌఖ్యాల గురించి ఓ ప్రకటన చేసేందుకు కూడా ఆ దేశం సిద్ధమైంది. ఈ చర్చలు ఫలిస్తే, ఉత్తర కొరియాతో సహకారం మరింత విస్తరిస్తుందని భావించింది.

దక్షిణ కొరియాతోపాటు చైనా, రష్యా దేశాలు కూడా ఈ చర్చలు విఫలమవ్వడంతో అసంతృప్తిగా ఉన్నాయి.

ఉత్తర కొరియాపై ఆంక్షలను పెంచం అని, సమీప భవిష్యత్తులో ఆంక్షలు లేని ఉత్తర కొరియాను చూడటం తనకు ఇష్టమని ట్రంప్ అన్నారు. అంటే.. ఉత్తర కొరియాపై ఆంక్షలు ఎత్తివేసే ఆలోచన అమెరికాకు లేదన్నది స్పష్టమవుతోంది.

Image copyright Getty Images

'మానవ హక్కులు, అణునిరాయుధీకరణ రెండిటికీ సంబంధం ఉంది' - ఒలీవియా ఇనస్, పాలసీ అనలిస్ట్, ఏషియన్ స్టడీస్ సెంటర్, ది హెరిటేజ్ ఫౌండేషన్

ఈ ఒప్పందం నుంచి వైదొలగి ట్రంప్ సరైన నిర్ణయమే తీసుకున్నారు. ఆంక్షలు సంపూర్ణంగా ఎత్తివేయడమన్న ఉత్తర కొరియా డిమాండ్ అంగీకారయోగ్యం కాదు.

అది చట్టవిరుద్ధం కూడా. అమెరికా, ఐక్యరాజ్య సమితి ప్రకారం, ఉత్తర కొరియా తన అణు కార్యక్రమాన్ని పూర్తిగా ఆపేవరకు, దేశంలో మానవహక్కులు పెంపొందించేవరకూ ఆంక్షలను ఎత్తివేయడం కుదరదు.

ఉత్తర కొరియా అణు, క్షిపణి కార్యక్రమంలో 80వేల నుంచి 1.20లక్షల మంది ప్రజలు కట్టుబానిసల్లా పని చేస్తున్నారు. వీరిలో కొందరిపై రసాయన, బయొలాజికల్ ఆయుధాల పరీక్షలు చేశారని నివేదికలు చెబుతున్నాయి.

ఇరు దేశాల మధ్య విఫలమైన చర్చలు.. ఉత్తర కొరియా పట్ల మరింత విస్తృతమైన విధానాలు రూపొందించాల్సిన ఆవశ్యకతను తెలిపింది. ఎందుకంటే.. మానవ హక్కులు, అణునిరాయుధీకరణ రెండు ఒకదానితో ఒకటి సంబంధం ఉన్న అంశాలే.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

ప్రపంచబ్యాంకు బాటలోనే ఏఐఐబీ.. రాజధాని ప్రాజెక్టు నుంచి వెనక్కు

కర్ణాటక ముఖ్యమంత్రి: అడ్వాణీకి వర్తించిన రూల్ యడ్యూరప్పకు వర్తించదా

'మా తరం భవిష్యత్తును దోచుకున్నారు': పార్లమెంటులో పదహారేళ్ల బాలిక ప్రసంగం

పదహారేళ్ల కిందటే చంద్రుడిపై స్థలం కొన్నానంటున్న హైదరాబాద్ వ్యాపారి.. అసలు చందమామపై స్థలం కొనొచ్చా

కార్గిల్ యుద్ధం: జనరల్ ముషారఫ్ ఫోన్ ట్యాప్ చేసి పాక్ ఆర్మీ గుట్టు రట్టు చేసిన 'రా'

నిస్సహాయ తల్లులను వ్యభిచారంలోకి నెడుతున్న సార్వత్రిక నగదు బదిలీ పథకం

లోకేశ్ ట్వీట్: ‘జగన్ మాట మార్చడం వల్ల ఒక్కో మహిళకు రూ.45 వేల నష్టం’

కర్ణాటక అసెంబ్లీ: ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ.. కుమారస్వామి రాజీనామాను ఆమోదించిన గవర్నర్