లీగల్ హ్యాకింగ్‌ చేస్తూ కోట్లు సంపాదిస్తున్న శాంటియాగో లోపెజ్

  • 3 మార్చి 2019
హ్యాకర్ శాంటియాగో లోపెజ్

ఈ 19 ఏళ్ల కుర్రాడు ఓ కోటీశ్వరుడు. 19ఏళ్లకే కోట్లు ఎలా సంపాదించాడని ఆశ్చర్యపోతున్నారా? ఈ యువకుడు చేసే ఉద్యోగం ఏంటో తెలుసా? అసలు అలాంటి ఉద్యోగం ఒకటుందని చాలామందికి తెలియదేమో కూడా.

ఈ యువకుడి పేరు శాంటియాగో లోపెజ్. వృత్తి... హ్యాకింగ్. అంటే వెబ్‌సైట్లలో లోపాలు కనిపెట్టే 'బగ్ బౌంటీ హంటర్'.

ప్రపంచంలోనే ఉత్తమ వెబ్‌సైట్లు అని భావిస్తున్న వాటిలో కూడా దాదాపు 1600 బగ్స్‌ను శాంటియాగో కనుగొన్నారు.

హ్యాకర్‌ అంటే సినిమాల్లో చూపించేటట్లుగా పెద్ద జుత్తు, కళ్లజోడుతో ఉంటారనుకోవద్దు. అసలు ఆ రూపమే తనకు నచ్చదని అంటారు శాంటీ.

"సాధారణ వ్యక్తిలాగే ఉండటం నాకిష్టం. అలాగే హ్యాకింగ్ అంటే కూడా నాకు చాలా ఇష్టం" అంటారు శాంటీ.

శాంటియాగో సంపాదించిన డబ్బంతా చట్టబద్ధంగా వచ్చిందే. చేతిలో ఉన్న నైపుణ్యాలను సరైన పద్ధతిలోనే ఆయన ఉపయోగిస్తున్నారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: హ్యాకర్ శాంటియాగో లోపెజ్ లక్షాధికారి ఎలా అయ్యారు

"ఎప్పుడైనా మీ నైపుణ్యాలను దుర్వినియోగం చేశారా?" అని శాంటీని బీబీసీ ప్రశ్నించింది.

"హ్యాకింగ్ మొదలు పెట్టిన తొలినాళ్లలో అలా చేశా. అప్పట్లో అలా చేయాలనే కుతూహలం ఉండేది. డబ్బులు సంపాదించాలనే కోరికే అప్పట్లో నాతో అలా చేయించింది" అని శాంటీ తెలిపారు.

అలాంటి పనుల నుంచి తనను బగ్ బౌంటీ కాపాడిందని ఆయన తెలిపారు. ఆ దారిలోకి వెళ్లకుండా ఉండటానికి ఇదే కారణమని చెప్పారు.

మరి డబ్బంటే ఆశ లేదా అంటే, "అయ్యో, ఎందుకుండదు, నాకు డబ్బంటే చాలా ఇష్టం. హ్యాకింగ్, డబ్బు.. రెండూ నాకెంతో ఇష్టం. భలే కాంబినేషన్ కదా" అని నవ్వుతూ అంటారు శాండీ.

శాంటియాగోకు ఒక్కో బగ్‌కు వేల డాలర్లు చెల్లిస్తారు. ఇది అర్జెంటీనాలో ఓ ఉద్యోగి సగటు వేతనానికి 40 రెట్లు.

ఇప్పుడు కంపెనీలన్నీ అంతర్గత భద్రత కోసం లీగల్ హ్యాకర్ల మీద ఆధారపడుతున్నాయి. ఎంత వేతనాన్నైనా చెల్లించడానికి సిద్ధపడుతున్నాయి.

"నేను కనిపెట్టే ప్రతి బగ్ వల్లా ఇంటర్నెట్‌లో భద్రతా ప్రమాణాలు మరింత మెరుగుపడతాయనే గట్టిగా నమ్ముతున్నా" అంటారు శాంటియాగో.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు