వారమంతా తక్కువ నిద్ర, వారాంతాల్లో ఎక్కువ నిద్ర... బ్యాలెన్స్ అవుతుందా?

  • 3 మార్చి 2019
నిద్రపోతున్న యువతి Image copyright iStock

వారమంతా సరైన నిద్రలేకుండా కష్టపడి, వారాంతంలో ఎక్కువ సేపు పడుకుని విశ్రాంతి తీసుకోవాలని చాలామంది అనుకుంటారు. అయితే, తక్కువైన నిద్ర ద్వారా వచ్చే అలసట ఇలా చేస్తే తగ్గుతుందా?

ఈ విషయంపై అధ్యయనం చేయడానికి పరిశోధకులు సంపూర్ణ ఆరోగ్య వంతులైన కొందరు వ్యక్తులను రెండు బృందాలుగా విభజించారు. వారిని రోజుకు 5 గంటలకు మించి నిద్రపోకుండా పరిమితి విధించారు.

మళ్లీ, వీరిలో ఒక బృందాన్ని తమ అధ్యయనం పూర్తయ్యేవరకూ ఇదే నిబంధనను కొనసాగించాలని చెప్పారు. మరో బృందానికి మాత్రం వారాంతాల్లో విశ్రాంతినిచ్చారు.

ఈ రెండు గ్రూపుల్లో ఉన్నవారికీ రాత్రి పూట ఎక్కువ ఆహారాన్నిచ్చారు, దీంతో వారు బరువు పెరిగారు, ఫలితంగా వారి జీవక్రియల్లో మార్పులు చోటుచేసుకుని, ఆరోగ్యంపై ప్రభావం పడింది.

అధ్యయనం పూర్తయ్యేనాటికి వారాంతాల్లో ఎక్కువ సమయం పడుకున్నవారిలో జీవక్రియల పరంగా, ఆరోగ్య పరంగా ఎలాంటి ప్రయోజనాలూ కనిపించలేదని కొలరాడో బౌల్డర్ యూనివర్సిటీలో ఇంటిగ్రేటివ్ ఫిజియాలజీ విభాగంలో అసిస్టెంట్ రిసెర్చ్ ప్రొఫెసర్‌ క్రిస్ డెప్నర్ తెలిపారు.

Image copyright Getty Images

"చాలా తక్కువ సమయం నిద్రపోయేవారిలో అనారోగ్య సమస్యలు, ఊబకాయం, టైప్-2 మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువయ్యాయి. వీరిలో రాత్రిపూట కూడా ఏదో ఒకటి తినాలనే కోరిక పెరుగుతుంది. దీంతో ఇన్సులిన్ స్థాయులు తగ్గడంగానీ, రక్తంలో చక్కెర స్థాయుల్లో హెచ్చుతగ్గులు గానీ జరుగుతాయి. దీంతో మధుమేహానికి అవకాశాలు పెరుగుతాయి."

ఈ అధ్యయనంలో మరో ముఖ్యమైన పరిశీలన... వారాంతాల్లో నిద్రపోయేవారి ఆరోగ్యం ఎలా ఉంది? వారమంతా తక్కువగా నిద్రపోయి, వారాంతాల్లో విశ్రాంతి తీసుకుంటే ఏం జరుగుతుంది? ఇలా చేస్తే నిద్రలేమి బ్యాలెన్స్ అవుతుందా?

18 నుంచి 39 సంవత్సరాల మధ్య వయసున్న 36 మందిని వీరు దీనికోసం పరిశీలించారు. రెండువారాల పాటు వారిని ప్రయోగశాలలో ఉంచి, వారి ఆహారం, వారిపై పడే కాంతిని, వారు ఎంతసేపు నిద్రపోతున్నారనే విషయాలను దగ్గరుండి పరిశీలించారు.

ఈ శాంపుల్ పరిమాణం చిన్నదే అయినప్పటికీ, నిద్రకు సంబంధించిన అధ్యయనాల్లో ఇది చాలా పెద్ద సంఖ్యే అని పరిశోధకులు చెబుతున్నారు.

Image copyright Getty Images

ఈ మొత్తం వ్యక్తులను మూడు గ్రూపులుగా విభజించారు.

  1. మొదటి గ్రూపును రోజుకు ఐదు గంటలకన్నా ఎక్కువ పడుకోవద్దంటూ నిబంధన విధించారు.
  2. రెండో గ్రూపును కూడా రోజుకు ఐదుగంటలకన్నా ఎక్కువగా పడుకోనివ్వకుండా పరిమితి విధించినప్పటికీ వారాంతాల్లో రెండు రోజులు మాత్రం వారికి ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకోవడానికి అనుమతినిచ్చారు.
  3. మూడో గ్రూపులో ఉన్నవారికి తగినంత నిద్రపోయే సమయాన్నిచ్చారు. అంటే రోజుకు దాదాపు 9 గంటలపాటు వారికి పడుకునే అవకాశం కల్పించారు.

ఈ అధ్యయనం పూర్తయ్యేనాటికి మొదటి రెండు గ్రూపుల్లోని సభ్యులు కొద్దిగా (దాదాపు 1 కేజీ) బరువు పెరిగారు. వారి ఇన్సులిన్ స్థాయుల్లో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి అని కరెంట్ బయాలజీ అనే జర్నల్‌లోని ఓ నివేదికలో పేర్కొన్నారు.

వారాంతాల్లో విశ్రాంతి తీసుకున్న గ్రూపులో కొద్దిగా ఆశాజనక మార్పులు కనిపించినప్పటికీ మళ్లీ వారం మొదలు కాగానే, వారు తక్కువ నిద్రపోవడం వల్ల, ఈ మార్పులు మళ్లీ నిష్ప్రయోజనమయ్యాయి.

కొన్ని విషయాల్లో అయితే, ఈ గ్రూపుపై పరిశోధనల్లో మరింత ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి. వారమంతా ఒకే రకంగా తక్కువ నిద్రపోయిన గ్రూపు వారిలోలో ఇన్సులిన్ స్థాయి 13శాతం తగ్గింది, కానీ వారాంతాల్లో విశ్రాంతి తీసుకునే వారిలో ఆ మార్పు 9 నుంచి 27శాతం వరకూ ఉంది.

వీరు వారాంతాల్లో ఎక్కువసేపు విశ్రాంతి తీసుకుందామనుకున్నా సరాసరిన 66 నిమిషాల కన్నా ఎక్కువ సేపు నిద్రపోలేకపోయారు.

Image copyright Getty Images

క్రమపద్ధతిలో ఉన్నవారు ఎలా ఉన్నారు?

ఈ అధ్యయనంలో వెల్లడైన ఆరోగ్యపరమైన విషయాలు చిన్నవిగానే కనిపించినా, ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే ఆ సమస్యలు మరింత తీవ్రమయ్యే ప్రమాదముందని ఈ అధ్యయనంలో పాల్గొనని పరిశోధకులు సైతం హెచ్చరిస్తున్నారు. రోజూ ఓ నిర్ణీత సమయానికి నిద్రపోయే అలవాటు చేసుకోవడం, తగినంత సమయం నిద్రపోవడం చాలా ముఖ్యమని చెబుతున్నారు.

వీలైనంత వరకూ ఓ నిర్ణీత సమయంలో పని చేయడం, నిద్రపోవడం, నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి అని యూనివర్సిటీ ఆఫ్ సర్రేలో క్రోనోబయాలజీ ప్రొఫెసర్ మాల్కమ్ వాన్ శాంజ్ సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)