జైషే మొహమ్మద్ శిబిరాలపై భారత్ నిజంగానే వైమానిక దాడులు చేసిందా? ఎంతమంది చనిపోయారు, ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారు? -బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

  • 2 మార్చి 2019
మిరాజ్ విమానం Image copyright AFP

బాలాకోట్‌లో భారత వైమానిక దళ దాడులు జరిగిన తర్వాత భారత్, పాకిస్తాన్ రెండు దేశాలూ తమ తమ వాదనలు వినిపించాయి.

బాలాకోట్‌లో తీవ్రవాద సంస్థ జైషే మహమ్మద్ శిక్షణ శిబిరాలను టార్గెట్ చేశామని, అక్కడ ఉన్న తీవ్రవాదులందరూ చనిపోయారని భారత్ చెప్పింది.

ఇటు పాకిస్తాన్ అక్కడ ఎలాంటి శిక్షణ శిబిరాలు లేవని. భారత యుద్ధ విమానాలు ఖాళీ ప్రాంతాల్లో బాంబులు వేశాయని, పాకిస్తాన్ వైమానిక దళం దాడులను తిప్పికొట్టడంతో వెనక్కి వెళ్లిపోయాయని చెప్పింది.

రెండు దేశాల మధ్య ఈ వాదనలు జరుగుతున్నప్పుడు, మీడియా కూడా తమ తమ కథనాలు వినిపించాయి. కొన్ని మీడియా చానళ్లు భారత వైమానిక దళం దాడుల్లో 300 మంది తీవ్రవాదులు చనిపోయారని చెప్పాయి.

బాలాకోట్‌లో తీవ్రవాదుల కోసం ఆరు ఎకరాల్లో శిక్షణ శిబిరం నిర్మించారని, వాటిలో చాలా సౌకర్యాలు ఉన్నాయని, తీవ్రవాదులకు అక్కడ అన్నిరకాల శిక్షణ అందించేవారని కూడా చెప్పాయి. కానీ, ఈ వాదనలను ధ్రువీకరించలేకపోయాయి.

పాకిస్తాన్ తమ వాదనలను ధ్రువీకరించడానికి దాడులు జరిగిన బాలాకోట్‌లోని జాబా ప్రాంతానికి వచ్చి చూడాలని అంతర్జాతీయ మీడియాను ఆహ్వానించింది. జాబా బాలాకోట్‌లో ఉంది.

పాకిస్తాన్ సైన్యం రక్షణలో మీడియాను జాబాకు తీసుకెళ్లారు. అక్కడ పరిస్థితులపై సమగ్ర సమాచారం.

చిత్రం శీర్షిక ప్రత్యక్ష సాక్షితో మాట్లాడుతున్న బీబీసీ ప్రతినిధి

బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

భారత వైమానిక దళం దాడుల తర్వాత బీబీసీ ప్రతినిధి సహర్ బలోచ్ కూడా బాలాకోట్ వెళ్లారు. ఈ దాడుల్లో గాయపడిన స్థానికుడు నూరాన్ షాతో ఆమె మాట్లాడారు. ఆయన ఇల్లు ఘటనాస్థలానికి దగ్గరే ఉంది.

"రాత్రి నేను నిద్రపోతున్నా. చాలా గట్టిగా శబ్దం వచ్చింది. నేను లేచి చూసినప్పుడు చాలా పెద్ద పేలుడు జరిగింది. ఆ పేలుడు సమయంలో నేను బయటికెళ్లాలనున్నా. అదేదో ప్రమాదకరమైనదని అనుకున్నా. నేను తలుపుల దగ్గరికి వచ్చినపుడు మూడో పేలుడు జరిగింది. అది 15 మీటర్ల లోపే జరిగింది" అని నూరాన్ చెప్పారు.

"రెండో పేలుడుతోనే తలుపులు విరిగిపోయాయి. అప్పుడు నేను, నా కూతురు, నా భార్య లోపలే కూర్చున్నాం. మేం చచ్చిపోతామేమో అనుకున్నాం. ఆ తర్వాత కాస్త దిగువన నాలుగో పేలుడు జరిగింది. దాంతో మేం అక్కడే ఉండిపోయాం. కాసేపటి తర్వాత బయటికెళ్లి చూస్తే ఇంటి గోడలు, పైకప్పు అంతా పగుళ్లొచ్చేశాయి. అల్లా దయతో బతికిపోయాం. నా తలపై చిన్న దెబ్బ తగిలింది. కాలుపైన, నడుముపైన దెబ్బలు తగిలాయి".

పాకిస్తాన్ సైన్యం రావడం వల్ల ఆ ప్రాంతంలో ఎలాంటి ప్రభావం కనిపించిందని అక్కడే ఉన్న ఒక విద్యార్థిని అడిగితే, అతడు "ఉదయం నుంచి ఇక్కడికి ఎవర్నీ రాకుండా ఆపేశారు. సైన్యం మమ్మల్ని అడ్డుకుంది" అని చెప్పారు.

దానికితోడు, ఖైబర్ పంఖ్తూంఖ్వా హెల్త్ కేర్ కమిషన్ "ఇక్కడ 100 బెడ్‌లు వేరేగా పెట్టింది. ఆ తర్వాత పరిస్థితి ఘోరంగా ఉందేమో అనే అనుమానాలు మొదలయ్యాయి.

అల్ జజీరా ఏం రాసింది

కతార్ న్యూస్ బ్రాడ్‌కాస్టర్ అల్ జజీరా, "బుధవారం దాడులు జరిగిన ప్రాంతాల్లో అల్ జజీరా పరిశీలించింది. ఉత్తర పాకిస్తాన్‌లోని జాబా పట్టణం బయట అడవుల్లో, చుట్టుపక్కల ప్రాంతాల్లో నాలుగు బాంబులు వేసినట్టు గుర్తించింది. పేలుళ్ల వల్ల పడిన గుంతల్లో విరిగిన చెట్లు, అక్కడక్కడా రాళ్లు ఉన్నాయి. కానీ, అక్కడ ఎలాంటి శిథిలాలుగానీ, ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్టు ఆధారాలూ లేవు" అని రాసింది.

స్థానిక ఆస్పత్రుల అధికారులు, ఆ ప్రాంతం దగ్గరికి చేరుకున్న చాలా మంది స్థానికులు "భారత్ దాడుల తర్వాత తమకు అక్కడ ఎలాంటి మృతదేహాలు, గాయపడినవారు కనిపించలేదని" చెప్పారు.

"అక్కడ జైషే మహమ్మద్ శిక్షణ శిబిరాల గురించి స్పష్టంగా తెలీలేదు".

బాంబులు వేసిన ప్రాంతానికి ఒక కిలోమీటర్ కంటే తక్కువ దూరంలో ఒక కొండ కింద మదరసా ఉండేది. దానిని జైషే మహమ్మద్ నిర్వహిస్తుంది అని స్థానికులు చెప్పారు.

కొంత దూరంలో ఉన్న ఒక సైన్ బోర్డు వల్ల అక్కడ స్కూల్ ఉన్న ప్రాంతం ధ్రువీకరించుకున్నాం. అది ఒక సాయుధ దళం ద్వారా నడిచేదని అక్కడ కొందరు చెప్పారు.

ఆ మదరసా బోర్డుపై తాలీమ్-ఉల్-ఖురాన్ చీఫ్ మసూద్ అజర్‌ అని, మహమ్మద్ యూసఫ్ అజర్‌ దాని నిర్వాహకుడని రాసుంది.

అక్కడ కొంత మంది ఈ మదరసాలో స్థానిక పిల్లలకు బోధించేవారని చెబితే, కొంతమంది మాత్రం అది జైషే మిలిటెంట్లకు శిక్షణ కేంద్రంగా ఉండేదని చెప్పారు.

గుర్తింపు బయటపెట్టవద్దనే షరతుతో ఒక వ్యక్తి "కొండపై నిర్మించిన మదరసా ముజాహిదీన్లకు శిక్షణ శిబిరంగా ఉండేదని" చెప్పారు.

31 ఏళ్ల మరో స్థానికుడు "అక్కడ జైషే శిక్షణ శిబిరం ఉందనే విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. అక్కడ అందరికీ పోరాటాలు ఎలా చేయాలో నేర్పించేవారు" అన్నారు.

అయితే, ఆ ప్రాంతానికి కొంత దూరంలో ఉంటున్న మీర్ అఫ్జల్ గుల్జార్ మాత్రం "ఇక్కడ శిబిరాలు లేవు, మిలిటెంట్లు లేరు. 1980లో ఇక్కడ ముజాహిదీన్ శిక్షణ శిబిరం ఉండేది. కానీ ఇప్పుడు వాళ్లు వెళ్లిపోయారు" అని చెప్పారు.

2004 జనవరి 31న వికీలీక్స్ ద్వారా లీక్ అయిన అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ మెమోలో "జాబాలో జైషే మహమ్మద్ శిక్షణ శిబిరం ఉందని, అక్కడ ఆయధాలు, పేలుడు పదార్థాల గురించి బేసిక్, అడ్వాన్స్ శిక్షణ ఇస్తారు" అని తెలిపారు.

Image copyright Reuters
చిత్రం శీర్షిక నూరాన్ షా రాయిటర్స్‌తో మాట్లాడారు

రాయిటర్స్ రిపోర్ట్

జాబాలో పర్యటించిన బ్రిటన్ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ "అక్కడ దాడి వల్ల ఒక్కరు మాత్రమే గాయపడ్డారని, బాంబు దాడుల వల్ల అతడి కుడి కంటికి గాయం అయ్యిందని" చెప్పింది.

జాబాలో పైన కొండలవైపు చూపించిన గ్రామస్థులు "అక్కడ నాలుగు బాంబులు పడిన గుర్తులున్నాయి. వాటి ధాటికి దేవదారు చెట్లు చెల్లాచెదురయ్యాయి" అని చెప్పారు.

ఆ ప్రాంతంలో వ్యాన్ నడిపే అబ్దుర్ రషీద్ "వాటి వల్ల అంతా కంపించింది. కానీ, ఇక్కడ ఎవరూ చనిపోలేదు. కొన్ని దేవదారు చెట్లు మాత్రం ధ్వంసమయ్యాయి" అని చెప్పారు.

జాబా కొండలు, నదులు ఉన్న ప్రాంతంలో ఉంది. అక్కడ నుంచి కాఘాన్ లోయకు వెళ్లే దారి ఉంది. పాకిస్తాన్ పర్యాటకులకు ఇది చాలా నచ్చిన ప్రాంతం

ఇక్కడ 500 మంది వరకూ మట్టి ఇళ్లలో ఉంటారని స్థానికులు చెప్పారు. రాయిటర్స్ అక్కడ 15 మందితో మాట్లాడింది. కానీ నూరాన్ షా తప్ప వేరే ఎవరూ గాయపడినట్లు సమాచారం లేదు.

"నేనిక్కడ ఒక్క మృతదేహం కూడా చూళ్లేదు. ఇక్కడ ఉన్న ఒకరికి ఏదో తగిలి గాయమైంది" అని అబ్దుల్ రషీద్ చెప్పారు.

జాబాకు దగ్గరగా ఉన్న ఆస్పత్రిలో బేసిక్ హెల్త్ యూనిట్‌కు చెందిన అధికారి మహమ్మద్ సాదిక్ ఆ రాత్రి నైట్ డ్యూటీలో ఉన్నారు. ఆయన కూడా ఎవరైనా గాయపడ్డారనే విషయాన్ని తోసిపుచ్చారు. "అది అవాస్తవం. మా దగ్గరికి గాయపడిన వ్యక్తి ఒక్కరు కూడా రాలేదు" అన్నారు.

అయితే, స్థానికులు మాత్రం అక్కడ జేషే మహమ్మద్ ఉండేదని చెబుతున్నారు. శిక్షణ శిబిరం లేకపోయినా, వారి మదరసా ఉందన్నారు.

"ఇది తాలీమ్-ఉల్-ఖురాన్ మదరసా. గ్రామంలోని పిల్లలు అక్కడకు వెళ్లి చదువుకునేవారు. అక్కడ ఎలాంటి శిక్షణా ఇవ్వడం లేదు" అని నూరాన్ షా చెప్పారు.

మదరసాలో జైషే మహమ్మద్‌కు సంబంధించిన సైన్ బోర్డ్‌ను గురువారం తొలగించారు. మీడియా ప్రతినిధులు అక్కడకు వెళ్లకుండా సైన్యం అడ్డుకుంది.

కానీ, వెనక నుంచి ఆ నిర్మాణం కనిపిస్తోంది. దానికి ఎలాంటి నష్టం జరగలేదు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

హైదరాబాద్ ‘ఎన్‌కౌంటర్‌’పై హైకోర్టులో కేసు: ‘సోమవారం దాకా నిందితులకు అంత్యక్రియలు చేయొద్దు.. మృతదేహాలను భద్రపరచండి’

ఆరు గంటలు గుండె కొట్టుకోవడం ఆగిపోయింది.. అయినా ఆమె ప్రాణం పోలేదు

INDvsWI: మొదటి టీ20లో భారత్ విజయం.. కోహ్లీ 94 నాటౌట్

నాడు మూడు అడుగుల లోతులో పాతిపెడితే సజీవంగా బయటపడిన పసిపాప ఆరోగ్యం ఇప్పుడు భేష్

స్మృతి ఇరానీపై లోక్‌సభలో ఇద్దరు కాంగ్రెస్ ఎంపీల ‘దౌర్జన్యం’ చేశారన్న బీజేపీ.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్

పది రోజులు... 3,000 కిలోమీటర్ల ప్రయాణం: యెమెన్ నుంచి తప్పించుకుని సముద్ర మార్గంలో భారత్‌కు

హైదరాబాద్ ఎన్‌కౌంటర్: సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ అంటే ఏంటి.. ఎందుకు చేస్తారు

సజ్జనార్ ప్రెస్ మీట్: 'చట్టం తన పని తాను చేసింది'