నరేంద్ర మోదీ వర్సెస్ ఇమ్రాన్ ఖాన్: ఇంతకీ ఈ ప్రచార యుద్ధంలో గెలిచిందెవరు?

  • 2 మార్చి 2019
ఇమ్రాన్ ఖాన్, మోదీ Image copyright Getty Images

పాకిస్తాన్ బందీగా పట్టుకున్న భారత వైమానిక దళ పైలట్‌ను విడుదల చేయటంతో.. రెండు అణ్వస్త్ర దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుతాయని భావిస్తున్నారు. అయితే, ఈ సంక్షోభంలో సాగిన ప్రచార యుద్ధంలో గెలుపు ఎవరిది?

పాకిస్తాన్ బందీగా పట్టుకున్న భారత పైలట్‌ను ''శాంతి సూచిక''గా విడుదల చేస్తామని పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ గురువారం మధ్యాహ్నం తమ దేశ పార్లమెంటులో ప్రకటించారు.

ఆ తర్వాత కొద్ది సేపటికి దిల్లీలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శాస్త్రవేత్తల సమావేశంలో ప్రసంగిస్తూ.. నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ''ఒక పైలట్ ప్రాజెక్టు పూర్తయింది. ఇప్పుడిక మనం దానిని నిజం చేయాల్సి ఉంది'' అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల పట్ల ఆయన మద్దతుదారులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తే.. ఇది అహంకార పూరిత, మొరటు వ్యాఖ్యలని ఇంకొందరు విమర్శించారు.

మంగళవారం నాడు భారత యుద్ధ విమానాలు పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించి, ఆరోపిత ఉగ్రవాద శిక్షణ శిబిరం మీద బాంబులు వేసిన కొన్ని గంటల తర్వాత.. మోదీ గర్వంగా ప్రసంగిస్తూ ఒక భారీ ప్రచార సభను ప్రారంభించారు. ''దేశం సురక్షిత హస్తాల్లో ఉందని మీకు నేను భరోసా ఇస్తున్నా'' అన్న ఆయన మాటలకు సభికుల నుంచి హర్షం వెల్లువెత్తింది. సార్వత్రిక ఎన్నికలు మరో నెల రోజుల్లోనే జరగనున్నాయి.

Image copyright AFP

అనంతరం 24 గంటల లోపలే పాకిస్తాన్ ఎదురు దాడి చేసింది. భారత యుద్ధ విమానాన్ని పాక్ ఆధీనంలోని కశ్మీర్‌లో కూల్చివేసి, పైలట్ అభినందన్ వర్ధమాన్‌ను బందీగా పట్టుకుంది.

ఉద్రిక్తతలను చల్లార్చాలని ఇరు పక్షాల మీదా తీవ్ర ఒత్తిడి ఉంది. ఇమ్రాన్ ఖాన్ ముందడుగు వేసి పైలట్‌ను విడుదల చేస్తామని చెప్పారు.

''ఇమ్రాన్ ఖాన్ దౌత్యపరమైన రివర్స్ స్వింగ్‌తో మోదీ బీజేపీలోనూ, భారత ప్రభుత్వంలోనూ ఉన్న యుద్ధోన్మాదులు చిక్కుకుపోతారని'' భారత మాజీ దౌత్యవేత్త, వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడు కె.సి.సింగ్ వ్యాఖ్యానించారు.

(క్రికెట్‌లో రివర్స్ స్వింగ్ అంటే.. బంతి బాట్స్‌మన్‌కు దూరంగా కాకుండా బాట్స్‌మన్ దిశగా మళ్లేలా విసిరే కళ. ఇమ్రాన్ ఖాన్ తన క్రీడా జీవితంలో ప్రపంచంలో ఉత్తమ క్రీడాకారుల్లో ఒకరిగా రాణించారు.)

భద్రతా సంక్షోభం

నరేంద్ర మోదీ 2014లో అధికారంలోకి దూసుకొచ్చినప్పటి నుంచీ.. మొత్తం కథనం మీద తన పట్టు బిగించారు. అతి విధేయమైన స్థానిక మీడియా ఆయనకు ఎంతో విధేయంగా ఆయన ప్రతిష్ఠను ''శక్తిమంతుడైన జాతీయవాది''గా ప్రచారం చేస్తోంది.

అయితే, దేశం కత్తి మొన మీద ఉన్న సమయంలో... అణ్వాయుధాలున్న పొరుగు దేశంతో యుద్ధం తప్పదన్న వదంతులు చెలరేగుతున్నపుడు, మోదీ తానే స్వయంగా ప్రజలతో మాట్లాడకుండా తన అధికారులు, సైన్యంతో ఎందుకు మాట్లాడించారని చాలా మంది ఆశ్చర్యం వ్యక్తంచేశారు.

అలా చికాకుపడ్డ వారిలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలూ ఉన్నాయి. మోదీ హయాంలో అతి పెద్ద భద్రతా సంక్షోభం తలెత్తిన సమయంలో ప్రధాని ఎన్నికల సమావేశాలకు, రాజకీయ కార్యక్రమాలకు హాజరవుతుండటాన్ని, మొబైల్ యాప్‌ను ఆవిష్కరించటాన్ని 21 ప్రతిపక్ష పార్టీలు విమర్శించాయి.

పాకిస్తాన్ వేగంగా, బాహాటంగా ప్రతిదాడి చేసి భారత యుద్ధ విమానాన్ని కూల్చివేయటంతో పాటు, భారత పైలట్‌ను బందీ పట్టుకోవటం ద్వారా మోదీని విస్మయానికి గురిచేసిందని చాలా మంది నమ్ముతున్నారు.

ఆ తర్వాత రెండు రోజుల పాటూ వైరాన్ని తగ్గించుకోవాలని ఖాన్ పిలుపునిచ్చారు. శాంతి గురించి మాట్లాడారు. పైలట్‌ను విడుదల చేస్తామని ప్రకటించారు. పాక్ ప్రధానమంత్రి ఒక ''గౌరవప్రదమైన సంయమనం, విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి సంసిద్ధత''ను ప్రదర్శించారని.. భారత పైలట్‌ను తిరిగి అప్పగించాలన్న తన నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యపరచారని కె.సి.త్యాగి అంటారు.

ఇమ్రాన్‌ ఖాన్ తన ప్రజలతో మాట్లాడితే.. రక్షణ అధికారులు మీడియాకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం ఇస్తూ వచ్చారు. పాక్ ప్రధాని భారతదేశాన్ని ఇరుకునపెట్టటానికి ప్రయత్నించకుండా ఉండటం ద్వారా, వైరం తొలగించటానికి ఓ దారి ఇవ్వటం ద్వారా.. ''సహేతుక నాయకుడిగా'' కనిపించారని భారతదేశంలో చాలా మంది విశ్లేషకులు అంటున్నారు.

మరోవైపు నరేంద్రమోదీ ఈ కథాగమనంపై నియంత్రణ కోల్పోయినట్లు కనిపించింది. ''దీనిని ఎటు తిప్పి చూసినా.. పాకిస్తాన్ దాడి ఇండియాకు అనూహ్యమైనది'' అని చరిత్రకారుడు, రచయిత శ్రీనాథ్ రాఘవన్ వ్యాఖ్యానించారు. ఆయన తాజాగా దక్షిణాసియాలో అమెరికా చరిత్ర అనే పుస్తకం రచించారు.

ఫిబ్రవరి 14వ తేదీన 40 మందికి పైగా భారత జవాన్ల మరణానికి కారణమైన పుల్వామా దాడికి ప్రతీకారంగా భారతదేశం అర్థరాత్రి వేళ పాకిస్తాన్ మీద దాడి చేసింది. ఆ మరుసటి రోజే పట్టపగలు భారత్ మీద దాడి చేసిన పాకిస్తాన్ ప్రతిస్పందన చాలా వేగంగా, దూకుడుగా ఉంది.

Image copyright AFP

'ప్రతీకారం అనేది ఓ వ్యూహం కాదు'

భారత పైలట్‌ను పాకిస్తాన్ బంధించటం అంటే.. మోదీ, ఆయన ప్రభుత్వ కథనం, అంచనాలు తల్లకిందులయ్యాయి. అంతకుముందు రోజు ఉదయం ఉన్న హర్షాతిరేకమంతా పూర్తిగా మారిపోయింది. పైలట్‌ను తిరిగి రప్పించటం మీదే కేంద్రీకృతమైంది. పాకిస్తాన్ దాడి జరిగి 30 గంటలు పైగా సమయం గడిచిన తర్వాత భారత సైన్యం మీడియాకు వివరాలు వెల్లడించింది. ఈ వ్యవహారం మీద పట్టు బిగించటానికి మోదీకి, ఆయన ప్రభుత్వానికి అవకాశం లేకపోయింది.

చివర్లో.. ఈ కథనం మీద పట్టుసాధించటానికి బడాయి మాటలతో ప్రయత్నించటం సులభంగా తిప్పికొట్టే అవకాశముంది.

పాకిస్తాన్ కేంద్రంగా ఉన్న ఉగ్రవాద సంస్థల ప్రేరేపణతో భద్రతా సమస్యలను ఎదుర్కొన్న మొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాదు.

ఆయనకు ముందు అటల్ బిహారీ వాజపేయి, మన్మోహన్‌సింగ్‌లు కూడా సరిహద్దు అవతలి నుంచి ఇటువంటి రెచ్చగొట్టే చర్యలను ఎదుర్కొన్నారు. ఎదురు దాడి చేయగల ఇదే తరహా సామర్థ్యాలూ వారికి ఉన్నాయి. కానీ వాతావరణాన్ని చల్లార్చటానికి ఆచితూచి నిర్ణయాలు తీసుకున్నారు.

''ప్రతీకారం అనేది ఒక వ్యూహాత్మక లక్ష్యం కాబోదు. భావోద్వేగాలతో ప్రేరేపితమైన ఏ వ్యూహమైన విఫలమయ్యే అవకాశముంది'' అంటారు రాఘవన్.

భారత పైలట్‌ను విడుదల చేయటం మోదీ విజయం అని దేశంలోని మీడియాలో చాలా భాగం అల్లుకొచ్చింది.

అయితే, పుల్వామా దాడికి కారణమైన భారీ నిఘా వైఫల్యం గురించి, పాకిస్తాన్ పట్టపగలు గగనతల రక్షణలోకి చొచ్చుకురాగలగటం గురించి కానీ చాలా కొద్ది మంది మాత్రమే ప్రశ్నిస్తున్నారు.

భారతదేశంలో పాక్ మద్దతుతో ఉగ్రవాదాన్ని సైనిక చర్యల ద్వారా తిప్పికొడతామన్న భయటం కలిగించటమనే నూతన వ్యూహాత్మక లక్ష్యాన్ని కూడా భారత సైన్యం సాధించలేదని ప్రముఖ రక్షణ రంగ విశ్లేషకుడు అజయ్ శుక్లా వ్యాఖ్యానించారు.

''ఇప్పటివరకూ.. భారత్‌ను తాము దీటుగా ఎదుర్కోగలమని పాకిస్తాన్ ప్రదర్శించి చూపింది. దీనికి ప్రతిగా.. పాకిస్తాన్ తమకు సాటిరాగల స్థాయిలో భారత సైన్యం శిక్షను పెంచాల్సి ఉంటుంది. ఏదేమైనా.. దశాబ్దాల తరబడి నిర్లక్ష్యం, నిధుల కొరత.. భారత సైన్యాన్ని ఎంత బోలుగా మార్చిందంటే.. పాకిస్తాన్‌ను వేగంగా, ఎక్కువ రక్తపాతం లేకుండా శిక్షించటానికి సైన్యం సామర్థ్యం మీద మోదీ అధారపడలేనంత స్థాయికి తీసుకెళ్లింది'' అని ఆయన విశ్లేషించారు.

పైగా.. పాకిస్తాన్‌లో ఆరోపిత ఉగ్రవాద శిబిరాలను భారత యుద్ధ విమానాలు ఎంతమేరకు ధ్వంసం చేశాయన్న వివరాలు కూడా అస్పష్టంగా ఉన్నాయి. ఆ దాడిలో దాదాపు 300 మంది మిలిటెంట్లు చనిపోయారని మీడియాలోని కొన్ని వర్గాలు యధేచ్ఛగా చెప్తున్నప్పటికీ.. ఎంత మంది చనిపోయారన్న దాని మీద భారత అధికారులకు స్పష్టత లేదు. ఏరకంగా చూసినా మోదీ ముందు కఠినమైన ప్రశ్నలు ఉన్నాయి.

Image copyright AFP
చిత్రం శీర్షిక పాక్‌లో 'జైషే శిబిరం' మీద దాడి వార్తలతో భారతీయులు హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు

అయితే.. ఇమ్రాన్ ఖాన్ ఈ ప్రచార యుద్ధంలో తన స్వదేశ ప్రజల్లోనూ, కొందరు భారతీయులనూ గెలిచి ఉండవచ్చు. కానీ మోదీ తన క్షేత్రమైన భారతదేశంలో ఈ కథనం మీద తన పట్టును కొనసాగిస్తారు.

''మోదీని విశ్వసించని జనం కన్నా చాలా పెద్ద ప్రజాసమూహం అది. మీడియా కథనం మీద దాదాపు సంపూర్ణ నియంత్రణ ఉండటం వల్ల.. ఆయన ఈ ప్రచార యుద్ధంలో ఓటమి పాలైనట్లు నేను అనుకోను. మోదీ తన పని తాను చేసుకుంటూ వెళ్లారని.. ఖాన్ ఒత్తిడికి లోనై మాట్లాడాల్సి వచ్చిందని, పైలట్‌ను విడుదల చేయాల్సి వచ్చిందని ఆయన మద్దతుదారులు విశ్వసిస్తారు'' అని ప్రముఖ రచయిత, విశ్లేషకుడు సంతోష్ దేశాయ్ పేర్కొన్నారు. ఆయన ఇటీవల 'మదర్ పయస్ లేడీ - మేకింగ్ సెన్స్ ఆఫ్ ఎవిరిడే ఇండియా' అనే పుస్తకం రాశారు.

Image copyright MEA/INDIA

ఈ సుదీర్ఘ కథాక్రమంలో ప్రచార యుద్ధంలో ఎవరు గెలిచినా కానీ.. ఒక అంశం కీలకమైనది. ఇరువురిలో ఏ పక్షమూ యుద్ధం కోరుకున్నట్లు కనిపించటం లేదని ఎంఐటీలో రాజనీతి శాస్త్రం ప్రొఫెసర్ విపిన్ నారంగ్ అంటారు.

''ఇరు దేశాల మధ్య క్యూబా క్షిపణి సంక్షోభం తరహా సంక్షోభం తలెత్తింది. ఒకటి రెండు తప్పులతో నియంత్రించలేని స్థాయికి పరిస్థితి ఎలా పెరిగిపోతుందో అర్థం చేసుకున్నారు'' అని తాను భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.

కాబట్టి ఇరు పక్షాలూ వెనక్కు మళ్లగలిగాయంటారు. ''ఇదంతా పునరావృతం కాకుండా నివారించటానికి ఉగ్రవాదం మీద పాకిస్తాన్ చివరికి పటిష్ట చర్యలు చేపట్టవచ్చు. భారతదేశం వ్యూహాత్మక సంయమనం కొనసాగించవచ్చు'' అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు