11 ఏళ్ల బాలికకు సిజేరియన్.. తాత అత్యాచారం చేయడంతో అర్జెంటీనా బాలికకు కష్టాలు

  • 3 మార్చి 2019
అర్జెంటీనాలో అబార్షన్ల చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్న మహిళలు Image copyright EPA
చిత్రం శీర్షిక అర్జెంటీనాలో అబార్షన్ల చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్న యువతులు

అర్జెంటీనాలో అత్యాచారానికి గురయిన ఒక పదకొండేళ్ల బాలికకు శస్త్రచికిత్స ద్వారా కాన్పు చేయడం అక్కడ చర్చకు తెరతీసింది.

ఆ దేశంలో అమల్లో ఉన్న గర్భవిచ్ఛిత్తి నిబంధనలు చర్చనీయమవుతున్నాయి.

వరుసకు తాతయ్యే 65 ఏళ్ల వృద్ధుడొకరు ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడడంతో గర్భం దాల్చింది. గర్భాన్ని తొలగించుకోవాలని ఆమె నిర్ణయించుకున్నప్పటికీ అప్పటికే ఆలస్యమైంది. పైగా కొందరు వైద్యులు కూడా గర్భ విచ్ఛిత్తికి అంగీకరించలేదు.

ఆమెకు గర్భవిచ్ఛిత్తి చేయడం ప్రమాదకరమని చెబుతూ వైద్యులు శస్త్రచికిత్స ద్వారా కాన్పు చేశారు. బాలిక 23 వారాల గర్భంతో ఉన్నప్పుడు ఈ శస్త్రచికిత్స చేశారు. పుట్టిన బిడ్డ సజీవంగానే ఉన్నప్పటికీ బతికే అవకాశాలు చాలా తక్కువని వైద్యులు చెప్పారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక అబార్షన్లను చట్టబద్ధం చేయరాదంటూ యువతుల నిరసన

అయితే, బాలిక గర్భందాల్చినప్పటి నుంచి తనకు ఆ గర్భం వద్దని, అబార్షన్ చేయమని కోరుతోందని స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి.

అత్యాచారానికి గురై గర్భం దాల్చితే.. అలాంటివారి ఆరోగ్యానికి ప్రమాదం ఉన్నప్పుడు అబార్షన్ చేయించుకోవడానికి అర్జెంటీనా చట్టాలు అనుమతిస్తాయి.

కానీ, ఈ పదకొండేళ్ల బాలిక విషయంలో ఆమె సంరక్షుల కారణాంగానే అబార్షన్ ఆలస్యమైందని స్థానిక మీడియా చెప్పింది.

బాలిక తల్లి కూడా అబార్షన్‌కు అంగీకరించినప్పటికీ.. బాలిక కొద్దికాలం ఆమె బామ్మ సంరక్షణలో ఉన్నందున తల్లి అంగీకారం ఒక్కటే చాలలేదు.

బామ్మ అంగీకారం కూడా కావాల్సి వచ్చినప్పటికీ ఆమె ఎటూ తేల్చలేదు. ఆ బామ్మతో సహజీవనం చేస్తున్న వృద్ధుడే ఈ బాలికపై అత్యాచారం జరిపాడు.

చివరకు అందరి అంగీకారం లభించే నాటికి బాలిక 23 వారాల గర్భంతో ఉంది.

Image copyright Reuters
చిత్రం శీర్షిక అబార్షన్ల చట్టంలోని నిబంధనలను సడలించి సరళతరం చేయాలని కోరుతూ మహిళల ఆందోళన

కానీ, అలాంటి సమయంలో అబార్షన్ చేయడానికి వైద్యులు అంగీకరించలేదు.

ఫ్యామిలీ కోర్టు జడ్జి తీర్పు ప్రకారం అవసరమైన ప్రక్రియ నిర్వహించాలని ఆరోగ్య శాఖ అధికారులు వైద్యులకు సూచించారు.

దాంతో వైద్యులు అబార్షన్ వల్ల బాలిక ప్రాణానికి ప్రమాదం ఉంది కాబట్టి శస్త్రచికిత్స ద్వారా కాన్పు చేసి బిడ్డను బయటకు తీశారు.

దీంతో మానవ హక్కుల సంస్థలు మండిపడుతున్నాయి. సకాలంలో స్పందించకుండా నాన్చడం వల్ల బాలికకు ఇలాంటి కష్టమొచ్చిందని వారు ఆరోపిస్తున్నారు.

14 వారాల లోపు గర్భాన్ని తొలగించుకునేందుకు అబార్షన్ చేయించుకోవడాన్ని చట్టబద్ధం చేయాలా వద్దా అనే విషయమై అర్జెంటీనాలో ఆర్నెళ్లుగా పెద్ద చర్చే జరుగుతోంది. చట్టబద్ధం చేయడానికి సెనెట్‌లో ప్రవేశపెట్టిన బిల్లు ఓడిపోయింది.

ఇలాంటి సమయంలో ఈ బాలిక ఉదంతం కూడా రావడంతో మరోసారి అబార్షన్ల చట్టం అక్కడ చర్చనీయంగా మారింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)