''మైఖేల్ జాక్సన్‌ వద్ద ఉన్నప్పుడు ప్రతి రాత్రీ నన్ను లైంగికంగా వేధించాడు''

  • 3 మార్చి 2019
మైఖేల్ జాక్సన్ Image copyright Channel4
చిత్రం శీర్షిక చిన్ననాటి రాబ్సన్‌తో మైఖేల్ జాక్సన్

మైఖేల్ జాన్సన్ తమను చిన్నతనం నుంచి వందలాది సార్లు లైంగికంగా వేధించాడని ఇద్దరు పురుషులు 'బీబీసీ'కి చెప్పారు.

బీబీసీ విక్టోరికాయ డెర్బీషైర్ ప్రోగ్రాంలో వేడ్ రాబ్సన్(36) తనకు మైఖేల్ జాక్సన్ నుంచి ఎదురైన అనుభవాలను బయటపెట్టారు. తనకు ఏడేళ్లు ఉన్నప్పటి నుంచే జాక్సన్ లైంగికంగా వేధించేవారని, తనకు 14 ఏళ్ల వయసున్నప్పుడు ఒకసారి తనపై అత్యాచారానికి ప్రయత్నించారని ఆరోపించారు.

అదే కార్యక్రమంలో జేమ్స్ సేఫ్‌చక్(40) కూడా జాక్సన్‌ వల్ల ఎదురైన అనుభవాలను వివరించారు. తనకు పదేళ్లప్పటి నుంచి 14 ఏళ్ల వరకు జాక్సన్ లైంగికంగా వేధించారని ఆరోపించారు.

అయితే, జాక్సన్ కుటుంబసభ్యులు మాత్రం ఈ ఆరోపణలను తిప్పికొడుతున్నారు. ఇలాంటివాటిపై రవ్వంత కూడా ఆధారాలు లేవని కొట్టిపారేస్తున్నారు.

కాగా రాబ్సన్, సేఫ్‌చక్ 'లీవింగ్ నెవర్‌ల్యాండ్' అనే డాక్యుమెంటరీలోనూ ఇవే విషయాలు చెప్పారు.

(హెచ్చరిక: ఈ కథనంలోని కొన్ని వివరణలు కలవరపెట్టేలా ఉండొచ్చు)

చిత్రం శీర్షిక సేఫ్‌చక్, రాబ్సన్

''జాక్సన్‌ వద్ద ఉన్న ప్రతి రాత్రీ నన్ను ఆయన లైంగికంగా వేధించాడు'' అని చెప్పిన రాబ్సన్.. ''నా ఒళ్లంతా తడిమేసేవాడు. ఆయన ఇతరులతో శృంగారం చేస్తూ నన్ను చూడమనేవాడ''నీ చెప్పారు.

తామిద్దరం ప్రేమలో ఉన్నామని.. ప్రేమను వ్యక్తం చేయడానికి ఇదే మార్గమని నమ్మేలా చేసేవాడని రాబ్సన్ తెలిపారు.

అయితే, ఆ వెంటనే ఇంకో మాట కూడా చెప్పేవారని.. ''మనం ఇలాంటి పనిచేయడం కానీ ఎవరైనా చూస్తే మనిద్దరం కూడా జీవితాంతం జైల్లో ఉండాల్సిందే'' అనేవారని.. ఆ మాటలన్నీ వింటుంటే తనకెంతో భయం వేసేందని రాబ్సన్ ఆ కార్యక్రమంలో వెల్లడించారు.

ప్రపంచమంతా ఇష్టపడే గొప్ప గాయకుడు మైఖేల్ జాక్సన్‌ను తానెంతో ఇష్టపడేవాడినని రాబ్సన్ చెప్పారు.

''జాక్సన్ కూడా నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ అనేవారు. ఇలాంటి శృంగారం కూడా నీతో తప్ప ఇంకెవరితోనూ నేను చేయలేదు'' అనేవారని రాబ్సన్ చెప్పుకొచ్చారు. దాంతో ప్రపంచంలోని పిల్లలందరిలోనూ జాక్సన్ నన్నే ఎంచుకున్నారని అనుకునేవాడినని చెప్పారు.

Image copyright Getty Images

సేఫ్‌చక్ కూడా జాక్సన్‌పై ఇలాంటి ఆరోపణలే చేశారు. ''నాకు పదేళ్లు వయసున్నప్పుడు సెక్స్ ఎలా చేయాలో జాక్సన్ నాకు వివరించడంతో మొదలయ్యాయి ఆయన వేధింపులు'' అన్నారాయన.

ఫ్రెంచి కిస్‌తో మొదలుపెట్టి అన్ని రకాలుగా వేధించారని సేఫ్‌చక్ ఆరోపించారు.

జాక్సన్ పెద్ద జాదూ అన్న రాబ్సన్.. 'నా తల్లిదండ్రులకు నాకు మధ్య చిచ్చు పెట్టారు. దానివల్ల ఆయన వద్దే ఉండేలా చేసుకుని ఇవన్నీ కొనసాగించార'న్నారు.

కాగా మైఖేల్ జాక్సన్ సోదరులు టిటో, మార్లోన్, జాకీ.. సమీప బంధువు మేనల్లుడు తాజ్ జాక్సన్‌లు 'లీవింగ్ నెవర్లాండ్' డాక్యుమెంటరీలో రాబ్సన్, సేఫ్‌చక్ చెప్పినవన్నీ తప్పని ఖండిస్తున్నారు.

జాక్సన్ కొంతమందికి తేడాగా కనిపిస్తారు కానీ ఆయన చాలా అమాయకుడు.. ఆయన అమాయకత్వమే ఆయన్ను పతనం చేసిందని తాజ్ జాక్సన్ బాధపడ్డారు.

ఇలాంటి ఆరోపణల్లో ఒక్క దానికి కూడా ఆధారం లేదని మార్లోన్ అన్నారు. ''ఇద్దరు చేసే నిరాధార ఆరోపణలపై ఈ డాక్యుమెంటరీని అతుకులబొంతలా తయారు చేశారు'' అంటూ రాబ్సన్, సేఫ్‌చక్‌ల ఆరోపణలను మార్లోన్ ఖండించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)