బెల్జియంలో సైకిల్ రేసింగ్: పురుషుల కంటే వేగంగా వెళ్తున్నారన్న కారణంతో.. మహిళలను అడ్డుకున్నారు

  • 6 మార్చి 2019
మహిళను అడ్డుకుంటున్న మార్షల్స్ Image copyright Getty Images
చిత్రం శీర్షిక పురుషులను దాటేస్తున్నారన్న కారణంతో మహిళా రేసర్‌ను మార్షల్స్ అడ్డుకున్నారు

సైకిల్ రేసింగ్‌ పోటీలో పురుషుల కంటే వేగంగా వెళ్తున్నారన్న కారణంతో మహిళలను నిర్వాహకులు అడ్డుకున్నారు. తాజాగా బెల్జియంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన వన్డే రేసింగ్ పోటీల సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.

'ఓమ్‌లూప్ హెట్ న్యూజ్‌బ్లాజ్' పేరుతో మార్చి 2న పురుషులకు, మహిళలకు వేరువేరుగా సైకిల్ రేసింగ్ పోటీలు నిర్వహించారు.

123 కిలోమీటర్ల దూరం సాగిన ఈ రేసింగ్‌లో స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ మహిళా సైక్లిస్టు నికోలే హాన్సెల్మాన్‌ కూడా పాల్గొన్నారు.

మహిళల కంటే 10 నిమిషాలు ముందే పురుషుల పోటీ ప్రారంభించారు. అయితే, మహిళల రేసింగ్ ఆలస్యంగా ప్రారంభమైనా.. హాన్సెల్మాన్ అత్యంత వేగంగా దూసుకెళ్తూ 35 కిలోమీటర్ల దూరం వెళ్లేసరికి పరుషుల బృందానికి చేరువయ్యారు.

Image copyright Getty Images

అప్పటికే, మిగతా మహిళల కంటే ఆమె రెండు నిమిషాల ముందున్నారు. అయితే, పురుషుల బృందానికి, మహిళల బృందానికి మధ్య కొంత దూరం పాటించాలంటూ నిర్వాహకులు ఆమెను అడ్డుకున్నారు.

"అవకాశాలను చంపేయడం"

"దాదాపు పురుషుల దగ్గరి వరకూ వెళ్లాను. కానీ, మాకు.. పురుషులకు మధ్య కొంత దూరం ఉండాలంటూ ఆరేడు నిమిషాల పాటు నన్ను మార్షల్స్ అడ్డుకున్నారు. ఇలా అడ్డుకోవడమంటే.. మా గెలుపు అవకాశాలను చంపేయడమే అవుతుంది" అని హన్సెల్మాన్ సైక్లింగ్ న్యూస్‌తో చెప్పారు.

కొద్ది సేపటి తర్వాత ఆమెను అనుమతించారు. కానీ, అప్పటికే ఆమెలో ఆసక్తి తగ్గిపోయింది. దాంతో, ఈ పోటీలో 74 స్థానంలో నిలిచారు. డచ్ సైక్లిస్టు చంటల్ బ్లాక్ విజేతగా నిలిచారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఈ పందెంలో నికోలే హాన్సెల్మాన్‌ను అడ్డుకున్న తర్వాత డచ్ రైడర్ చంటల్ బ్లాక్ గెలుపొందారు

"తర్వాత నన్ను ముందుకెళ్లేందుకు అనుమతించారు. కానీ, ఆ తర్వాత కూడా పురుషులకు కనీస దూరం పాటించాల్సి వచ్చింది. అదొక చేదు అనుభవం. మొదట్లో పోటీలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నాను. కానీ, మార్షల్స్ అడ్డుకోవడం ద్వారా ఆ ఉత్సాహం పోయింది. అది నాకంటే వెనకున్న పోటీదారులకు అనుకూలంగా మారింది" అని హాన్సెల్మాన్ అన్నారు.

తనకు ఎదురైన ఆ అనుభవం గురించి ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లొ ఓ సరదా కామెంట్ చేశారు.

"ఈ పోటీలో మహిళలు మరీ ఎక్కువ వేగంగానైనా వెళ్లి ఉంటారు. లేదంటే పురుషులు మరీ నెమ్మదిగానైనా వెళ్లి ఉంటారు" అని చమత్కరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)