జోసెఫ్ స్టాలిన్: హిట్లర్‌నే భయపెట్టిన ఈయన హీరో మాత్రమే కాదు, నియంత కూడా

  • 5 మార్చి 2019
Image copyright HULTON ARCHIVE/GETTY IMAGES
చిత్రం శీర్షిక జోసెఫ్ స్టాలిన్

మార్చి 5 జోసెఫ్ స్టాలిన్ వర్థంతి.

సోవియట్ యూనియన్ పాలకుడు జోసెఫ్ స్టాలిన్‌ను ఒకప్పుడు కమ్యూనిస్టులు ఆదర్శ నేతగా భావించేవారు. ఆయన సోవియట్ యూనియన్‌కు ఒక పెద్ద హీరో.

కానీ, ఆయన నిజంగానే అలాంటి వారేనా? లేదా ఆయన్ను ఇప్పుడు నరమేధం చేసిన నేతగా కూడా గుర్తు చేసుకోవచ్చా?

ఆయన మొత్తం జీవితాన్ని మనం పరిశీలిస్తే, స్టాలిన్‌లో ఒక హీరోతోపాటు క్రూరమైన విలన్ కూడా కనిపిస్తారు.

స్టాలిన్ అనే పేరుకు లోహ పురుషుడనే అర్థం వస్తుంది. స్టాలిన్ గడిపిన జీవితాన్ని చూస్తే, ఆయన తన పేరును సార్థకం చేసుకున్నారనే అనిపిస్తుంది.

ఆయన రష్యాను ఎంత బలమైన దేశంగా మార్చారంటే, ఆ దేశ సైన్యం రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ సైన్యాన్నే పరుగులు పెట్టించింది. శతాబ్దంలో నాలుగో వంతు ఆయన సోవియట్ యూనియన్‌కు అతిపెద్ద నేతగా నిలిచారు.

కానీ, స్టాలిన్ పాలనలో దారుణాలు-అరాచకాలు కూడా జరిగాయని చెబుతారు. ఆయన విధానాలు, శాసనాల వల్ల లక్షల మంది చనిపోయారనే ఆరోపణలున్నాయి.

ఒక సమయంలో ప్రపంచంలోనే అత్యంత బలమైన నేతగా నిలిచిన స్టాలిన్ జీవితం ఒక సాధారణ కుటుంబం నుంచి ప్రారంభమైంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక బాల్యంలో స్టాలిన్

సాధారణ కుటుంబంలో పుట్టిన స్టాలిన్

స్టాలిన్ 1879 డిసెంబర్ 18న జార్జియాలోని గోరీలో జన్మించారు. చిన్నతనంలో ఆయన పేరు జోసెఫ్ విసారియోనోవిచ్ జుగాష్‌విలీ. ఆ సమయంలో రష్యా చక్రవర్తి జార్ సామ్రాజ్యంలో జార్జియా ఒక భాగంగా ఉండేది.

స్టాలిన్ తండ్రి చెప్పులు కుట్టేవారు. తల్లి బట్టలు ఉతికే పనిచేసేవారు. ఏడేళ్ల వయసులో స్టాలిన్‌కు మశూచి వచ్చింది. దాంతో ఆయన ముఖంపై మచ్చలు వచ్చాయి. ఆ వ్యాధితో ఆయన ఎడమ చేయి కూడా పాడైంది.

స్టాలిన్ బాల్యంలో చాలా బలహీనంగా ఉండేవారు. మిగతా పిల్లలు ఆయన్ను చాలా ఏడిపించేవారు. ఆయన తండ్రి తాగుబోతు. తరచూ స్టాలిన్‌ను కొట్టేవాడు. స్టాలిన్ పెరుగుతున్న సమయంలోనే జార్జియాలో జార్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు జ్వాలలు రాజుకుంటున్నాయి. ఆయనను జార్జియా జానపథ కథలు, రష్యా వ్యతిరేక ఆలోచనలు చాలా ప్రభావితం చేశాయి.

Image copyright HULTON ARCHIVE/GETTY IMAGES

మతాధికారి కావడంపై విముఖత

స్టాలిన్ తల్లికి మతపరమైన ఆలోచనలు ఉండేవి. ఆమె 1895లో స్టాలిన్‌ను మతాధికారిగా చేయాలని జార్జియా రాజధాని తిబిలిసి పంపించారు. కానీ స్టాలిన్‌కు మతపరమైన పుస్తకాలపై అసలు ఆసక్తి ఉండేది కాదు. ఆయన చాటుగా కార్ల్ మార్క్స్ పుస్తకాలు చదివేవారు.

స్టాలిన్ ఆ రోజుల్లో సామ్యవాద ఆలోచనాధోరణి ఉన్న సంస్థల్లో సభ్యత్వం కూడా తీసుకున్నారు. ఆ సంస్థలు రష్యా చక్రవర్తికి వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేసేవి.

తల్లి కోరికను వ్యతిరేకించిన వెళ్లిన స్టాలిన్ మతాధికారి కాలేనని స్పష్టంగా చెప్పేశారు. 1899లో ఆయన మతపరమైన స్కూలు నుంచి బయటికొచ్చేశారు.

తిరుగుబాటు ధోరణి

20వ శతాబ్దం ప్రారంభంలో స్టాలిన్ తిబిలిసి వాతావరణ విభాగంలో పనిచేయడం ప్రారంభించారు. ఆ సమయంలో ఆయన రష్యా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా తిరుగుబాటు ధోరణిని అలవర్చుకున్నారు. స్టాలిన్ తరచూ సమ్మెలు, వ్యతిరేక ప్రదర్శనల్లో పాల్గొనేవారు.

జార్ నిఘా పోలీసులకు స్టాలిన్ పనుల గురించి తెలిసిపోయింది. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన అండర్‌గ్రౌండ్‌కు వెళ్లారు. అప్పుడే స్టాలిన్ బొల్షొవిక్ పార్టీలో చేరారు. 1905లో స్టాలిన్ మొదటిసారి రష్యా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా గొరిల్లా యుద్ధంలో పాల్గొన్నారు,.

రష్యా బొల్షొవిక్ విప్లవం నేత వ్లాదిమిర్ లెనిన్‌ను స్టాలిన్ మొదటిసారి ఫిన్‌లాండ్‌లో కలిశారు. లెనిన్ ఆయన ప్రతిభను ప్రశంసించారు. 1907లో స్టాలిన్ తిబిలిసిలో ఒక బ్యాంకుకు కన్నం వేసి రెండున్నర లక్షల రూబుల్స్ దోపిడీ చేశారు. ఈ మొత్తాన్ని జార్ వ్యతిరేక ఆందోళనలకు ఉపయోగించాలనుకున్నారు.

Image copyright HULTON ARCHIVE/GETTY IMAGES

లోహ పురుషుడు స్టాలిన్

జోసెఫ్ స్టాలిన్ 1906లో కేటెవాన్ స్వానిజేను పెళ్లి చేసుకున్నారు. ఆమె ఒక చిన్న సామంతు రాజుల కుటుంబానికి చెందినవారు. పెళ్లి తర్వాత ఏడాదికి స్టాలిన్‌కు కొడుకు పుట్టాడు. తిబిలిసిలో బ్యాంక్ దోపిడీ తర్వాత స్టాలిన్ జార్జియా వదిలి పారిపోవాల్సి వచ్చింది. దాంతో ఆయన అజర్ బైజాన్‌లోని బాకూ పట్టణంలో స్థిరపడ్డారు.

పెళ్లైన ఏడాది తర్వాత 1907లోనే స్టాలిన్ భార్య కెటెవాన్ టైఫాయిడ్‌తో మృతిచెందారు. అది స్టాలిన్‌కు పెద్ద షాక్ అయ్యింది. దాంతో ఆయన కొడుకును తన అమ్మమ్మ దగ్గరే వదిలి పూర్తిగా రష్యా విప్లవానికి అంకితం అయిపోయాడు. అదే సమయంలో తన పేరును స్టాలిన్ అని మార్చుకున్నారు.

విప్లవ భావాల కారణంగా స్టాలిన్ చాలాసార్లు అరెస్ట్ అయ్యారు. 1910లో ఆయన్ను సైబీరియాకు కూడా పంపించారు.

1917లో లెనిన్ నేతృత్వంలో రష్యాలో కమ్యూనిస్ట్ విప్లవం విజయవంతమైంది. ప్రజలకు శాంతి, భూమి, ఆహారం అందిస్తానని లెనిన్ హామీ ఇచ్చారు. స్టాలిన్ ఆ విప్లవంలో కీలక పాత్ర పోషించారు. ఆయన ఆ సమయంలో బొల్షెవిక్ పార్టీ వార్తా పత్రికను నడిపేవారు.

లెనిన్‌ను జార్ సైన్యం నుంచి తప్పించి ఫిన్‌లాండ్ పారిపోయేందుకు స్టాలిన్ సాయం చేసినపుడు ఆయనకు పార్టీలో పెద్ద స్థానం ఇచ్చారు. జార్ పాలన ముగిసిన తర్వాత రష్యాలో అంతర్యుద్ధం చెలరేగింది.

అంతర్యుద్ధం సమయంలో పార్టీనుంచి పారిపోయిన వారిని, తిరుగుబాటుదారులను ఉరి తీయాలని స్టాలిన్ ఆదేశించారు. లెనిన్ అధికారంలోకి రాగానే, ఆయన స్టాలిన్‌ను కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీగా నియమించారు.

Image copyright HULTON ARCHIVE/GETTY IMAGES

రష్యా నియంతగా మారిన స్టాలిన్

1924లో లెనిన్ మృతి చెందారు. ఆ తర్వాత స్టాలిన్ తనను ఆయన వారసుడుగా ప్రకటించుకున్నారు. అయితే లెనిన్ తర్వాత లియోన్ ట్రాట్‌స్కీ ఆయన వారసుడు అవుతాడని పార్టీలో కొందరు భావించేవారు. కానీ ట్రాట్‌స్కీని చాలా మంది ఆదర్శవాదిగా భావించేవారు. ట్రాట్‌స్కీ సిద్ధాంతాలను నిజ జీవితంలో అమలు చేయడం చాలా కష్టం అనుకునేవారు.

అదే సమయంలో స్టాలిన్ తన జాతీయవాద మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని బలంగా ప్రచారం చేయడం ప్రారంభించారు. "ప్రపంచమంతా విప్లవం తీసుకురావడం కాదు, సోవియట్ యూనియన్‌ను బలంగా చేయడమే తన లక్ష్యం" అని చెప్పేవారు.

స్టాలిన్ ప్రణాళికలను ట్రాట్‌స్కీ వ్యతికేరించడంతో స్టాలిన్ ఆయన్ను దేశం నుంచి బహిష్కరించారు. 1920వ దశకం చివరికల్లా స్టాలిన్ సోవియట్ యూనియన్ నియంతగా ఆవిర్భవించారు..

Image copyright HULTON ARCHIVE/GETTY IMAGES

సోవియట్ యూనియన్ పారిశ్రామికీకరణ

20వ దశాబ్దంలో స్టాలిన్ పంచవర్ష ప్రణాళిక ద్వారా దేశాభివృద్ధికి పనిచేశారు. ఆయన సోవియట్ యూనియన్‌ను ఆధునిక దేశంగా మార్చడానికి కృషి చేశారు. సోవియట్ యూనియన్ పారిశ్రామికీకరణ కాకపోతే కమ్యూనిస్ట్ విప్లవం పనికిరాకుండా పోతుందని, దేశం నాశనమైపోతుందని, పొరుగున ఉన్న కాపిటలిస్ట్ దేశాలు దానిని ఆక్రమిస్తాయని ఆయన భావించేవారు.

స్టాలిన్ పాలనలో సోవియట్ యూనియన్ బొగ్గు, ఇంధనం, స్టీల్ ఉత్పుత్తులను చాలా పెరిగాయి. దేశంలో వేగంగా ఆర్థికాభివృద్ధి జరిగింది. స్టాలిన్ తన ప్రణాళికలను చాలా కఠినంగా అమలు చేశారు.

పరిశ్రమలకు చాలా పెద్ద పెద్ద టార్గెట్లు ఇచ్చారు. చాలాసార్లు ఈ టార్గెట్ పూర్తి చేయడం అసాధ్యం అనిపించేది. లక్ష్యాలు చేరుకోవడంలో విఫలమైనవారిని దేశద్రోహులుగా భావించి జైళ్లలో వేసేవారు.

రష్యాలో భయంకరమైన కరువు

స్టాలిన్ అధికారలోకి వచ్చినపుడు రష్యాలో చాలా భూమి చిన్న చిన్న కమతాలుగా ఉండేది. తరచూ కరువులు వచ్చేవి. పొలాల్లో చాలా తక్కువ ధాన్యం పండేది.

స్టాలిన్ వ్యవసాయం ఆధునికీకరణ ప్రారంభించారు. ఆయన మొత్తం భూమిని జాతీయకరణ చేశారు. చాలా మంది రైతులు దీన్ని వ్యతిరేకించారు. తమ పశువులను చంపి, ధాన్యం దాచేసి ఆయన్ను వ్యతిరేకించారు. దాంతో సుమారు 50 లక్షల మంది ఆకలితో చనిపోయారు.

దానితో కోపమొచ్చిన స్టాలిన్, దొంగతనంగా ధాన్యం నిల్వచేసి, తన విధానాలను వ్యతిరేకించిన రైతులను చంపించడం మొదలుపెట్టారు. దాంతో లక్షలాది రైతులు మృతి చెందారు. 30వ దశకం చివర్లో సోవియట్ యూనియన్‌లో భూమిని పూర్తిగా జాతీయీకరణ చేశారు. ధాన్యం ఉత్పత్తిని ఎన్నో రెట్లు పెంచారు.

Image copyright HULTON ARCHIVE/GETTY IMAGES

స్టాలిన్ అరాచకాలు

జోసెఫ్ స్టాలిన్ తనను తాను సున్నిత మనస్కుడినని, దేశభక్తుడినని ప్రచారం చేసుకునేవారు. కానీ సైన్యంలో అయినా, కమ్యూనిస్టు పార్టీలో అయినా ఎవరైనా తనను వ్యతిరేకిస్తే వారిని చంపించేవారు. పార్టీ సెంట్రల్ కమిటీలోని 139 మందిలో 93 మందిని స్టాలిన్ చంపించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అంతే కాకుండా సైన్యంలోని 103 మంది జనరళ్లు, అడ్మిరల్‌లో 81 మందిని కూడా ఆయన చంపించారని చెబుతారు.

స్టాలిన్ విధానాలను ఆయన నిఘా పోలీసులు చాలా కఠినంగా అమలు చేసేవారు. సామ్యవాదాన్ని వ్యతిరేకించే 30 లక్షల మందిని ఆయన సైబీరియాసోని గులాగ్ ప్రాంతానికి బలవంతంగా పంపించేసారు. దానితోపాటు సుమారు ఏడున్నర లక్షల మందిని చంపించారని చెబుతారు..

Image copyright HULTON ARCHIVE/GETTY IMAGES
చిత్రం శీర్షిక స్టాలిన్ రెండో భార్య నదెజ్జా

జర్మనీ క్యాంపులో స్టాలిన్ కొడుకు మరణం

1919లో జోసెఫ్ స్టాలిన్, నదెజ్దా ఎల్లిలుయేవాను రెండో వివాహం చేసుకున్నారు. ఆమె ద్వారా ఆయనకు స్వెత్లానా అనే కూతురు వైసిలీ అనే కొడుకు పుట్టారు. కానీ స్టాలిన్ తన రెండో భార్యతో చాలా దారుణంగా ప్రవర్తించేవారని చెబుతారు.

స్టాలిన్ ఆరెండో భార్య నదెజ్దా 1932లో ఆత్మహత్య చేసుకున్నారు. అయితే అధికారికంగా ఆమె అనారోగ్యంతో మరణించారని ప్రకటించారు.

రెండో ప్రపంచ యుద్ధం సమయంలో స్టాలిన్ మొదటి భార్య కొడుకు యాకోవ్‌ను జర్మనీ సైన్యం అరెస్ట్ చేసింది. జర్మనీ తమ బంధీలను అప్పగిస్తే యాకోవ్‌ను విడుదల చేస్తామని చెప్పింది. కానీ, దానికి స్టాలిన్ ఒప్పుకోలేదు. దాంతో, జర్మనీ యుద్ధఖైదీల క్యాంపులోనే ఉండిపోయిన యాకోవ్‌ 1943లో మృతిచెందాడు.

ఒప్పందం తర్వాత హిట్లర్ మోసం

రెండో ప్రపంచ యుద్ధం మొదలైనప్పుడు స్టాలిన్ జర్మనీ నియంత హిట్లర్‌తో ఒక ఒప్పందం చేసుకున్నారు. తూర్పు యూరప్ దేశాలను ఇద్దరూ పంచుకున్నారు.

జర్మనీ సైన్యం సులభంగా ఫ్రాన్స్‌ను స్వాధీనం చేసుకుంది. బ్రిటన్‌ కూడా వెనక్కు వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో జర్మనీ సోవియట్ యూనియన్‌పై కూడా దాడి చేయవచ్చని రష్యా సైనికాధికారులు స్టాలిన్‌ను హెచ్చరించారు. కానీ స్టాలిన్ తన సైనిక కమాండర్ల హెచ్చరికను పట్టించుకోలేదు.

1941లో జర్మనీ పోలెండ్‌ను స్వాధీనం చేసుకుంది. సోవియట్ యూనియన్‌పై కూడా భయంకరమైన దాడులు చేసింది. సోవియట్ యూనియన్‌కు చాలా నష్టం జరిగింది.

హిట్లర్ చేసిన మోసానికి స్టాలిన్‌కు చాలా కోపం వచ్చింది. కానీ, ఆయన అప్పుడు ఏ నిర్ణయం తీసుకోలేకపోయారు. ఒక గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుని తనను తాను బంధించుకున్నారు. చాలా రోజుల వరకూ సోవియట్ యూనియన్ ప్రభుత్వానికి దిశానిర్దేశం లేకుండాపోయింది. ఆ సమయంలో హిట్లర్ సైన్యం రాజధాని మాస్కో వరకూ చేరుకున్నాయి.

Image copyright HULTON ARCHIVE/GETTY IMAGES

స్టాలిన్ హిట్లర్‌ను ఓడించినప్పుడు...

జర్మనీ వరుస దాడులతో సోవియట్ యూనియన్‌ను కోలుకోలేకుండా చేసింది. దేశం పూర్తిగా ధ్వంసమయ్యే స్థితిలో ఉంది. కానీ నాజీ సైన్యంపై గెలుపు కోసం స్టాలిన్ తన దేశంలోని లక్షల మందిని ప్రాణత్యాగానికి సిద్ధం చేశారు.

1914 డిసెంబర్‌లో జర్మన్ సైన్యం రష్యా రాజధాని మాస్కోకు చాలా దగ్గరికొచ్చేశాయి. స్టాలిన్ సన్నిహితులు ఆయన్ను మాస్కో వదిలి వెళ్లిపొమ్మని చెప్పారు. కానీ స్టాలిన్ దానికి ఒప్పుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నాజీ సైన్యాన్ని ఓడించాల్సిందేనని పట్టుబట్టారు.

జర్మనీ రష్యా మధ్య యుద్ధంలో స్టాలిన్‌గ్రాడ్ పోరాటం ఒక నిర్ణయాత్మక మలుపుగా మారింది. స్టాలిన్‌ అని పేరుతో ఉండడంతో హిట్లర్ ఈ నగరంపై దాడి చేశారు. స్టాలిన్‌గ్రాడ్‌లో గెలిచి స్టాలిన్‌ను అవమానించాలని అనుకున్నారు. కానీ స్టాలిన్ తన సైన్యంతో మీరు ఒక్క అడుగు కూడా వెనక్కు వేయకూడదని చెప్పారు.

స్టాలిన్‌గ్రాడ్ యుద్ధంలో రష్యా సైన్యంలో పది లక్షలమందికి పైగా సైనికులు చనిపోయారు. చివరికి సోవియట్ యూనియన్ సైన్యం జర్మనీని ఓడించింది. ఆ తర్వాత సోవియట్ యూనియన్ హిట్లర్ సైన్యాన్ని తిరిగి జర్మనీవైపు వెనక్కు తిరిగేలా చేసింది. సోవియట్ సైన్యం, జర్మనీ సైన్యాన్ని తరుముతూ దాని రాజధాని బెర్లిన్ వరకూ వెళ్లింది.

ఇనుప తెరలో యూరప్

రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీని ఓడించడంలో స్టాలిన్ చాలా కీలక పాత్ర పోషించారు. యుద్ధం తర్వాత తూర్పు యూరప్‌లోని ఒక పెద్ద భాగాన్ని సోవియట్ సైన్యం తమ అధీనంలోకి తెచ్చుకుంది. అవి జర్మనీ రాజధాని బెర్లిన్ తూర్పు భాగాన్ని కూడా ఆక్రమించాయి.

యూరప్‌లోని అన్ని దేశాలూ సోవియట్ యూనియన్ చేతికింద ఉండాలని స్టాలిన్ అనేవారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అమెరికా, బ్రిటన్, స్టాలిన్‌ వెంట నిలిచాయి. కానీ యుద్ధం తర్వాత స్టాలిన్ విధానాలను వ్యతిరేకించి అతడికి శత్రువుగా మారాయి. స్టాలిన్ యూరప్‌లోని ఒక పెద్ద భాగాన్ని ఇనుప తెరలో బంధించారని బ్రిటన్ ప్రధాన మంత్రి విన్‌స్టన్ చర్చిల్ అన్నారు.

బెర్లిన్ గురించి బ్రిటన్-అమెరికా, సోవియట్ యూనియన్ మధ్య ఉద్రిక్తతలు ఏ స్థాయికి చేరాయంటే, తూర్పు బెర్లిన్‌లోకి అమెరికా, బ్రిటిష్ సైన్యం చొచ్చుకురాకుండా స్టాలిన్ వాటిపై నిషేధం విధించారు. దాంతో తూర్పు బెర్లిన్‌లో చిక్కుకుపోయిన తమవారి కోసం అమెరికా 11 నెలల వరకూ వాయు మార్గంలో సరుకులు పంపించింది.

కోల్డ్ వార్ మొదలైపోయింది. సోవియట్ యూనియన్ 1949 ఆగస్టు 29న తన మొదటి ఆటం బాంబు పరీక్షించింది.

Image copyright Getty Images

ఒక యుగాంతం

చివరి రోజుల్లో స్టాలిన్ అదరినీ సందేహించేవారు. ఆయన పార్టీలోని చాలా మందిని శత్రువులుగా భావించేవారు. అలా తనకు సందేహం వచ్చిన ప్రతి ఒక్కరినీ చంపించేసేవారు.

1953 మార్చి 5న గుండెపోటు రావడంతో స్టాలిన్ మృతి చెందారు. సోవియట్ యూనియన్‌లోని చాలా మంది ఆయన మృతికి విషాదం పాటించారు. ఆయనను మహా నేతగా వర్ణించారు. దేశాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లారని, హిట్లర్‌ను ఓడించడంలో కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు.

కానీ సోవియట్ యూనియన్‌లోని కొన్ని లక్షల మంది స్టాలిన్ మృతికి సంబరాలు కూడా చేసుకున్నారు. స్టాలిన్ తర్వాత నికితా ఖుశ్చేవ్ సోవియట్ యూనియన్ నేత అయ్యారు. స్టాలిన్ విధానాలను పక్కన పెట్టారు.

మొత్తం గమనిస్తే, స్టాలిన్ తన జీవితం విప్లవంతో ప్రారంభించారు. కానీ తర్వాత కరకు నియంతగా మారారు. అంటే ఆయన హీరోతోపాటూ విలన్ కూడా అనిపించుకున్నారు.

(ఇది బీబీసీ ఐవండర్ ప్రచురించిన కథనం. దీనిని ఆంగ్లంలో చదివేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం