IWD2022 అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు, ఎందుకు, ఎలా మొదలైంది? మార్చి 8నే ఎందుకు జరుపుకోవాలి?

ఫొటో సోర్స్, Getty Images
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 1981వ సంవత్సరంలో ఆస్ట్రేలియాలో ర్యాలీ నిర్వహిస్తున్న మహిళలు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి మీరు వినే ఉంటారు. ఇప్పటికే మీ వాట్సాప్, ఫేస్‌బుక్‌లకు మెసేజ్‌లు కూడా వచ్చి ఉంటాయి. ఇంతకీ ఇది ఎప్పుడు? దేని కోసం? ఇది నిజంగా వేడుకలు చేసుకునే రోజా లేక నిరసనలు తెలిపే రోజా? అంతర్జాతీయ మహిళా దినోత్సవం లాగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవం కూడా ఉందా?
దాదాపు శతాబ్దానికి ముందు నుంచే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు మార్చి 8వ తేదీని మహిళలకు ప్రత్యేక రోజుగా గుర్తిస్తున్నారు. ఎందుకో ఈ కథనంలో తెలుసుకోండి.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు ప్రారంభమైంది?
అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్మిక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చింది. దీనిని ఐక్యరాజ్య సమితి గుర్తించి, ఏటా నిర్వహిస్తోంది.
దీని పుట్టుకకు బీజాలు 1908లో పడ్డాయి. తక్కువ పనిగంటలు, మెరుగైన జీతం, ఓటు వేసే హక్కు కోసం న్యూయార్క్ సిటీలో 15 వేల మంది మహిళలు ప్రదర్శన చేశారు. ఈ మహిళల డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని అమెరికాలోని సోషలిస్టు పార్టీ 1909వ సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది.
ఈ దినోత్సవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలన్న ఆలోచన క్లారా జెట్కిన్ అనే ఒక మహిళది. కోపెన్‌హెగెన్ నగరంలో 1910లో జరిగిన 'ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్' సదస్సులో ఆమె ఈ ప్రతిపాదన చేశారు. 17 దేశాల నుంచి ఈ సదస్సుకు హాజరైన 100 మంది మహిళలు క్లారా జెట్కిన్ ప్రతిపాదనను ఏకగ్రీవంగా అంగీకరించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని తొలిసారిగా 1911లో ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాల్లో నిర్వహించారు. 2011లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ శతాబ్ది వేడుకలు కూడా జరిగాయి. సాంకేతికంగా చెప్పాలంటే.. ఈ ఏడాది జరిగేది 111వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం.
ఫొటో సోర్స్, Topical Press Agency
అంతర్జాతీయ మహిళా దినోత్సవం స్థాపకురాలు క్లారా జెట్కిన్
అయితే, 1975వ సంవత్సరంలోనే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి అధికారికంగా నిర్వహించటం ప్రారంభించింది. అంతేకాదు, ప్రతి ఏటా ఏదో ఒక ఇతివృత్తం (థీమ్)తో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. 'గతాన్ని వేడుక చేసుకోవడం, భవిష్యత్తుకు ప్రణాళికలు రచించుకోవడం' అని మొదటి థీమ్‌ను నిర్ణయించింది.
''లింగ సమానత్వం ఉన్న ప్రపంచాన్ని ఊహించండి. ఎలాంటి పక్షపాతం, మూసధోరణులు, వివక్ష లేని ప్రపంచం. భిన్నమైన, సమానమైన, అందరినీ కలుపుకుపోయే ప్రపంచం. భిన్నత్వాన్ని గుర్తించి, విలువ ఇచ్చి, వేడుక చేసుకునే ప్రపంచం. అంతా కలసి మహిళా సమానత్వాన్ని లిఖించగలం. ఉమ్మడిగా మనమంతా వివక్షను బద్దలుకొట్టగలం #BreakTheBias'' అన్నది 2022 నినాదం.
పనిచేసే వయసున్న మహిళల్లో సగం మంది మాత్రమే ప్రపంచ కార్మిక శక్తికి ప్రాతినిథ్యం వహిస్తున్నారని ఐక్యరాజ్య సమితి గణాంకాలు చెబుతున్నాయి.
సామాజికంగాను, రాజకీయాల్లోనూ, ఆర్థిక రంగంలోనూ మహిళలు ఎంత మేరకు ఎదిగారో తెలుసుకుని, వేడుక చేసుకునే రోజుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం మారిపోయింది.
వాస్తవంగా.. కొనసాగుతున్న అసమానతలపై అవగాహన పెంచేందుకు ధర్నాలు, నిరసనలు నిర్వహించటం ఈ దినోత్సవం వెనుక ఉన్న కారణం.
ఫొటో సోర్స్, AFP
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 2016లో టర్కీలో నిరసనలు తెలుపుతున్న మహిళలు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు?
మార్చి 8న. అయితే, దీనికి ఒక నిర్దిష్టమైన తేదీ ఉండాలని క్లారా జెట్కిన్ భావించలేదు.
మార్చి 8నే ఎందుకు జరుపుకోవాలి?
1917 యుద్ధ సమయంలో రష్యా మహిళలు ''ఆహారం - శాంతి'' డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు. నాలుగు రోజుల తర్వాత అప్పటి రష్యా సామ్రాట్ నికోలస్ జా 2 సింహాసనాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అప్పుడు తాత్కాలికంగా ఏర్పాటైన ప్రభుత్వం మహిళలకు ఓటు వేసే హక్కును మంజూరు చేసింది. మహిళలు ఈ సమ్మెకు దిగిన రోజు జూలియన్ క్యాలెండర్ ప్రకారం (అప్పట్లో రష్యాలో ఈ క్యాలెండర్‌నే అనుసరించేవాళ్లు) ఫిబ్రవరి 23 ఆదివారం. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం చూస్తే అది మార్చి 8వ తేదీ. అందుకే మార్చి 8వ తేదీన (ప్రపంచవ్యాప్తంగా అత్యధిక దేశాల్లో ఇప్పుడు అమలులో ఉన్నది గ్రెగోరియన్ క్యాలెండర్) అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకొంటున్నారు.
ఫొటో సోర్స్, Getty Images
మహిళా దినోత్సవం సందర్భంగా మాస్కో నగరంలో బ్యానర్లు ప్రదర్శిస్తున్న మహిళలు
అంతర్జాతీయ పురుషుల దినోత్సవం ఉందా?
ఉంది. అది నవంబర్ 19వ తేదీన. 1990వ సంవత్సరం నుంచే దీనిని పాటిస్తున్నారు. కానీ, దీనికి ఐక్యరాజ్య సమితి గుర్తింపు లేదు.
60కి పైగా దేశాల్లో అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ''పురుషులు, బాలుర ఆరోగ్యంపై దృష్టి పెట్టడం, లింగ సంబంధాలను మెరుగుపర్చడం, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడం, సానుకూల పురుష స్ఫూర్తి ప్రదాతలను ప్రచారం చేయడం'' ఈ అంతర్జాతీయ పురుషుల దినోత్సవం ఉద్దేశ్యాలు. ఈ దినోత్సవానికి కూడా ప్రతి ఏటా ఏదో ఒక ఇతివృత్తాన్ని నిర్ణయించే ప్రయత్నం చేస్తున్నారు. 2018వ సంవత్సరానికి థీమ్ ''సానుకూల పురుష స్ఫూర్తి ప్రదాతలు''.
భారతదేశంలో 2007వ సంవత్సరం నుంచి కొన్ని స్వచ్ఛంద సంస్థలు అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని జరుపుతున్నాయి.
ఫొటో సోర్స్, Getty Images
2012లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మిమోసా పూలగుత్తితో రోమ్ నగరంలో ఒక మహిళ
ప్రపంచవ్యాప్తంగా మహిళల దినోత్సవాన్ని ఎలా జరుపుకొంటారు?
అంతర్జాతీయ మహిళల దినోత్సవం రష్యా సహా చాలా దేశాల్లో జాతీయ సెలవు దినం. మార్చి 8కి ముందు, తర్వాత మూడు నాలుగు రోజుల పాటు రష్యాలో పువ్వుల కొనుగోళ్లు రెండింతలు అవుతుంటాయి.
చైనాలో మార్చి 8వ తేదీన స్టేట్ కౌన్సిల్ సిఫార్సు మేరకు చాలా మంది మహిళలకు సగం రోజు పని నుంచి సెలవు లభిస్తుంది. కానీ, ఇంకా కొన్ని సంస్థలు తమ మహిళా ఉద్యోగులకు ఈ సగం పనిదినం అవకాశాన్ని ఇవ్వట్లేదు.
ఇటలీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం లేదా 'ల ఫెస్టా డెల్ల డొన్న'ను మిమోసా అనే చెట్టుకు కాసే పువ్వులను బహూకరించి జరుపుకుంటారు. ఈ మిమోసా పువ్వులను పంచే సంప్రదాయం ఎప్పుడు ప్రారంభమైందో స్పష్టంగా తెలియదు కానీ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో రోమ్‌లో ఇది ప్రారంభమైందని భావిస్తుంటారు.
అమెరికాలో అయితే మార్చి నెల మహిళల చరిత్ర నెల. అమెరికా మహిళల విజయాలను గౌరవిస్తూ ప్రతి ఏటా అధ్యక్ష ప్రకటన వెలువడుతుంది.
ఇవి కూడా చదవండి:
- ముత్తులక్ష్మి రెడ్డి: దేశంలో తొలి మహిళా ఎమ్మెల్యే.. దేవదాసీ వ్యవస్థపై పోరాడిన మొదటి డాక్టర్
- చరిత్రలో మహిళలు: ఒక ఆటతో ఓటుహక్కును ఎలా సాధించుకున్నారు?
- పెయిన్ కిల్లర్స్: తేడా వస్తే నొప్పినే కాదు మనిషినే చంపేయొచ్చు
- క్యాన్సర్లు, గుండె పోటును దూరం చేసే ఇది వంటగదిలోనే ఉంటుంది కానీ ఎక్కువ మంది తినడం లేదు
- ఎండోమెట్రియాసిస్: లక్షణాలు ఏంటి.. ఎంత ప్రమాదకరం?
- ఎండోమెట్రియాసిస్: మహిళలకు మాత్రమే వచ్చే చికిత్స లేని ఈ నెలసరి రోగం ఏమిటి?
- సెక్స్‌పై ఆసక్తి లేదా.. అది వ్యాధి లక్షణమా..
- ఒకచోట ఉండే మహిళలకు పీరియడ్స్ ఒకేసారి వస్తాయా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)