బ్రసెల్స్ మ్యూజియం హత్యలు: 'అతడే మొదటి ఐరోపా జిహాదీ'

  • 8 మార్చి 2019
నమూష్ ఊహా చిత్రం Image copyright AFP

2014లో జరిగిన బ్రస్సెల్స్ కాల్పుల కేసులో 33ఏళ్ల ఐసిస్‌ జిహాదీ.. మెహ్దీ నమూష్ దోషిగా తేలాడు. ఫ్రాన్స్‌లో పుట్టిన మెహ్దీ నమూష్, ఐసిస్ జిహాదీగా సిరియాలో ఒక ఏడాది పాటు పని చేశాడు.

బ్రస్సెల్స్‌లోని యూదుల మ్యూజియంలో 2014 మే నెలలో ఏకే-47, ఒక హ్యాండ్ గన్‌తో మెహ్దీ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు ఇజ్రాయెల్ పర్యాటకులు, ఒక రిసెప్షనిస్ట్‌తొపాటు మరొకరు చనిపోయారు.

ఈ దాడి కోసం మెహ్దీకి ఆయుధాలు సరఫరా చేసిన వ్యక్తి కూడా దోషిగా తేలాడు. వీరిద్దరికీ శిక్ష ఖరారు కావాల్సి ఉంది.

కుట్రపన్ని, నమూష్‌ను ఈ కేసులో ఇరికించారని నమూష్ తరపు లాయర్ వాదించారు కానీ, అందుకు తగిన ఆధారాలను కోర్టుకు సమర్పించలేకపోయారు.

ఎవరీ నమూష్?

ఐసిస్ జిహాదీగా సిరియా యుద్ధంలో పాల్గొని, విధ్వంసకర దాడులు చేయడానికి తిరిగి యూరప్ వచ్చిన మొదటి యూరోపియన్ జిహాదీ మెహ్దీ నమూష్ అని న్యాయవాదులు చెబుతున్నారు.

ఫ్రాన్స్‌లో పుట్టిన, నమూష్ దొంగతనం కేసులో అయిదేళ్లు జైలు శిక్ష అనుభవించాడు. ఆ సమయంలోనే బెండ్రర్‌ అనే వ్యక్తిని కలిశాడు. జైలు జీవితంలో వీరిద్దరికీ ర్యాడికల్స్‌గా పేరుంది.

Image copyright AFP
చిత్రం శీర్షిక 2014లో విడుదల చేసిన నమూష్ చిత్రం. విచారణలో సమయంలో నమూష్‌కు ఫొటోలు తీయలేదు.

2013లో సిరియా వెళ్లి, ఐసిస్ జిహాదీగా సిరియా యుద్ధంలో పాల్గొన్నట్లు అధికారులు విశ్వసిస్తున్నారు. ఆ సమయంలోనే, 2016లో బ్రస్సెల్స్ విమానాశ్రయంలో ఆత్మాహుతి దాడికి పాల్పడి, 32 మంది ప్రాణాలు తీసిన నాజిమ్ లష్రూవీని నమూష్ కలిసినట్లు దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.

ఫ్రాన్స్‌కు చెందిన నలుగురు జర్నలిస్టులను ఐసిస్ బంధించినపుడు, వారికి నమూష్, లష్రూవీ ఇద్దరూ కాపలాగా ఉండేవారని ఆ బందీలు తెలిపారు. జర్నలిస్టులను బంధించిన కేసులో కూడా నమూష్‌ విచారణ ఎదుర్కోవలసి ఉంది.

కేసు విచారణలో భాగంగా, 81సంవత్సరాల చిలీ కళాకారుడితోపాటు, కాల్పుల్లో మరణించిన ఇజ్రాయెల్ దంపతుల పిల్లలను కూడా సాక్షులుగా ప్రవేశపెట్టారు.

కుటుంబమే లోకంగా తమ తల్లి జీవించేదని, తమ తండ్రికి కొత్త ప్రదేశాలకు వెళ్లడం చాలా ఇష్టమని ఇజ్రాయెల్ దంపతుల పిల్లలన్నారు. కాల్పుల ఘటనతో ఇద్దరూ అనాథలయ్యారు.

Image copyright Reuters
చిత్రం శీర్షిక 2014 బ్రస్సెల్స్ దాడికి ఉపయోగించిన ఆయుధాలను కోర్టుకు సమర్పించారు.

2013లో ఐసిస్ బంధించిన నలుగురు ఫ్రెంచ్ జర్నలిస్టుల్లో ఇద్దరు కోర్టులో హాజరై, తమను బంధించిన నమూష్‌ను గుర్తించారు. నమూష్ ఓ శాడిస్ట్ అని ఒక జర్నలిస్ట్ చెప్పారు.

వీలయినంత త్వరగా ఈ కేసులో తీర్పు చెప్పాలని, నమూష్ మామూలు ర్యాడికల్ కాదని, తీవ్రమైన ర్యాడికల్ భావాలున్న వ్యక్తి అని న్యాయవాది బెర్నార్డ్ మైఖెల్ జడ్జిని కోరారు. మ్యూజియంలో జరిగిన కాల్పుల ఘటన హింసాత్మకం కాకపోతే, మరి దేన్నీ హింసాత్మకం అనలేమని బెర్నార్డ్ అన్నారు.

ఈ కేసులో విదేశీ ఇంటెలిజెన్స్ ప్రమేయం.. పలు అనుమానాలకు తావిస్తోందని నమూష్ తరపు లాయర్ సెబాస్టియన్ కోర్టయ్ అభిప్రాయం. 2013లో ఇరానియన్ లేదా లెబనీస్ ఇంటెలిజెన్స్ వర్గాలు నమూష్‌ ఐసిస్‌లో చేరేలా తోడ్పడ్డాయని సెబాస్టియన్ వాదించారు.

2014లో బ్రెస్సెల్స్ నగరంలో జరిగిన దాడి ఐసిస్ చేసిన దాడి కాదని, ఇజ్రాయెల్ నిఘావర్గం(మొసాద్ ఏజెంట్స్)కు చెందిన ఆ ఇజ్రాయెల్ దంపతులు లక్ష్యంగా, ఓ అనామకుడు చేసిన దాడి అని సెబాస్టియన్ అన్నారు.

కానీ, బ్రస్సెల్స్ దాడికి, మొసాద్ ఎజెంట్స్‌కు ఎలాంటి సంబంధం లేదని న్యాయమూర్తులు తెలిపారు.

Image copyright Reuters
చిత్రం శీర్షిక విదేశీ ఇంటెలిజెన్స్ వర్గాల కుట్ర అని వాదించిన నమూష్ తరపు లాయర్.

బ్రిటిష్ జిహాదీలు కూడా నమూష్ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నాడని అనుమానించారని, యూరప్‌కు తిరిగొచ్చాక, తాను అంతవరకూ పని చేసిన నిఘా సంస్థను వీడాలని నమూష్ భావించినట్లు ఆయన లాయర్ వాదించారు.

నమూష్ యూదుల వ్యతిరేకి ఏమాత్రం కాదని, 'కాల్విన్ క్లెయిన్' అనే ఒక యూదుడి కంపెనీకి చెందిన షూస్‌ వేసుకోవడమే అందుకు ఉదాహరణ అని లాయర్ అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు