పాకిస్తాన్ అయోమయం: భారత వ్యతిరేక మిలిటెంట్ల విషయంలో ఏం చేయాలి?

  • 9 మార్చి 2019
మౌలానా మసూద్ అజార్ ఫొటోలతో ప్లకార్డులు Image copyright AFP/Getty Images
చిత్రం శీర్షిక జైషే మొహమ్మద్‌ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజార్ పాకిస్తాన్ రక్షణ నిర్బంధంలో ఉన్నాడు

ఇస్లామాబాద్ శివార్లలోని ఒక మదర్సా గేటు దగ్గర ఒక గార్డు ఉన్నాడు. ఆ యువకుడు కోపంగా కనిపిస్తున్నాడు. చేతిలో శక్తివంతమైన ఆటోమాటిక్ రైఫిల్. అతడికి ఒక కన్ను లేదు.

మదర్సా లోపల దాని నిర్వాహకుల్లో ఒకరు.. ''దీనిని జైషే మొహమ్మద్ నడుపుతున్నట్లు చెప్తుంటారు'' అని అంగీకరించారు. గత నెలలో భారత్ ఆధీనంలోని కశ్మీర్‌లో 40 మంది జవాన్లను బలితీసుకున్న పుల్వామా ఆత్మాహుతి దాడి చేసింది తామేనని ప్రకటించిన సంస్థ ఇదే. ఆ దాడితో పాకిస్తాన్ - భారత్ మధ్య సంఘర్షణ రేగింది.

అయితే.. ఆ ఆరోపణలు అవాస్తవమని సదరు మత పెద్ద చెప్పారు. నిజానికి ఇది మరో సాధారణ ఇస్లామిక్ పాఠశాల మాత్రమే అన్నారు.

కానీ.. ఆయన వెనుక గోడ మీద ఒక చిన్న పోస్టర్ ఉంది. ఇస్లామిక్ చరిత్రలోని ఒక ప్రఖ్యాత యుద్ధాన్ని ఉటంకిస్తూ ఒక నినాదం.. దానితో పాటు తుపాకుల శ్రేణి ముద్రించి ఉన్నాయి.

బయట దుమ్మరేగుతున్న వీధిలో మరొక పోస్టర్ ఉంది. కశ్మీరీ ఉద్యమానికి మద్దతుగా ఒక ప్రదర్శనకు సంబంధించిన ప్రకటన అది. దాని మీద జైషే మొహమ్మద్ జెండా ముద్రించి ఉంది.

పాకిస్తాన్‌లో తీవ్రవాదుల ''అణచివేత''లో భాగంగా.. జైషే మొహమ్మద్ సహా అనేక గ్రూపులకు అనుబంధంగా ఉన్నట్లు ఆరోపణలున్న వందలాది మత పాఠశాలలు, భవనాలను ప్రభుత్వం ఇటీవలి సంవత్సరాల్లో తన ఆధీనంలోకి తీసుకుంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక హఫీజ్ సయీద్ స్థాపించిన లష్కరే తోయిబా ఇప్పుడు జమాత్ ఉద్ దావాగా పేరు మార్చుకుందని చెప్తున్నారు

జైషే మొహమ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజార్ సోదరుడు, మరొక బంధువుతో పాటు డజన్ల మంది ఇతరులను ''ముందస్తు నిర్బంధం'' చేశారు.

అయితే.. ఇస్లామాబాద్‌లోని ఈ మదర్సాను భద్రతా బలగాల నుంచి ఏ ఒక్కరూ సంప్రదించలేదు.

అజార్ సైతం 2016 నుంచి పాకిస్తాన్‌లో రక్షణ నిర్బంధంలో ఉన్నట్లు భావిస్తుంటారు. అయినప్పటికీ అతడు తన మద్దతుదారులకు ఆడియో సందేశాలు విడుదల చేస్తూనే ఉన్నాడు.

''ఎవరికి హాని చేయటానికీ మా భూమిని ఉపయోగించరాదన్నది మా నిశ్చయం'' అని పాకిస్తాన్ హోంమంత్రి షెహ్రార్ ఖాన్ అఫ్రిది గత వారం ఆరంభంలో విలేకరులతో చెప్పారు. తాము చర్యలు చేపట్టటానికి కారణం ''బయటి నుంచి ఒత్తిడి'' కాదని.. అధికారులు అప్పటికే ఈ ప్రణాళిక రూపొందించారని ఆయన ఉద్ఘాటించారు.

కానీ.. గతంలో పాకిస్తాన్ అంతర్జాతీయ దృష్టిలో పడినప్పుడు కూడా ఇటువంటి దాడులు, నిర్బంధాలు జరిగాయి. వాటికి భారీ ప్రచారం కూడా ఇచ్చారు. అయితే ఆ తర్వాత ఆయా మసీదులు, పాఠశాలలను వాటి పాత యజమానులకు తిరిగి అప్పగించేశారు. నిర్బంధించిన వారిని విడుదల చేశారు. కారణం ''ఆధారాలు లేవు'' అని చెప్పారు.

Image copyright Reuters
చిత్రం శీర్షిక భారత్ ఆధీనంలోని కశ్మీర్‌లో తీవ్రవాదం మొదలైనప్పటి నుంచీ ఏకైక అతి పెద్ద దాడి పుల్వామాలో జరిగిన ఆత్మాహుతి దాడి

దీంతో.. ఇప్పుడు చేపట్టిన చర్యల మీద కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భారత్ లక్ష్యంగా తీవ్రవాద సంస్థలు సాగిస్తున్న కార్యకలాపాలకు పాకిస్తాన్ ప్రభుత్వం నిజంగా ముగింపు పలుకుతుందా అన్నదానిపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఆయా మిలిటెంట్ గ్రూపులకు పాక్ గూఢచార సంస్థ మద్దతు ఉందని చాలా కాలంగా నమ్ముతున్నారు.

''ఇదంతా చాలాసార్లు చూశాం'' అని భారత అధికారులు బీబీసీతో వ్యాఖ్యానించారు.

జైషే మొహమ్మద్ సంస్థను మసూద్ అజార్ 2000 సంవత్సరంలో స్థాపించాడు. ఆ ముందటి సంవత్సరమే అతడు భారత జైలు నుంచి విడుదలయ్యాడు. అతడి సహ తీవ్రవాదులు భారత విమానాన్ని హైజాక్ చేయటంతో మసూద్‌ను భారత్ విడుదల చేసింది.

1990ల్లోనే మసూద్ అజార్ పేరున్న తీవ్రవాది. అటు అఫ్గానిస్తాన్, ఇటు కశ్మీర్ సంఘర్షణలు రెండిటిలోనూ అతడికి సంబంధాలు ఉన్నాయి.

తొలినాళ్లలో జైషే జిహాదీలు ''అత్యంత శిక్షణ పొందిన వారు.. అత్యంత ప్రేరేపితులైన'' సాయుధులని పాకిస్తానీ విశ్లేషకుడు అహ్మద్ రషీద్ చెప్తున్నారు.

Image copyright AFP
చిత్రం శీర్షిక ముంబై తీవ్రవాద దాడికి సూత్రధారి లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ అని భారత అధికారులు ఆరోపిస్తున్నారు

పాకిస్తాన్‌తో వారికి బాహాటంగా సంబంధం లేకపోవటంతో.. వారి దాడులకు ఎలా స్పందించాలన్న దానికి భారతదేశం వద్ద ''స్పష్టమైన సమాధానం లేదు'' అని ఆయన వ్యాఖ్యానించారు. ఆ సంస్థలతో తమకు సంబంధం లేదని నిరాకరించే అవకాశం పాకిస్తాన్‌కు ఉందని పేర్కొన్నారు.

కశ్మీర్ లక్ష్యంగా పనిచేస్తున్న మరో తీవ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు కూడా పాకిస్తాన్ భద్రతా బలగాల మద్దతు ఉన్నట్లు భావిస్తున్నారు.

అమెరికా మీద 9/11 దాడుల తర్వాత జిహాదీ గ్రూపుల నుంచి ఉన్న ముప్పు మీద అంతర్జాతీయ సమాజం దృష్టి కేంద్రీకరించటంతో పాకిస్తాన్ జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా రెండిటినీ నిషేధించింది.

అయితే.. ఆ సంస్థల నాయకులు ఎవరినీ ఏ నేరానికీ ఎన్నడూ శిక్షించలేదు. రెండు సంస్థలూ కొత్త పేర్లు పెట్టుకున్నాయి. లష్కరే తోయిబా అనంతర కాలంలో జమాత్ ఉద్ దావాగా మారింది (అయితే తమవి వేర్వేరు సంస్థలని ఇవి రెండూ చెప్తున్నాయి.)

2007లో జిహాదీ గ్రూపులతో పాకిస్తానీ ప్రభుత్వ సంబంధం ఎట్టకేలకు విచ్ఛిన్నమైంది. ఇస్లామాబాద్‌లో భద్రతా బలగాలకు, తీవ్రవాద మద్దతుదారులకు మధ్య రక్తసిక్త పోరు దీనికి కారణం.

Image copyright Reuters
చిత్రం శీర్షిక ముంబై దాడుల సూత్రధారులపై పాక్ ఇంతరవకూ నిర్దిష్ట చర్యలు చేపట్టలేదని భారత్ తప్పుపడుతోంది

ఆ ఘర్షణ తర్వాత జిహాదీ సంస్థలు తమకుతాముగా పాకిస్తాన్ అనుకూల, ప్రతికూల శిబిరాలుగా గ్రూపులు కట్టాయి. పాకిస్తాన్ వ్యతిరేక శిబిరంలోని తీవ్రవాద సంస్థలు పాక్ భద్రతా బలగాలు, పౌరులు లక్ష్యంగా దాడులు చేస్తూ వేలాది మందిని చంపాయి.

పాక్ అనుకూల శిబిరంలోని తీవ్రవాద సంస్థలు అటు అఫ్గానిస్తాన్‌లో అమెరికా బలగాలతో, ఇటు భారత్ ఆధీనంలోని కశ్మీర్‌లో భారత బలగాలతో పోరాడటంపై దృష్టి కేంద్రీకరించే ఉన్నాయి.

జమాత్ ఉద్ దావా, జైషే మొహమ్మద్ సంస్థల నాయకులు పాకిస్తాన్ రాజ్యానికి విధేయులుగానే కొనసాగుతున్నారు. అయితే ఆ సంస్థలకు చెందిన చాలా మంది తీవ్రవాదులు.. ముఖ్యంగా జైషేకు చెందిన వారు ప్రభుత్వ వ్యతిరేక గ్రూపులకు ఫిరాయించారు.

పాకిస్తాన్ సైన్యంతో పోరాడుతున్న పాకిస్తానీ తాలిబన్ గ్రూపుకు చెందిన సీనియర్ కమాండర్ ఒకరు బీబీసీతో మాట్లాడుతూ.. జైషే సభ్యులు చాలా మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము చేస్తున్న 'జిహాద్'లో చేరారని చెప్పాడు.

అయితే చాలా మంది ఆ తర్వాత మళ్లీ మారిపోయారని.. కానీ మాజీ జైషే మిలిటెంట్లు ఇంకా పెద్ద సంఖ్యలో తమ సంస్థలోనూ, అల్‌ఖైదా వంటి ఇతర గ్రూపుల్లోనూ కొనసాగుతున్నారని అతడు వివరించాడు.

Image copyright PLANET LABS INC./HANDOUT VIA REUTERS
చిత్రం శీర్షిక పాకిస్తాన్‌లో జైషే శిబిరాలను ధ్వంసం చేశామన్న భారత ప్రకటన మీద ఈ శాటిలైట్ దృశ్యాలు ప్రశ్నలు లేవనెత్తాయి

ప్రభుత్వ వ్యతిరేక తీవ్రవాదుల సామర్థ్యాలను దెబ్బతీయటంలో పాకిస్తాన్ భద్రతా బలగాలు గణనీయంగా విజయం సాధించాయి. పాకిస్తాన్‌లో ఉగ్రవాద దాడుల్లో చనిపోయిన వారి సంఖ్య 2013లో దాదాపు 2,500 మందిగా ఉండగా 2018 నాటికి 595 మందికి తగ్గిపోయినట్లు పాకిస్తాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పీస్ స్టడీస్ గణాంకాలు చెప్తున్నాయి.

అయితే.. భారత్ మీద దాడులు కొనసాగిస్తున్నట్లు ఆరోపణలున్న జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా/జమాత్ ఉద్ దావా వంటి ప్రభుత్వ విధేయ తీవ్రవాద సంస్థల విషయంలో ఏం చేయాలన్న ప్రశ్న ఇంకా అలాగే ఉంది.

జైషే మొహమ్మద్ 2016లో భారత్ ఆధీనంలోని కశ్మీర్‌లో రెండు భారీ దాడులు చేసినట్లు భావిస్తున్నారు. ఇక 2008 ముంబై దాడులకు కుట్ర పన్నింది లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ అని భారత అధికారులు ఆరోపిస్తున్నారు. ఆ ఆరోపణలను సయీద్ నిరాకరిస్తున్నాడు.

ఆ సమయంలో పాకిస్తానీ గూఢచార సంస్థ కూడా సహకరించిందన్న ఆరోపణలు వచ్చాయి. ఆ సంస్థ ఆ ఆరోపణలను తిరస్కరించినప్పటికీ.. దాడిలో ప్రమేయం ఉందని అనుమానాలున్న వారిపై చేపట్టిన చర్యలు కూడా.. సందేహస్పదకరమైనంత నెమ్మదిగా ఉన్నాయి.

కానీ.. ఇప్పుడు భారత్‌తో సంబంధాలను మెరుగుపరుస్తామని పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ ప్రకటించిన లక్ష్యానికి ఈ మిలిటెంట్ గ్రూపుల కార్యకలాపాలు అవరోధంగా కనిపిస్తున్నాయి. అంతకన్నా ముఖ్యంగా.. తీవ్రవాద సంస్థలకు నిధులు అందకుండా చేయటంపై సరిగ్గా పనిచేయనందున ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ 'గ్రే లిస్ట్'లో పాకిస్తాన్‌ను చేర్చటానికి కారణం కావటం వల్ల ఈ సంస్థలను తమకు అవరోధంగా చూస్తుండవచ్చు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక పుల్వామా దాడి తమ పనేనని మౌనాలా మసూద్ అజర్‌‌‌కు చెందిన జైషే మొహమ్మద్ ప్రకటించింది

''గ్రే లిస్ట్''లో ఉన్న దేశంలో వ్యాపారం చేయటానికి అంతర్జాతీయ వాణిజ్య సంస్థలు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తుంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు విదేశీ పెట్టుబడులు చాలా అవసరం.

అయితే.. జైషే మొహమ్మద్, జమాత్ ఉద్ దావాలతో నేరుగా తలపడటం వల్ల మరోసారి హింస పేట్రేగే అవకాశం ఉందని పాకిస్తానీ అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

పాకిస్తానీ విశ్లేషకులు, సైనిక ప్రముఖులు కొందరు.. మిలిటెంట్ గ్రూపులతో సంబంధం ఉన్న వారిని ''ప్రధాన స్రవంతిలోకి తీసుకురావటం'' అనే ఆలోచనను గత ఏడాది ముందుకు తెచ్చారు.

ఆ తర్వాత కొంత కాలానికే జమాత్ ఉద్ దావా (లష్కరే తోయిబా) వ్యవస్థాపకుడు సయీద్ మద్దతుదారులు ఒక రాజకీయ పార్టీని స్థాపించారు. ఇమ్రాన్ ఖాన్ గెలిచిన గత ఎన్నికల్లో పోటీ చేసిన ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. అయినప్పటికీ.. జైషే మొహమ్మద్ సంస్థతో కన్నా వీరితో వ్యవహరం సులభంగా ఉండొచ్చు.

సయీద్ కొన్నేళ్లలో అంబులెన్సులు, కనీస ఆరోగ్యసేవా కేంద్రాలతో విస్తృత స్వచ్ఛంద వ్యవస్థను నెలకొల్పాడు. వాటిలో చాలా వాటిని ఇప్పుడు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోంది. అయితే.. ఆయన మద్దతుదారుల నుంచి ''ప్రతిఘటన ఎదురవుతుందన్న ఆందోళన'' అధికారులకు లేదు అని పాకిస్తాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పీస్ స్టడీస్‌కు చెందిన విశ్లేషకుడు అమీర్ రాణా పేర్కొన్నారు.

Image copyright ARIF ALI/AFP/GETTY IMAGES
చిత్రం శీర్షిక హఫీజ్ సయీద్ మద్దతుదారులు గత ఏడాది రాజకీయ పార్టీని స్థాపించారు

అయితే దీనికి విరుద్ధంగా.. ఇంకా ఎక్కువ రహస్యంగా పనిచేసే జైషే మొహమ్మద్‌ను కదిలిస్తే తలెత్తే హింస గురించి అధికారులు ఎక్కువ ఆందోళన చెందుతున్నారని ఆయన చెప్పారు. జైషే మొహమ్మద్‌ను 2002లో నిషేధించినపుడు.. నాటి పాక్ సైనిక పాలకుడు పర్వేజ్ ముషారఫ్‌ను హత్య చేయటానికి ఈ సంస్థకు చెందిన శక్తులు ప్రయత్నించాయి.

పాకిస్తాన్ సైన్యాధిపతి, కొందరు రాజకీయ నాయకుల బృందం మధ్య ఇటీవల జరిగిన ఒక ఆంతరంగిక సమావేశంలో.. తీవ్రవాదులను దారిలోకి తెస్తామని ఆ నాయకులకు సైన్యం హామీ ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు బీబీసీకి చెప్పాయి.

అయితే.. తీవ్రవాదుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని, వారినందరినీ కేవలం బలప్రయోగంతో పూర్తిగా నిర్మూలించటం సాధ్యం కాదని, కొందరినీ ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాలని సైనికాధికారులు సూచించినట్లు ఆ వర్గాలు తెలిపాయి.

ఈ సంస్థల సభ్యుల కోసం 'డీరాడికలైజేషన్' కేంద్రాలు - అంటే తీవ్రవాద ఆలోచనాధోరణిని మార్చే కేంద్రాలు - నెలకొల్పటంతో పాటు.. వారిని ఒకరకమైన 'పారామిలటరీ' బలగంగా ఉపయోగించుకోవటం సహా ఉద్యోగాలు ఇవ్వటం అనేది ప్రభుత్వ ప్రతిపాదనల్లో ఒకటిగా చెప్తున్నారు.

కశ్మీర్‌లో ''ప్రచ్ఛన్న'' శక్తులను ఉపయోగించటం ప్రతికూలాంశంగా ఉందని.. భారత్ ''మానవ హక్కుల ఉల్లంఘన''కు పాల్పడుతోందన్న ఆరోపణల మీద నుంచి అది దృష్టి మళ్లిస్తోందనే అవగాహన ఇప్పుడు పాకిస్తాన్‌లో ఉందని సీనియర్ రాజకీయ నాయకుడు ఒకరు బీబీసీతో పేర్కొన్నారు. అయితే.. తీవ్రవాదులతో సాధ్యమైతే శాంతియుతంగా చర్చించటానికి ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు.

చిత్రం శీర్షిక ఈ మసీదును ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.. కానీ పరిస్థితిలో పెద్ద మార్పు లేదు

తీవ్రవాదులతో సంబంధమున్న మదర్సాలు, మసీదులను స్వాధీనం చేసుకోవటం.. పాకిస్తాన్ ప్రభుత్వానికి మీడియాలో కొంత సానుకూల వార్తలుగా ఉంటాయి. అయితే ఆ తర్వాత వాళ్లు ఏం చేస్తారు అనేదే లెక్కలోకి వస్తుంది.

నిజంగా విచారణలు జరుగుతాయా? ఆ గ్రూపులు సరిహద్దుకు అవతల కార్యకలాపాలు నిర్వహించకుండా నిజంగా నిరోధిస్తారా? ఎంతో కాలంగా హింసకు అలవాటుపడ్డ జిహాదీలను 'ప్రధానస్రవంతిలోకి తీసుకువచ్చే' ప్రయత్నాలు.. నిజంగా వారిని హింసామార్గం నుంచి మళ్లించటమే లక్ష్యంగా ఉంటాయా? లేదంటే ఆ ప్రయత్నాలు వారికి చట్టబద్ధత కల్పించటానికి కేవలం ఒక ముసుగు గానే ఉంటాయా?

ఇస్లామాబాద్ శివార్లలోని మరో పేదరిక ప్రాంతంలో గల మరో మదర్సాను కూడా నేను సందర్శించాను. హఫీజ్ సయీద్ స్వచ్ఛంద సంస్థ జమాత్ ఉద్ దావా నుంచి ప్రభుత్వం గత ఏడాది దీనిని స్వాధీనం చేసుకుంది.

అక్కడి సిబ్బంది పాత వాళ్లే ఉన్నారు. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నాక వచ్చిన ఏకైక మార్పు.. స్థానిక ప్రభుత్వ అధికారి ఒకరు తరచుగా తనిఖీలు నిర్వహిస్తుండటమేనని వాళ్లు నాకు చెప్పారు. అంతేకాదు.. ఇంతకుముందు తమకు విరాళాల ద్వారా నిధులు వస్తే.. ఇప్పుడు ప్రభుత్వమే నిధులు అందిస్తోందని తెలిపారు.

ఆ మదర్సా వద్ద సెక్యూరిటీ గార్డు ధరించిన సంప్రదాయ సల్వార్ కమీజ్ మీద ఒక గుర్తు ఎంబ్రాయిడరీ చేసి ఉంది. అది ఇప్పుడు అధికారికంగా నిషేధించిన గ్రూపు పేరు: జమాత్ ఉద్ దావా.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు

రోహిత్ శర్మ IND vs. SA: టెస్టుల్లో తొలి డబుల్ సెంచరీ సాధించిన హిట్ మ్యాన్

మెట్రో రైలు చార్జీల పెంపుపై నిరసన: దేశ రాజధానిలో హింస.. ముగ్గురి మృతి

‘డియరెస్ట్ మోదీజీ... దక్షిణాది సినీ కళాకారులకు స్థానం లేదా?’ - ఉపాసన కొణిదెల

కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించారంటూ భారత్-పాక్ పరస్పర ఆరోపణలు

వాట్సప్‌పై రోజుకు రూ.14.5 ట్యాక్స్.. ఆందోళన చేస్తున్న జనం

టర్కీ అధ్యక్షుడి హెచ్చరిక: 'కుర్దు ఫైటర్లు ఉత్తర సిరియా నుంచి వెనక్కి వెళ్లకపోతే తలలు చిదిమేస్తాం’

#100WOMEN: పోర్న్‌హబ్‌తో కలిసి పనిచేస్తానని హాలీవుడ్ నటి బెల్లా థోర్న్ ఎందుకన్నారు...

బ్రెగ్జిట్: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు ఎదురుదెబ్బ