‘హలో.. మీరు చావబోతున్నారు.. అంతవరకూ ఈ మందులు వాడండి’

  • 10 మార్చి 2019
రోబో తెరపై వైద్యుడు Image copyright JULIANNE SPANGLER

'మీరు.. ఎక్కువ కాలం బతకరు!' అని డాక్టర్‌, తన పేషెంట్‌ కళ్లల్లోకి చూస్తూ చెప్పడం, లేదా పేషెంట్‌కు తెలియకుండా వారి కుటుంబ సభ్యుల్లో ఒకరిని పక్కకు తీసుకువెళ్లి చెప్పడం మీరు చూసుండొచ్చు లేదా వినుండొచ్చు. కానీ ఇదే విషయాన్ని ఆ పేషెంట్‌కు వీడియో కాల్‌ చేసిమరీ చెబితే? కాలిఫోర్నియాలో అదే జరిగింది.

ఎర్నెస్ట్ క్వింటానా అనే వ్యక్తి కాలిఫోర్నియాలోని కైసర్ పర్మనెంట్ మెడికల్ సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు. హాస్పిటల్‌కు చెందిన రోబో స్క్రీన్‌పై ఎర్నెస్ట్‌కు వైద్యం చేస్తున్న డాక్టర్ ప్రత్యక్షమై.. 'మీరు కొన్ని రోజుల్లో చనిపోతారు!' అని అసలు విషయం చెప్పారు.

ఆ మరునాడే 78ఏళ్ల ఎర్నెస్ట్ క్వింటానా చనిపోయారు.

ఎర్నెస్ట్ కుటుంబ మిత్రులొకరు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, 'ఒక పేషెంట్‌తో ఇలా వ్యవహరించడం భావ్యం కాదు..' అని రాశారు.

''మీ ఊపిరితిత్తులు పూర్తిగా పాడయ్యాయని రోబో తెరపై డాక్టర్ చెప్పారు. విశ్రాంతి తీసుకోవడం తప్ప, మీకు వేరే దారి లేదన్నారు. 'ఇక మీరు ఆక్సిజన్ మాస్క్ తీసేసి, సొంతంగా శ్వాస తీసుకోవడానికి ప్రయత్నించండి. చనిపోయేవరకూ ఆ మార్ఫిన్ (మత్తు మందు)ను అలానే వాడండి..' అని డాక్టర్ చెప్పారు'' అని, ఆ రోబో ఫోటోను ఎర్నెస్ట్ కుమార్తె ఫ్రెండ్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

Image copyright Facebook/Annalisia Wilharm
చిత్రం శీర్షిక 'ఇక మీరు ఆ ఆక్సిజన్ మాస్క్ తీసేసి, శ్వాస తీసుకోవడానికి ప్రయత్నించండి. చనిపోయేవరకూ ఆ మార్ఫీన్ (మత్తు మందు)ను అలానే వాడండి..'

ఆమె బీబీసీతో మాట్లాడుతూ.. ''వైద్యం, టెక్నాలజీ కలయిక ఎంతటి దుర్మార్గానికి దారితీసిందో చూడండి.. వైద్యంలో టెక్నాలజీ అభివృద్ధి చెందడం అద్భుతం. కానీ, దాని పరిధి ఎంతవరకు ఉండాలి అన్నదానిపై స్పృహ ఉండాలని నేను భావిస్తున్నా'' అన్నారు.

ఎర్నెస్ట్ విషయంలో జరిగినదానికి పశ్చాత్తాప పడుతున్నట్లు హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది. రోబో తెరపై డాక్టర్ ఈ విషయాన్ని చెబుతున్నపుడు అక్కడేవున్న ఎర్నెస్ట్ మనవరాలు బీబీసీతో మాట్లాడుతూ.. 'నేను ఏడవకుండా ఉండేందుకు చాలా ప్రయత్నించా' అన్నారు.

''తల పైకెత్తి చూస్తే ఎదురుగా రోబో ఉంది. దాని స్క్రీన్‌పై డాక్టర్ కనిపించాడు. ఆయన ఎక్కడో ఓ గదిలో, కుర్చీలో కూర్చుని చెప్పడం మొదలుపెట్టాడు.. 'ఎమ్ఆర్ఐ రిపోర్ట్స్ వచ్చాయి. మీ లంగ్స్ పూర్తిగా పాడయ్యాయి. ఏమీ చేయలేం' అన్నాడు. నా గుండె బద్ధలైంది. ఏడ్వకుండా, గట్టిగా అరవకుండా కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించాను. అప్పుడు ఆ గదిలో నేను, తాతయ్య మాత్రమే ఉన్నాం'' అని ఎర్నెస్ట్ మనవరాలు బీబీసీతో అన్నారు.

ఈ విషయమై ఎర్నెస్ట్ భార్య హాస్పిటల్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. కానీ 'ఇది మా పాలసీ...' అని ఓ నర్స్ ఆమెతో అన్నారు.

'మేం చింతిస్తున్నాం..!'

పేషెంట్లతో పరోక్షంగా సంప్రదించినపుడు ఆ గదిలో ఓ నర్స్ లేదా డాక్టర్ ఉండాలన్నది మా పాలసీ అని హాస్పిటల్ వైస్ ప్రెసిడెంట్ మైఖెల్ గాస్కిల్-హేమ్స్ ఓ ప్రకటన విడుదల చేశారు.

''డాక్టర్, పేషెంట్ మధ్య ఉండే మానవ సంబంధాల స్థానంలో టెక్నాలజీని వాడాలని మా ఉద్దేశం కాదు. ఎర్నెస్ట్ కుటుంబ సభ్యుల బాధను అర్థం చేసుకోగలం. మేం వారి అంచనాలను అందుకోలేకపోయాం. ఈ సంఘటన ద్వారా, టెలీ-వీడియో వాడకాన్ని విశ్లేషించుకుంటాం'' అని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)