ఉత్తర కొరియా: ఎన్నికల్లో వందకు వంద శాతం పోలింగ్.. పోటీ చేసేవాళ్లంతా గెలుపు

  • 10 మార్చి 2019
కిమ్ జాంగ్ ఉన్ Image copyright Getty Images

అభ్యర్థుల మధ్య పోటీ లేని ఎన్నికలను చూశారా? ఓటు వేయడానికి వెళితే, బ్యాలెట్ పేపర్‌మీద ఒకే అభ్యర్థి పేరు ఉంటే మీరు ఎవరికి ఓటేస్తారు? ఏమిటీ ప్రశ్నలు అనుకుంటున్నారా? అలాంటి ఎన్నికలే ఉత్తర కొరియాలో జరుగుతున్నాయి.

ఉత్తర కొరియాలో ఎన్నికల మాట నిజమేకానీ, ఆ ఎన్నికలు.. రబ్బర్ స్టాంప్‌లా పని చేసే పార్లమెంటును ఎన్నుకోవడానికి. అధ్యక్షుడు మాత్రం ఆయనే.. కిమ్ జాంగ్ ఉన్!

కిమ్ అధికారంలోకి వచ్చాక, రెండోసారి ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల ద్వారా 'సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ' సభ్యులను ఎన్నుకుంటారు.

ఉత్తర కొరియాలో ఈ ఎన్నికలు మాత్రం తప్పనిసరి. కానీ అభ్యర్థుల పట్ల ఓటర్ల అభిప్రాయాలకు విలువ ఉండదు. అయినా పోలింగ్ మాత్రం దాదాపు 100%కు దగ్గరగా ఉంటుంది.

ఉత్తర కొరియాలో కిమ్ కుటుంబ పాలన సాగుతోంది. కిమ్ కుటుంబం పట్ల, అధ్యక్షుడి పట్ల అక్కడి ప్రజలు భక్తి, విధేయత కలిగి ఉండాలి.

Image copyright Getty Images

ఈ ఎన్నికలు ఎలా ఉంటాయి?

ఎన్నికల రోజున 17ఏళ్ల యువకుల నుంచి పెద్దవారి వరకూ అందరూ తమ ఓటుహక్కును తప్పకుండా వినియోగించుకోవాలి.

''తమ విధేయతకు చిహ్నంగా ఉదయాన్నే ఓటేయడానికి వెళ్లాలి. ఎక్కడ చూసినా పెద్దపెద్ద క్యూ లైన్లు ఉంటాయి'' అని దక్షిణ కొరియాకు చెందిన విశ్లేషకులు ఫియోదర్ తెర్తిత్స్కీ అన్నారు.

''తనవంతు రాగానే, ఓటరు చేతికి ఓ బ్యాలెట్ పేపర్ ఇస్తారు. దానిపై ఒకేఒక అభ్యర్థి పేరుంటుంది. ఆ పేరు మినహా అందులో 'టిక్' చేయడానికి కానీ, అభ్యర్థిని వ్యతిరేకిస్తున్నట్లు 'ఇన్‌టూ మార్క్' చేయడానికి కానీ ఎలాంటి ఆప్షన్స్ ఉండవు. ఆ పేపరు తీసుకుని బ్యాలెట్ బాక్సులో వేయాలి. ఆ బాక్సును కూడా అందరికీ కనిపించేలా బహిరంగంగా ఉంచుతారు.

అలాకాకుండా గోప్యంగా ఓటేయడానికి ప్రత్యేక పోలింగ్ బూత్‌లు కూడా ఉంటాయి. కానీ అక్కడ ఓటు వేస్తే, అధికారులు, పోలీసులకు మీపై అనుమానాలు పెరుగుతాయి'' అని విశ్లేషకులు చెబుతున్నారు.

బ్యాలెట్ పేపరులోని వ్యక్తిని వ్యతిరేకించడానికి సైద్ధాంతికంగా ఓటర్లకు హక్కు ఉంటుంది. కానీ అలా చేస్తే వెంటనే ఆ వ్యక్తిపై నిఘా పెరుగుతుంది. పోలీసులు ఆ వ్యక్తిని నీడలా వెంటాడతారని తెర్తిత్స్కీ చెబుతున్నారు.

Image copyright Getty Images

అక్కడితో పని పూర్తవ్వదు. ఓటేశాక, తమ ఓటు హక్కును వినియోగించుకున్నందుకుగాను.. సంబరాలు చేసుకుంటున్న సమూహంతో కలిసి, తెలివైన నాయకత్వాన్ని ఎన్నుకున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేయాలి.

''పోలింగ్ బూత్‌ల వద్ద సంబరాలు చేసుకుంటున్న ప్రజలను చూపిస్తూ, అది ఓ పండుగలా ఆ దేశ జాతీయ మీడియా చిత్రిస్తుంది'' అని ఎన్.కె.న్యూస్ వెబ్‌సైట్‌కు చెందిన మిన్యోంగ్ లీ అన్నారు.

ఈ ఎన్నికల ద్వారా, అధికారులు.. అక్రమంగా చైనాకు పారిపోయినవారిని నియోజకవర్గాలవారీగా గుర్తించడానికి వీలవుతుంది కూడా.

ఈ పార్లమెంటు అధికారాలు ఏవి?

ఉత్తర కొరియా పార్లమెంటు రబ్బర్ స్టాంప్ వంటిది. అధికారాలేవీ ఉండవు. ప్రతి ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల తర్వాత, 'సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ' ఏర్పడుతుంది.

''ఉత్తర కొరియా పార్లమెంటుకు చాలా తక్కువ అధికారాలు ఉన్నాయని అప్పుడపుడూ అంతర్జాతీయ మీడియా చెబుతుంటుంది. కానీ అది అబద్ధం. ఈ పార్లమెంటుకు అధికారాలు తక్కువ ఉండటం కాదు.. సున్నా అధికారాలని చెప్పొచ్చు'' అని తెర్తిత్స్కీ అన్నారు.

దేశంలోని చట్టాలను పార్టీయే రూపొందిస్తుంది. ఆ చట్టాలకు పార్లమెంటు ఆమోదం అన్నది నామమాత్రమే. పార్లమెంటు సభ్యులు కూడా ఎప్పుడోకానీ సమావేశమవ్వరు.

Image copyright Getty Images

ఇతర రాజకీయ పార్టీలు ఉన్నాయా?

పార్లమెంటులో ఒకేఒక పార్టీ ఉంటుందనుకుంటున్నారా? కాదు.. మూడు పార్టీలు ఉన్నాయి. అందులో కిమ్ జాంగ్ ఉన్‌ చైర్మన్‌గా ఉన్న ‘వర్కర్స్ పార్టీ’తోపాటు సోషల్ డెమొక్రటిక్ పార్టీ, ‘చోందోయిస్ట్ చోంగూ’ పార్టీలు కూడా పార్లమెంటులో కొన్ని సీట్లు కలిగివున్నాయి.

కానీ వాస్తవానికి ఈ మూడు పార్టీలకు పెద్ద వ్యత్యాసం ఉండదు. 'డెమొక్రటిక్ ఫ్రంట్' పేరుతో ఈ పార్టీలన్నీ కొరియా 'పునరేకీకరణ' కోసం పనిచేస్తాయి.

ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి?

ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠగా గోళ్లు కొరుక్కుంటూ ఎదురు చూడాల్సిన పనిలేదు. ఫలితాలకంటే ముందు పోలింగ్ శాతాన్ని ప్రకటిస్తారు. 2014లో పోలింగ్ శాతం 99.97% నమోదైంది. అనారోగ్య కారణాలతో కొందరు ఓటు వేయలేకపోయి ఉండొచ్చు.

'ఉత్తర కొరియా ఎన్నికల రోజున ఒక్కరు కూడా చావరు. అందరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు..' అని ఓ జోక్ ప్రాచుర్యంలో ఉంది.

ఆ తర్వాత మొదటగా కిమ్ జాంగ్ నియోజకవర్గ ఫలితాలు ప్రకటిస్తారు. ఆయన నియోజకవర్గంలో పోలింగ్ శాతం, ప్రజల మద్దతు రెండూ 100% ఉండటం సాధారణమే.

ఆ తర్వాత మిగతా అభ్యర్థుల ఫలితాలు ప్రకటిస్తారు. వీరి నియోజకవర్గాల్లో పోలింగ్ శాతంలో కాస్తంత తేడా ఉన్నా, ప్రజల మద్దతు మాత్రం అందరికీ 100శాతమే.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు

రాయల్‌ వశిష్ట: గోదావరిలో 300 అడుగుల లోతులో మునిగిన బోటును ఎలా బయటకు తీశారంటే..

#100WOMEN: ‘మహిళ 'అందం' అనే భారాన్ని మోయాల్సిన అవసరం ఏముంది’

బ్యాంకుల విలీనాన్ని ఉద్యోగులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు

ఇన్ఫోసిస్: సీఈఓ, సీఎఫ్ఓ‌లపై వచ్చిన ఆరోపణలపై విచారణను ప్రారంభించిన ఐటీ సంస్థ

గోదావరిలోంచి బయటపడ్డ రాయల్‌ వశిష్ట బోటు.. మృతదేహాల కోసం కొనసాగుతున్న గాలింపు

ఆల్కహాల్‌తో చేతులు కడుక్కునే నిరంకుశ నియంత.. నికొలస్ చాచెస్కూ

చెడ్డ విధానాలను ప్రొఫెషనల్‌గానే విమర్శిస్తా.. నాకు రాజకీయాలేవీ లేవు - అభిజిత్ బెనర్జీ

భారత క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర - దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్