సంఝౌతా ఎక్స్‌ప్రెస్: నా ఐదుగురు పిల్లలు కళ్లముందే సజీవదహనం అయ్యారు

  • 12 మార్చి 2019
సంఝౌతా ఎక్స్‌ప్రెస్
చిత్రం శీర్షిక పిల్లల ఫొటోలను చూపిస్తున్న రానా షౌకత్ భార్య రుక్సానా

పాకిస్తాన్ సెంట్రల్ పంజాబ్‌లోని ఫైసలాబాద్ నగరాన్ని పారిశ్రామిక నగరంగా చెబుతారు. ఇక్కడ న్యూ మురాద్ కాలనీలో ఉన్న ఒక మురికి వాడలో రానా షౌకత్ చిన్న దుకాణం నడుపుతుంటారు.

ఆ షాపు ఒక రెండతస్తుల ఇల్లు. అదే ఇంట్లో షౌకత్ తన భార్య, ఇద్దరు కూతుళ్లతో ఉంటున్నారు.

రానా షౌకత్ తన దుకాణం షట్టర్ వేస్తూ "నాకు ఈ షాపు మీద ఎలాంటి ఆసక్తీ లేదు. ఏదో ఒక విధంగా పొద్దుపోవాలని ఇక్కడ ఉంటా" అన్నారు.

సుమారు 12 ఏళ్ల క్రితం దిల్లీలో జరిగే బంధువుల పెళ్లి కోసం రానా షౌకత్ తన కుటుంబంతో కలిసి భారత్ వచ్చారు. ఆ తర్వాత సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో తిరిగి స్వదేశానికి వెళ్తున్నారు. అప్పుడు షౌకత్‌తోపాటు భార్య, ఆరుగురు పిల్లలు ఉన్నారు.

ఆ ప్రయాణం సవ్యంగా జరిగుంటే, వాళ్లు తర్వాత రోజు ఉదయం అటారీ చేరేవారు. అయితే, అర్థరాత్రి రైలు పానిపత్‌లోని దీవానా దగ్గర వెళ్తున్నప్పుడు వారున్న కోచ్‌లో పేలుడు జరిగింది.

చిత్రం శీర్షిక రానా షౌకత్, రుక్సానా

ఐదుగురు పిల్లల సజీవ దహనం

రానా షౌకత్ తన భార్యతో కలిసి రైలు నుంచి దూకేశారు. కానీ ఐదుగురు పిల్లలు కోచ్‌లోనే ఉండిపోయారు. వారందరూ ఆయన కళ్ల ముందే సజీవదహనం అయ్యారు.

ఆనాటి ఘోర ప్రమాదం గురించి చెప్పిన రానా "నాకు ఆరోజు చాలా అసౌకర్యంగా ఉంది. ఇద్దరు వెళ్లి కోచ్‌లో టికెట్ కలెక్టర్‌ను కలిశారు. వాళ్లకు పాస్‌పోర్ట్ లేదు" అని కాస్త ఆగి మళ్లీ ఆ రోజును గుర్తు చేసుకునే ప్రయత్నం చేశారు.

"నేను ఆరోజు చాలా అలసిపోయున్నా, ఎందుకంటే పిల్లల్ని కూచోబెట్టడానికి, సామాన్లు పెట్టడానికి చాలా కష్టమైపోయింది. కళ్లు మూతలు పడుతుండడంతో నేను నా సీటులోకి తిరిగి వెళ్లి పడుకున్నా" అన్నారు షౌకత్.

"అర్థరాత్రి వింతగా ఉన్న ఒక గొంతు వినిపించింది. నేను కాసేపు వారి మాటలు వినాలని ప్రయత్నించా, కానీ వారి మాటలు రైలు శబ్దంలో కలిసిపోయాయి" అన్నారు.

ఆరోజు షౌకత్‌కు ఏదో విరిగిపడ్డట్టు అనిపించింది. కానీ ఆయన లేచి చూడలేదు. పూర్తిగా కంబళి కప్పుకుని నిద్రపోడానికి ప్రయత్నించారు.

చిత్రం శీర్షిక ప్రమాదం జరగకముందు పిల్లలతో షౌకత్

తలుపు తెరవగానే చెలరేగిన మంటలు

"కొన్ని నిమిషాల తర్వాత ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపించింది. దాంతో నేను కంబళి తీశాను. లేచి చూడాలనుకుంటే ఏం కనిపించడం లేదు. అప్పటికే రైల్లో లైట్లు ఆరిపోయాయి".

"ఎలాగోలా నా బెర్త్ నుంచి లేచాను. అంతా చీకటిగా ఉంది. తలుపు తెరిస్తే గాలి వస్తుందని, రైలు తలుపు దగ్గరికి వెళ్లడానికి ప్రయత్నించాను" అని షౌకత్ చెప్పారు.

షౌకత్ రైలు తలుపు తెరవగానే.. కోచ్‌లోకి గాలి వేగంగా వచ్చింది. దాంతో మంటలు పెట్టె అంతా వ్యాపించాయి. ఆ మంటల నుంచి ప్రాణాలు కాపాడుకోడానికి షౌకత్ రైలు నుంచి దూకేశారు. ఆ తర్వాత ఆయన భార్య రుక్సానా కూడా కూతురు అక్సాను తీసుకుని కిందికి దూకేశారు.

"మేం సాయం కోసం ఏడుస్తున్నాం, ఎవరైనా మా పిల్లల్ని కాపాడండి అని అరుస్తున్నాం. సాయం చేయడానికి వచ్చేలోపే నా పిల్లలు కాలి బూడిదైపోయారు" అని షౌకత్ చెప్పారు.

ఆ మాట చెప్పగానే బాధతో షౌకత్ గొంతు పూడుకుపోయింది. నా పక్కనే కూర్చున్న ఆయన భార్య రుక్సానా ఏడుస్తున్నారు.

"నా ముఖం, చేతులు కాలిపోయాయి. నడుస్తున్న రైలు నుంచి దూకడంతో మోకాళ్లపై చర్మం కొట్టుకుపోయింది. అసలు పైకి లేవలేకపోయా. కోచ్ అగ్నిగోళంలా మండుతోంది. నేను ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో అలాగే చూస్తూ ఉండిపోయా" అన్నారు షౌకత్.

ఆయన మాటల మధ్యలో రుక్సానా ఏడుపును ఆపుకోలేకపోయారు.

చిత్రం శీర్షిక పిల్లల సమాధుల దగ్గర షౌకత్

నా బిడ్డల ఎముకలే ఇచ్చారు

తర్వాత షౌకత్, ఆయన భార్యను సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ వారికి ఒక వారంపాటు చికిత్స అందించారు. పిల్లల మృతదేహాలు లేకుండా భారత్ నుంచి తిరిగి వెళ్లడానికి షౌకత్, ఆయన భార్య నిరాకరించారు. కొన్ని రోజుల తర్వాత వారికి పిల్లల మృతదేహాలను ఇచ్చారు.

జరిగింది మొత్తం చెబుతున్నప్పుడు.. ఆ ఘటన రుక్సానా కళ్ల ముందే కనిపిస్తున్నట్టు అనిపించింది.

"మృతదేహాలుగా మాకు ఎముకలు మాత్రమే ఇచ్చారు. మేం మా పిల్లలు వేసుకున్న బట్టల ముక్కలు చూసి వారి మృతదేహాలను గుర్తించాం. నేను పూర్తిగా షాక్‌లో ఉన్నా. నా ప్రపంచమంతా నా కళ్ల ముందే కూలిపోయినట్టు అనిపించింది. మేం జీవచ్ఛవాల్లా అయిపోయాం" అన్నారు.

షౌకత్, రుక్సానాల పెద్ద కూతురు ఆయేషాకు అప్పుడు 16 ఏళ్లు.

"నా పెద్ద కూతురికి సంప్రదాయం ప్రకారం పూర్తి లాంచనాలు పాటించాలని సహాయ కార్యక్రమాలలో ఉన్న వారికి చెప్పాను. ఆమె మృతదేహాన్ని తీసే ముందు దానిపై గుడ్డ కప్పాలన్నాను" అని రుక్సానా చెప్పారు.

ఏడుపు ఆపుకోలేకపోయిన రుక్సానా మధ్యలో మాట్లాడలేకపోతున్నారు. ఆమె తన కన్నీళ్లు తుడుచుకుంటూనే "నేను.. ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లను పోగొట్టుకున్నాను. ఎవరి ఇళ్లలో అయినా పెళ్లిళ్లు జరగడం చూసినపుడు నాకు లోపల చాలా బాధగా ఉంటుంది. నా పిల్లలందరూ ఉండుంటే ఇప్పటికి ఎంత పెద్దవాళ్లుగా ఉండేవారో" అన్నారు.

ఐదు శవపేటికలతో తిరిగి పాకిస్తాన్‌ చేరారు

షౌకత్ ఆయన భార్య ఐదు శవపేటికలతో తిరిగి పాకిస్తాన్ బయల్దేరారు. ఫైసలాబాద్‌లోని ఒక స్మశానంలో వాటిని ఖననం చేశారు.

పిల్లల సమాధుల దగ్గరకు వెళ్లడం వారు ఎప్పుడూ మర్చిపోరు. అక్సా ఈ ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఆమెకు ఇప్పుడు 15 ఏళ్లు. కొన్నేళ్ల తర్వాత రుక్సానా మరో పాపకు జన్మనిచ్చారు.

వారి చిన్నకూతురు ఖదీజాకు అమ్మనాన్నల ఆ బాధ గురించి అసలు తెలీదు. ఇప్పుడు షౌకత్, రుక్సానా జీవితానికి ఆ ఇద్దరు పిల్లలే తోడుగా నిలిచారు. కానీ, తల్లిదండ్రుల మనసులో ఇప్పటికీ మండుతున్న ఆ గాయాన్ని మాత్రం మాన్పలేకపోయారు.

భారత్, పాకిస్తాన్ ప్రభుత్వాల నుంచి తమకు ఆర్థిక సాయం అందిందని షౌకత్ చెప్పారు. కానీ ఈ కేసులో ప్రత్యక్ష సాక్షిగా హాజరు కావాలని భారత ప్రభుత్వం తనను ఎప్పుడూ సంప్రదించలేదన్నారు.

Image copyright Getty Images

సంఝౌతా ఎక్స్‌ప్రెస్ పేలుడు కేసు విచారణ

సోమవారం సంఝౌతా ఎక్స్‌ప్రెస్ పేలుడు కేసును విచారించిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక న్యాయస్థానం తీర్పును మార్చి 14 వరకూ రిజర్వ్ చేసింది.

ఒక పాకిస్తాన్ పౌరుడు ఈ కేసులో సాక్ష్యం ఇవ్వాలని అనుకుంటున్నారని ఒక లాయర్ పిటిషన్ వేశారు. అందుకే ఈ తీర్పును రిజర్వ్ చేశారని బీబీసీ ప్రతినిధి అరవింద్ ఛాబ్డా తెలిపారు.

సంఝౌతా ఎక్స్‌ప్రెస్ భారత్-పాకిస్తాన్ మధ్య వారానికి ఒకరోజు నడుస్తుంది.

Image copyright Getty Images

2007 ఫిబ్రవరి 18న ఈ రైలులో పేలుడు జరిగింది. ఈ ఘటనలో 68 మంది మృతి చెందారు. ఇందులో ఎక్కువ మంది పాకిస్తాన్ పౌరులే.

ఈ కేసులో ఎన్ఐఏ 290 మంది సాక్షులను విచారించింది. ముస్లింలే లక్ష్యంగా చేసుకుని ఈ పేలుడు జరిపారని తమ చార్జిషీటులో తెలిపింది. ఈ పేలుడు పానిపత్‌లోని దీవానీ గ్రామం దగ్గర జరిగింది.

హిందుత్వ సంస్థ 'అభినవ భారత్' సభ్యుడు అసీమానంద్‌కు ఈ పేలుడుతో ప్రమేయం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఛార్జిషీటులో లోకేశ్ శర్మ, సునీల్ జోషి, సందీప్ డాంగే, రామచంద్ర కాలసాంగరా పేర్లున్నాయి.

12 ఏళ్ల క్రితం ఆ రోజు రాత్రి ఈ రైలు దిల్లీ నుంచి పాకిస్తాన్‌లో ఉన్న లాహోర్ వెళ్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు

పాకిస్తాన్‌ను టార్గెట్ చేసిన మోదీ.. ‘సొంత దేశాన్నే చూసుకోలేకపోతున్న వారు, భారత్‌లో ఏం చేసినా ఇబ్బంది పడిపోతున్నారు’

'మా అమ్మను, తోబుట్టువులను నా ముందే చంపేశారు.. చనిపోయినట్లు నటించి నేను బయటపడ్డా'

కళ్లు కనిపించవు, చెవులు వినిపించవు... అయినా 130కి పైగా దేశాలు చుట్టేశారు ఈయన

ప్రెస్ రివ్యూ: 'బాహుబలి' తీయకపోతే 'సైరా' వచ్చేది కాదు: చిరంజీవి

Howdy Modi: ‘ట్రంప్ కోసం ఎన్నికల ప్రచారం చేసిన పీఎం మోదీ’ - కాంగ్రెస్ పార్టీ విమర్శ

అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ పెచ్చు ఊడిపడి మహిళ మృతి

హూస్టన్‌లో మోదీ సభా ప్రాంగణం ఎదుట ఆర్టికల్ 370 సవరణకు వ్యతిరేకంగా నిరసనలు

గులాలాయీ ఇస్మాయిల్: పాకిస్తాన్ నుంచి అమెరికా పారిపోయిన మానవహక్కుల కార్యకర్త