IND vs AUS: భారత్ ఆర్మీ క్యాప్‌లపై ఐసీసీకి పాకిస్తాన్ ఫిర్యాదు

  • 12 మార్చి 2019
ఆర్మీ టోపీలతో ధోనీ, కోహ్లీ Image copyright Getty Images
చిత్రం శీర్షిక భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రస్తుత వికెట్ కీపర్ అయిన ఎంఎస్ ధోనీ ఇండియన్ ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ కూడా

ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఈనెల 8వ తేదీ శుక్రవారం రాంచీ (ఝార్ఖండ్‌)లో జరిగిన మూడో వన్డేలో ఆర్మీ తరహా 'కామఫ్లాజ్' టోపీలను టీమిండియా క్రీడాకారులు ధరించడంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఈ క్యాప్‌లు ధరించిన టీమిండియా ఆటగాళ్లపై చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి లేఖ రాసింది.

ఫిబ్రవరి 14న జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్‌పీఎఫ్ జవాన్ల గౌరవార్థం భారత క్రీడాకారులు ఈ టోపీలు ధరించారని భారత్ ప్రకటించింది. ఈ దాడికి పాల్పడింది తామేనని పాకిస్తాన్‌కు చెందిన జైషే మొహమ్మద్ ప్రకటించుకుంది.

Image copyright Getty Images

మిలటరీ క్యాప్‌ల వాడకంపై మ్యాచ్‌కు ముందే ఐసీసీని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సంప్రదించింది. విరాళాల సేకరణ కార్యక్రమాల్లో భాగంగా దీనికి ఐసీసీ కూడా అనుమతి ఇచ్చింది.

''చనిపోయిన సైనికుల స్మృత్యర్థం నిధుల సేకరణ కార్యక్రమంలో భాగంగా టోపీలను ధరించేందుకు అనుమతి ఇవ్వాలని ఐసీసీని బీసీసీఐ కోరింది. ఐసీసీ అనుమతి ఇచ్చింది'' అని ఐసీసీ అధికార ప్రతినిధి చెప్పారు.

ఆస్ట్రేలియా 32 పరుగులతో విజయం సాధించిన ఈ మ్యాచ్‌ ద్వారా తమకు లభించిన ఫీజును భారత ఆటగాళ్లు ఆత్మాహుతి దాడిలో మృతి చెందిన జవాన్ల కుటుంబాలకు విరాళం ఇచ్చారు.

Image copyright Getty Images

కాగా, భారత్ ''రాజకీయాల కోసం క్రికెట్‌ను వాడుకునేందుకు ప్రయత్నించింది'' అని పీసీబీ ఛైర్మన్ ఎసాన్ మణి అన్నారు. అందుకే భారత జట్టు ఆర్మీ క్యాప్‌ల వినియోగాన్ని వ్యతిరేకిస్తూ ఐసీసీకి లేఖ రాసినట్లు తెలిపారు.

''ఐసీసీకి మా వైఖరిని గట్టిగా చెప్పాం. మా ఉద్దేశ్యం గురించి ఇప్పుడు ఐసీసీకి ఎలాంటి అనుమానాలు కానీ, గందరగోళం కానీ లేవు'' అని ఆయన రిపోర్టర్లతో అన్నారు.

''క్రికెట్ ప్రపంచంలో వాళ్ల (భారత్) విశ్వసనీయత చాలా దారుణంగా దెబ్బతింది'' అని ఎసాన్ మణి చెప్పారు.

Image copyright Twitter/BCCI

కశ్మీర్ దాడి నేపథ్యంలో ''ఉగ్రవాదం ఉద్భవిస్తున్న దేశాలతో సంబంధాలు తెంచుకోవాలి'' అని గత నెలలో ఐసీసీని బీసీసీఐ కోరింది.

''గతంలో ఇలాంటి పనులు చేసిన ఇమ్రాన్ తాహిన్, మొయీన్ అలీలపై చర్యలు తీసుకున్నారు. ఇప్పుడూ అలాంటి చర్యలే తీసుకోవాలి'' అని మణి కోరారు.

రాజకీయ స్టేట్‌మెంట్లు ఇచ్చినందుకు దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయీన్ అలీలపై ఐసీసీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది.

Image copyright Twitter/BCCI
చిత్రం శీర్షిక భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి టోపీని అందిస్తున్న ధోనీ

2017లో శ్రీలంకపై మ్యాచ్ సందర్భంగా ఒక వికెట్ తీసినప్పుడు మత ప్రచారకుడు జునైద్ జంషెడ్‌కు సంబంధించిన ఒక టీషర్టును ఇమ్రాన్ తాహిర్ ప్రదర్శించాడు.

2014లో ఇండియాపై టెస్ట్ మ్యాచ్ సందర్భంగా 'సేవ్ గాజా', 'ఫ్రీ పాలస్తీనా' అన్న నినాదాలు కలిగిన రిస్ట్‌బ్యాండ్‌లను మొయీన్ అలీ ధరించాడు.

''వీరిద్దరిపై ఐసీసీ కఠిన చర్యలు తీసుకుంది. అలాంటి చర్యలే ఇప్పుడు ఇండియాపై కూడా తీసుకోవాలి'' అని మణి అన్నారు.

''భారత్ అనుమతి తీసుకున్నది ఒకదానికోసం, కానీ చేసింది మరొకటి'' అని ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)