బోయింగ్ 737 మాక్స్ 8 విమానం ఏంటి? ఈ విమానాలు ఎందుకు కూలిపోతున్నాయి?

  • 14 మార్చి 2019
బోయింగ్ విమానం

బోయింగ్ సంస్థ తయారు చేసే 737 మాక్స్ 8 విమానం ఈనెల 10వ తేదీ ఆదివారం ఇథియోపియాలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 157 మంది చనిపోయారు.

లయన్ ఎయిర్ సంస్థ నడుపుతున్న ఇదే మోడల్ విమానం గతేడాది అక్టోబర్‌లో ఇండోనేసియాలో కూలిపోయింది. ఆ ప్రమాదంలో 189 మంది చనిపోయారు.

ఈ రెండు విమానాలూ కొత్తవే. రెండూ రన్‌వే పైకి ఎగిరిన కొన్ని నిమిషాల్లోనే కూలిపోయాయి.

బోయింగ్ 737 మాక్స్ 8 మోడల్ విమానాలు వాణిజ్య సేవలు ప్రారంభించింది 2017వ సంవత్సరంలోనే.

సాధారణంగా పాత, ఎక్కువకాలం వినియోగంలో ఉన్న విమానాలు ప్రమాదాలకు గురవుతుంటాయి. విమానాలను సరిగ్గా నిర్వహించకపోవడం, వివిధ విడిభాగాలను సమయానుకూలంగా పరిశీలించక, మార్చకపోవటం వంటి కారణాలు ఉంటాయి. అయితే, కొత్త విమానాలు కూలిపోతుండటం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.

ప్రపంచవ్యాప్తంగా ఈ మోడల్ విమానాలు ఎన్ని ఉన్నాయి?

బోయింగ్ సంస్థ చరిత్రలోనే అత్యంత వేగంగా అమ్ముడైన విమానాలు 737 మాక్స్ మోడల్‌వే.

ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా విమానయాన సంస్థలు 4,500 విమానాలకు ఆర్డర్లు ఇచ్చాయి.

మిగతా విమానాలకు దీనికీ తేడాలేంటి?

జకార్తాకు చెందిన ఏవియేషన్ నిపుణుడు జెర్రీ సోజాట్‌మన్ బీబీసీతో మాట్లాడుతూ.. 737 మాక్స్ విమానాల ఇంజిన్ కొంత ఆధునికమైనదని, దీని రెక్కలు గత మోడల్స్‌తో పోలిస్తే పెద్దవని చెప్పారు. దీనివల్ల విమానం సమన్వయంపై ప్రభావం పడుతుందని వెల్లడించారు.

విమానం నిలిచిపోయే ప్రమాదంలో పడినప్పుడు పైలట్‌ను అలర్ట్ చేసే సెన్సర్లు ఉంటాయి. వీటిని యాంగిల్ ఆఫ్ అటాక్ (ఏఓఏ) సెన్సర్లు అంటారు. ప్రమాదానికి గురైన లయన్ ఎయిర్ విమానానికి ఈ సెన్సర్ల నుంచి భారీస్థాయిలో సంకేతాలు అందాయని ఇండోనేసియా జాతీయ రవాణా భద్రత కమిటీ తెలిపింది.

అయితే, ఈ విమాన ప్రమాదం ఎందుకు జరిగిందో ఇంకా తుది నివేదిక తయారు కాలేదు.

ఈ సెన్సర్లు, వాటితో అనుసంధానమైన సాఫ్ట్‌వేర్ పాతతరం 737 మోడల్ విమానాలతో పోలిస్తే భిన్నంగా పనిచేస్తాయి, కానీ ఈ విషయాన్ని పైలట్లకు చెప్పలేదు.

ఈ విమానం ప్రయాణానికి అనుకూలమేనా?

లయన్ ఎయిర్ ప్రమాదం జరిగిన కొన్ని రోజులకు ఈ విమానాలను తయారు చేసే బోయింగ్ సంస్థ విమాన నిర్వహణ బులెటిన్‌ను ఆయా ఎయిర్‌లైన్స్‌కు జారీ చేసింది.

ఈ యాంగిల్ ఆఫ్ అటాక్ (ఏఓఏ) సెన్సర్ల గురించి అప్పట్లో అమెరికా విమానయాన నియంత్రణ సంస్థ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ)... అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. అన్ని విమానాల ఎయిర్‌వర్తీనెస్ (విమానం ప్రయాణానికి అనుకూలంగా ఉందా? లేదా? అన్నది నిర్ణయించే నిర్థిష్టమైన తనిఖీలు)కు సంబంధించి అన్ని విమానయాన సంస్థలు పరిశీలన జరపాలని సూచించింది.

ఒకవేళ ఈ సెన్సర్ల పరిస్థితిని కనుక పరిష్కరించకుంటే.. విమానాన్ని నియంత్రించటంలో పైలట్లు ఇబ్బంది పడతారని, అలాంటప్పుడు విమానం ఉన్నట్టుండి నిట్టనిలువుగా కిందకు జారిపోయే ప్రమాదంలో పడుతుందని, ఎత్తు నుంచి పడిపోయి భూమిని ఢీకొంటుందని ఎఫ్ఏఏ తెలిపింది.

విమాన పైలట్ల కోసం రూపొందించే ఫ్లైట్ మ్యానువల్స్ (విమానాన్ని ఎలా నడపాలో తెలిపే సూచనలు/మార్గదర్శకాల పుస్తకం)లో తాజా సమాచారం ఇవ్వాలని అమెరికాలోని విమానయాన సంస్థలకు సూచనలు అందాయి.

Image copyright Getty Images

యాంగిల్ ఆఫ్ అటాక్ సెన్సర్ల గురించి పైలట్లకు తెలుసా?

అదే సమయంలో ఈ విషయాన్ని ఇతర దేశాల విమానయాన నియంత్రణ సంస్థలకు కూడా అందజేశామని ఎఫ్ఏఏ వెల్లడించింది.

అంటే.. ఆయా దేశాల విమానయాన నియంత్రణ సంస్థలు ఈ సమాచారాన్ని ఆయా దేశాల్లో విమానాలు నడిపే ఎయిర్‌లైన్స్ సంస్థలకు, అవి వారి పైలట్లకు అందజేస్తాయన్నది ఎఫ్ఏఏ ఉద్దేశం.

ఈ సెన్సార్ సమస్య గురించి ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ పైలట్లకు కూడా సమాచారం ఉండి ఉండాలని విమానయాన నిపుణులు చెబుతున్నారు.

అయితే, లయన్ ఎయిర్ విమానం ఎదుర్కొన్న సమస్యనే ఇథియోపియన్ ఎయిర్‌లైన్ విమానం కూడా ఎదుర్కొందా, లేదా అన్నది ఇంకా స్పష్టంగా తెలియదు.

బోయింగ్ సంస్థ ఏమంటోంది?

ఆదివారం విమాన ప్రమాదం అనంతరం బోయింగ్ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది.

''అమెరికా జాతీయ రవాణా భద్రత బోర్డు నేతృత్వంలో సాంకేతిక సహాయాన్ని అందించేందుకు సాంకేతిక బృందం సన్నద్ధమైంది'' అని తెలిపింది.

ప్రమాదంలో మృతి చెందిన విమానయాన సిబ్బంది, ప్రయాణికులకు సంతాపాన్ని, వారి కుటుంబాలకు సానుభూతిని తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు

చైనాలో అదృశ్యమైన వీగర్ ముస్లిం ప్రొఫెసర్‌ ఏమయ్యారు?

ఏడేళ్ల వయసులో నాపై జరిగిన అత్యాచారాన్ని 74 ఏళ్ల వయసులో ఎందుకు బయటపెట్టానంటే...

రెడ్డి సుభానా: "మా బిడ్డ కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి" అని వీళ్లు కోర్టును ఎందుకు కోరుతున్నారు

IND Vs SA రెండో టెస్టు: ఇన్నింగ్స్ 137 పరుగులతో భారత్ విజయం

కంట్లో ప్రతిబింబించిన చిత్రంతో పాప్‌సింగర్ ఇల్లు కనిపెట్టి వేధించిన యువకుడు

హాగిబిస్‌ పెనుతుపాను: అతలాకుతలమైన జపాన్, 18 మంది మృతి, నీట మునిగిన బుల్లెట్ రైళ్లు

నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసిన తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతి

నింజా టెక్నిక్: వ్యాసం రాయమంటే 'ఖాళీ' పేపర్‌ ఇచ్చిన అమ్మాయికి అత్యధిక మార్కులు.. ఎలా