బోయింగ్ 737 మాక్స్ 8 విమానాలు భారత్‌లో ఎన్ని ఉన్నాయి? ఏఏ విమానయాన సంస్థలు వీటిని నడుపుతున్నాయి?

  • 13 మార్చి 2019
2010 మే 24వ తేదీన దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయిన స్పైస్ జెట్ సంస్థ నడుపుతున్న బోయింగ్ 737-800 మోడల్ విమానం Image copyright Getty Images
చిత్రం శీర్షిక 2010 మే 24వ తేదీన దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయిన స్పైస్ జెట్ సంస్థ నడుపుతున్న బోయింగ్ 737-800 మోడల్ విమానం

ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఘోర ప్రమాదానికి గురై 157 మంది చనిపోయిన నేపథ్యంలో బోయింగ్ 737 మాక్స్ 8 విమాన ప్రయాణాలను ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు, విమానయాన సంస్థలు నిలిపివేస్తున్నాయి.

లయన్ ఎయిర్ సంస్థ నడుపుతున్న ఇదే మోడల్ విమానం గతేడాది అక్టోబర్‌లో ఇండోనేసియాలో కూలిపోయింది. ఆ ప్రమాదంలో 189 మంది చనిపోయారు.

ఈ రెండు విమానాలూ కొత్తవే. రెండూ రన్‌వే పైకి ఎగిరిన కొన్ని నిమిషాల్లోనే కూలిపోయాయి.

బోయింగ్ 737 మాక్స్ 8 మోడల్ విమానాలు వాణిజ్య సేవలు ప్రారంభించింది 2017వ సంవత్సరంలోనే.

బోయింగ్ సంస్థ చరిత్రలోనే అత్యంత వేగంగా అమ్ముడైన విమానాలు 737 మాక్స్ మోడల్‌వే.

ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా విమానయాన సంస్థలు 4,500 విమానాలకు ఆర్డర్లు ఇచ్చాయి.

భారత దేశంలో ఈ విమానాలు ఎన్ని ఉన్నాయి?

డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అందించిన సమాచారం మేరకు రెండు భారతీయ విమానయాన సంస్థలు బోయింగ్ 737 మాక్స్ 8 విమానాలను ఉపయోగిస్తున్నాయి.

ఈ మోడల్ విమానాలు స్పైస్ జెట్ వద్ద 13, జెట్ ఎయిర్‌వేస్ వద్ద 5 ఉన్నాయి.

Image copyright Getty Images

డీజీసీఏ మార్గదర్శకాలు ఏంటి?

ఇప్పుడు ఈ విమానాల ఇంజనీరింగ్, నిర్వహణలపై డీజీసీఏ ఆ రెండు సంస్థలకు పలు మార్గదర్శకాలు జారీ చేసింది.

ఆటోపైలట్ వ్యవస్థ, యాంగిల్ ఆఫ్ అటాక్ (ఏఓఏ) సెన్సార్లు, విమానం హఠాత్తుగా నిలిచిపోయే పరిస్థితి మొదలైన వాటిపై ఈ మార్గదర్శకాలు ఉన్నాయి.

అలాగే, బోయింగ్ 737 మాక్స్ విమానాలను నడిపే పైలట్‌కు బోయింగ్ 737 ఎన్‌జీ విమానం నడపటంలో కనీసం వెయ్యి గంటలు పైలట్ ఇన్ కమాండ్ (పీఐసీ) అనుభవం, సహ పైలట్‌కు 500 గంటల అనుభవం ఉండాలని డీజీసీఏ తెలిపింది.

ఈ మార్గదర్శకాలు పాటించకుండా మార్చి 12వ తేదీ నుంచి బోయింగ్ 737 మాక్స్ 8 విమానాలను ప్రయాణాలకు అనుమతించొద్దని ఆయా ఎయిర్‌లైన్స్‌ సంస్థలకు డీజీసీఏ ఆదేశాలు ఇచ్చింది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఈ చర్యలు తీసుకున్నామని, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని, తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.

జెట్ ఎయిర్‌వేస్ స్పందన

తగినన్ని నిధులు లేకపోవటంతో విమానాల రాకపోకల్ని నిలిపివేసిన జెట్ ఎయిర్‌వేస్ సంస్థ ఈ అంశంపై స్పందిస్తూ.. తమ ఆధ్వర్యంలో బోయింగ్ 737 మాక్స్ విమానాలు ఐదు ఉన్నాయని, అయితే అవేవీ ప్రస్తుతం రాకపోకలు జరపటం లేదని వెల్లడించింది.

స్పైస్‌జెట్ స్పందన

డీజీసీఏ మార్గదర్శకాల మేరకు బోయింగ్ 737 మాక్స్ విమానాల ప్రయాణాన్ని నిలిపివేసినట్లు స్పైస్‌జెట్ 13వ తేదీ బుధవారం ప్రకటించింది.

స్పైస్‌జెట్ కమ్యూనికేషన్స్ హెడ్ తుషార్ శ్రీవాస్తవ ఈ మేరకు ట్విటర్‌లో ఒక ప్రకటన చేశారు. ‘‘ప్రయాణీకులు, సిబ్బంది భద్రతే మాకు ముఖ్యం. ఈ విమానాల నిర్వహణ చేపడతాం. డీజీసీఏతోనూ, బోయింగ్‌తోనూ చర్చలు జరుపుతున్నాం. మా వద్ద ఉన్న 76 విమానాల్లో 14 విమానాలు ఈరోజు సాయంత్రం 4 గంటలకల్లా రాకపోకలు నిలిపివేస్తాయి. మిగతా 64 విమానాలు ప్రయాణిస్తాయి. రద్దయిన విమానాల కారణంగా ప్రయాణీకులకు వీలైనంత తక్కువ అసౌకర్యం కలిగేలా చూస్తాం’’ అని పేర్కొన్నారు.

ఇతర దేశాలు ఏం చర్యలు తీసుకున్నాయి?

సింగపూర్‌ నుంచి వెళ్లే, సింగపూర్‌లోకి ప్రవేశించే బోయింగ్ 737 మాక్స్ విమానాలను సింగపూర్ సివిల్ ఏవియేషన్ అథార్టీ సస్పెండ్ చేసింది.

చైనా సివిల్ ఏవియేషన్ అథార్టీ సైతం దేశీయంగా బోయింగ్ 737 మాక్స్ 8 విమానాల ప్రయాణాలను రద్దు చేసింది.

ఇండోనేసియా సైతం తనిఖీల నేపథ్యంలో బోయింగ్ 737 మాక్స్ 8 విమానాలను రద్దు చేసింది.

అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) మాత్రం బోయింగ్ 737 మాక్స్ 8 విమానాలు ప్రయాణించేందుకు సురక్షితమేనని, అయితే విమానం ప్రయాణించేందుకు అనువుగా ఉందో లేదో క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని సూచించింది.

బోయింగ్ 737 మాక్స్ 8 విమాన ప్రయాణాలు ఆపేసిన ఎయిర్ లైన్స్

షెన్‌జెన్ ఎయిర్‌లైన్స్

చైనా ఈస్ట్రన్ ఎయిర్‌లైన్స్

ఎయిర్ చైనా

ఓకే ఎయిర్‌వేస్

కున్మింగ్ ఎయిర్‌లైన్స్

ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్

కేమాన్ ఎయిర్‌వేస్

గరుడ ఇండోనేసియా

లయన్ ఎయిర్

కోమ్ ఎయిర్

గోల్ ఎయిర్‌వేస్

ఏరో మెక్సికో

ఏరోలినీస్ అర్జెంటినాస్

సిల్క్ ఎయిర్

బోయింగ్ 737 మాక్స్ 8 విమాన ప్రయాణాలు కొనసాగిస్తున్న ఎయిర్ లైన్స్

నార్వేజియన్ ఎయిర్ షటిల్

ఫ్లై దుబయ్

టీయూఐ గ్రూప్

ఎయిర్ ఇటలీ

ఐలాండ్ ఎయిర్

ఎస్7

సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్

ఫిజి ఎయిర్‌వేస్

ఎల్ఓటీ పోలిష్ ఎయిర్‌లైన్స్

అమెరికన్ ఎయిర్‌లైన్స్

వీటిలో కొన్ని విమానయాన సంస్థలు బోయింగ్‌తో చర్చలు జరుపుతున్నామని చెప్పాయి. అమెరికన్ ఎయిర్‌లైన్స్ మాత్రం బోయింగ్ 737 మాక్స్ 8 విమానాలపై పూర్తి నమ్మకం ఉందని తెలిపింది.

బోయింగ్ 737 మాక్స్ 8 విమానాలు వాడే ఇతర ఎయిర్‌లైన్స్

కొరెండో ఎయిర్‌లైన్స్

మారిటేనియా ఎయిర్‌లైన్స్

మలిండో ఎయిర్

సన్‌వింగ్ ఎయిర్‌లైన్స్

ఏవియేషన్ క్యాపిటల్ గ్రూప్

గెకాస్ ట్రావెల్ సర్వీసెస్

ఒమన్ ఎయిర్ (బోయింగ్ సంస్థ ఇంకా విమానాలను ఇవ్వలేదు)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం