న్యూజీలాండ్: ''మసీదుకు మేం కేవలం 50 గజాల దూరంలో ఉన్నాం.. ఐదు నిమిషాలు ముందు వెళ్లుంటే ఏమైపోయేవాళ్లమో" - బీబీసీతో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మేనేజర్

  • 16 మార్చి 2019
అల్ నూర్ మసీదుపై కాల్పుల నుంచి తప్పించుకొని హాగ్లే పార్క్ గుండా వెళ్తున్న బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు Image copyright Twitter @Isam84
చిత్రం శీర్షిక శుక్రవారం అల్ నూర్ మసీదుపై కాల్పుల నుంచి తప్పించుకొని హాగ్లే పార్క్ గుండా వెళ్తున్న బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు

''మేమెన్నడూ అంత భయపడలేదు'' - న్యూజీలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ నగరంలో అల్ నూర్ మసీదుపై కాల్పుల నుంచి తృటిలో తప్పించుకొన్న బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మేనేజర్ మాట ఇది.

న్యూజిలాండ్‌లో క్రైస్ట్‌చర్చ్ నగరంలోని అల్ నూర్ మసీదు, లిన్‌వుడ్ శివారులోని మరో మసీదుపై శుక్రవారం జరిగిన కాల్పుల్లో 49 మంది చనిపోయారు.

అల్ నూర్ మసీదులో కాల్పులు మొదలైనప్పుడు మేనేజర్ ఖలీద్ మసూద్ బంగ్లాదేశ్ జట్టుతోపాటు ఉన్నారు. శుక్రవారం ప్రార్థనలు చేసేందుకు బంగ్లాదేశ్ క్రికెటర్లు అల్‌ నూర్ మసీదుకు వచ్చారు.

''ఎక్కడైనా అలాంటి దాడి ఒకటి జరుగుతుందని మేం ఎన్నడూ అనుకోలేదు. అక్కడ మా ఆటగాళ్లు 17 మంది ఉన్నారు. జట్టులోని ఇద్దరు మాత్రమే హోటల్లోనే ఉండిపోయారు. కాల్పులు జరుగుతున్నప్పుడు మసీదుకు మేం కేవలం 50 గజాల దూరంలో ఉన్నాం. మేం ఐదు నిమిషాలు ముందు వెళ్లుంటే మా పరిస్థితి మరోలా ఉండేది'' అని ఖలీద్ చెప్పారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక కాల్పుల ఘటన నేపథ్యంలో శనివారం క్రైస్ట్ చర్చి నుంచి స్వదేశానికి బయల్దేరిన బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు

అల్ నూర్ మసీదు క్రైస్ట్ చర్చ్ నగరం మధ్యలో ఉంది. మసీదుకు ఆనుకొని హాగ్లే పార్క్ ఉంది. మసీదులో కాల్పులు జరుగుతున్నప్పుడు బంగ్లాదేశ్ క్రికెటర్లు ఈ పార్క్ గుండా పరుగెత్తి ప్రాణాలు కాపాడుకున్నారు.

ప్రాణాలతో బయటపడటం అదృష్టమేనని జట్టు అనుకొంటోందని, కానీ బాగా భయాందోళనకు గురైందని మేనేజర్ తెలిపారు. ''మసీదులో కాల్పులు జరుగుతున్నప్పుడు మేం బస్సులో ఉన్నాం. ప్రాణాలు కాపాడుకొనేందుకు అందరం తలలు కిందకు దించుకొని ఉండిపోయాం. షూటర్లు మసీదులోంచి వచ్చి మాపై కాల్పులు జరుపుతారేమోనని అప్పటికీ భయపడుతూనే ఉన్నాం'' అని ఆయన వివరించారు.

జట్టులో ఒకరైన ముష్ఫికర్ రహీం ట్విటర్‌లో స్పందిస్తూ- ''మేం చాలా అదృష్టవంతులం. ఇలాంటి ఘటనలు మళ్లీ ఇంకెప్పుడూ జరగకూడదని కోరుకొంటున్నా. మా కోసం ప్రార్థించండి'' అన్నారు.

Image copyright Bangladesh Cricket Board
చిత్రం శీర్షిక బంగ్లాదేశ్ జట్టు మేనేజర్ ఖలీద్ మసూద్

కాల్పులు జరుగుతున్నప్పుడు తమ ఆటగాళ్లు ఏడ్చారని, వారిపై మానసికంగా ప్రభావం పడిందని మేనేజర్ ఖలీద్ విచారం వ్యక్తంచేశారు.

''వారిని సురక్షితంగా తిరిగి హోటల్‌కు చేర్చడం మేనేజర్‌గా నా బాధ్యత. అక్కడ జరిగినదాని ప్రభావం నుంచి తేరుకోవడం కష్టం. ఇప్పుడు ఆటగాళ్లందరూ సాధారణ స్థితికి వచ్చేశారు'' అని ఆయన వివరించారు.

షెడ్యూలు ప్రకారం న్యూజీలాండ్‌ పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ జట్టు ఈ రోజు(మార్చి 16) కివీస్‌తో హాగ్లే ఓవల్ మైదానంలో మూడో టెస్ట్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. బంగ్లాదేశ్ క్రికెటర్లు నిన్న ప్రార్థన చేయడానికి వెళ్లిన అల్ నూర్ మసీదు ఈ వేదికకు సమీపంలోనే ఉంది. నిన్న కాల్పుల అనంతరం ఈ మ్యాచ్ రద్దయింది.

Image copyright Reuters

పార్కింగ్ ప్రదేశంలోంచి బంగ్లాదేశ్ క్రికెటర్లు వస్తుండటం తనకు కనిపించిందని ఈఎస్‌పీఎన్ ప్రతినిధి మొహమ్మద్ ఇస్లాం తెలిపారు. తర్వాత ఐదు నిమిషాల్లోపే ఒక క్రికెటర్ (తమీమ్ ఇక్బాల్) తనను సాయం అడిగారని చెప్పారు.

''మమ్మల్ని కాపాడండి. మేం పెద్ద సమస్యలో చిక్కుకున్నాం. ఎవరో కాల్పులు జరుపుతున్నారు'' అని తమీమ్ ఇక్బాల్ అన్నారని ఆయన వివరించారు. ''ఆ క్రికెటర్ మాటలను మొదట నేను పెద్దగా పట్టించుకోలేదు. అయితే అంతలోనే ఆయన గొంతులో భయాందోళన కనిపించింది. నేను వెంటనే వారికి సాయపడేందుకు పరుగెత్తాను. వారిని చేరుకొనే వరకు పరుగెత్తుతూనే వెళ్లేందుకు ప్రయత్నించాను. దారిలో ఒకరు లిఫ్ట్ ఇచ్చారు. అనంతరం నేను ఘటనా స్థలానికి చేరుకున్నాను'' అని ఆయన బీబీసీకి వివరించారు.

జట్టు కాల్పుల ప్రాంతం నుంచి సురక్షితంగా బయటపడిన తర్వాత బ్యాట్స్‌మన్ తమీమ్ ఇక్బాల్- ''మొత్తం జట్టు షూటర్ల బారి నుంచి ప్రాణాలతో బయటపడింది'' అంటూ ట్వీట్ చేశారు.

భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీతోపాటు ఇతర జట్లు బంగ్లాదేశ్ జట్టుకు సంఘీభావం ప్రకటించాయి.

''క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన ఘటన దిగ్భ్రాంతికరం, విషాదకరం. ఇదో పిరికి చర్య. బాధితులందరికీ సానుభూతి తెలుపుతున్నా. బంగ్లేదేశ్ జట్టు సభ్యులకు సంఘీభావం ప్రకటిస్తున్నా. వాళ్లంతా సురక్షితంగా ఉండాలని కోరుకొంటున్నా'' అని ట్విటర్ వేదికగా చెప్పారు.

క్రైస్ట్‌చర్చ్ కాల్పుల నేపథ్యంలో, వీలైనంత త్వరగా స్వదేశానికి వచ్చేయాలని బంగ్లాదేశ్ జట్టుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సూచించింది. క్రికెటర్లు శనివారం క్రైస్ట్‌చర్చ్ నుంచి ఢాకాకు బయల్దేరారు.

క్రైస్ట్‌చర్చ్ కాల్పుల మృతుల్లో ముగ్గురు బంగ్లాదేశీయులు ఉన్నారని ఆస్ట్రేలియాలో కాన్‌బెర్రా నగరంలోని బంగ్లాదేశ్ హైకమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)