న్యూజీలాండ్: మసీదుల్లో కాల్పుల అనుమానితుడు ఇతడే.. ఆస్ట్రేలియన్‌ను కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు

  • 16 మార్చి 2019
ప్రధాన అనుమానితుడు బ్రెంటన్ టారంట్‌ను కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు Image copyright Reuters
చిత్రం శీర్షిక ప్రధాన అనుమానితుడు బ్రెంటన్ టారంట్‌ను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు.

న్యూజీలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ నగరంలో మసీదులపై కాల్పుల కేసులో ప్రధాన అనుమానితుడిని పోలీసులు శనివారం న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు.

ఆస్ట్రేలియాకు చెందిన బ్రెంటన్ టారంట్ అనే ఈ అనుమానితుడి వయసు 28 సంవత్సరాలు. ఖైదీ దుస్తుల్లో, చేతులకు బేడీలు వేసి అతడిని పోలీసులు కోర్టుకు తీసుకొచ్చారు. అతడిపై ఒక హత్య కేసు నమోదు చేశారు. మరిన్ని అభియోగాలు అతడిపై మోపే అవకాశం ఉంది.

కోర్టు విచారణ సమయంలో టారంట్ మౌనంగా ఉన్నాడు. అతడిని కోర్టు కస్టడీకి పంపింది. అతడిని తిరిగి ఏప్రిల్ 5న కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

క్రైస్ట్‌చర్చ్‌లోని అల్ నూర్ మసీదులో, నగర శివారు లిన్‌వుడ్‌లో ఉండే మరో మసీదులో స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ కాల్పుల్లో 49 మంది చనిపోయారు. మృతుల్లో ఒక హైదరాబాదీ కూడా ఉన్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ప్రధానమంత్రి జసిండా ఆర్‌డెర్న్

తుపాకుల చట్టాన్ని మారుస్తామన్న ప్రధాని

2017 నవంబరు నుంచే టారంట్ వద్ద ఆయుధ లైసెన్స్ ఉందని, దాని ఆధారంగానే ఇప్పుడు దాడుల్లో వాడిన తుపాకులు కొన్నాడని న్యూజీలాండ్ ప్రధానమంత్రి జసిండా ఆర్‌డెర్న్ వెల్లడించారు. టారంట్ వద్ద ఐదు తుపాకులు లభించాయన్నారు. దేశంలో తుపాకుల చట్టాన్ని మారుస్తామని ప్రకటించారు.

టారంట్‌ వాడిన తుపాకులు మార్పులు చేర్పులు చేసిన తుపాకులని తెలుస్తోందని ప్రధాని చెప్పారు.

అతడి కారు నిండా ఆయుధాలు ఉన్నాయని ఆమె చెప్పారు. ఈ విషయాన్ని ప్రస్తావించడం ద్వారా, దాడిని కొనసాగించాలనే ఉద్దేశం అతడికి ఉందని ఆమె సంకేతమిచ్చారు.

కాల్పుల ఘటనను శుక్రవారం ఆమె ఉగ్రవాద దాడిగా పేర్కొన్నారు.

సెమీ-ఆటోమేటిక్ ఆయుధాలను నిషేధించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించనుందని అటార్నీ జనరల్ డేవిడ్ పార్కర్ చెప్పారు.

కాల్పులు జరిగిన రెండు మసీదుల నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

క్రైస్ట్‌చర్చ్ కాల్పుల కేసులో మరో ఇద్దరు వ్యక్తులు పోలీసుల నిర్బంధంలో ఉన్నారు. అదుపులోకి తీసుకున్న ఎవరికీ ఇంతకుముందు వరకు ఎలాంటి నేర చరిత్రా లేదు.

Image copyright Reuters
చిత్రం శీర్షిక బాధితుడు దావూద్ నబీ కుమారుడు ఒమర్ నబీ. ఆయన మొబైల్‌లో తన తండ్రి చిత్రాన్ని చూపిస్తున్నారు.

అధికారిక సమాచారం ప్రకారం- దావూద్ నబీ అనే వ్యక్తి శుక్రవారం నాటి కాల్పుల తొలి బాధితుడు.

1980ల్లో అఫ్గానిస్థాన్ నుంచి న్యూజీలాండ్‌కు వలస వచ్చిన ఆయన వయసు 71 సంవత్సరాలు.

దేశమంతటా మసీదుల మూసివేత

కాల్పుల్లో 48 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరు బాలురు ఉన్నారు. వీరిలో ఒకరికి 12 ఏళ్లు కాగా, మరొకరికి 13 ఏళ్లు. క్రైస్ట్‌చర్చ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్లో 11 మంది పరిస్థితి విషమంగానే ఉంది.

ఈ కాల్పుల్లో తమ పౌరులు చనిపోయారని భారత్, బంగ్లాదేశ్, ఇండొనేషియా దేశాలు ఇప్పటికే ప్రకటించాయి.

ప్రస్తుతం క్రైస్ట్‌చర్చ్ నగరమంతా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ముందు జాగ్రత్తగా న్యూజీలాండ్ అంతటా మసీదులు మూసివేశారు.

తొలి దాడి అల్ నూర్ మసీదులో స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 1: 40 గంటలకు ప్రార్థనలు జరుగుతున్న సమయంలో చోటుచేసుకొంది. షూటర్ మసీదు ముందు ద్వారం గుండా లోపలకు ప్రవేశించాడు. అక్కడున్నవారిపై దాదాపు ఐదు నిమిషాలపాటు కాల్పులు జరిపాడు. తలకు పెట్టుకున్న కెమెరా సాయంతో తన కాల్పులను టారంట్ లైవ్‌లో ప్రసారం చేశాడు. చిన్నారులు సహా అందరిపై కాల్పులు జరిపాడు.

అల్ నూర్ మసీదులో కాల్పులు జరిపాక అతడు అక్కడి నుంచి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో క్రైస్ట్‌చర్చ్ శివారు లిన్‌వుడ్‌లో ఉన్న మరో మసీదుకు కారులో వెళ్లాడు.

Image copyright Reuters

బాధితులకు క్రైస్ట్‌చర్చ్ మేయర్ లియానే డాల్జీల్ సంఘీభావం తెలిపారు. షూటర్ తన మనసంతా విద్వేషం నింపుకొని, ఉగ్రవాద దాడికి పాల్పడేందుకే ఈ నగరానికి వచ్చాడని ఆమె వ్యాఖ్యానించారు.

న్యూజీలాండ్ జనాభా 42.5 లక్షలు కాగా, అందులో ఇంచుమించు 1.1 శాతం మంది ముస్లింలు ఉన్నారు. 1990ల నుంచి వివిధ యుద్ధ బాధిత దేశాల నుంచి శరణార్థులను స్వీకరించడం వల్ల జనాభా త్వరగా పెరిగింది.

క్రైస్ట్‌చర్చ్ దాడులకు ముందు టారంట్ పేరిట ఉన్న సోషల్ మీడియా ఖాతాల్లో జాత్యహంకారంతో కూడిన ఒక డాక్యుమెంట్ పోస్ట్ అయ్యింది. ఇప్పుడు కాల్పులు జరిగిన మసీదుల ప్రస్తావన అందులో ఉంది.

2017లో యూరప్ వెళ్లానని, అక్కడ జరుగుతున్న పరిణామాలు తనకు ఆగ్రహం తెప్పించాయని, ఆ తర్వాతే దాడులకు కుట్రను మొదలుపెట్టానని డాక్యుమెంట్ రాసిన వ్యక్తి పేర్కొన్నాడు.

‘ద గ్రేట్ రీ‌ప్లేస్‌మెంట్’ పేరుతో డాక్యుమెంట్‌లో సమాచారం ఉంది. ‘ద గ్రేట్ రీ‌ప్లేస్‌మెంట్’ మాటను తొలుత ఫ్రాన్స్‌లో వలస వ్యతిరేక అతివాదులు వాడారు. తర్వాత ఐరోపాలోని వలస వ్యతిరేకులు దీనిని వాడటం మొదలైంది.

న్యూజీలాండ్ ఆస్ట్రేలియా ఖండం కిందకు వస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)