నెదర్లాండ్స్‌: ట్రామ్‌ బండిపై కాల్పుల కేసులో టర్కీ పౌరుడిని అరెస్టు చేసిన పోలీసులు

  • 19 మార్చి 2019
పోలీసులు విడుదల చేసిన గోక్‌‌మెన్ టానిస్ ఫొటో Image copyright @POLITIEUTRECHT / TWITTER
చిత్రం శీర్షిక పోలీసులు విడుదల చేసిన గోక్‌‌మెన్ టానిస్ ఫొటో

నెదర్లాండ్స్‌లోని యూట్రెక్ట్‌ నగరంలో ఒక ట్రామ్ బండిపై కాల్పుల కేసులో అనుమానితుడైన టర్కీ పౌరుడు గోక్‌మెన్ టానిస్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

కాల్పులు జరిగిన తర్వాత కొన్ని గంటలకు ఘటనా స్థలం 24 ఆక్టోబెర్‌ప్లీన్ కూడలికి దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలోని ఒక భవనంలో టానిస్‌ను అరెస్టు చేశారు.

అతడి వయసు 37 సంవత్సరాలు.

కాల్పుల వెనక టానిస్ ఉద్దేశమేమిటనేది స్పష్టం కాలేదని అధికారులు తెలిపారు.

Image copyright EPA
చిత్రం శీర్షిక నిందితుడి కోసం గాలిస్తున్న బలగాలు

సోమవారం జరిగిన ఈ కాల్పుల్లో ముగ్గురు మరణించారు. ఐదుగురు గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి తీవ్రంగా ఉంది.

దుండగుడు విచక్షణరహితంగా కాల్పులు జరిపాడని ఒక ప్రత్యక్ష సాక్షి స్థానిక మీడియాకు తెలిపారు.

ఈ కాల్పుల ఘటన ఉగ్రవాద దాడిగా అనిపిస్తోందని పోలీసులు ఇంతకుముందు చెప్పారు. ఒక ప్రాసిక్యూటర్ మాత్రం- టానిస్ జరిపిన కాల్పులకు కుటుంబ సంబంధ కారణాలు ఉండొచ్చని మీడియా సమావేశంలో చెప్పారు.

Image copyright EPA

టానిస్ లోగడ చెచెన్యాలో పోరాటంలో పాల్గొన్నాడని స్థానిక వ్యాపారవేత్త ఒకరు బీబీసీకి వెల్లడించారు. ఇస్లామిక్ స్టేట్(ఐఎస్)‌తో సంబంధాలపై అతడిని అరెస్టు చేశారని, తర్వాత విడుదల చేశారని వివరించారు.

‘‘యూట్రెక్ట్‌ ఘటన మన నాగరికతపై, సహనంపై జరిగిన దాడి‘‘ అని నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రుటె వ్యాఖ్యానించారు. ఈ దాడితో దేశం దిగ్భ్రాంతి చెందిందని, ఎంతగానో కలత చెందిందని చెప్పారు.

యూట్రెక్ట్‌ దేశంలోని నాలుగో అతిపెద్ద నగరం. దీని జనాభా సుమారు 3 లక్షల 40 వేలు.

ఇక్కడ నేరాలు తక్కువగా జరుగుతుంటాయి. తుపాకులతో కాల్చి చంపే ఘటనలు అరుదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)