కోడిని చంపకుండా కోడికూర: కృత్రిమ మాంసంపై పరిశోధనల్లో ముందడుగు

  • 24 మార్చి 2019
చికెన్

మాంసాన్ని ప్రయోగశాలలో ఉత్పత్తి చేసే పరిశోధనల్లో బ్రిటన్ శాస్త్రవేత్తలు ఒక ముందడుగు వేశారు. బ్రిటన్‌లోని బాత్ నగరానికి చెందిన 'యూనివర్శిటీ ఆఫ్ బాత్' శాస్త్రవేత్తలు గడ్డిపోచలపై జంతు కణాలను అభివృద్ధి చేశారు.

కృత్రిమ మాంసం(కల్చర్డ్ మీట్) ఉత్పత్తి దిశగా ఇదో ముందడుగు. మాంసాన్ని ఈ పద్ధతిలో పెద్దయెత్తున ఉత్పత్తి చేయగలిగితే జంతువులను చంపకుండానే మాంసం తినే రోజులు రావొచ్చు.

వైద్యం, ఇంజినీరింగ్ రంగాల్లో తనకున్న అపార నైపుణ్యం సాయంతో ఈ రంగంలో బ్రిటన్ ముందుకు వెళ్లగలదని పరిశోధకులు చెబుతున్నారు.

ప్రయోగశాలలపై ఆధారపడి తయారుచేసే మాంసోత్పత్తులు ఇంకా అమ్మకానికి రాలేదు.

చిత్రం శీర్షిక పందులు, కోళ్లు, పశువుల నుంచి సేకరించిన కణాల సాయంతో కృత్రిమ మాంసం తయారీకి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.

ఇలాంటి మాంసోత్పత్తులను తాము తయారు చేస్తున్నామని అమెరికా సంస్థ 'జస్ట్' లోగడ తెలిపింది. బతికి ఉన్న కోడి ఈకల నుంచి సేకరించిన కణాలతో అభివృద్ధి చేసిన 'చికెన్ నగిట్స్' త్వరలోనే కొన్ని రెస్టారెంట్లలో అందుబాటులోకి వస్తాయని ప్రకటించింది.

ప్రపంచం ఆకలి తీర్చేందుకు కృత్రిమ మాంసం ఒక ప్రత్యామ్నాయ ప్రొటీన్ వనరు అవుతుందని బాత్ విశ్వవిద్యాలయం రసాయన ఇంజినీర్ డాక్టర్ మరియానే ఎలిస్ అభిప్రాయపడ్డారు.

ఆమె తన ప్రయోగశాలలో కృత్రిమ పంది కణాలను అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రయోగం ఫలిస్తే భవిష్యత్తులో ప్రయోగశాలలోనే కృత్రిమ మాంసం తయారు చేయొచ్చు.

చిత్రం శీర్షిక బయోరియాక్టర్

''భవిష్యత్తులో పందికి జీవాణుపరీక్ష(బయాప్సీ) జరిపి, పంది నుంచి సేకరించిన కణజాలంలోంచి ప్రధాన కణాలను వేరు చేసి, మరిన్ని కణాలను అభివృద్ధి చేస్తారు. వాటిని 'బయోరియాక్టర్‌'లో పెడతారు. అప్పుడు కణాలు పెద్దయెత్తున వ్యాప్తి చెందుతాయి. అలా ఏర్పడే మాంసమే కృత్రిమ మాంసం'' అని అబెరిస్ట్‌విత్ విశ్వవిద్యాలయం పోస్టుగ్రాడ్యుయేట్ విద్యార్థి నిక్ షార్టెన్ వివరించారు.

ఆ పంది బతికే ఉంటుందని, కానీ దాని నుంచి సేకరించే కొన్ని కణాల సాయంతో పెద్దమొత్తంలో మాంసాన్ని ఉత్పత్తి చేసుకోవచ్చని ఆ విద్యార్థి తెలిపారు.

ఇలా పంది మాంసమైతే తయారు చేయొచ్చు, మరి రుచి? సహజమైన పంది మాంసం ఎలా ఉంటుందో అలాంటి రుచినే తీసుకురావడానికి మరిన్ని సంవత్సరాలపాటు పరిశోధనలు కొనసాగించాల్సి ఉంది.

Image copyright PA
చిత్రం శీర్షిక 2013లో తొలిసారిగా ప్రయోగశాలల బర్గర్ తయారుచేశారు

2013లో తొలిసారిగా నెదర్లాండ్స్‌లో ప్రయోగశాలలో బర్గర్ తయారైంది. దీని తయారీకి దాదాపు 3 లక్షల 30 వేల డాలర్ల ఖర్చు అయ్యింది. అతి సూక్ష్మమైన లక్షల కొద్దీ కణాలను మాంసంగా మార్చడానికి చాలా కాలంపాటు పరిశోధకులు ఎంతగానో శ్రమించారు.

2018 డిసెంబరులో ఇజ్రాయెల్‌లో ప్రయోగశాలలో అభివృద్ధి చేసిన కణాలతో కృత్రిమమైన ఆవు మాంసం(స్టీక్) తయారైంది. అందులో చిన్న ముక్క ఖరీదు 50 డాలర్లు.

ఈ మాంసం ఉత్పత్తిని మెరుగుపరచాల్సి ఉందని అప్పుడు తయారీదారులు వెల్లడించారు.

Image copyright Getty Images

ఆవుకు తినడానికి గడ్డిపెట్టి, తర్వాత ఆ ఆవు మాంసం తినే బదులు, గడ్డిపోచలపైనే ఆవు కణాలను వృద్ధిచేసి కృత్రిమంగా మాంసం తయారుచేసుకొంటే ఎలా ఉంటుందనే ఆలోచనే బాత్ విశ్వవిద్యాలయంలో పరిశోధనకు మూలమని రసాయన ఇంజినీరింగ్‌లో పోస్టుగ్రాడ్యుయేట్ విద్యార్థి స్కాట్ అలన్ చెప్పారు.

నాణ్యమైన, సురక్షితమైన, చౌకయిన కృత్రిమ మాంసం ఉత్పత్తికి అవసరమైన బయోరియాక్టర్లు, బయోప్రాసెస్‌ల అభివృద్ధిపై తాము దృష్టి సారించామని డాక్టర్ మరియానే ఎలిస్ తెలిపారు.

సజీవంగా ఉన్న లేదా ఇటీవలే వధించిన జంతువు నుంచి సేకరించిన ప్రాథమిక కణాలను పెద్దయెత్తున కణాల అభివృద్ధికి ఉపయోగిస్తామని ఆమె చెప్పారు.

ఏ జంతువునూ చంపకుండానే మాంసం ఉత్పత్తి చేయగలగడం ఈ విధానం ప్రత్యేకత, అదే ఇందులో ఆకర్షణీయమైన అంశం. మాంసం కోసం పెంచే జంతువుల వల్ల కలిగే పర్యావరణ సమస్యల గురించి ఆందోళన చెందే మాంసాహారులకు కృత్రిమ మాంసం ఆసక్తికరమే.

చిత్రం శీర్షిక బాత్ విశ్వవిద్యాలయంలో కృత్రిమ మాంసం తయారీ

ఈ మాంసం ఉత్పత్తికి భూమి, నీరు తక్కువగానే అవసరమయ్యే అవకాశముందని, దీని తయారీలో వెలువడే కార్డైన్ డయాక్సైడ్ కూడా తక్కువేనని సంప్రదాయ వ్యవసాయ ఉత్పత్తులకు ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించే స్వచ్ఛంద సంస్థ 'యూరప్ ఆఫ్ ద గుడ్ ఫుడ్ ఇన్‌స్టిట్యూట్' మేనేజింగ్ డైరెక్టర్ రిచర్డ్ పార్ అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మాంసాహారం కోసం కోట్ల కొద్దీ జీవులను భరించలేనంతగా హింసిస్తున్నామని, కృత్రిమ మాంసం అందుబాటులోకి వస్తే ఈ జీవులకు ఈ బాధ నుంచి విముక్తి కల్పించవచ్చని ఆయన తెలిపారు.

ఆహార కల్తీని నిరోధించడానికి కూడా ఇది దోహదం చేస్తుందని రిచర్డ్ పార్ చెప్పారు.

చిత్రం శీర్షిక ఈ మినీ బయో రియాక్టర్‌లో జంతువుల కణాలను వృద్ధి చేస్తున్నారు

'కృత్రిమ మాంసం' రూపంలో ఒక పెద్ద వాణిజ్య అవకాశం తెరపైకి వచ్చిందని, కంపెనీలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వాలు దీనిని అందిపుచ్చుకోవాలని, ఈ పరిశోధనలకు ఊతమివ్వాలని, పెట్టుబడులు పెట్టాలని ఆయన సూచించారు.

కృత్రిమ మాంసం వాడకం వల్ల గ్రీన్‌హౌస్ వాయువుల విడుదల గణనీయంగా తగ్గుతుందని అత్యధిక విశ్లేషణలు చెబుతున్నాయని డాక్టర్ మరియానే ఎలిస్ వెల్లడించారు.

చిత్రం శీర్షిక డాక్టర్ మరియానే ఎలిస్

కృత్రిమ మాంసం వల్ల పర్యావరణానికి మేలు కన్నా కీడు ఎక్కువనే వాదన కూడా ఉంది. కృత్రిమ మాంసం తయారీకి అవసరమయ్యే ఇంధనాన్ని ఎలా ఉత్పత్తి చేస్తారనేదానిపై ఇది పర్యావరణానికి ఎంత మేలు చేస్తుందనేది ఆధారపడి ఉంటుందని బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన జాన్ లించ్ తమ పరిశోధన పత్రంలో పేర్కొన్నారు.

భవిష్యత్తులో సంప్రదాయ వ్యవసాయంతోపాటే కృత్రిమ మాంసం ఉత్పత్తి కూడా ఉంటుందని బాత్ విశ్వవిద్యాలయ పరిశోధకులు చెబుతున్నారు.

ఎప్పుడు వస్తుంది?

ప్రయోగశాల కేంద్రంగా తయారయ్యే కృత్రిమ మాంసం ఐదేళ్ల తర్వాతే విస్తృతంగా అందుబాటులోకి వచ్చే అవకాశముంది. అప్పుడు దీనిని ప్రజలు ఎంత మేర స్వీకరిస్తారనేది చూడాల్సి ఉంది.

బ్రిటన్‌లో నిర్వహించిన సర్వేల్లో దీనిపై మిశ్రమ స్పందన వచ్చింది. కృత్రిమ మాంసాన్ని తింటామని 20 శాతం మంది చెప్పగా, తినబోమని 40 శాతం మంది చెప్పారు. మిగతా 40 శాతం మంది ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)