ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు... అతి చౌక నగరాలు.. ఈ జాబితాలో భారతీయ నగరాలెక్కడ?

  • 20 మార్చి 2019

‘జీవన వ్యయం’(కాస్ట్ ఆఫ్ లివింగ్)లో.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు ఏవి? అత్యంత చౌక నగరాలు ఏవి? అందులో భారతీయ నగరాలు ఎన్నివున్నాయి?

ఈ అంశాలపై 'ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్' సర్వే నిర్వహించింది. లండన్‌కు చెందిన ఈ సంస్థ నిర్వహించిన వార్షిక సర్వేలో అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో ప్యారిస్, హాంగ్‌కాంగ్, సింగపూర్ నగరాలు మొదటి స్థానంలో నిలిచాయి.

ప్రపంచవ్యాప్తంగా 133 నగరాల్లోని ధరలపై అధ్యయనం చేశారు. గత 30 ఏళ్ల సర్వే చరిత్రలో మూడు నగరాలు అగ్ర స్థానంలో నిలవడం ఇదే మొదటిసారి.

గత ఏడాది రెండో స్థానంలో నిలిచిన ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్, ఈసారి మొదటిస్థానంలో నిలిచింది. టాప్-10 దేశాల జాబితాలో చోటు సంపాదించిన ఒకేఒక 'యూరోజోన్’ నగరం ప్యారిస్. యూరోజోన్ అంటే, 'యూరో'ను కరెన్సీగా కలిగిన దేశాలు అని అర్థం.

133 దేశాల్లో ఉన్న... బ్రెడ్ లాంటి సాధారణ పదార్థాలు/వస్తువుల ధరలను సేకరించి, ఒకదానితో మరొక దేశ ధరలను పోల్చి చూశారు. వీటికి న్యూయార్క్ నగరంలోని ధరలను ప్రామాణికంగా తీసుకున్నారు.

హెయిర్ కట్‌కు 8వేలు!

2003 నుంచి ఇప్పటిదాకా ప్యారిస్ నగరం అత్యంత ఖరీదైన టాప్ టెన్ నగరాల్లో ఒకటిగా ఉంటూ వస్తోందని అధ్యయనకారుల్లో ఒకరైన రోక్సానా స్లవ్జోవా అన్నారు.

''వివిధ దేశాల్లో మహిళల హెయిర్‌ కట్ ధరలను పరిశీలిస్తే, ప్యారిస్‌లో రూ. 8,178, స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్ నగరంలో రూ. 5,081, జపాన్‌లోని ఒసాకా నగరంలో 3,672 రూపాయలు ఉంది.

''గృహావసరాలు, వ్యక్తిగత శ్రద్ధ, విహార, వినోద రంగాలు ఐరోపా దేశాల్లో చాలా ఖరీదైనవి. ఈ అంశాల్లో ప్యారిస్ కాస్త మెరుగ్గా ఉంది. బహుశా ప్యారిస్‌లోని పర్యటకరంగం నుంచి ఆదాయం ఎక్కువ ఉండటం కూడా కారణం కావచ్చు'' అని రోక్సానా స్లవ్జోవా అన్నారు.

Image copyright Getty Images

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాలు

1. సింగపూర్ (సింగపూర్)

1. ప్యారిస్ (ఫ్రాన్స్)

1. హాంగ్‌కాంగ్ (చైనా)

4. జ్యూరిక్ (స్విట్జర్లాండ్)

5. జెనీవా (స్విట్జర్లాండ్)

5. ఒసాకా (జపాన్)

7. సియోల్ (దక్షిణ కొరియా)

7. కోపెన్‌హెగన్ (డెన్మార్క్)

7. న్యూయార్క్ (అమెరికా)

10. టెల్ అవీవ్ (ఇజ్రాయెల్)

10. లాస్ ఏంజెలిస్ (అమెరికా)

Image copyright Getty Images

అత్యంత చౌక నగరాల్లో మూడు భారతీయ నగరాలు

ద్రవ్యోల్బణం, అస్థిరమైన ద్రవ్యవిలువల కారణంగా ఈ సంవత్సరం జాబితాలో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. 'జీవన వ్యయం' ఖరీదైన నగరాల జాబితాలో బ్రెజిల్, టర్కీ, వెనెజ్వెలా దేశాలు.. కిందకు వెళ్లాయి.

వెనెజ్వెలాలోని కరాకస్ నగరంలో ద్రవ్యోల్బణం దాదాపు 10,00,000%కు చేరుకుంది. దీంతో వెనెజ్వెలా ప్రభుత్వం కొత్త కరెన్సీ అమల్లోకి తెచ్చింది. ఈ పరిణామాలతో జీవన వ్యయం అత్యంత చౌకగా ఉన్న దేశంగా ఈసారి వెనెజ్వెలా నిలిచింది.

వెనెజ్వెలా రాజధాని కరాకస్ నగరంలో, గత డిసెంబర్ నెలలో.. ఒక వారం రోజుల్లో ఒక కప్పు కాఫీ రెట్టింపై, 42 రూపాయలకు చేరుకుందని బ్లూమ్‌బర్గ్ వెబ్‌సైట్ తెలిపింది.

సిరియాలోని డమాస్కస్ నగరం.. ప్రపంచంలో అత్యంత చవకైన నగరాల్లో రెండో స్థానంలో నిలిచింది. జీవన వ్యయం తగ్గుతున్న ప్రాంతాల సంఖ్య పెరుగుతోంది. ఇందుకు ఆర్థిక, రాజకీయ రంగాలే కారణం అని 'ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్' పేర్కొంది.

ప్రపంచంలో అత్యంత చౌక నగరాలు

1. కరాకస్ (వెనెజ్వెలా)

2. డామస్కస్ (సిరియా)

3. తాష్కెంట్ (ఉజ్బెకిస్తాన్)

4. అల్మాటా (కజక్‌స్థాన్)

5. బెంగళూరు (భారత్)

6. కరాచి (పాకిస్తాన్)

6. లాగుష్ (నైజీరియా)

7. బ్వైనోస్ ఐరీజ్(అర్జెంటీనా)

7. చెన్నై (భారత్)

8. న్యూదిల్లీ (భారత్)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)