గుడ్లు ఎక్కువగా తింటే గుండె జబ్బులు వస్తాయా?

  • 24 మార్చి 2019
ఎగ్ శాండ్‌విచ్ Image copyright Getty Images
చిత్రం శీర్షిక రోజుకు రెండు గుడ్లు తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు, అకాల మరణాలు సంభవించొచ్చని ఈ అధ్యయనం చెబుతోంది.

గుడ్లు తినడం ఆరోగ్యానికి మంచిదా కాదా.. అని కొన్నేళ్లుగా చర్చ జరుగుతోంది. అయితే, మనం వారానికి ఎన్ని గుడ్లు తింటున్నాం అన్నదానిపై అది ఆధారపడి ఉంటుందని 'జామా' మెడికల్ జర్నల్‌లో అచ్చయిన ఓ కొత్త అధ్యయనం చెబుతోంది.

గుడ్డులో ఉండే పచ్చసొనలో కొవ్వు శాతం అధికంగా ఉంటుంది కాబట్టి, రోజుకు రెండు గుడ్లు తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు, అకాల మరణాలు సంభవించొచ్చని ఈ అధ్యయనం చెబుతోంది.

రోజులో మనం తీసుకునే కొవ్వుపదార్థాలు 300 మిల్లీగ్రాములకు మించరాదని ప్రపంచ ఆరోగ్యసంస్థ చెబుతోంది. కానీ ఒక నాణ్యమైన గుడ్డులో దాదాపు 185 మిల్లీగ్రాముల కొలెస్టరాల్ ఉంటుందని అమెరికా వ్యవసాయ శాఖ చెబుతోంది. అంటే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న లెక్కలో సగానికిపైగా కొవ్వుపదార్థం ఒక గుడ్డులో ఉంటుంది.

ప్రమాద శాతం ఎంత?

17 సంవత్సరాలు దాటిన 30 వేలమందిపై ఈ అధ్యయనం చేశారు. వీరిపై ఆరు రకాల ప్రయోగాలు నిర్వహించి, ఫలితాలను విశ్లేషించారు.

రోజుకు 300 మి.గ్రా. కొవ్వుపదార్థాలను తీసుకోవడం ద్వారా గుండె జబ్బు వచ్చే ప్రమాదం 17%, అకాల మరణం సంభవించే ప్రమాదం 18% పెరుగుతుందని ఈ అధ్యయనం చెబుతోంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక గుడ్లను ఇష్టపడేవారికి.. 'కేవలం తెల్ల సొనను మాత్రమే తినొచ్చు' అని సలహా కూడా ఇస్తున్నారు.

ఇక గుడ్డు విషయానికి వస్తే, వారానికి 3-4 గుడ్లు తినడంవల్ల గుండెజబ్బు వచ్చే ప్రమాదాలు 6%, అకాల మరణాల ప్రమాదం 8% పెరుగుతాయని అధ్యయనకారులు చెబుతున్నారు.

కానీ రోజుకు రెండు గుడ్లు తినడం వల్ల మాత్రం, ఈ ప్రమాద శాతం 27%, 34% ఉందని చెబుతున్నారు.

హెచ్చరిక

అధ్యయనంలో పాల్గొన్నవారి వయసు, వారి శారీరక పటుత్వం, పొగాకు వాడకం, వారిలో అంతకుముందే రక్తపోటు, మొదలైన సమస్యలుండటం లాంటి విషయాలను పరిగణలోకి తీసుకోలేదు.

''ఇద్దరు వ్యక్తులకు ఒకేరకమైన ఆహారం ఏర్పాటు చేసి, అందులో ఒకరికి అదనంగా ఒక గుడ్డు ఇచ్చినపుడు, రెండో వ్యక్తికంటే, గుడ్డు తిన్న వ్యక్తికి గుండె జబ్బు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తేలింది'' అని అధ్యయనకారుల్లో ఒకరైన అసోసియేట్ ప్రొఫెసర్ నోరినా అల్లెన్ అన్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక మితంగా గుడ్లు తినడం ద్వారా అనారోగ్య సమస్యలనుంచి తప్పించుకోవచ్చు

గత అధ్యయనాలకు భిన్నం

గుడ్డు తినడానికి, గుండె జబ్బు ప్రమాదాలకు సంబంధం లేదని చెప్పిన గత అధ్యయనాలకంటే, ఈ తాజా అధ్యయనం భిన్నమైన ఫలితాలనిచ్చింది. గతంలో అధ్యయన సమయం తక్కువగా ఉందని, అధ్యయనం కోసం సేకరించిన నమూనాలు కూడా తక్కువేనని అల్లెన్ అన్నారు.

గతంలో అధ్యయనం చేసినవారు మాట్లాడుతూ, ఎన్నిసార్లు గుడ్డు తిన్నారు.. అన్న సమాచారాన్ని తాము ఒక ప్రశ్నావళి ద్వారా సేకరించామని, అధ్యయనంలో పాల్గొన్నవారు కొన్ని నెలలుగా తాము తీసుకుంటున్న ఆహారాన్ని గుర్తుకుతెచ్చుకుని సమాధాన పత్రంలో నింపారని తెలిపారు.

అయితే, తాజా అధ్యయన ఫలితాలు పరిశీలనాత్మకమే కానీ, గుడ్లు తినడం కారణంగా గుండె జబ్బులు, అకాల మరణాలు సంభవిస్తాయని రుజువు చేయలేవని మరికొందరు నిపుణుల అభిప్రాయం.

''అమెరికా జనాభాలోని భిన్న జాతులవారికి ప్రాతినిధ్యం కల్పించి, అమెరికాలోని సాధారణ ప్రజలు తీసుకునే ఆహారంపై అధ్యయనం చేశారు. ఈ విషయాలే ఈ అధ్యయనానికి బలం చేకూరుస్తున్నాయి'' అని లండన్‌లోని కింగ్స్ కాలేజ్‌కు చెందిన టామ్ శాండర్స్ అన్నారు.

మరి.. రోజుకు ఎన్ని గుడ్లు తినాలి?

వారానికి మూడు గుడ్లకు మించి తినరాదని అధ్యయనకారులు అల్లెన్ చెబుతున్నారు. గుడ్లను ఇష్టపడేవారికి.. 'కేవలం తెల్ల సొనను మాత్రమే తినొచ్చు' అని సలహా కూడా ఇస్తున్నారు.

''గుడ్లు తినడం పూర్తిగా ఆపేయాలని నేను వాదించడం లేదు. కానీ కాస్త మితంగా తినాలని సలహా ఇస్తున్నాను'' అన్నారు.

ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్- 2015 లెక్కల ప్రకారం, ప్రపంచంలో ఒక సంత్సరానికి తలసరి గుడ్డు వినియోగం ఇలా ఉంది.
దేశం తలసరి వినియోగం
మెక్సికో 352
మలేసియా 342
జపాన్ 329
రష్యా 285
అర్జెంటీనా 256
చైనా 254.8
అమెరికా 252
డెన్మార్క్ 245

''అమెరికాలో ఒక వ్యక్తి రోజుకు తీసుకోదగిన సగటు కొలెస్టరాల్ 600మి.గ్రా. ఉంటే, ఇంగ్లండ్‌లో రోజుకు దాదాపు 225మి.గ్రా. ఉండొచ్చు'' అని టామ్ శాండర్స్ అన్నారు.

కానీ ఇటర్నేషనల్ ఎగ్ కమిషన్ - 2015 గణాంకాల ప్రకారం, ఒక వ్యక్తి సంవత్సర కాలంలో తీసుకునే గుడ్ల సంఖ్య 252 మాత్రమే. కానీ అమెరికాలో సంభవించే మరణాల్లో 20%, గుండెజబ్బులకు సంబంధించిన మరణాలే!

జపాన్‌లో ఒక వ్యక్తి సంవత్సరానికి 328 గుడ్లు తింటుంటే, అక్కడ గుండెజబ్బు కారణంగా మరణించేవారు కేవలం 11% మాత్రమే.

''వారానికి 3-4 గుడ్లు వరకు తినడం మంచిదే'' అన్నది నిపుణుల అభిప్రాయం.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)