ఆలయ భూముల ఆక్రమణ‌లను క్రమబద్ధీకరిస్తామని డీఎంకే చెప్పిందా - Fact Check

  • 23 మార్చి 2019
మధు పూర్ణిమ కిష్వర్ Image copyright Getty Images
చిత్రం శీర్షిక మధు పూర్ణిమ కిష్వర్

తమిళనాడులో డీఎంకే లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను లక్ష్యంగా చేసుకొని రచయిత, విద్యావేత్త మధు పూర్ణిమ కిష్వర్ చేసిన ఒక ట్వీట్ చర్చనీయమైంది.

''ఆలయ భూములను ఆక్రమించుకొన్న వారికి వాటిని క్రమబద్ధీకరిస్తాం, వాటిపై యాజమాన్య హక్కు కల్పిస్తాం అని డీఎంకే మేనిఫెస్టోలో 112వ పేజీలో ఉంది. ఆక్రమణకు గురైన భూములను స్వాధీనం చేసుకొని తిరిగి వక్ఫ్‌ బోర్డ్‌కు అప్పగిస్తాం అని 85వ పేజీలో ఉంది'' అని ఆమె ట్వీట్‌లో రాశారు.

Image copyright Twitter/MadhuPurnima Kishwar

ఈ ట్వీట్‌ను పెద్దసంఖ్యలో ట్విటర్ యూజర్లు చూశారు. వేల సంఖ్యలో షేర్ కూడా చేశారు.

కానీ ఆమె ట్వీట్‌లో చెప్పిన మాటలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Image copyright Facebook/MK Stalin
చిత్రం శీర్షిక ఎంకే స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే ఈ నెల 19న లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది.

ఈ నెల 19న ప్రకటించించిన డీఎంకే లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టో ఆ పార్టీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.

మేనిఫెస్టోలోని మొత్తం పేజీలు 76 మాత్రమే. మధు కిష్వర్ చెప్పిన పేజీలు 85, 112 అందులో లేనే లేవు.

మధు కిష్వర్ ట్వీట్‌పై డీఎంకే అధికార ప్రతినిధి మనురాజ్ ఎస్ ట్విటర్‌లో స్పందిస్తూ- ఇది నకిలీ వార్త అని ఆయన ఖండించారు.

మేనిఫెస్టోలో వక్ఫ్ బోర్డు గురించిగాని, ఆక్రమణల గురించిగాని ప్రస్తావనే లేదు. అందులో మత వ్యవహారాల ప్రస్తావన ఆఖరి అధ్యాయంలో ఉంది. మతాన్ని, మత సామరస్యాన్ని కాపాడతామని మాత్రమే అందులో ఉంది.

మధు కిష్వర్ ట్వీట్‌లోని సమాచారం డీఎంకే 2016 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోకు కొంచెం దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తోంది.

ఆక్రమణలకు గురైన వక్ఫ్ భూములను తిరిగి స్వాధీనం చేసుకొని, వాటికి రక్షణ కల్పిస్తామని నాటి మేనిఫెస్టోలోని 85వ పేజీలో ఉంది.

ఆలయ భూములను రక్షిస్తామని 111వ పేజీలో హిందూ మత, ధార్మిక ఎండోమెంట్ విభాగం(హెచ్‌ఆర్‌సీఈ) ఉపశీర్షిక కింద రాసి ఉంది.

Image copyright Twitter

ఆలయ భూములపై ఆలయ ట్రస్టు కౌలు వసూలు వ్యవహారాలను క్రమబద్ధీకరిస్తామని, ఆలయాలకు చెందిన ఖాళీ భూముల పరిరక్షణకు భూనిధి ఏర్పాటు చేస్తామని డీఎంకే అందులో పేర్కొంది.

చట్ట నిబంధనలకు లోబడి ఆలయ భూముల కొనుగోలుకు ముందుకు వస్తున్న ప్రజల డిమాండ్లు పరిశీలించేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని కూడా అందులో రాశారు.

2016 మేనిఫెస్టోలో వక్ఫ్ భూములే కాదు ఆలయ భూముల పరిరక్షణ గురించి కూడా డీఎంకే హామీ ఇచ్చింది.

2019 మేనిఫెస్టోలో మధు కిష్వర్ ట్వీట్‌లో చెప్పినవి లేవు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)