ఐపీఎల్‌: టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్

  • 24 మార్చి 2019
డేవిడ్ వార్నర్ Image copyright Getty Images
చిత్రం శీర్షిక డేవిడ్ వార్నర్

ఐపీఎల్ క్రికెట్ టోర్నీలో 'సన్‌రైజర్స్ హైదరాబాద్' తన తొలి మ్యాచ్ ఆడుతోంది. కోల్‌కతా వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడుతోంది.

టాస్ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలింగ్ ఎంచుకుంది.

Image copyright Getty Images

కోహ్లీ సేనపై ధోనీ సేన విజయం

కాగా శనివారం ప్రారంభమైన ఐపీఎల్ 2019లో తొలి రోజున చైన్నై సూపర్‌కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య పోరు క్రికెట్ అభిమానులను కాసింత నిరాశపరిచింది. ఐపీఎల్ అంటేనే సిక్సర్ల మోత, ఫోర్ల వరద ఉంటుంది.. స్కోరు బోర్డు పరుగులు తీస్తుందన్న అంచనాలతో వచ్చిన అభిమానులకు తొలి మ్యాచ్ అలాంటి అనుభవాన్ని ఇవ్వలేకపోయింది.

రెండు జట్లూ పరుగులు సాధించడానికి తంటాలు పడడంతో క్రికెట్ ప్రేమికుల్లో ఉత్సాహం చల్లారింది. చెన్నై చెపాక్‌ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కేవలం 70 పరుగులకే కుప్పకూలగా ఆ చిన్నపాటి లక్ష్యాన్ని సాధించడానికి చెన్నై సూపర్‌కింగ్స్ కూడా 17.4 ఓవర్లు వరకు ఆడారు.

రెండు జట్లలోనూ టాప్ ప్లేయర్స్ ఉన్నప్పటికీ అభిమానులను అలరించడంలో మాత్రం తడబడ్డారు.

Image copyright Getty Images

రాయల్ చాలెంజర్స్ జట్టులో కోహ్లి, డివిలియర్స్‌ లాంటి బ్యాట్స్‌మెన్‌ ఉన్నా భారీ షాట్లు, స్కోరు లేకపోయింది. మరోవైపు చెన్నై సూపర్‌కింగ్స్ జట్టులోనూ ఆటగాళ్లు తమ బ్యాట్లను ఝుళింపించలేదు. మూడు వికెట్లు కోల్పోయి ఆ జట్టు విజయం సాధించడంతో ధోనీకి బ్యాటింగ్ అవకాశం రాలేదు.

అయితే.. సొంత గడ్డపై చెన్నై సూపర్‌కింగ్స్ విజయంతో బోణీ చేయడం మాత్రం అక్కడి అభిమానులను ఉత్సాహపరిచింది.

Image copyright Getty Images

రైనా ఒక్కడికే ఆ రికార్డు

ఐపీఎల్ ఈ సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌లో 5 వేల పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు.

ఈ మ్యాచ్‌‌లో 19 పరుగులు చేసిన రైనా ఐపీఎల్‌లో 5వేల పరుగుల క్లబ్‌ ప్రారంభించాడు. ఈ మ్యాచ్‌కు ముందు రైనా 4,985 పరుగులు చేసి ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు.

కాగా రాయల్‌ చాలెంజర్స్ ఆటగాడు విరాట్ కోహ్లీ 4,954 పరుగులతో రైనా తరువాత రెండో స్థానంలో ఉన్నాడు.

ఇదీ షెడ్యూల్

Image copyright IPLT20.com
చిత్రం శీర్షిక ఐపీఎల్ షెడ్యూల్

కాగా సన్ రైజర్స్ హైదరాబాద్ 8 మ్యాచ్‌లను హైదరాబాద్‌లోనే ఆడనుంది.

మార్చి 29న రాజస్తాన్ రాయల్స్‌తో, మార్చి 31న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో హైదరాబాద్‌లో సన్‌రైజర్స్ తలపడనుంది.

ఏప్రిల్ 6న ముంబయి ఇండియన్స్‌తో, ఏప్రిల్ 14న దిల్లీ కేపిటల్స్‌తో, ఏప్రిల్ 17న చెన్నై సూపర్‌కింగ్స్‌తో, ఏప్రిల్ 21న కోల్‌కత్ నైట్‌రైడర్స్‌తో, ఏప్రిల్ 29న కింగ్స్ లెవన్ పంజాబ్‌తో సన్‌రైజర్స్ జట్టు హైదరాబాద్ వేదికగా ఆడనుంది.

Image copyright Iplt20.com
చిత్రం శీర్షిక ఐపీఎల్ షెడ్యూల్

మార్చి 23న మొదలైన ఐపీఎల్ 2019 మే మొదటివారం వరకు కొనసాగుతుంది.

2016లో విజేతగా నిలిచిన సన్‌రైజర్స్ జట్టు ఈ ఏడాది టోర్నీలో ఎలాంటి ఫలితం సాధిస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)