ఆస్ట్రేలియాలో లైంగిక వేధింపులు: భారత్, దక్షిణాసియా అమ్మాయిలకు ఇబ్బందులు

  • 25 మార్చి 2019
ఆస్ట్రేలియాలో అమ్మాయి Image copyright Getty Images

రియా సింగ్ (ఆమె విజ్ఞప్తి మేరకు పేరు మార్చాం) రోజూ వెళ్తున్నట్లుగానే ఆరోజు సిడ్నీ సెంట్రల్ స్టేషన్ నుంచి విశ్వవిద్యాలయానికి వెళ్తున్నారు. విశ్వవిద్యాలయం బస్సు ఎక్కారు. బస్సు కదిలిన కొద్దిసేపటికే అందులో ఉన్న పురుష సిబ్బంది ఆమెను అసభ్యకరంగా తాకడం, నెట్టడం మొదలుపెట్టారు.

’’అలా 20 నిమిషాల పాటు నన్ను వేధించారు. భయమేసింది, ఏం చేయాలో అర్థం కాలేదు. విశ్వవిద్యాలయంలో ఎవరికి ఫిర్యాదు చేయాలో కూడా తెలియదు. ఈ విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్తే వాళ్లు ఇబ్బందిపడతారు. నా తమ్ముడితోనూ చెప్పలేను. నాకు సన్నిహితంగా ఉండే అమ్మాయికి చెప్పాను. కానీ, తనకు కూడా ఏం చేయాలో తెలియదు" అని రియా తనకు ఎదురైన ఆ చేదు అనుభవం గురించి వివరించారు.

ఆ ఘటన 2017లో జరిగింది. ఆస్ట్రేలియాలోని విశ్వవిద్యాలయాల్లో లైంగిక దాడులు, వేధింపులపై ఆస్ట్రేలియా మానవ హక్కుల సంఘం (ఏహెచ్‌ఆర్‌సీ) ఒక నివేదిక విడుదల చేసింది. వేధింపులను ఎదుర్కోవడంపై మహిళల్లో అవగాహన పెంచే అంశాలను కూడా అందులో పేర్కొంది.

’’వేధింపులను ఎదుర్కొంటూ, ఏమీ చేయలేని స్థితిలో మౌనంగా ఉండిపోవడం పట్ల నా మీద నాకే ఆగ్రహం కలిగింది. దక్షిణాసియా దేశాల ప్రజలు లైంగిక వేధింపుల గురించి బహిరంగంగా మాట్లాడేందుకు సంకోచిస్తారు. ఆ విషయాలను బయటకు చెబితే కుటుంబం పరువు పోతుందన్న భావన ఉంది. అయితే, మానవ హక్కుల సంస్థ నివేదిక వచ్చిన తర్వాత మాలో అవగాహన పెరిగింది. ఎవరైనా తమపై వేధింపులకు పాల్పడితే ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఎవరి సహాయం తీసుకోవాలి? అన్న విషయాలు తెలిశాయి" అని రియా చెప్పారు.

భారత్‌కు చెందిన రియా సింగ్ చిన్నతనంలోనే తన తల్లిదండ్రులతో కలిసి ఆస్ట్రేలియా వచ్చారు.

2015, 2016లో విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులపై లైంగిక వేధింపుల కేసుల్లో 22 శాతం విశ్వవిద్యాలయానికి వెళ్లేటప్పుడు లేదా తిరుగు ప్రయాణంలో జరిగాయని, 51 శాతం కేసులు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో జరిగాయని మానవ హక్కుల సంస్థ తెలిపింది.

Image copyright Getty Images

మద్యం తాగించి రేప్ చేశాడు

సింగపూర్ నుంచి చదువుకునేందుకు ఆస్ట్రేలియా వచ్చిన ఇమిలీ లీ (పేరు మార్చాం) కూడా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని మాతో పంచుకున్నారు.

’’ఓసారి నా స్నేహితుడు కలుద్దామని పిలిచాడు. బలవంతంగా వెళ్లాను. కొద్దిగా ఆల్కహాల్ సేవించాం. తర్వాత అతడు బలవంతంగా నాతో సెక్స్ చేయడం ప్రారంభించాడు. అప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. తిరిగి ఇంటికి వచ్చాను, మాకు సెక్స్ గురించి అవగాహన లేదు. అంతకుముందు ఆల్కహాల్ కూడా నాకు అలవాటు లేదు. నా మీద నాకే అసహ్యం వేసింది. ఆ విషయం గురించి కొన్నేళ్ల వరకూ ఎవరికీ చెప్పలేదు" అని ఇమిలీ చెప్పారు.

ఇటీవల ఆమె అతడి పేరును బయటపెట్టారు. తన అంగీకారం లేకుండా ఆరోజు అతడు చేసిన సెక్స్ రేప్‌ అవుతుందని ఆమె తెలుసుకున్నారు.

"లైంగిక అంగీకారం అంటే ఏమిటి? అనంగీకారం అంటే ఏమిటి? అన్న విషయాలపై నాకు అవగాహన ఉండి ఉంటే అప్పుడే అతన్ని అడ్డుకునేదాన్ని’’ అని ఆమె అంటున్నారు.

Image copyright Getty Images

విదేశీ విద్యార్థులే బాధితులు

ఆస్ట్రేలియా జాతీయ మహిళా మండలి సభ్యురాలు బెల్లే లిమ్ మాట్లాడుతూ... ’’శృంగార స్వేచ్ఛ అధికంగా ఉండే ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో అడుగుపెట్టే ముందు విద్యార్థుల్లో లైంగిక అంగీకారం గురించి అవగాహన పెంచాలి. లైంగిక విద్య, అవగాహన లేని ఆసియా దేశాల విద్యార్థులు ఎక్కువగా లైంగిక వేధింపుల బాధితులుగా మారుతున్నారు. ఏది వేధింపు? ఏది వేధింపు కాదు అన్న అవగాహన వారిలో లోపించడం వల్ల వారు ఫిర్యాదు చేయలేకపోతున్నారు" అని వివరించారు.

ఆసియా దేశాల నుంచి ఆస్ట్రేలియా లాంటి దేశాలకు చదువుల కోసం వెళ్లేవారు, అక్కడ పరిస్థితులను అర్థం చేసుకోలేక ఇలా బాధితులుగా మారుతున్నారు.

"ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లోని విశ్వవిద్యాలయంలో చేరినప్పుడు నాకు 18 ఏళ్లు. అప్పుడే చాలామంది మద్యం సేవించడాన్ని చూశాను, మాదక ద్రవ్యాలు తీసుకోవడం, అసభ్యంగా తాకడం లాంటివి చూస్తే నాకు చిరాకుగా అనిపించేది. ఓ రోజు మా కాలేజీ క్యాంపస్‌లో నలుగురు అబ్బాయిలు నగ్నంగా తిరుగుతూ కనిపించారు. అది చూసి ఇదేమి అలవాటు అనిపించింది. అదృష్టం కొద్ది నాకు కొంతమంది మంచి స్నేహితులు దొరికారు. కానీ, విదేశీ విద్యార్థిని అన్న భావన మాత్రం ఉండేది" అని శ్రీలంకకు చెందిన దేవనా సెననయాకె వివరించారు.

ఆస్ట్రేలియా మానవ హక్కుల సంస్థ నిర్వహించిన సర్వేలో 39 విశ్వవిద్యాలయాలకు చెందిన 30,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 2015, 2016లో 5.1 శాతం మంది విదేశీ విద్యార్థులు లైంగిక దాడులకు గురయ్యారని తేలింది. బాధితుల్లో 1.4 శాతం మందిపై విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లోనే లైంగిక వేధింపులు జరిగినట్లు వెల్లడైంది. బాధితుల్లో ఎక్కువగా మహిళలే ఉంటున్నారు.

"విదేశాల నుంచి వచ్చే విద్యార్థులకు అండగా నిలిచేవారు లేకపోవడం వల్ల వారి మీద ఇలాంటి దాడులు జరగడానికి ఒక కారణమని అర్థమవుతోంది. కళాశాలతో పోల్చితే పనిచేసే చోట ఇలాంటి వేధింపులు మరింత ఎక్కువగా ఉంటున్నాయి" అని మానవహక్కుల సంఘం కమిషనర్ కేట్ జెంకిన్స్ తెలిపారు.

ఇలాంటి దాడులను, వేధింపులను అరికట్టేందుకు బాధితులకు అండగా నిలిచేందుకు విశ్వవిద్యాలయాలు బాధ్యతాయుతమైన చర్యలు చేపట్టాలంటూ విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, లైంగిక వేధింపుల బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

Image copyright Getty Images

2018లో దక్షిణాసియాకు చెందిన దాదాపు 100 మంది విద్యార్థులు సాయం కోసం 'ఎండ్ రేప్ ఆన్ క్యాంపస్ ఆస్ట్రేలియా(ఈఆర్‌ఓసీ) ' అనే సంస్థను సంప్రదించారు.

"సాధారణంగా దక్షిణాసియాకు చెందిన విద్యార్థులు ఇలాంటి విషయాలపై ఫిర్యాదులు చేసేందుకు పెద్దగా ముందుకు రారు. కానీ, వారిలోనూ ఇప్పుడు అవగాహన పెరుగుతోంది. కాబట్టి, మా వద్దకు సాయం కోసం వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది. విద్యార్థులకు విశ్వవిద్యాలయాలు చెబుతున్న విషయాలు సాంస్కృతికంగా సరిగా ఉండటంలేదు. ఏఏ విషయాలపై ఫిర్యాదు చేయవచ్చన్నది చాలామంది విద్యార్థులకు తెలియడం లేదు. చాలామంది ఫిర్యాదు చేస్తే ఆ విషయం తమ ఇంట్లో తెలిసిపోతుందని, దాంతో కుంటుంబం పరువు పోతుందన్న భయంతో ముందుకు రావడం లేదు" అని ఈఆర్‌ఓసీ వ్యవస్థాపకులు, డైరెక్టర్ షర్నా బ్రెమ్మెర్ అంటున్నారు.

Image copyright Getty Images

87 శాతం మంది లైంగిక దాడుల బాధితులు, 94 శాతం మంది లైంగిక వేధింపుల బాధితులు తమ విశ్వవిద్యాలయాల్లో ఫిర్యాదు చేయలేదని మానవ హక్కుల సంఘం సర్వేలో వెల్లడైంది. వీసాకు సంబంధించిన సమస్యలు వస్తాయేమో అన్న భయంతో చాలామంది విద్యార్థులు ముందుకు రాకపోవడానికి ఒక కారణని తేలింది.

"ఫిర్యాదు చేసిన విద్యార్థుల్లో చాలామంది విశ్వవిద్యాలయ అధికారుల నుంచి వచ్చిన స్పందనపట్ల సంతృప్తిగా లేరు. కౌన్సిలింగ్ ఇవ్వడం, అసైన్‌మెంట్లను పొడిగించడం లాంటి చర్యలకు మించి నిందితులపై విశ్వవిద్యాలయాల యాజమాన్యాలు ఎలాంటి చర్యలూ తీసుకోవట్లేదు. దాంతో, ఫిర్యాదు చేసినా ఫలితం ఉండదన్న అభిప్రాయం విద్యార్థుల్లో ఏర్పడుతోంది. అందుకే మౌనంగా ఉండిపోతున్నారు" అని బ్రెమ్మెర్ అంటున్నారు.

విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులు, ట్యూటర్ల నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న వారిలో అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కంటే రెట్టింపు సంఖ్యలో పీజీ విద్యార్థులు ఉంటున్నారని సర్వేలో వెల్లడైంది.

Image copyright Getty Images

సెక్స్ గురించి అవగాహన కల్పించేందుకు ఆన్‌లైన్‌లో పాఠ్యాంశాలను అందిస్తూ, ఆ కోర్సులను విద్యార్థులు తప్పనిసరిగా పూర్తి చేసేలా నిబంధన పెట్టడం ద్వారా లైంగిక దాడులను తగ్గించే వీలుంటుందని మెల్‌బోర్న్ కేంద్రంగా పనిచేసే సెంటర్ ఫర్ కల్చర్ నిర్వాహకులు అలిసన్ సీల్హో అభిప్రాయపడ్డారు. వివిధ దేశాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం ఆయా దేశాల సంస్కృతులకు అనుగుణంగా ఆ పాఠ్యాంశాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

అయితే, విదేశీ విద్యార్థుల కోసం ప్రత్యేక అవగాహనా తరగతులు నిర్వహిస్తున్నామని, కౌన్సిలింగ్‌తో పాటు అంగీకరించకూడని విషయాలేమిటో వివరిస్తున్నామని యూనివర్సిటీస్ ఆఫ్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ కాట్రియోనా జాక్సన్ చెప్పారు.

విశ్వవిద్యాలయంలో చేరేటప్పుడు, బయటకు వెళ్లేటప్పుడు కూడా వారికి భద్రతకు సంబంధించిన సమాచారం అందిస్తున్నామని తెలిపారు.

Image copyright Getty Images

దిల్లీకి చెందిన దీక్షా దాహియా తాజాగా మెల్‌బోర్న్‌లోని మొనాష్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ కోర్సు పూర్తి చేశారు. ’’మా విశ్వవిద్యాలయంలో అవగాహనా కార్యక్రమాలు చాలా బాగున్నాయి. సామాజిక నియమాలు, లైంగిక ప్రవర్తన, మానవ సంబంధాలు, ఆల్కహాల్‌ వంటి విషయాలతో పాటు ఆపదలో ఉన్నప్పుడు సాయం కోసం సంప్రదించాల్సిన వివరాలను అందిస్తారు. అలాంటి విషయాలపై భారత్‌లో పెద్దగా మాట్లాడరు" అని దీక్షా చెప్పారు.

ఆస్ట్రేలియాలో చదివే విదేశీ విద్యార్థుల్లో చైనా, భారత్‌ నుంచే అత్యధికంగా ఉంటున్నారు. 2017లో 6,24,001 విదేశీ విద్యార్థులు ఆస్ట్రేలియాలో చదివేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అందులో 30 శాతం (231,191 మంది)తో చైనా ప్రథమ స్థానంలో ఉంది. భారత్ నుంచి 87,615 మంది (11 శాతం) విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)