డోనల్డ్ ట్రంప్: రష్యాతో కుమ్మక్కు కాలేదన్న ముల్లర్ రిపోర్ట్

  • 25 మార్చి 2019
డోనల్డ్ ట్రంప్ Image copyright Reuters

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్.. 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యాతో కలిసి కుట్ర చేయలేదని ఈ అంశంపై ఆదివారం కాంగ్రెస్‌ (పార్లమెంటు)కు సమర్పించిన రాబర్ట్ ముల్లర్ నివేదిక సారాంశం పేర్కొంది.

అయితే.. ట్రంప్ అక్రమంగా న్యాయప్రక్రియకు ఆటంకం కలిగించారా అనే అంశంపై ప్రత్యేక న్యాయవాది రాబర్ట్ ముల్లర్ సంక్షిప్త నివేదిక ఎటువంటి నిర్ధారణా చేయలేదు. దీంతో అధ్యక్షుడికి నిందారోపణల నుంచి ఇంకా విముక్తి లభించలేదు.

ముల్లర్ నివేదికను కాంగ్రెస్ కోసం అటార్నీ జనరల్ విలియం బార్ సంక్షిప్తీకరించారు.

నివేదికపై ట్రంప్ ట్వీట్ చేస్తూ ''కుమ్మక్కూ లేదు.. ఆటంకమూ లేదు'' అని వ్యాఖ్యానించారు.

రష్యా జోక్యం అంశంపై దర్యాప్తును రాజకీయ కక్షసాధింపు అని పదే పదే విమర్శించిన ట్రంప్.. ''దేశం ఇదంతా చవిచూడాల్సి రావటం సిగ్గుచేటు'' అని ఆదివారం పేర్కొన్నారు. ఈ విచారణ ఒక ''విఫలమైన అక్రమ దాడి'' అని అభివర్ణించారు.

ముల్లర్ రెండేళ్ల పాటు దర్యాప్తు చేసి ఈ నివేదికను రూపొందించారు. ఇందులో భాగంగా అధ్యక్షుడు ట్రంప్‌కు అత్యంత సన్నిహితులైన సహాయకుల మీద కోర్టులో విచారణ జరిగింది. కొందరు జైలు శిక్షకు కూడా గురయ్యారు.

''అధ్యక్షుడు నేరం చేసినట్లు ఈ నివేదిక నిర్ధరించటం లేదు.. అలాగని ఆయనను ఆరోపణల నుంచి నిర్దోషిగా విముక్తి కల్పించటమూ లేదు'' అని ముల్లర్ తన నివేదికలో రాశారు.

Image copyright Getty Images

నివేదిక సారాంశం ఏమిటి?

2016 అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేయటానికి రష్యా ప్రయత్నాలకు సంబంధించి నిర్వహించిన దర్యాప్తులో వెల్లడైన అంశాలను అటార్నీ జనరల్ బార్ తన సంక్షిప్త లేఖలో వివరించారు.

''ఏ అమెరికా వ్యక్తి కానీ, ట్రంప్ ప్రచార బృంద అధికారి ఎవరైనా కానీ రష్యాతో కలిసి కుట్ర చేశారని కానీ లేదంటే తెలిసి రష్యాతో సమన్వయంతో పనిచేశారని కానీ ప్రత్యేక న్యాయవాది కనుగొనలేదు'' అని బార్ తన లేఖలో పేర్కొన్నారు.

ఆ లేఖలోని రెండో భాగం.. న్యాయప్రక్రియకు ఆటంకం కలిగించే అంశానికి సంబంధించినది. ప్రత్యేక న్యాయవాది నివేదిక ''చివరికి సంప్రదాయబద్ధమైన విచారాణాత్మక నిర్ధారణ చేయరాదని గట్టిగా భావించింది'' అని బార్ చెప్పారు.

''కాబట్టి ప్రత్యేక న్యాయవాది ఎటువంటి నిర్థారణకూ రాలేదు - పరిశీలించిన ప్రవర్తన ఆటంకం కలిగించటం అవుతుందా కాదా అనేది ఎటూ తేల్చలేదు'' అని ఆ లేఖ చెప్తోంది.

Image copyright Getty Images

''అధ్యక్షుడు న్యాయ ప్రక్రియకు అవరోధం కలిగించి నేరానికి పాల్పడ్డారని నిరూపించటానికి'' తగినన్ని ఆధారాలు లేవని బార్ పేర్కొన్నారు.

పూర్తి నివేదికలోని మరిన్ని అంశాలను తాను విడుదల చేస్తానని.. కానీ అందులోని కొన్ని అంశాలు ఆంక్షలకు లోబడి ఉన్నాయని అంటూ బార్ తన లేఖను ముగించారు.

''ఈ పరిమితుల నేపథ్యంలో.. ఈ నివేదికలోని ఏ అంశాలను చట్టం ప్రకారం బహిరంగ పరచలేమోనన్నది ఈ శాఖ ఎంత త్వరగా గుర్తిస్తుందనే అంశం మీద.. ఈ నివేదికను పరిశీలించే షెడ్యూల్ ఆధారపడి ఉంటుంది'' అని వివరించారు.

అమెరికా రాజకీయ నాయకులు ఎలా స్పందించారు?

న్యాయ ప్రక్రియను ట్రంప్ అడ్డుకుని ఉండొచ్చునన్న అంశాన్ని అటార్నీ జనరల్ కొట్టివేయలేదని ప్రతినిధుల సభ జ్యుడీషియరీ కమిటీకి సారథ్యం వహిస్తున్న డెమొక్రటిక్ కాంగ్రెస్ సభ్యుడు జెర్రీ నాడ్లర్ వ్యాఖ్యానించారు.

''న్యాయప్రక్రియను అడ్డుకోవటానికి అధ్యక్షుడు ప్రయత్నించి ఉండవచ్చునని బార్ చెప్తున్నారు. కానీ ఇలా అడ్డుకోవటంలో దోషిగా నిర్ధారించటానికి 'ఒక వ్యక్తి దురుద్దేశంతో వ్యవహరిస్తూ అవరోధం కలిగించేవిధంగా ప్రవర్తించారని సందేహానికి తావులేని విధంగా ప్రభుత్వం నిరూపించాల్సి ఉంటుంది'' అని ఆయన పేర్కొన్నారు.

''కోర్టులో విచారించదగ్గ నేరపూరిత కుట్ర''కు మద్దతుగా సాక్ష్యం లేనప్పటికీ.. ట్రంప్ రాజీపడ్డారా లేదా అనే దానిపై ప్రశ్నలు అలాగే ఉన్నాయి'' అని సెనేట్ జ్యుడీషియరీ కమిటీ సభ్యుడు, డెమొక్రటిక్ సెనెటర్ రిచర్డ్ బ్లూమెంథాల్ స్పందించారు.

బార్ లేఖ ''ఇస్తున్న సమాధానాలు చాలా ప్రశ్నలను లేవనెత్తుతోంది'' అని.. పూర్తి నివేదికను అందించాలని ప్రతినిధుల సభ స్పీకర్, డెమొక్రటిక్ సభ్యురాలు నాన్సీ పెలోసీ, సెనేట్‌లో డెమొక్రటిక్ నాయకుడు చుక్ చూమర్ ఒక సంయుక్త ప్రకటనలో పిలుపునిచ్చారు.

ఈ నివేదికలో వెల్లడైన అంశాలు ''అధ్యక్షుడిని ఆరోపణల నుంచి పూర్తిగా విముక్తం చేశాయి'' అని అధ్యక్ష భవనం వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ సారా సాండర్స్ అభివర్ణించారు.

ఈ నివేదిక ''నేను ఊహించిన దానికన్నా ఉత్తమంగా ఉంది'' అని ట్రంప్ న్యాయవాది రూడీ గిలియానీ చెప్పారు.

ఇది ''శుభ వార్త'' అంటూ రిపబ్లికన్ సెనెటర్ మిట్ రోమ్నీ ఆహ్వానించారు. ఇప్పుడిక ''దేశం ముందుకు కదలాల్సిన సమయం'' అని ట్వీట్ చేశారు.

Image copyright Reuters

ఇప్పుడేం జరుగుతుంది?

ముల్లర్ నివేదికలోని కీలక అంశాలను ఆదివారం విడుదల చేయటం.. అసలు పూర్తి నివేదికను బహిరంగ పరచాలంటూ సుదీర్ఘ సమరానికి నాంది కావచ్చు.

ప్రత్యేక న్యాయవాది రాబర్ట్ ముల్లర్ దర్యాప్తు చేసిన ఫైళ్లతో సహా పూర్తి నివేదికను విడుదల చేయాలని పలువురు సీనియర్ డెమొక్రాట్లు డిమాండ్ చేశారు.

మరిన్ని వివరాలు విడుదల చేస్తానని బార్ చెప్పారు. కానీ.. ఏ అంశాలను విడుదల చేయవచ్చో నిర్ణయించటానికి కొంత సమయం పడుతుందని సూచించారు.

అయితే ఎంత సమయం పడుతుందో ఆయన నిర్దిష్ట గడువు చెప్పలేదు. కాంగ్రెస్ డెమొక్రాట్లకు మరిన్ని వివరాలను ఎప్పుడు అందించినా.. అది పూర్తి నివేదిక కానట్లయితే.. చట్టపరమైన సవాళ్లకు దారితీయవచ్చు.

మరిన్ని వివరాల కోసం కాంగ్రెస్ నిరీక్షిస్తుంటే.. ప్రతినిధుల సభ జ్యుడీషియరీ కమిటీ ముందు సాక్ష్యం చెప్పటానికి బార్‌ను పిలిపించే అవకాశముంది.

రష్యాతో కుమ్మక్కు, న్యాయ ప్రక్రియకు అవరోధం ఆరోపణల నుంచి తనకు పూర్తి విముక్తి లభించిందని ట్రంప్ అంటున్నప్పటికీ.. మరోవైపు ఆయన కార్యకలాపాల మీద ఇంకో డజను వరకూ దర్యాప్తులు సాగుతున్నాయి.

ట్రంప్ ఎన్నికల ప్రచార బృందం ఎన్నికల చట్టాలను ఉల్లంఘించిందన్న ఆరోపణలపై న్యూయార్క్‌లో ఫెడరల్ దర్యాప్తు జరుగుతోంది. కాంగ్రెస్.. ముఖ్యంగా డెమొక్రాట్లు మెజారిటీగా ఉన్న ప్రతినిధుల సభ తన సొంత విచారణలూ కొనసాగిస్తోంది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

శ్రీలంక పేలుళ్లు: ఆత్మాహుతి దాడుల్లో జేడీఎస్ కార్యకర్తలు మృతి.. 'ఇస్లామిస్ట్ గ్రూప్'పై అనుమానాలు

లాబ్‌స్టర్, పీతల గుల్లలతో ఎకో-ఫ్రెండ్లీ ప్లాస్టిక్ సంచుల తయారీ

ప్రెస్ రివ్యూ: నిన్న 0 మార్కులు, నేడు 99 మార్కులు... ఒక్క రోజులోనే మారిన ఇంటర్ ఫలితం

సౌదీలో భారత కార్మికుల కష్టాలకు కారణాలేంటి

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సీజేఐ గొగోయ్ ముందుకు రానున్న ముఖ్యమైన కేసులివే

శ్రీలంక పేలుళ్లు: 290 మంది మృతి... 'టిఫిన్ తినడం ఆలస్యం కాకపోతే నేను కూడా..'

అబూదాబిలో 13.5 ఎకరాల్లో హిందూ మందిర నిర్మాణం... దాని విశేషాలివే

మనిషికి ఇదే చివరి శతాబ్దమా.. డైనోసార్లలా మానవజాతి అంతం కానుందా?