వక్షోజాలను ఎందుకు ఐరన్ చేస్తున్నారు? దాని వల్ల వచ్చే సమస్యలు ఏమిటి?

  • 27 మార్చి 2019
బ్రెస్ట్ ఐరనింగ్ Image copyright Getty Images

'బ్రెస్ట్ ఐరనింగ్' ఆచారం గురించి పాఠశాల స్థాయిలోనే బాలికలకు అవగాహన కల్పించాలని యూకే నేషనల్ ఎడ్యుకేషన్ యూనియన్ సూచించింది. విద్యార్థులు పూర్తి చేయాల్సిన తప్పనిసరి పాఠ్యాంశాల్లో దానిని కూడా చేర్చాలని స్పష్టం చేసింది.

బ్రెస్ట్ ఐరనింగ్ అంటే?

వక్షోజాలు తొందరగా పెరగడకుండా చూసేందుకు బాలికల ఛాతి బాగాన్ని వేడి వస్తువులతో అదుముతారు. అలాగే, వక్షోజాలను అదుముతూ బెల్టు లేదా బట్టతో ఛాతి మీదుగా బిగుతుగా కట్టు కడతారు. అలా చేయడం ద్వారా బాలికల మీద పురుషుల దృష్టి పడకుండా ఉంటుందని కొందరు చెబుతారు.

ఒకప్పుడు పశ్చిమ ఆఫ్రికాలో ఈ పద్దతి ఉండేది.

అయితే, అక్కడి నుంచి వలస వెళ్లేవారి కారణంగా యూరప్ దేశాల్లోనూ క్రమంగా ఈ ధోరణి పెరుగుతోంది.

పిల్లల ఎదుగుదల విషయంలో కీలక పాత్ర పోషించే టీచర్లకు కూడా 'బ్రెస్ట్ ఐరనింగ్' గురించి అవగాహన కల్పించాలని కన్జర్వేటివ్ ఎంపీ నిక్కీ మోర్గాన్ అభిప్రాయపడ్డారు.

దీనిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఉపాధ్యాయులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని హోం శాఖ కోరింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక బ్రెస్ట్ ఐరనింగ్ కోసం ఇలాంటి రాళ్లను ఎక్కువగా వినియోగిస్తారు.

'నన్ను ఏడ్వనివ్వలేదు'

కియానా (పేరు మార్చాం) కుటుంబం పశ్చిమ ఆఫ్రికా నుంచి వలస వెళ్లి యూకేలో స్థిరపడింది.

కియానాకు పదేళ్ల వయసు ఉన్నప్పుడు బ్రెస్ట్ ఐరన్ చేశారు.

"ఐరన్ చేసుకోకుంటే, నీ మీద అబ్బాయిల దృష్టి పడుతుందని మా అమ్మ చెప్పింది. రాయి లేదా గరిటెను వేడి చేసి, వాటితో నా రొమ్ములను మా అమ్మ అదుముతూ, రుద్దేవారు. అలా కొన్ని నెలల పాటు చేసింది’’ అని కియానా చెప్పారు.

ఆ సమయంలో తాను భరించిన బాధను జీవితంలో ఎన్నటికీ మరచిపోలేనని ఆమె అంటున్నారు.

"విపరీతమైన నొప్పి వస్తుంది. కానీ, ఏడ్వనివ్వరు. ఏడ్చితే కుటుంబం పరువు పోయినట్లుగా భావిస్తారు. అలాగే, పిరికి అమ్మాయి అన్న ముద్ర వేస్తారు" అని ఆమె వివరించారు.

చిత్రం శీర్షిక కియానా, ఆమె కూతురు

కియానా వివాహం చేసుకున్నారు. ఇప్పుడు యుక్తవయసు బిడ్డలు కూడా ఉన్నారు.

"నా పెద్ద బిడ్డకు పదేళ్లు రాగానే బ్రెస్ట్ ఐరన్ చేయాలని మా అమ్మ సూచించారు. కానీ, నో.. నో... నేనే ఇప్పటికీ ఆ బాధను మరచిపోలేదు, నా బిడ్డలకు ఆ పరిస్థితి రావద్దు. వారికి అలా చేయనివ్వను అని తేల్చి చెప్పాను" అని కియానా తెలిపారు.

అలాంటి బాధను తాను 13 ఏళ్ల వయసులో ఎదుర్కొన్నానని సిమోన్ (పేరు మార్చాం) చెప్పారు.

"బహుశా... నా రొమ్ములు పెద్దవిగా ఉండటం వల్ల నా మీద అబ్బాయిల దృష్టి పడిందేమో. అవి పెరగకుండా ఐరన్ చేస్తే, అంద విహీనంగా తయారవుతాను. అప్పుడు నావైపు ఎవరూ కన్నెత్తి చూడరని అనుకున్నాను. కొన్ని నెలల పాటు బ్రెస్ట్ ఐరన్ చేశాను. మా అమ్మ రోజూ రొమ్ములను అదుముతూ ఛాతి మీదుగా బిగుతుగా కట్టు కట్టేది. దాంతో ఒక్కోసారి ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉండేది" అని సిమోన్ గుర్తు చేసుకున్నారు.

బ్రెస్ట్ ఐరనింగ్ చేసుకున్న బాలికలు పెద్దయ్యాక పిల్లలకు పాలివ్వడం కూడా కష్టమవుతుందని బాధితులు చెబుతున్నారు.

అలా చేయడం వల్ల ఛాతి భాగంలో కొన్ని నరాలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుందని అంటున్నారు.

Image copyright AFP
చిత్రం శీర్షిక బ్రెస్ట్ ఐరనింగ్ బాధితులు ఆఫ్రికా దేశాల్లో అధికంగా ఉన్నారు.

10 మందిలో ఒకరు

జర్మన్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ గిజ్ నివేదిక ప్రకారం, ఆఫ్రికన్ దేశం కామెరూన్‌లో ప్రతి 10 మంది మహిళల్లో ఒకరు బ్రెస్ట్ ఐరనింగ్ బాధితులే. యూకేలో 1,000 మందికి పైగా బాధితులు ఉన్నట్లు అంచనా.

ఫిమేల్ జెనిటల్ మ్యుటిలేషన్ (మహిళల్లో సున్తీ) గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెరుగుతున్న ఈ తరుణంలో బ్రెస్ట్ ఐరనింగ్ పట్ల కూడా పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సున్తీ మాదిరిగానే బ్రెస్ట్ ఐరనింగ్ కూడా బాలికలపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని, బాధితులు జీవితాంతం ఆత్మ న్యూనతా భావంతో కుంగిపోయే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అలా చేయడం ద్వారా కలిగే దుష్ప్రభావాల గురించి ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచే బాలికల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఎంపీ నిక్కీ మోర్గాన్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

ముఖ్యమైన కథనాలు

శ్రీలంక పేలుళ్లు న్యూజిలాండ్ మసీదుల్లో దాడులకు ప్రతీకారంగా జరిగినవా?

99 మార్కులు వస్తే 0 వేశారు.. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఎందుకిన్ని పొరపాట్లు

లోక్‌సభ ఎన్నికలు 2019: సాయంత్రం 5 గంటలకు 62.16 శాతం పోలింగ్.. బెంగాల్‌లో ఘర్షణలు ఒకరి మృతి

ఈవీఎం వీవీ ప్యాట్‌ నుంచి రశీదు వస్తుందనుకుంటే పాము వచ్చింది

భారత ఓటర్లు ఏం కోరుకుంటున్నారు.. బలమైన నాయకత్వమా, ప్రజాస్వామ్యమా

డాకర్ ర్యాలీ: 5,600 కి.మీ. అత్యంత క్లిష్టమైన బైక్ రేస్‌ను పూర్తిచేసిన ఏకైక మహిళ

సీజేఐ గొగోయ్ మీద లైంగిక ఆరోపణలు: ఈ కేసు #MeToo కంటే పెద్దది. ఎందుకంటే..

ప్రెస్ రివ్యూ: ‘ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఖర్చు రూ. 8750 కోట్లు.. అంతా అవినీతి డబ్బే’