ఈమెకు నెల రోజుల్లో రెండు కాన్పులు, ముగ్గురు పిల్లలు

  • 1 ఏప్రిల్ 2019
శిశువు పాదం Image copyright Getty Images

ఓ మహిళ నెల రోజుల వ్యవధిలో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. అందులో ఇద్దరు కవలలు. ఈ విషయాన్ని ఆమె డాక్టర్ బీబీసీకి తెలిపారు. బంగ్లాదేశ్‌కు చెందిన 20ఏళ్ల అరీఫా సుల్తానా, ఫిబ్రవరి చివర్లో ఓ మగబిడ్డకు జన్మినిచ్చారు. 26 రోజులు గడిచాక, మళ్లీ నొప్పులు రావడంతో అరీఫా ఇంకొక హాస్పిటల్‌కు వెళ్లారు. ఆమెను పరీక్షించిన వైద్యులు, ఆమె గర్భంలో ఇద్దరు కవలలు ఉన్నారని, ఇంకా ఆమె గర్భిణీయే అని అన్నారు.

అరీఫాకు రెండు గర్భసంచులు ఉన్నాయి. మొదటి కాన్పు తర్వాత, తన రెండో గర్భంలో కవలలు ఉన్నట్లు వైద్యులు కనుగొన్నారు. డాక్టర్లు వెంటనే అరీఫాకు సిజేరియన్ చేశారు.

రెండో కాన్పులో పుట్టిన ఇద్దరు కవలలు, ఎలాంటి సమస్యలు లేకుండా, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు.

'మేం షాక్‌కు గురయ్యాం'

బంగ్లాదేశ్‌లోని ఖుల్నా జిల్లాలోవున్న ‘ఖుల్నా మెడికల్ కాలేజ్ హాస్పిటల్’లో అరీఫా సుల్తానా తొలిబిడ్డను ప్రసవించారు. ప్రసవం తర్వాత 26 రోజులకు మళ్లీ నొప్పులు రావడంతో, మార్చి 21న అద్-దిన్ జిల్లాలోని ఓ హస్పిటల్‌కు వెళ్లారని, అరీఫాకు సిజేరియన్ చేసిన డా.షీలా పొద్దర్ బీబీసీకి తెలిపారు.

కొన్ని మీడియాల్లో.. అరీఫా మార్చి 22న రెండోసారి హాస్పిటల్‌కు వెళ్లారని వార్తలొచ్చాయి.

''అరీఫా మా హాస్పిటల్‌కు వచ్చాక, ఆమెకు అల్ట్రాసౌండ్ చేశాం. అప్పుడే, ఆమె గర్భంలో కవలలు ఉన్నారని తేలింది. మేం షాక్‌కు గురయ్యాం.. చాలా ఆశ్చర్యమేసింది. ఇంతకుముందు ఎప్పుడూ ఇలాంటిది చూడలేదు'' అని డా.షీలా అన్నారు.

యుటరస్ డైడెల్ఫిస్

కానీ, అరీఫా.. రెండోసారి వేరొక హాస్పిటల్‌కు వెళ్లడానికి గల కారణంలో స్పష్టత లేదు.

అరీఫా సుల్తానా దంపతులు పేదవారని డా.షీలా చెబుతున్నారు. మొదటి కాన్పుకు ముందెన్నడూ ఆమె అల్ట్రాసౌండ్ చేయించుకోలేదని అన్నారు.

''తన గర్భంలో ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తనకు తెలీదు. సిజేరియన్ ఆపరేషన్ తర్వాత తనకు కవలలు జన్మించారు. వారిలో ఒకరు అమ్మాయి, ఒకరు అబ్బాయి'' అని డా.షీలా అన్నారు.

నాలుగు రోజులు హాస్పిటల్లో వైద్యం అందించాక, అరీఫాను, తన ఇద్దరు కవలపిల్లలను మార్చి 25న డిశ్చార్జ్ చేశారు.

''తల్లీ పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు. అంతా సవ్యంగా జరిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది'' అని షీలా అన్నారు.

ఒకే మహిళ రెండు గర్భసంచులను కలిగివుండటాన్ని 'యుటరస్ డైడెల్ఫిస్' అంటారు. చాలామంది భావిస్తున్నట్లుగా ఇది అరుదైన విషయమేమీకాదని సింగపూర్‌కు చెందిన ఒక గైనకాలజిస్ట్ అన్నారు.

''ముందస్తుగా స్కాన్ చేసినపుడు రెండు గర్భాలు ఉండటం కొందరిలో సాధారణంగా కనిపిస్తుంది. కానీ వీరు గ్రామీణ ప్రాంతానికి చెందినవారు. వీరికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ సదుపాయం లేకపోయుండొచ్చు'' అని గైనా.ఎం.డి.క్లినిక్‌కు చెందిన డా.క్రిస్టఫర్ అన్నారు.

''అరీఫా గర్భంలో మూడు అండాలు విడుదలై, ఒకేసారి ఫలదీకరణ అయినట్లు తెలుస్తోంది. అందుకనే, ముగ్గురు పిల్లలు జన్మించారు'' అని డా.క్రిస్టఫర్ అన్నారు.

Image copyright Pekic

రెండు గర్భాలుంటే ఏమవుతుంది?

ఒక గర్భాశయం స్థానంలో రెండు గర్భసంచులు తయారవ్వడం, అనారోగ్యం అని చెప్పొచ్చు.

సాధారణంగా ఆడపిల్లలు ఎదుగుతున్నపుడు, వారి కడుపులో ఉండే రెండు చిన్న ట్యూబులు ఒకదానితో ఒకటి కలిసిపోయినపుడు గర్భాశయం ఏర్పడుతుంది. అలా కాక, రెండు ట్యూబులు విడివిడిగా మిగిలిపోతే అవి, రెండు గర్భాశయాలుగా తయారవుతాయి.

దీని తీవ్రత వివిధ రకాలుగా ఉంటుంది. కొందరిలో సంతానోత్పత్తి సమస్యలు కూడా తలెత్తుతాయి.

మహిళల్లో ఈ పరిస్థితి ఎంతమేరకు సాధారణం అన్నదానిపై భిన్నమైన అంచనాలున్నాయి. ఇంగ్లండ్‌లో ప్రతి వెయ్యిమందిలో ఒక మహిళ ఈ పరిస్థితిని ఎదుర్కొన్నట్లు భావిస్తున్నారు.

ఈ పరిస్థితి ఎదుర్కొంటున్న మహిళల్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. గర్భందాల్చిన సమయంలో అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసినపుడు సాధారణంగా బయటపడుతుంది.

అరీఫా సుల్తానా ఏఎఫ్‌పీ వార్తాసంస్థతో మాట్లాడుతూ, ముగ్గురు పిల్లలు పుట్టడం చాలా ఆనందంగా ఉన్నా, వీరిని పెంచి పెద్దచేయడం అన్నది తమకు భారమవుతుందని అన్నారు.

అరీఫా భర్త కూలి పనులు చేస్తూ, నెలకు రూ.6వేలు సంపాదిస్తారు. ఆయన ఏఎఫ్‌పీతో మాట్లాడుతూ, తన పిల్లలను పెంచడానికి సాధ్యమైనంతవరకు కష్టపడతానన్నారు.

''మా పిల్లలు అందరూ ఆరోగ్యంగా ఉండటం అల్లా దయ. వీరు ఆనందంగా ఉండటానికి సాధ్యమైనంతవరకూ ప్రయత్నిస్తాను'' అని అరీఫా భర్త అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

శ్రీలంక పేలుళ్లు న్యూజిలాండ్ మసీదుల్లో దాడులకు ప్రతీకారంగా జరిగినవా?

99 మార్కులు వస్తే 0 వేశారు.. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఎందుకిన్ని పొరపాట్లు

లోక్‌సభ ఎన్నికలు 2019: సాయంత్రం 5 గంటలకు 62.16 శాతం పోలింగ్.. బెంగాల్‌లో ఘర్షణలు ఒకరి మృతి

ఈవీఎం వీవీ ప్యాట్‌ నుంచి రశీదు వస్తుందనుకుంటే పాము వచ్చింది

భారత ఓటర్లు ఏం కోరుకుంటున్నారు.. బలమైన నాయకత్వమా, ప్రజాస్వామ్యమా

డాకర్ ర్యాలీ: 5,600 కి.మీ. అత్యంత క్లిష్టమైన బైక్ రేస్‌ను పూర్తిచేసిన ఏకైక మహిళ

సీజేఐ గొగోయ్ మీద లైంగిక ఆరోపణలు: ఈ కేసు #MeToo కంటే పెద్దది. ఎందుకంటే..

ప్రెస్ రివ్యూ: ‘ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఖర్చు రూ. 8750 కోట్లు.. అంతా అవినీతి డబ్బే’