మిషన్ శక్తి: భారతదేశ పరీక్షల అనంతరం.. అంతరిక్షంలో చెత్తపై ఆమెరికా హెచ్చరికలు

  • 28 మార్చి 2019
Image copyright AFP/Getty
చిత్రం శీర్షిక ఇప్పుడు కూల్చేసిన ఉపగ్రహాన్ని జనవరిలో ప్రయోగించారు.

ఉపగ్రహ విధ్వంసక క్షిపణి (ఏశాట్) ప్రయోగాలతో అంతరిక్షంలో "చెత్త" పెరుగుతుందని అమెరికా రక్షణ మంత్రి పాట్రిక్ షనాహన్ హెచ్చరించారు. భారతదేశం తన ఉపగ్రహాన్ని క్షిపణి ప్రయోగంతో విజయవంతంగా ధ్వంసం చేసిన తరువాత అమెరికా నుంచి ఈ ప్రకటన వెలువడింది.

భూమికి సమీప కక్ష్యలో జరిపిన ఈ దాడి వల్ల అంతరిక్షంలో చెత్త పదార్థాలు పెరగడం ఉండదని భారతదేశం చెబుతోంది కానీ, ఆ దేశం చేసిన పరీక్షల గురించి అమెరికా ఇంకా పరిశీలిస్తోందని పాట్రిక్ అన్నారు.

ఏశాట్ పరీక్షలు జరిపిన నాలుగో దేశంగా భారత్ చరిత్ర సృష్టిస్తే, ఈ తరహా పరీక్షలను చైనా 2007లోనే నిర్వహించింది.

"మనమంతా ఈ అంతరిక్షంలో నివసిస్తున్నాం. దీన్ని చెత్తతో నింపొద్దు. అంతరిక్షంలో మనం వ్యాపార లావాదేవీలు నిర్వహించవచ్చు. అందరూ స్వేచ్ఛగా తమ కార్యకలాపాలు సాగించే వీలున్న చోటు కూడా అంతరిక్షమే" అని పాట్రిక్ వివరించారు.

Image copyright ESA

ఇలాంటి పరీక్షల వల్ల పౌర, సైనిక ఉపగ్రహాలకు హాని కలిగే అవకాశం ఉంది. అంతేకాకుండా అవి అంతరిక్షంలోని వేరే పదార్థాలతో ఢీకొనే ప్రమాదం ఉంటుంది. అయితే, భారతదేశం మాత్రం తాను మిషన్ శక్తి కార్యక్రమాన్ని భూసమీప వాతావరణంలో, అంటే సుమారు 300 కిలోమీటర్ల దూరంలో నిర్వహించినట్లు చెబుతోంది. అందువల్ల, వ్యర్థాలేవీ అంతరిక్షంలో నిలిచే అవకాశం లేదని, అవి కొన్ని వారాల వ్యవధిలోనే నేల మీదకు పడిపోతాయని చెబుతోంది.

"అందుకే, మేం ఈ పరీక్షలను సమీప వాతావరణంలో నిర్వహించాం. అదంతా కొన్ని రోజుల్లోనే మాయమైపోతుంది" అని భారత రక్షణ పరిశోధన-అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) చైర్మన్ జి. సతీశ్ రెడ్డి రాయిటర్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

అయితే, పేలుడు అనంతర శకలాలు భూమికి చేరుకునే మార్గాలను నియంత్రించడం సాధ్యం కాదని కొందరు నిపుణులు అంటున్నారు. భారత పరీక్షల అనంతరం 250 శకలాలను అమెరికా సైనిక విభాగం పరిశీలిస్తోందని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. అమెరికా ఈ తరహా పరీక్షలను 1959లో నిర్వహించింది.

చైనా 2007లో నిరర్థకంగా మిగిలిన వాతావరణ ఉపగ్రహాన్ని ఇలాగే ధ్వంసం చేసింది. 865 కిలోమీటర్ల దూరంలో జరిపిన ఈ ప్రయోగం ఫలితంగా భారీయెత్తున ఏర్పడిన చెత్త ఒక పెద్ద మేఘంలా కక్ష్యలో పరిభ్రమిస్తోంది.

Image copyright NASA/NANORACKS

ఈ శకలాలు, చెత్త వల్ల ఉండే ప్రమాదంపై నాసా కూడా భారత్ నిర్వహించిన పరీక్షల అనంతరం హెచ్చరించింది.

"ఉపగ్రహాల్ని కూల్చే సామర్థ్యాన్ని కొందరు ఉద్దేశపూర్వకంగానే పరీక్షించాలనుకుంటున్నారు. దీనివల్ల అంతరిక్షంలో చెత్త పెరిగిపోతుంది, దీనితో ఇప్పటికే మనకు సమస్యలున్నాయి. అంతరిక్షంలోని ప్రస్తుత పరిస్థితిపై అందరికీ అవగాహన అవసరమని మళ్లీ ఆ దేశాలే మాతో అంటాయి. ఎందుకంటే ఈ చెత్త క్షేత్రాలను సృష్టించేది వాళ్లే కదా" అని యూఎస్ స్పేస్ ఏజెన్సీ చీఫ్ జిమ్ బ్రైడెన్‌స్టైన్.. కాంగ్రెస్‌తో అన్నారు.

"ఏశాట్ ఆయుధం తయారీకి అవసరమైన టెక్నాలజీ భారత్ వద్ద ఉంది కానీ ఓ ఉపగ్రహాన్ని కూల్చి దాన్ని పరీక్షించాలని కోరుకోవడం లేదు. ఎందుకంటే అప్పుడు ఏర్పడే చెత్త ఇతర ఉపగ్రహాలపై ప్రభావం చూపించే ప్రమాదం ఉంది" అని 2012లో భారత్‌లో అప్పటి డీఆర్డీవో ఛైర్మన్ చెప్పారు.

భారత్ ఏశాట్ పరీక్ష నిర్వహించిందని, గ్లోబల్ స్పేస్ పవర్‌గా అవతరించిందని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారంనాడు ఓ అనూహ్య ప్రకటన ద్వారా వెల్లడించారు.

అంతరిక్షంలో సైనికీకరణ పెరగడంపై ఆయుధ నియంత్రణ మండలి ఆందోళన వ్యక్తం చేసింది. ఏవైనా ఘర్షణలు తలెత్తితే ఈ ఏశాట్ టెక్నాలజీతో ప్రత్యర్థి ఉపగ్రహాలను కూల్చే అవకాశం ఇప్పుడు భారత్ చేతిలో ఉంది. ఈ పరీక్ష ద్వారా భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే ప్రమాదముంది. చైనా సాయంతో పాకిస్తాన్ గత సంవత్సరం రండు ఉపగ్రహాల్ని ప్రయోగించింది.

ఈ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని, ఆయుధ వినియోగంతో అంతరిక్షంపై పట్టు సాధించాలనే ఉద్దేశం భారత్‌కు ఎంతమాత్రం లేదని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

విపక్షాలు కూడా మోదీ ప్రకటనపై విమర్శలు గుప్పించాయి. మరికొద్ది రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో లబ్ధికోసమే ఇప్పుడీ ప్రకటన చేశారని ఈసీకి ఫిర్యాదు చేశాయి. మోదీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారా లేదా అనే దానిపై విచారణ నిర్వహిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)